Online Puja Services

ఓం నమః శ్శివాయ 

కార్తీక పురాణం - ముప్పదవ అధ్యయము, ముప్పదవ రోజు పారాయణము

సేకరణ: లక్ష్మి రమణ 

ఫలశ్రుతి:

నైమిశారణ్య ఆశ్రమంలో శౌనకాది మహామునులందరికీ సూతమహర్షి కార్తీక వ్రత మహిమ వివరించి ,  ఫల శ్రుతిని తెలియజేశారు. విష్ణు మహిమ, విష్ణు భక్తుల చరిత్రలను విని అంతా ఆనందించారు. వేయినోళ్ల సూతమహర్షిని కొనియాడారు. శౌనకాది మహామునులకు ఇంకా సంశయాలు తీరకపోవడంతో సూత మహర్షిని చూసి ”ఓ మహాముని! కలియుగంలో ప్రజలు అరిషడ్వర్గాలకు దాసులై, అత్యాచారపరులై జీవిస్తున్నారు. సంసార సాగరంలో తరించలేకపోతున్నారు. అలాంటి వారికి సులభంగా ఆచరించే వ్రతాలేమైనా ఉన్నాయా? ఉంటే మాకు వివరించండి. ధర్మాలన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించే ఉత్తమ ధర్మమేదో సెలవివ్వండి. దేవతలందరిలో ముక్తిని కలిగించే దైవం ఎవరో చెప్పండి. మానవుడిని ఆవరించిన అజ్ఞానాన్ని రూపుమాపి, పుణ్యఫలమిచ్చే కార్యమేమిటో తెలపండి. ప్రతిక్షణం మృత్యువు వెంటాడుతున్న మానవులకు సులభంగా మోక్షం పొందగల ఉపాయమేమిటి? హరినామస్మరణ సర్వదా చేస్తున్నా… మేము ఈ సంశయాల్లో కొట్టుమిట్టాడుతున్నాం. కాబట్టి మాకు వివరించి, మమ్మల్ని ఉద్దరించండి” అని కోరారు.

దానికి సూత మహర్షి ఇలా చెబుతున్నారు… ”ఓ మునులారా! మీకు కలిగిన సంశయాలు తప్పక తీర్చుకోవాల్సినవే. కలియుగంలో మానవులు మందబుద్ధులు. క్షణికములైన సుఖాలతో నిండిన సంసార సాగరం దాటేందుకు మీరు అడిగిన ప్రశ్నలు దోహదపడతాయి. మోక్షసాధనలుగా ఉంటాయి. కార్తీక వ్రతం వల్ల యాగాది క్రతువులు చేసిన పుణ్యం, దాన ధర్మ ఫలాలు చేకూరుతాయి. కార్తీక వ్రతం శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతికరమైన వ్రతం. ఇది అన్ని వ్రతాల కంటే ఘనమైనదని ఆ శ్రీహరే సెలవిచ్చారు. ఆ వ్రత మహిమ వర్ణించడానికి నాకు శక్తి సరిపోదు. అంతేకాదు. సృష్టికర్త అయిన ఆ బ్రహ్మదేవుడికి కూడా శక్యం కాదు. అయినా… సూక్షంగా వివరిస్తాను. కార్తీకమాసంలో పాటించాల్సిన పద్ధతులను గురించి చెబుతాను. శ్రద్ధగా వినండి. కార్తీకమాసంలో సూర్యభగవానుడు తులారాశిలో ఉనప్పుడు శ్రీహరి ప్రీతికోసం మనకు ముక్తి కలగడానికి తప్పనిసరిగా నదీస్నానం ఆచరించాలి. దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజించాలి. తనకున్న దాంట్లో కొంచెమైనా దీపదానం చేయాలి. ఈ నెలరోజులు భర్తని కోల్పోయిన  వండిన పదార్థాలు తినరాదు. రాత్రులు విష్ణువాలయాల్లోగానీ, శివాలయాల్లోగానీ ఆవునేతితో దీపారాధన చేయాలి. ప్రతిరోజు సాయంకాలం పురాణ పఠనం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల సకల పాపాల నుంచి విముక్తులై సర్వ సౌక్యాలను అనుభవిస్తారు. 

సూర్యుడు తులారాశిలో ఉన్న ఈ నెలరోజులు ఈ విధంగా పద్ధతులు పాటించేవారు జీవన్ముక్తులవుతారు. ఇలా ఆచరించే శక్తి ఉన్నా.. ఆచరించక పోయినా… భక్తి శ్రద్ధలతో కార్తీక నియమాలను పాటించేవారిని ఎగతాళి చేసినా… ధన సహాయం చేసేవారికి అడ్డుపడినా… వారు ఇహలోకంలో అనేక కష్టాలను అనుభవించడమేకాకుండా…. వారి జన్మాంతరంలో నరకంలోపడి కింకరులచే నానా హింసలపాలవుతారు. అంతేకాకుండా… వారు నూరు హీనజన్మలెత్తుతారు.

కార్తీకమాసంలో కావేరీ, గంగా, అఖండ గౌతమి నదుల్లో స్నానం చేసి, ముందు చెప్పిన విధంగా నిష్టతో కార్తీక నియమాల్ని పాటించేవారు జన్మాంతరాన వైకుంఠ వాసులవతుతారు. సంవత్సరంలో వచ్చే అన్ని  నెలల్లోనూ  కార్తీక మాసం ఉత్తమమైనది. అధిక ఫలదాయకమైనది. హరిహరాదులకు ప్రీతికరమైనది కాబట్టి కార్తీక మాస వ్రతం వల్ల జన్మజన్మల నుంచి వారికున్న సకల పాపాలు తొలగిపోతాయి. నియమ నిష్టలతో కార్తీక వ్రతం ఆచరించేవారు జన్మరాహిత్యాన్ని పొందుతారు. ఇలా నెలరోజులు నియమాలు పాటించలేనివారు కార్తీక శుద్ధ పౌర్ణమినాడు తమ శక్తికొలదీ వ్రతమాచరించి, పురాణ శ్రవణం చేసి, జాగారం ఉండి…. మర్నాడు ఒక బ్రాహ్మణుడికి భోజనం పెడితే… నెలరోజులు వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది. ఈ నెలలో ధనం, ధాన్యం, బంగారం, గృహం, కన్యాదానం చేసినట్లయితే… ఎన్నటికీ తరగని పుణఫ్యం లభిస్తుంది. ఈ నెలరోజులు ధనవంతుడైనా, పేద అయినా.. మరెవ్వరైనా హరినామ స్మరణను నిరంతరం చేయాలి. పురాణాలు వింటూ, పుణ్యతీర్థాలను సేవిస్తూ దాన ధర్మాలుచేయాలి. అలా చేసేవారు పుణ్యలోకాలను పొందుతారు. ఈ కథను చదివినవారికి శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యాలను ఇచ్చి, వైకుంఠ ప్రాప్తి కలిగిస్తాడు.

శ్రీ స్కాంద పురాణాంతర్గత, వశిష్ట ప్రోక్త, కార్తీక మహత్యంలోని ముప్పదవ అధ్యయము , ముప్పదవ రోజు ,చివరిరోజు  పారాయణము సమాప్తం . 

ఓం సర్వేషాం స్వస్తిర్భవతు ఓం సర్వేషాం శాంతిర్భవతు

ఓం సర్వేషాం పూర్ణం భవతు ఓం శ్శాంతి శ్శాంతి::||

సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు !!

స్వస్తి !

Videos View All

కార్తీక పురాణం - ముప్పదవ అధ్యయము
కార్తీక పురాణం - ఇరవైతొమ్మిదవ అధ్యయము
కార్తీక పురాణం - ఇరవైఎనిమిదవ అధ్యాయము
కార్తీక పురాణం - ఇరవైఏడవ అధ్యాయము
కార్తీక పురాణం - ఇరవైఆరవ అధ్యాయము
కార్తీక పురాణం - ఇరవైఐదవ అధ్యాయము

Quote of the day

In a gentle way, you can shake the world.…

__________Mahatma Gandhi