Online Puja Services

శ్రీరాముడికి అక్కడ రెండుసార్లు పెళ్ళి!

3.138.33.87

రామస్వామి దేవస్థానం 
రామతీర్థం, విజయనగరం జిల్లా

దర్శనం సమయం: ఉదయం 05:00 నుండి రాత్రి 8:00 వరకు

భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా శ్రీరాముడికి ఏడాదిలో ఒక్కసారి మాత్రమే కల్యాణం నిర్వహిస్తారు. అది కూడా శ్రీరాముడు జన్మించిన చైత్ర శుద్ధ నవమి (శ్రీరామ నవమి) నాడే చేయడం ఆనవాయితీ. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా రామతీర్థం రామస్వామి దేవస్థానంలో మాత్రం శ్రీరాముడికి ఏడాదికి రెండుసార్లు కల్యాణం జరుపుతారు. ఈ దేవస్థానం ఏర్పాటైన 16వ శతాబ్దం నుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. 

శ్రీరాముడికి అక్కడ రెండుసార్లు పెళ్ళి!

ఇక్కడ శ్రీరామ నవమి రోజునే కాదు, మాఘ శుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి)నాడు కూడా సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దీనినే తిరుకల్యాణ మహోత్సవమనీ, ‘దేవుని పెళ్లి’ అని పిలుస్తారు. శ్రీరామ నవమి రోజున కల్యాణోత్సవం పగటి పూట, తిరుకల్యాణ మహోత్సవం రాత్రి పూట జరుగుతాయి. మరో ముఖ్యమైన విశేషం ఏమిటంటే, ‘"దేవుని పెళ్లి " జరిగాకే ఈ ప్రాంతంలో సాధారణ వివాహాలకు ముహూర్తం పెట్టుకోవడం ఆచారం! రామతీర్థం సీతారాముల తొలి కల్యాణ మహోత్సవం ఈ ఏడాది జనవరి 27న జరిగింది. రెండో కల్యాణోత్సవం శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీన జరిగింది. ( 2020 వ సంవత్సరం )

తిరుకల్యాణం కథ ఇదీ!

16వ శతాబ్ద కాలంలో ఇదంతా అటవీ ప్రాంతంగా ఉండేది. సమీపంలోని కుంబిళాపురం (ప్రస్తుతం కుమిలి) గ్రామానికి చెందిన పుట్టు మూగ అయిన వృద్ధురాలు కట్టెల కోసం వచ్చిందట. ఆమెకు శ్రీరాముడు ప్రత్యక్షమై, ఆమె నాలుకపై ‘శ్రీరామ’ అనే బీజాక్షరాలు రాశాడట! ఈ విషయాన్ని వెంటనే ఆమె కుంబిళాపురాన్ని పరిపాలిస్తున్న పూసపాటి వంశీయులకు తెలిపింది. అలాగే శ్రీరాముడు కుంబిళాపురం రాజుకు కూడా కలలో కనిపించి ఈ ప్రాంతంలో సీతా, రామలక్ష్మణ రాతి విగ్రహాలు ఉన్నాయని, వాటిని సేకరించి వెంటనే ప్రతిష్ఠించాలని ఆదేశించాడట. .చక్రవర్తి, వృద్ధురాలు కలిసి వెతకగా నీటి మడుగులో ఉన్న సీతారామలక్ష్మణ విగ్రహాలు లభించాయనీ, తీర్థంలో రాముడి విగ్రహం లభించినందున ‘రామతీర్థం’ అని ఈ ప్రాంతానికి నామకరణం చేశారట. అలాగే మాఘ శుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి) నాడు రామతీర్థంలో ఈ విగ్రహాలను ప్రతిష్ఠించడం వల్ల ఏటా ఆ భీష్మ ఏకాదశి నాడు సీతారాములకు బ్రహ్మాండంగా ‘తిరుకల్యాణ మహోత్స’వాన్ని నిర్వహించడం ఆనవాయితీ!

ఏకుల వంశీయులే ఆడపెళ్లి వారు

రామతీర్థంలో ఏటా జరిగే సీతారాముల కల్యాణోత్సవంలో వరుడు శ్రీరామచంద్రుడు తరపున విజయనగరం పూసపాటి రాజ వంశీకులు లేదావారి తరపున దేవస్థానం అధికారులు వ్యవహరిస్తారు. వధువు సీతమ్మ తరపున పూసపాటిరేగకు చెందిన ఏకుల రామారావు కుటుంబీకులు హాజరవుతారు. వీరు సీతమ్మ తల్లికి బంగారు మంగళసూత్రాలతో పాటు ఇతర సామగ్రి తీసుకొస్తారు. నాలుగు శతాబ్దాల కాలం నుంచి ఏకుల వంశీయులే ఆడ పెళ్లివారు! వీరు రాముడి విగ్రహాలను కనుగొన్న మూగ వృద్ధురాలి వంశీయులని చెబుతారు. కేవలం పూసపాటి రాజ వంశీయుల వశిష్ట గోత్రంతోనే వివాహం ఆద్యంతం నిర్వహిస్తామని దేవస్థానం ప్రధాన అర్చకుడు ఖండవిల్లి సాయి రామాచార్యులు తెలిపారు. వివాహ మహోత్సవానికి ముందు రామతీర్థం ప్రధాన వీధిలో హంస, అశ్వ, గరుడ వాహనాలపై సీతారామలక్ష్మణ విగ్రహాలను ఉంచి, అర్చకులు నిర్వహించే ఎదురుసన్నాహ కార్యక్రమం కనులవిందుగా సాగుతుంది.

ఐదు రోజుల పెళ్ళి... ఆరుదైన పెళ్ళి!

రామ తీర్థంలో శ్రీరామ నవమి రోజున నిర్వహించే సీతారాముల కల్యాణోత్సవం ఒక్కరోజులో ముగుస్తుంది. తిరుకల్యాణ మహోత్సవం మాత్రం ఏటా ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు. దానికి ముందు వచ్చే రథసప్తమి నాడు పందిరి రాట వేస్తారు. నూతన వధూవరులకు ఈ రోజే నూతన వస్ర్తాలు, బంగారం కొనుగోలు చేస్తారు. కల్యాణోత్సవం జరిగే భీష్మ ఏకాదశి నాటి ఉదయం ధ్వజ స్తంభంపె ధ్వజారోహణం చేస్తారు. కల్యాణోత్సవం జరిగిన నుంచి ఐదు రోజుల పాటు అర్చకులు ప్రత్యేక హోమాలు,  సుందరకాండ పారాయణం, ప్రత్యేక హోమాలు నిర్వహిస్తారు. నాలుగో రోజున సదస్యం అనే పేరుతో పండితులకు సత్కారం, పండిత పరిషత్‌ పేరుతో సాహిత్య కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రధానంగా నాలుగో రోజు రాత్రి పూలతోనూ, విద్యుత్‌ వెలుగులతోనూ అలంకరించిన ప్రత్యేక రథంపై నవ వధూవరులు సీతారామచంద్రులను, లక్ష్మణ స్వామిని రామతీర్థం ప్రధాన వీధుల్లో ఊరేగిస్తారు. ఈ రథాన్ని పక్క గ్రామమైన సీతారామునిపేట గ్రామస్థులు మాత్రమే లాగుతారు. ఐదో రోజున శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించి, ఆ రోజు రాత్రి గరుడ పటాన్ని అవరోహణం చేస్తారు. పూర్ణాహుతి అనంతరం కల్యాణోత్సవాలకు ముగింపు ప్రకటిస్తారు.

సర్వేజనా సుఖినోభవంతు 

 

Quote of the day

We should not fret for what is past, nor should we be anxious about the future; men of discernment deal only with the present moment.…

__________Chanakya