Online Puja Services

‘గోవింద’ నామ మహిమ ఎలాంటిది ?

3.146.152.99

‘గోవింద’ నామ మహిమ ఎలాంటిది ? 
- లక్ష్మి రమణ 
 
భజ గోవిందం భజ గోవిందం 
గోవిందం భజ మూఢమతే !

అంటారు శంకరాచార్యులవారు . మృత్యువు ఆసన్నమైనప్పుడు నిన్ను రక్షించేది , నీకు శాశ్వతమైన సంతోషాన్నిచ్చేది , నీతో వచ్చేది నువ్వు చేసిన గోవింద నామ స్మరణ ప్రభావం మాత్రమే అంటారాయన ! అందువల్ల ఆ నామాన్ని  నిరంతరాయంగా స్మరించమని మూఢమైన మనసుని ఆదేశిస్తారు . అంతగా ఆ గోవింద అనే నామంలో దాగున్న మహిమ ఎటువంటిది ?

నామము భవసాగరాన్ని దాటించే నావ వంటిది. నామాన్ని నిరంతరం స్మరిస్తుంటే, అది ధ్యానమై అనంతరం దైవానుగ్రహాన్ని అందిస్తుంది . సంసారం అనే సాగరాన్ని దాటించే చుక్కాని అవుతుంది . మనసు మరో ఆలోచన లేకుండా భగవంతుని మీదే నిలవడం నిలపడం చాలా కష్టం . అది సాధించినవారు యోగి ! అందుకే ముందర మనసుకి స్మరణ అలవాటు చేయాలి . నెమ్మదిగా ఆ నామ సగుణ స్వరూపం నుండీ నిర్గుణ పరబ్రహ్మలో మనసు తాదాత్మ్యం పొందుతుంది . అటువంటి శ్రీహరి నామాలలో ‘గోవింద’  అనే నామం ఒకటి . 

తెలుగువారికి గోవిందుడంటే వేంకటేశ్వరస్వామే! ఆ స్వామిని ఆరాధించే వారందరూ గోవిందా గోవిందా అని ఆ కలియుగదైవాన్ని స్మరిస్తుంటారు .  తిరుమల లోని శ్రీవారి సన్నిధి నిరంతర గోవింద నామ స్మరణతో మారుమ్రోగుతూ ఉంటుంది . ఇంతకీ ఈ నామం హరి అవతారమైన కృష్ణ స్వామిది . ఆ నామానికి విస్తృతమైన అర్థం ఉంది .   

ఇంద్రుని గ్గర్వాన్ని అణిచి, చిటికిన వేలుపైన గోవర్థన గిరిని నిలిపి గోకులాన్ని కాపాడిన నల్లనయ్య కథ అందరికీ తెలిసినదే ! ఈ సంఘటనతో గర్వం తొలగిపోయి, కృష్ణుడే పరమాత్మ అనే జ్ఞానం కలిగింది ఇంద్రుడికి. స్వయంగా శ్రీకృష్ణుని దర్శించుకుని, క్షమాపణలు వేడుకునేందుకు గోకులానికి వచ్చాడు . అదే సమయంలో తన బిడ్డలైన గోవులన్నింటినీ రక్షించిన కృష్ణుని పట్ల కృతజ్ఞతగా, ఆయనను దర్శించి తన క్షీరాలతో కృష్ణుని అభిషేకిస్తుంది గోమాత కామధేనువు. ఆ దృశ్యాన్ని చూసి పరవశించిపోయిన ఇంద్రుడు తన వాహనమైన ఐరావతాన్ని కూడా గంగాజలంతో కృష్ణుని అభిషేకించవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. 

భూమిమీద ఉన్న జీవులన్నింటికీ అధిపతి అయిన పరమాత్ముని స్వరూపాన్ని చూసి, పులకించి పోయారు . స్వామీ మీరు అనుగ్రహించిన ఈ దివ్య రూపంలో గోవిందుడనే నామంతో పూజింపబడతారు. అని  చెబుతారు . నిజానికి గోవులు అంటే జీవులు అని అర్థం . ఆ విధంగా జీవుల్లన్నింటికీ ఇంద్రుడు (పరిపాలకుడు / అధిపతి) గా గోవిందుడు అనే నామాన్ని పొందారు పరమాత్మ . 

విష్ణు సహస్రనామంలో

మహేష్వాసో మహీభర్తా శ్రీనివాసః సతాం గతిః |
అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాం పతిః

అన్న శ్లోకం కనిపిస్తుంది. ఇందులో గోవింద అనే నామాన్ని వివరిస్తూ పెద్దలు గో అనే శబ్దానికి గోవులు, భూమి, వాక్కు, వేదాలు అనే అర్థాలు ఉన్నాయని చెబుతారు. అంటే యోగులు విష్ణుపరమాత్మను ఈ లోకానికీ, ఆ లోకం మీద ఉండే జీవులకూ ప్రాణాధారంగా భావిస్తున్నారని తెలుస్తోంది. ప్రేమ పురుషుని ఈ విధంగా గోవిందా నామంతో స్మరిస్తే, ముక్తి ప్రాప్తిస్తుంది . 

శుభం . 

#govinda #bhajagovindam #venkateswaraswami

Tags: govinda, bhajagovindam, venkateswara swami,

Quote of the day

The Vedanta recognizes no sin it only recognizes error. And the greatest error, says the Vedanta is to say that you are weak, that you are a sinner, a miserable creature, and that you have no power and you cannot do this and that.…

__________Swamy Vivekananda