Online Puja Services

విష్ణువు మోహిని అవతారం ఎన్నిసార్లు ధరించారు ?

3.144.102.239

శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎన్నిసార్లు ధరించారు ?
- లక్ష్మి రమణ 

 శ్రీ మహా విష్ణువు ఏ అవతారంలో అయినా సమ్మోహన రూపంతో ఉంటారు . అందుకే కదా ఆయన్ని మోహనుడు అన్నారు . ఈ అబ్బాయే అమ్మాయయితే యెంత అందంగా ఉంటుందో అని ఆ పరమాత్మ స్వరూపాన్ని చూసి అఖిల లోకాలూ అనుకున్నాయనే కాబోలు చాలా సందర్భాలలో ఆయన మోహినీ రూపం ధరించారు . నిజంగానే ఆ రూపం జగద్సమ్మోహన కారకమయ్యింది . అందువల్ల ఆమెను జగన్మోహిని అన్నారు .  విష్ణుమూర్తి యొక్క మోహినీ అవతారాలు పద్మపురాణం, భాగవతం, బ్రహ్మాండపురాణం, లింగ పురాణం, గణేశపురాణం, స్కాందం లలో ప్రస్తావించారు. ప్రస్తుతించారు.  అటువంటి సందర్భాలని గుర్తుచేసుకుందాం . 

1. మొట్టమొదట మోహినీ అవతారం ప్రస్తావన క్షీరసాగర మధనంలో కనిపిస్తుంది .  దైత్యగణ మోసాన్ని నివారించడానికి, దేవతలకు న్యాయం చెయ్యడానికి స్వామి ఒకే సమయంలో ఆ మందర పర్వతాన్ని మోస్తున్న కూర్మంగా, ఆ మధనఫలితాన్ని అనుగ్రహిస్తున్న ధన్వంతరిగా, దేవతలకు అమృతం పంచుతున్న మోహినిగా వ్యక్తమయ్యి జగన్నాటక సూత్రధారి అనిపించుకున్నారు . శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ చేస్తూ మోహినిగా నిలబడి రాక్షసులను మరులు గొలుపుతూ దేవతలకు ఆ అమృత ఫలాలను అందించారు.

2. ఈశ్వరుడు ఆ సాగరమధన సమయంలో వచ్చిన విషాన్ని తన గరళంలో దాచుకుని లోకాలను రక్షించే కార్యక్రమంలో నిమగ్నమైయున్నారు . ఆ  తరువాత దేవతలందరూ స్వామి యొక్క మోహినీ అవతార అందచందాలను వేనోళ్ళా పొగిడారు. అప్పుడు పరమేశ్వరులు వైకుంఠం వెళ్లి, తనకు ఆ అవతార దర్శనాన్ని అనుగ్రహించమని వేడుకున్నారు . అప్పుడు  శివుని కోసం మరల మరొక్కసారి మొహిని అవతారం తీసుకుని పార్వతీదేవి మరొక రూపమే ఇది అని  ఆయనకు దర్శింపచేసారు.

3. ఒకానొక సమయంలో ఋషులు అహంకారంతో తాము ధర్మాన్ని అనుష్టిస్తున్న కారణంగా దేవతలకు హవిస్సులు అర్పించనవసరం  అవసరం లేదని , తాము అరిషడ్వర్గాలను జయించాము కాబట్టి, తామే స్వతంత్రులమని ప్రకటించుకుని అనుష్టానాలు మానేశారు .  వారికి సత్యం బోధపరచడానికి శివుడు సుందరుని రూపంలో ఋషి పత్నుల ముందు, అదే సమయానికి విష్ణువు మోహినీ అవతారంలో ఋషుల ముందు నడయాడి వారిని మోహంలో ముంచి, తద్వారా తమ తప్పులు తెలుసుకునేలా చేసి, మరల ధర్మానుష్టానం చేసేవిధంగా వారిని సరినదారి చూపించి వచ్చారు. చిదంబరంలో నటరాజేశ్వరుని చరితం దీనికి అనుసంధానించి చెబుతారు.

4. ఒకసారి భస్మాసురుడు తాను ఎవరి తలపైన చేయి పెడితే వారు భస్మం అవుతారన్న వరాన్ని అనుగ్రహించమని శివుని కోరాడు . భక్త వత్సలుడు యుక్తాయుక్తాలు ఆలోచించలేదు . తదాస్తూ అనేశాడు . ఆ అసురుడు నీ తలమీదే చేయి పెట్టి , నీ వరం నిజమో కాదో తేల్చుకుంటా అని వెంటపడ్డాడు. తానిచ్చిన వరం మర్యాద నిలపాలి. అందుకోసం   లీలావినోదంగా శివుడు అతడినుండి పారిపోతున్నట్టు నటించారు .  తనకు అభేదమైన విష్ణువు ఆ మూర్ఖ అసురుని మోహింప చెయ్యడానికి మోహిని అవతారం స్వీకరించి అతడి తలమీదే అతని చెయ్యి పెట్టుకుని భస్మమైపోయేట్టు చేశారు . 

5. అంతగా ప్రాచుర్యం పొందని మరొక కధ గణేశపురాణంలో ఉంది. సూర్యుని అనుగ్రహంతో విరోచనుడు అజేయమైన ఒక మాయా కిరీటం సంపాదిస్తాడు. దాని వలన అతడు లోక కంటకునిగా మారి స్వర్గాన్ని ఆక్రమించి అల్లకల్లోలం సృష్టించగా మోహినీ అవతారంలో అతడిని మొహంలో ముంచి ఆ కిరీటం వదులుకునేలా ప్రేరేపించి సుదర్శనానికి బలి ఇస్తాడు ఆ స్థితికారకుడు.

6. ఇరావంతుడు (తమిళంలో అరవన్) అని అర్జునుని కుమారుని దగ్గర మూడు అజేయమైన బాణాల ద్వారా ఎవరినైనా ఓడించగలిగిన శక్తి సాధిస్తే అతడి బ్రహ్మచర్యాన్ని, విపరీతంగా పెరిగిన తేజస్సును ఒజస్సుగా నీరు కార్చడానికి శ్రీకృష్ణుడు తన ఒకానొక అంశగా మోహినిని సృష్టించి తద్వారా అతడిని అచిరకాలంలో నిరోధిస్తాడు అని స్థలపురాణం.

7. ఇక హర మోహినీ కలయిక వలన హరిహరపుత్రుడు(ధర్మశాస్త) ఉద్భవించారని కొన్ని పురాణాలు చెప్పడం విశేషం . 

కొన్ని కధలు కల్పభేదాలుగా కనిపిస్తాయి. కొన్ని మరొక దానితో విభేదించినట్టు కనబడతాయి కానీ ఇందులో ఉన్న ఒక ధర్మసూక్ష్మం నారాయణ నారాయణి అభేదం. శివ-శక్తి అభేదం, హరి హర అభేదం. వివిధ రూపాలలో కనబడినా ఉన్న ఒక్క పరబ్రహ్మం వివిధ ఆకారాలలో ఆ విధినిర్వహణ చేస్తున్నా ఒకొక్క కార్యాన్ని చక్కబెట్టడానికి కొన్ని శక్తుల కలయిక చెయ్యాలి కాబట్టి ఇటువంటి లీలలు సృష్టిస్తుంటారు పరమాత్మ . తరచి చూస్తే, అనేకమైన రూపాలు ధరించి ఆ పరమాత్మ చేసే లీలా విశేషమే మన కాళ్ళని కనిపించేది . ఏకత్వములో ఉన్న అనేకత్వాన్ని, అనేకత్వములో దాగిన ఏకత్వాన్ని పరిచేయం చేయగలిగిన గొప్ప ధర్మము మన సనాతనం . 

శుభం . 

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi