Online Puja Services

ఆనాడే సంకరజాతి జీవులున్నాయన్నమాట

18.119.172.146

ఆనాడే సంకరజాతి జీవులున్నాయన్నమాట ! (మకర ధ్వజుడు) 
-లక్ష్మీ రమణ 

సంకరజీవులని , సంకర వంగడాలనీ పుట్టించామని, కనుగొన్నామని  మేధావులు అనుకుంటున్నారు. మన ఇతిహాసాల్లో అటువంటి జీవుల గురించిన వివరణలు ఉండడాన్ని వారు గమనించారో లేదో మరి ! సగం వానరం , సగం మత్స్యం అయిన హనుమంతుని కుమారుడి గురించి విన్నారా ? హనుమంతుడు ఘోటక బ్రహ్మచారి కదా ? అని మరో ప్రశ్న సంధిస్తే , అప్పటికే స్పెర్మ్ బ్యాంకులు, ఎగ్ ప్రిజర్వేషన్ / ఫ్రీజింగ్ సెంటరులు  ఉన్నాయని చెప్పుకోవాల్సి వస్తుందేమో మరి ! 

కాంబోడియాన్, థాయ్ కథనాల ప్రకారం హనుమంతుడి పుత్రుడిని మచ్చాను అని కూడా పిలుస్తారు. రావణుడి కుమార్తె అయిన మత్స్యకన్య, హనుమంతులకు మచ్చాను జన్మించాడని అంటారు. ఇంకొన్ని కథనాలు, హనుమంతుడి వీర్యం నదీజలాల ద్వారా పయనించి రావణుడి కుమార్తె అయిన మత్స్యకన్య సువన్నమచ్చని చేరిందని ఆ విధంగా హనుమంతుడికి కుమారుడు జన్మించాడని అంటున్నాయి.

మరికొన్ని కథనాలు, లంకకు వంతెనను కడుతున్నప్పుడు హనుమంతుడు సువన్నమచ్చతో ప్రేమలో పడి తద్వారా మచ్చాను అనే బిడ్డకు జన్మనిచ్చారని అంటారు.

రామ రావణ యుద్ధంలో , రావణుడికి తోడైన మైరావణుడు రామలక్ష్మణులని పాతాళానికి ఎత్తుకుపోతాడు .  ఆ మాయావిని వెతుక్కుంటూ బయల్దేరతాడు హనుమంతుడు .  అప్పుడు మైరావణుని రాజ్యంలో హనుమంతుడు ఒక సాహసోపేతమైన ప్రత్యర్థిని ఎదుర్కొంటాడు. వానరునిలాగే కనిపించిన ఆ ప్రత్యర్థి సగం చేప ఆకారంలో ఉంటాడు . వారిద్దరూ హోరాహోరీ పోరాడతారు .  హనుమంతుడు ఎవరీ బలశాలి ఆశ్చర్యపోతాడు . ఇంతలో, ఆకాశంలో బంగారు వర్ణంలోనున్న నక్షత్రం మిల మిల మెరుస్తుంది. ఆకాశవాణి వినిపిస్తుంది. హనుమంతుడికి ఎదురైన ఆ సాహసోపేతమైన ప్రత్యర్థి మరెవరో కాదని అతను స్వయంగా హనుమంతుడి కుమారుడేనని ఆకాశవాణి వినిపిస్తుంది. రావణుడి కుమార్తె అయిన సువన్నమచ్చ ద్వారా హనుమంతుడికి కుమారుడు జన్మించాడని ఆకాశవాణి తెలియచేస్తుంది. వెనువెంటనే హనుమంతుడు తన ఆయుధాలను వెనక్కి తీసుకుంటాడు. తండ్రీ కొడుకులు ఇరువురూ ఒకరినొకరు గుర్తుపడతారు.

హనుమంతుడికి కుమారుడున్నాడన్న విషయం హనుమంతుడికి కూడా యుద్దభూమికి వెళ్ళేంతవరకు తెలియదన్న విషయం ఆశ్చర్యకరమైన అంశం. యుద్ద భూమిలో ఎదురైన శత్రువే తన కుమారుడని హనుమంతుడు తెలుసుకున్నాడు. హిందూ పురాణంలో ఇలాంటి ఆశ్చర్యకరమైన అంశాలెన్నో చెప్పబడ్డాయి. మకరధ్వజ హనుమంతుడి కొడుగుగానే కాకుండా సాహసోపేతమైన యుద్ధ వీరుడిగా కూడా ప్రసిద్ధి. తండ్రీ కొడుకులిద్దరూ యుద్ధభూమిలో ఒకరికొకరు ఏమవుతారో తెలుసుకోకుండా యుద్ధానికి సన్నద్ధమవుతారు.

అంతే కాకుండా మహర్షి వాల్మీకి రామాయణంలో కథనం ప్రకారం ఒకసారి హనుమంతుడు ఒక నదిలో స్నానమాచరిస్తుండగా అతని శరీరంలోనుంచి పుట్టిన వేడివల్ల అతని వీర్యం ఆ నదీజలాల గూండా ప్రయాణించి ఒక చేప లాంటి జీవి అయిన మకరలోకి చేరింది. ఆ తరువాత ఆ జీవి ఒక బిడ్డను ప్రసవించింది. ఆ తరువాత రావణుడి దాయాదులైన ఆహిరావణ, మహిరావణలు సగం వానర ఆకారంలో సగం చేప ఆకారంలోనున్న ఈ బిడ్డని ఆ నదీతీరంలో కనుగొన్నారు. ఆ విధంగా మకరధ్వజూడు మైరావణుని సేవలో నియోగించబడ్డాడు .

వాల్మీకి రామాయణం ప్రకారం, రామలక్ష్మణులను అహిరావణుడు పాతాళానికి తీసుకువెళ్ళినప్పుడు హనుమంతుడు వారిని కాపాడేందుకు బయలుదేరతాడు. ఇంతలో, సగం వానరం, సగం చేప ఆకారంలోనున్న మకరమనే వాడు పాతాళ ద్వారం వద్ద హనుమంతుడికి సవాల్ విసిరాడు. హనుమంతుడికి కుమారుడిగా తనని తాను పరిచయం చేసుకున్నాడు.

మకరధ్వజుడు తన కుమారుడన్న విషయం తెలుసుకుని హనుమంతుడు విస్మయానికి లోనవుతాడు. తాను బ్రహ్మచారని చెప్తాడు. జరిగిన సంఘటనలన్నిటినీ ఒకసారి కళ్ళు మూసుకుని తన మనోనేత్రంతో హనుమంతుడు తెలుసుకున్నాడు. తన పుత్రుడైన మకరధ్వజుడిని హత్తుకుని ఆశీర్వాదాన్ని అందించాడు. ఈ కథ ఆ రోజుల్లో కుంభసంభవులయినా టెస్ట్ ట్యూబ్ బేబీలున్నట్టే , సంకరజాతి జీవులున్నాయన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నట్టు లేదూ !

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi