Online Puja Services

ప్రదక్షణాలు చేస్తే చాలు , ఆపదల నుండీ కాపాడే సౌమ్యనాథుడు.

3.17.154.171

ప్రదక్షణాలు చేస్తే చాలు , ఆపదల నుండీ కాపాడే సౌమ్యనాథుడు. 
- లక్ష్మీరమణ 

శ్రీమహావిష్ణువు భక్తుడి పిలుపు విని స్థంభం నుండీ ఉగ్ర నరసింహస్వామిగా అవతరించి అసుర సంహారం చేశాడు. అతని కష్టాలని తీర్చాడు. సృష్టే తానైనవాడు కనుక  ఏ పదార్థంలో నుండైనా ఉద్భవవించ గలడు. కావలసిందల్లా  భక్తి నిండిన భక్తుని ఆర్తి అంతే. అలా భక్తుడైన ప్రహ్లాదుడు పిలిచాడు.  స్వామి ఉగ్రరూపంతో ఆవిర్భవించారు. ఆ మూర్తికి  శాంతి కలుగలేదు. భూమంతా కలియదిరిగాక , అమ్మ చెంచులక్ష్మీగా చెంతచేరి స్వామికి స్వాంతతనిచ్చి, సౌమ్యునిగా, శాంతమూర్తిగా మార్చింది. ఈ పుణ్యప్రదేశంలో భక్తులు ఏదైనా కోరిక కోరుకుంటే, స్వామీ అనుగ్రహంతో తప్పక నెరవేరుతుందని విశ్వాసం. యుగాంతంలో వచ్చే జలప్రళయంలో జీవంపోసుకొని ఓషధులని సేకరించే చేప ఈ ఆలయంలోనే ఉందని స్థానిక విశ్వాసం.   తెలుగు నేలమీదే ఉన్న ఆ దివ్యదేశం గురించి తెలుసుకుందాం . 

శ్రీ మహా విష్ణువు భూలోకంలో అనేక రూపాలలో, ఎన్నో నామాలతో  వెలసి  కొలిచిన వారికి కొంగు బంగారంగా కీరిని పొందుతున్నారు .  ఈ నేలమీద భారత భూమి చేసుకున్న అదృష్టం ఏమో కానీ , ఆ పరమాత్మ స్వయంగా నడయాడి, ఇక్కడ తన పాదధూళిని అనుగ్రహించిన దివ్యప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.  ప్రఖ్యాతిని పొందిన ప్రదేశాలు కొన్నయితే , మరుగున ఉన్న దివ్యాలయాలు మరికొన్ని . అటువంటి వాటిల్లో చెప్పుకోదగిన ఆలయం శ్రీ సౌమ్యనాథేశ్వరుని ఆలయం . 

 శ్రీ హరి సౌమ్యనాధ స్వామి గా వెలసిన క్షేత్రం నందలూరు. నందలూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని అన్నమయ్య జిల్లా, నందలూరు మండలం లోని గ్రామం,నందనందనుడు వెలసిన కారణంగా ఈ గ్రామానికి నందలూరు అన్న పెరోచ్చినదని చెబుతారు. సుందర శిల్పాలతో కళకళలాడే ఆలయం శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా దర్శనమిస్తుంది . 

పౌరాణిక గాధ :

లోక కంటకుడైన హిరణ్యకశపుని సంహరించిన తరువాత కూడా నరసింహుని ఉగ్రత్వం తగ్గలేదు. అరణ్యంలో చెంచు వనిత రూపంలో లక్ష్మి దేవి సహచర్యంతో స్వామి సౌమ్యుడైనాడు. ఆ రూపనికే సౌమ్యనాదుడు అని పేరు. నిరంతరం నారాయణ నామ స్మరణలోనే కాలంగడిపే నారద మహర్షి ఇక్కడ పురాణాలలో పేర్కొన్న బాహుదా ( చెయ్యేరు) నదీ తీరంలో స్వామిని ప్రతిష్టించారని స్థానికంగా ఒక కధనం ప్రచారంలో ఉన్నది. 

నారద ప్రతిష్టిత శ్రీ సౌమ్యనాధ స్వామికి దేవతలే ఆలయం నిర్మించారని, కాల గతిలో అది శిధిలం కాగా దాని మీదే ప్రస్తుత ఆలయాన్ని నిర్మించారని అంటారు. ఆ కధనం నిజమా అన్నట్లుగా ఆలయ స్థంభాలకు మిగిలిన ఆలయాలలో ఉన్నట్లు పైన సింహపు తలలు ఉండకుండా క్రింద ఉంటాయి. 

శ్రీ సౌమ్యనాథేశ్వరుడు : 

ముఖ మండపం నుండి కొద్దిగా ఎత్తులో వున్నగర్భాలయానికి సోపాన మార్గం ఉన్నది. ఇరు వైపులా జయ విజయులు ఉంటారు. పై మండప ద్వారం వద్ద ఉండగానే శ్రీ సౌమ్యనాధ స్వామి దివ్య రూపం నయన మనోహరంగా దర్శనమిస్తుంది. ఈయన్ని చొక్కనాథుడు అని కూడా పిలుస్తారు.  అర్ధ మండపం, గర్భలయాలలొ విద్యుత్ దీపాలుండవు. అయినా కళకళలాడుతూ కనపడతారు స్వామి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉండే సూర్య కాంతి స్వామిని నేరుగా తాకి ప్రణమిల్లుతూ ఉండడంతో, స్వామీ ద్విగుణీకృత ప్రకాశంతో దర్శనమిస్తుంటారు . 
 
కలియుగ వైకుంఠమైన తిరుమల వేంకటేశ్వరుని ప్రతి రూపం శ్రీ సౌమ్యనాథుడు.  ఏడు అడుగుల సుందర స్వరూపం చూపుతిప్పనివ్వని జీవసౌందర్యంతో చూపారులని కట్టిపడేస్తుంది . తిరుపతిలోని మూలమూర్తికి ఇక్కడి సౌమ్యనాధునికీ కనపడే తేడా ఏంటంటే, అక్కడ స్వామీ  వరద హస్తంతో దర్శనమిస్తారు కాగా ఇక్కడ సౌమ్యనాధుడు అభయ హస్తంతో దీవిస్తుంటారు. 

జలప్రళయంలో జీవం పోసుకొనే చేప : 

ఆలయ పైకప్పుకు ఒక పెద్ద చేప చెక్కబడి కనపడుతుంది. కలియుగంతానికి వచ్చే జల ప్రళయంలో ఇది జీవం పోసుకొని ఈదుకుంటూ వెళుతుంది అన్నది స్థానిక నమ్మకం. 

శాసనాలు -చరిత్ర :

పది ఎకరాల విశాల స్థలంలో చుట్టూ ప్రహరి గోడ, నాలుగు వైపులా గోపురాలతో దుర్భేద్యమైన కోటలా కనపడుతుంది. పదకొండవ శతబ్దంలో కులోత్తుంగ చోళ రాజు ఇక్కడ ఆలయ నిర్మాణాన్ని ఆరంభించారు. తదనంతరం ఈ ప్రాంతాన్ని పాలించిన పాండ్య, కాకతీయ, విజయనగర రాజుల కాలంలో కూడా నిర్మాణ ప్రక్రియ కొనసాగింది. పదిహేడవ శతాబ్దంలో స్థానిక పతి రాజుల కాలంలో పూర్తి అయినట్లుగా శాసనాల ఆధారంగా తెలుస్తోంది.

ఆలయంలో తమిళంలో ఎక్కువగా తెలుగులో కొద్దిగా శాసనాలు చెక్కబడి ఉంటాయి. వివిధ రాజ వంశాల రాజులు స్వామికి సమర్పించుకొన్న కైకర్యాల వివరాలు వీటిల్లో రాయబడినాయి. 

పుష్కరిణి - ఉపాలయాలు : 

తూర్పు గోపురం గుండా ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే ఈశాన్యంలో పుష్కరణి, రాతి స్థంభం, ధ్వజస్తంభం, గరుడా ఆళ్వార్ సన్నిధి, పక్కనే ఉన్న మండపంలో ఆంజనేయ స్వామి సన్నిది ఉంటాయి. పూర్తిగా ఎర్ర రాతితో నిర్మించబడిన ఈ ఆలయాన్ని తురువణ్ణామలై  లో ఉన్న శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆలయానికి నమూనా రూపంగా పేర్కొంటారు. 

మొత్తం నూట ఎనిమిది స్తంభాలపైన ప్రధాన ఆలయం నిర్మించారు. స్తంభాల పైన పురాణ ఘట్టాలను, నాటి ప్రజల జీవన శైలిని, చిత్ర విచిత్రమైన జంతువులను, ఆంజనేయ, గరుడ, రూపాలను సుందరంగా జీవం ఉట్టి పడేలా మలచారు. గర్భాలయ వెలుపలి గోడలలో శ్రీ గణేశ, శ్రీ ఆదిశేష విగ్రహాలను నిలిపారు. 
 

అన్నమాచార్య : 

వాగ్గేయ కారుడు అన్నమయ్య కొంతకాలం నందలూరులో సౌమ్యనాధుని సేవలో గడిపారని, తన కీర్తనలతో స్వామిని ప్రస్థుతించారని శాసనాలలో పేర్కొనబడినది. 

తొమ్మిది ప్రదక్షిణాలు :

ధృడమైన నమ్మకంతో, బలమైన కోరికతో ఓం శ్రీ సౌమ్యనాథాయ నమః  అంటూ గర్భాలయం చుట్టూ తొమ్మిది ప్రదక్షణలు చేసి మొక్కుకొంటే మనోభీష్టాలు నెరవేరుతాయి అన్న ఒక విశ్వాసం తరతరాల నుండి ఇక్కడ కొనసాగుతూ వస్తోంది. కోరిక నెరవేరిన వారం రోజులలో వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణలు చెయ్యాలి అని కూడా అంటారు. 

బ్రహ్మోత్సవాలు :

నారదుని సహాయంతో బ్రహ్మ ఆరంభించినందున బ్రహ్మోత్సవాలని పిలుస్తారు. ప్రతి సంవత్సరం జూలై నెలలో శ్రవణా నక్షత్రం నాడు ఆరంభించి తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుపుతారు. ఆలయ వెలుపల ఉన్న మరో కోనేరులో తెప్పోత్సవం జరుగుతుంది. 

పూజలు :

ప్రతి నిత్యం ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు తెరిచి ఉండే ఆలయంలో ఎన్నో విధాల నిత్య పూజలు నియమంగా చేస్తారు. అన్ని పర్వ దినాలలో, అష్టమి, నవమి తిధులలో, ధనుర్మాసంలో విశేష పూజలు భక్తుల కోరిక మేరకు జరుపుతారు. 

 శ్రీ కామాక్షి సమేత ఉల్లంఘేశ్వర స్వామి దేవస్థానం :

శ్రీ సౌమ్యనాధ స్వామి ఆలయానికి వెలుపల ఈ ఆలయం ఉంటుంది.శివాయ విష్ణురూపాయ , శివరూపాయ విష్ణవే” శివస్య హృదయం విష్ణుః విష్ణుశ్య హృదయం శివః అన్నట్టు ఇక్కడ సౌమ్యనాధుడుగా ఉన్న శ్రీమహావిష్ణువు దర్శనం తర్వాత శివ స్వరూపుడైన ఉల్లంఘేశ్వర స్వామిని దర్శించుకుంటారు భక్తులు . 

#sowmyanathatemple, #samyanathatemple, #nandaluru

Tags: sowmyanatha, samyanatha, nandaluru

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi