Online Puja Services

సదాస్మరణీయం!

18.188.20.56
సదాస్మరణీయం!

మానవులకు హరి నామం సర్వదా స్మరణీయం.
హరే రామ హరే రామ -రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ - కృష్ణ కృష్ణ హరే హరే
అనేది మహామంత్రం. దీనిని శ్రద్ధాసక్తులతో ఉచ్చరిస్తే కలిదోషాలు హరిస్తాయని తెలుపబడింది .
రామదాసుగా ప్రఖ్యాతి గన్న కంచెర్ల గోపన్న రామ నామ మహత్వాన్ని తన దాశరథీ శతకంలో
'రా' కలుషంబులెల్ల బయలం బడద్రోచితన 'మా' కవాటమై
దీకొని బ్రోచు నిక్కమది -్ధయుతులైన దదీయ వర్ణముల్
గైకొని భక్తి చే నుడువ -గానురుగా విపత్పరం పర్గల్
దావొనుకే జగజ్జనుల దాశరథీ కరుణాపయోనిధీ
అన్నారు. 'రామ' అనేది దివ్యనామం. దీనిలోని రేఫాక్షరం మనుజుల పాపాలను బయటకు పంపుతుంది. 'మ'కారం తలుపువలె అడ్డుపడి బయటికి వెళ్లిన పాపాలను తిరిగి లోపలకు రాకుండా చేస్తుంది. ఆశ్రీతులను రక్షించే నామం రామనామమే. ఏ మనుజుడైన రామ నామ ప్రభావాన్ని చవి చూడనిదే జీవితాన్ని గడపలేడు అన్నా అతిశయం కాదు.
లోకంలో రెండు మహామంత్రాలున్నాయి. 'ఓం నమశ్శివాయ'అనే పంచాక్షరీ మంత్రం. ఇందులో 'మ'కారం ఉంది. అష్టాక్షరీ మంత్రమైన 'ఓం  నమో నారాయణాయ' అనే దానిలో 'రా' ఉంది. ఈ రెంటినీ జత చేస్తే రామ అయింది. రామ నామంలో మహేశ్వర, నారాయణ మంత్రాల అక్షరాలు చేరుట చేత వీటిప్రభావం చాలా ఎక్కువ అవుతోంది. రామ శబ్దం అన్నింటి కన్నా మహత్వం కల్గింది. కావున అందరికీ రామ శబ్దం అంగీకారమైనది మధురమైనది. గోస్వామి తులసీదాసు తన శ్రీరామ చరిత మానసంలో ప్రథమ భాగవతోత్తముడైన శివునకు శ్రీరామ మంత్ర మహిమ బాగా తెలుసును దాని మహిమ వలనే తను మ్రింగిన విషం అమృత ప్రాయం అయిందన్నాడు. శ్రీరాముని పాదములపై భక్తి వర్ష ఋతువులాంటిదని, రామ భక్తులు వరి మొక్కలవంటి వారని శ్రావణ భాద్రపద మాసాల్లో వరిచేను వృద్ధి చెందినట్లుగా రామ నామ ప్రభావం చేత రామభక్తులు వృద్ధి చెందుతారన్నాడు. రామమంత్ర పఠనంలో కష్టం లేదన్నాడు. రామ లక్ష్మణులాగా సోదరులవలె విడదీయరాని అక్షరాలన్నాడు. భక్తికోటిని రక్షిస్తూ ఉంటాయన్నాడు. అక్షర మాల కంతటికి 'రా' అనేది గొడుగు లాంటిది.'మ' కారం కిరీటం వంటిది. కావున దివ్య మంత్రమైనది.
గోపన్న తన శతకం ద్వారా రామనామస్మరణం మోక్షమార్గమన్నారు. రామదాసు తన కీర్తనల్లో శ్రీరాముల దివ్యనామస్మరణ చేయుచున్నా ఘోరమైన తపములను కోరనేటికే మనసా అని వర్ణించారు.
తారక శ్రీరామ నామధ్యానము చేసిన చాలు, వేరు దైవముల వెదుక నేటికే మనసా... రామనామ మధురామృతమైన నామం మరోటి లేదన్నాడు. రామనామసుధామధురం దానిని విడవక పట్టుకొంటే చాలు కోరకనే ముక్తి లభిస్తుంది. ఇందు ఏ సంశయమూ లేదు అన్నాడు.
పాదుకాపట్ట్భాషేక సమయంలో దశరథుడు రాముని దీవించు సందర్భంలో లోకంలో ఎట్టి వ్రాతయైననూ మొట్టమొదట శ్రీరామ అని రాయబడకపోతే ఆ వ్రాత వ్యర్థమే అవుతుంది అన్నారు.
రామ రామ రామా అని ముమ్మారు పలికినా చాలు రాముని కృప లభ్యమవుతుంది. శివునకు, విభీషణునకు, పార్వతికి, గజేంద్రునికి, అహల్యకి, ద్రౌపదికి రామనామము తోడుగా నిలిచింది. వారిని పవిత్రులను చేసింది. పతిత పావననామము రామనామం. దీనిని పలికిన వారికే ఆ సుధామృతం రుచి తెలుస్తుంది అని అందరూ అంటారు. మరి మీరు రామనామం పలికి చూడండి. అమృతం రుచి తెలిసిన వారు మరొక రుచి చూడడానికి ఇష్టపడరు కదా.

Quote of the day

We should not fret for what is past, nor should we be anxious about the future; men of discernment deal only with the present moment.…

__________Chanakya