Online Puja Services

కళ్యాణ రాముని సుదర్శన దర్శనం చేశారా ?

3.145.152.98

కళ్యాణ రాముని సుదర్శన దర్శనం చేశారా ?
- లక్ష్మి రమణ 

భద్రాచల క్షేత్రం మహా పుణ్యక్షేత్రం . రాములవారు సీతమ్మతో కలిసి సంచరించిన  ఇప్పటికీ ఆ క్షేత్రంలో కనిపిస్తాయి . ఈ గుడిలోని రాళాలక్ష్మణులకి సీతామాతకీ కంచర్ల రామదాసు చేసిన సేవలు, స్వయంగా తరలి వచ్చిన రామ లక్ష్మణుల చరిత్ర ఈ ఆలయాన్ని సర్వశక్తి సమన్వితమైన రాములోరి ఆలయంగా భక్తుల మదిలో చెరగని ముద్ర వేసేలా చేశాయి. ఆ భద్రాద్రి రాముని కోవెలలో ప్రతి అణువూ ఒక అద్భుతమే. ప్రతి అంశమూ ఆ రాముని కృపాకటాక్షమే .అటువంటి  రాములోరి విమానం పైనున్న సుదర్శన మూర్తిని ఎప్పుడైనా గమనించారా ?  ఆ సుదర్శనుడు ఎవరూ తయారు చేసి ప్రతిష్ట చేసినవారు కాదు . తన స్వామీ కోసం స్వయంగా తానె తరలివచ్చినవారు . ఆ కదా కమామిషూ ఈ రోజు మీకోసం . 

రాములోరి కళ్యాణం అనగానే, తెలుగువారి మదిలో మెదిలే ఒకే ఒక్క క్షేత్రం భద్రాచలం . ఆ భద్రాద్రి రాముని ఆలయాన్ని స్వయంగా వెళ్లలేకపోతే, కనీసం బుల్లితెరమీదైనా చూసి తరించిపోవాలని తపించని గడప తెలుగు నేలమీద ఉండదంటే అతిశయోక్తి కాదు . ఇంతబాధా పడుతున్న భక్తులకి , తలంబ్రాలని చూస్తే ఈర్ష్య ముంచుకొచ్చేస్తుంది. అయ్య చేతులో నీలాల రాశిగా, అమ్మ చేతులో కెంపుల పూలై ఆ రమణీయ మూర్తుల తలమీది నుండీ జాలువారుతున్న ముత్యాల అదృష్టాన్ని తలుచుకొని ఈర్ష్య పొందినా, ఆ ముత్యాలకి ధీటుగా మెరుస్తున్న కళ్యాణరామయ్యనీ, సిగ్గుల మొగ్గాయినా సీతమ్మని చూసి తన్మయులై పోతారు .  

రాములోరి కళ్యాణం అంటే జగత్కళ్యాణమే . ఆయన కళ్యాణానికి ఆకాశమార్గాన యెగిరి దేవతలందరినీ తీసుకొచ్చే పని గరుక్మంతుడిదైతే, జగత్కళ్యాణాన్ని రక్షించే బాధ్యత మన సుదర్శనులవారిది . ఆయన స్వామివారి విమాన గోపురం మీద నిలిచి సదా రక్షకుడై ఉంటారు .

ఇక్కడ ఈ సుదర్శన చార రూపాన్ని కూడా గమనించాలి . స్వామీ సుదర్శనంగా ఒక చక్ర రూపంలోనే కాకుండా, దాని ముందర ఒక చిన్న రూపుతో కూడా దర్శనమిస్తూ ఉంటారు . ఈయన ఈ ఆలయానికి విచ్చేసిన వైనం రాములవారి దివ్య కటాక్ష మహిమతో నిండి ఉండడం విశేషం .   అది మానవ నిర్మితమైనది మాత్రము కాదు . 

శ్రీ రామదాసు భద్రాచలంలో దేవాలయాన్ని నిర్మిస్తున్న సమయం . ఇక ఆలయ విమానం పైన కలశస్థాపన జరగాలి . అదే సమయంలో ఆ పని జరగకుండానే ఆయన తురుష్కుల కారాగారంలో వుండవలసి వచ్చింది. ఇప్పుడీ ఈ సుదర్శన చక్రం స్థానం ఖాళీగా ఉండి పోయిందన్నమాట . అప్పుడు ఆ సమయంలో అక్కడ ఉన్న అప్పటి ఆలయ పాలకులు కలశ స్థాపన చేశారు . కానీ అది ఎందువల్లనో  ప్రతి చిన్నపాటి గాలికి, వర్షానికి కూడా క్రింద పడిపోయేది. దానివల్ల తరచూ స్వామి ఆలయంలో  అపచారం జరిగేది. ఇది భక్తులకి మనస్తాపాన్ని కలిగించేది .

ఈ విషయం ఆనోటా ఈనోటా పడి కారాగారం వరకూ చేరింది . అక్కడున్న  ఉన్న రామదాసుకుతెలిసింది . అయ్యో నారామునికి ఇంతటి అపచారమా ? నేను దగ్గరగా ఉంటె స్వామికి ఇటువంటి అపచారం జరగకుండా చేసేవాడిని కదా! అని బాధపడుతూ అన్న పానాదులు వదిలి రాముని కీర్తనలు పాడుతూ ఉండేవారు . 

ఆయనని ముందుగా స్వామి స్వయంగా వచ్చి తానీషా చెర నుండీ విడిపించిన వైనం మనకు తెలిసినదే ! ఆ తర్వాత ఆయన ఆర్తిని తీర్చడానికి, ఒక రోజు ఆయనకు స్వప్నము లో శ్రీ రాముల వారు ప్రత్యక్షమయ్యారు .  ఆ ఆలయ శిఖరం పైన ఉంచాల్సిన సుదర్శన చక్రం రామదాసుకి  గోదావరి నదిలో లభిస్తుందని అనుగ్రహించి అంతర్ధానం అయ్యారు. అనంత ఆనంద తరంగిణిలో మునకలేస్తూ , గోదారమ్మ జలాలని చేరి  ఒకేఒక్క మునక వేశారు .  పైకి లేవగానే ఆయన చేతిలో ఇప్పుడు మీరు చూస్తున్న సుదర్శన చక్ర సహిత పెరుమాళ్లు రెండు చేతులపై తెలియాడుతూ లభించింది. సంతోషాతిరేకంతో వేద మంత్రాలతో ఆదే రోజు శ్రీవారి ఆలయ శిఖరం పై దానిని ప్రతిష్ట చేశారు . అది ఈనాటికి అలాగే నిలిచి వుంది.

ఇక ఆ నాటి నుండీ మళ్ళీ శిఖరానికి అపశృతి అన్న మాట లేదు, సదరు. విషయం తురుష్కుల హుకుమత్ కి కూడా తెలిసి ఆయన కూడా సీతారాముల వారిని దర్శించుకుని కానుకలు మొక్కులు చెల్లించుకొని. శ్రీ.రామదాసుని బంధించి వుంచినందుకు మాఫీ కోరుకొని వెళ్లారుట. అదీ ఈ సుదర్శన పెరుమాళ్ళు కథ . క్లుప్తంగా ఇది ఆ గోపురం మహత్తు.

ఈ సారి స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు , కళ్యాణ రామయ్యని కన్నులారా దర్శించుకొని, ఆ తర్వాత సుదర్శనుడికి కూడా నమస్కారం చేసుకోండి . శుభం . 

Quote of the day

To be idle is a short road to death and to be diligent is a way of life; foolish people are idle, wise people are diligent.…

__________Gautam Buddha