Online Puja Services

అన్నం వండేప్పుడు ఇలా చేస్తే యజ్ఞం చేసిన ఫలితం .

18.218.38.125

అన్నం వండేప్పుడు ఇలా చేస్తే యజ్ఞం చేసిన ఫలితం . 
- లక్ష్మి రమణ 

భారతదేశం అగ్ని ఆరాధనే ప్రధానమైన సంప్రదాయంగా కలిగిన దేశం . ఈ దేశంలో యజ్ఞాలూ , యాగాలూ నిత్యమూ జరిగేవి . ప్రస్తుతం కూడా అవి అవిచ్ఛిన్నంగా దేశసౌభాగ్యం కోసం , విశ్వశాంతి కోసం , సర్వ జీవుల సౌభాగ్యం కోసం జరుగుతూనే ఉన్నాయి . యజ్ఞం అంటే కేవలం యజ్ఞకుండంలో చేసేది మాత్రమే కాదు.  మన శరీరమే సిద్ధంగా ఉన్న యజ్ఞ కుండం.  అందులో వేల్చే హవిస్సులు ఆ శరీరానికిచ్చే ఆహారం. దానివల్ల కూడా ప్రజా శ్రేయస్సు జరుగుతుంది. అలా జరిగే యజ్ఞంలో అగ్ని ఎలా ఉంటుంది ? ఆ అగ్ని రూపం ఏమిటి ? 

అహం వైశ్వానరో భూత్వా
 ప్రాణినాం దేహమా శ్రితః
 ప్రాణాపాన సమాయుక్తః 
పచామ్యన్నం చతుర్విధం 

అన్నం లేదా ఆహారము భక్ష,భోజ్య, లేహ్య, చోష్యాలని నాలుగు రకాలు.  ఈ ఆహారము ప్రాణుల దేహాలలోకి వెళ్లి, అక్కడ జటరాగ్ని ద్వారా ప్రాణాపాన వాయువులతో కలిసి శరీరానికి శక్తినిస్తుంది. అటువంటి  జటరాగ్నిని నేనేనని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతారు.  ఆ విష్ణువే అగ్ని అయినప్పుడు, మన శరీర వ్యవస్థే,  హోమగుండమై సిద్ధంగా ఉంటుంది . ఈ జఠరాగ్నిలో మనం అన్నాన్ని హుతం చేస్తున్నాం . యజ్ఞంలో ఆహుతులని వేసినట్టు . 

అలా హుతమైన ఆహారాన్ని స్వీకరించి, విభజించి, సారంగా, శక్తిగా మార్చి సర్వ ఇంద్రియాలకు ఆ శక్తిని పంపుతున్నాడు జటరాగ్ని స్వరూపమైన వైశ్వానరుడు . ఇలాగే  యజ్ఞం జరిగేటప్పుడు అగ్నిలో హుతమైన పదార్థాన్ని దేవతలకు అగ్ని అందజేస్తాడు. అదేవిధంగా, ఇంద్రియాలకు ఈ అన్నశక్తిని అందజేస్తోంది జటరాగ్ని.  ఇంద్రియాలకు అధిష్టాన దేవతలు ఉన్నారని ఇక్కడ మరోసారి గుర్తు తెచ్చుకోవాలి.  కనుక అన్నం తినడం అంటే యజ్ఞం చేయడమే!

యజ్ఞం చేసేప్పుడు అందులో వేసే ద్రవ్యాలని యెంత పవిత్రంగా ఉంచుతామో , అంటే పవిత్రంగా తినే అన్నాన్ని కూడా వండాలి.  ముందుగా పొయ్యి వెలిగించేప్పుడు , అగ్ని దేవునికి నమస్కారం చేసుకొని, పైన ఉంచిన గిన్నెలో నుండీ కొన్ని గింజల్ని  తీసుకొని గిన్నె చుట్టూ తిప్పి అగ్నికి ఆహుతిగా ఇవ్వాలి .  ఆ తర్వాత వండే ఆహారాన్ని ఈశ్వరునికి (ఇష్ట దైవానికి) నైవేద్యంగా సమర్పించేందుకు వండుతున్నాను. ఈ ఆహారం ఆయనకీ ప్రీతిని కలిగించుగాక అని భావించి , అగ్నికి నమస్కారం చేసుకోవాలి . అలా వండిన ఆహారాన్ని దేవునికి నివేదనగా పెట్టి తినాలి . ఇటువంటి ఆహారం మన శరీరం అనే యజ్ఞకుండంలో వేయదగిన హుతం . అది దేవతలకి ప్రీతి కలిగిస్తుంది. 

అందుకే స్నానం చేసి వంట చేయమని , ఇంటి ఆహారమే తినమని శాస్త్రం చెబుతుంది . ఈ విధంగా తీసుకునే ఆహారం శరీరానికి , సూక్ష్మ శరీరానికి కూడా తృప్తినిస్తుంది . ఆయుష్షుని వృద్ధి చేస్తుంది .  శక్తిగా , రేతస్సుగా మారిన ఆహారం చక్కని సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది . దేవతల ఆశీస్సులని అందజేస్తుంది . దీని అర్థం అన్నం తింటే సరిపోతుంది , యజ్ఞయాగాదులు చేయనవసరం లేదు అనిమాత్రం కాదని గ్రహించాలి .  అన్నం తినేప్పుడు తినేందుకు పుట్టమని తినకూడదు . ఈశ్వరునికి అర్పిస్తున్నాం అనే భావనతో స్వీకరించాలి అని చెప్పడం. అదికూడా యజ్ఞం వంటిదే !  

Quote of the day

May He who is the Brahman of the Hindus, the Ahura-Mazda of the Zoroastrians, the Buddha of the Buddhists, the Jehovah of the Jews, the Father in Heaven of the Christians give strength to you to carry out your noble idea.…

__________Swamy Vivekananda