Online Puja Services

తిరుమల వేంకటేశుని పూల అలంకారం

3.140.186.201

తిరుమల వేంకటేశుని పూల అలంకారంలో దాగిన విశేషాలు తెలుసా !
సేకరణ 

ఏడుకొండలవాడా! వెంకటా రమణా ! అని ఆ శ్రీనివాసుడిని చూసేందుకు, తపించని భారతీయుడు ఉండడంటే అతిశయోక్తి కాదు .  తమ కోరికలు చెప్పుకోవడానికే కాదు , సౌందర్యమంతా ఒకచోట రాశి పోసినట్టుండే ఆ నీల మేఘశ్యాముని సమ్మోహన రూపాన్ని చూడడం కోసం కూడా ఆ గోవిందుని సన్నిధికి వెళ్లాలని ప్రతి మనసూ ఆరాటపడుతుంది . పూలల్లో దాగిన ఆస్వామి సౌందర్యం , నిలువెల్లా దండలై తమ జన్మధన్య చేసుకున్న ఆ పూల సోయగంతో పోటీ పడుతుంది . సున్నితమైన ఆ పూలు అందమా ? స్వామి యెక్క మనోహరమైన చిరునవ్వు అందమా అని పరిశీలిస్తే, స్థాణువై అలా ఆ మోమువైపు చూస్తూ ఉండిపోవడమే తప్ప తేల్చుకోలేరు ! అదీ ఆ వెంకటేశుని రూపులో ఉన్న మహిమ . కానీ, అసలు ఆ స్వామికి చేసే పూల అలంకారంలోనే గొప్ప విశేషం ఉంది . అదేమిటో తెలుసుకుందామా !

అసలు వెంకటేశునికి సంబంధించిన ఏ అంశం విశేషమైనది కాదు గనుక ! ఆయన అవతారం, అనుగ్రహం, ఆరాధన అన్ని అద్భుతమైనవే ! అనంతమైన ఫలితాలని అనుగ్రహించేవే ! ఆ బ్రహ్మానందనాయకునికి అలంకరించే  ఆభరణాలు , నివేదించే  ప్రసాదాలు, జరిగే సేవలు ఇలా ఆయనకీ సంబంధించిన అన్ని విషయాలూ అనంతమైన ఆసక్తిని కలిగించేవే ! ఒక్క క్షణకాలం సేపు ఆయనని దర్శించుకున్న పూల అలంకరణలో దాగిన ఆ బ్రహ్మానందనాయకుని రూపం మన మనసుని దోచుకోవడం ఖాయం . అలా మనసు దోచేలా ఆ స్వామీ మనోహరరూపానికి జరిగే పూల అలంకరణకు య్యెన్ని పూలు పడతాయో , వాటిని ఎలా అలంకరిస్తారో తెలుసుకోవడం కూడా ఒక  భాగ్యమే కదా ! అలా అలంకరించే ప్రతి దండకీ ఒక ప్రత్యేకమైన పేరుంది.  ఒక ప్రత్యేక అలంకార వివిశేషం ఉంది మరి . రండి ఇక అసలు ఆ స్వామికి ఒక రోజుకి ఎన్ని రకాల దండలు అలంకారంగా వేస్తారో తెలుసుకుందాం . 

1.శిఖామణి:
శ్రీవారి కిరీటం మీద నుంచి రెండు భుజాల మీద వరకు అలంకరింపబడే అదృష్టాన్ని పొందింది కాబట్టి, ఇలా అలంకరించబడే ఒకే దండను శిఖామణి అంటారు. ఇది సుమారు 8 మూరలు ఉంటుంది.

2.సాలిగ్రామాలు:
ఇవి రెండు మాలలు. ఒక్కొక్కటి సుమారు 4 మూరలు ఉంటుంది. 
శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూ ఉన్న సాలిగ్రామాల మాలలకు ఆనుకొని వేలాడదీస్తూ అలంకరింపబడే పొడవైన పూలమాలలు. గండకీ నది గర్భంలో ఉద్భవించిన విష్ణువు, వేంకటేశునికి దండగా మారి తనని తానె అలంకరించుకుంటే, ఆలా అలంకారమైన విష్ణు స్వామికి తమ సౌగంధముచేత సేవలు చేసే మాలలు ఈ సాలిగ్రామమాలలు. 

3.కంఠసరి:
ఈ దండ మూడున్నర మూరలు ఉంటుంది. మెడలో రెండు పొరలుగా రెండు భుజాల మీదికి అలంకరింపబడే ఒకే దండ. ఆయన అభుజాకీర్తుల సౌందర్యాన్ని ఇనుమడింపజేసే పుష్పమాల కంఠ సరి.  

4.వక్షస్థల లక్ష్మి మాల :
చందనచర్చిత మైన విష్ణువక్షస్థల నివాసిని అయిన శ్రీదేవి, భూదేవులకు రెండు దండలు. ఒక్కొక్కటి ఒకటిన్నర మూర ఉంటుంది. 

5.శంఖుచక్ర మాలలు :
అయ్యవారి సూర్య ప్రతాపాల సేవకులు శంఖుచక్రాలు . వారిరువురికీ  రెండు దండలు. 
ఒక్కొక్కటి ఒక మూర పొడవు ఉంటుంది.

6.కఠారిసరం:
శ్రీవారిని మధురపదాల పాటలు మాలలతో  అర్చించిన అన్నమయ్య ఆ నందక ఖడ్గమేనని నమ్మిక . తెగనరకడమే ఎరిగిన ఆ ఖడ్గానికి , అంతటి సౌందర్య లాలిత్యమైన మనసు ఎలా వచ్చిందో మరి ! శ్రీ స్వామివారి బొడ్డున ఉన్న ఆ అపరాజయమైన నందక ఖడ్గానికి అలంకరించే దండ కఠారిసరం . ఇది  రెండు మూరలు ఉంటుంది .

7.తావళములు:
స్వామివారి రెండు మోచేతుల కింద, నడుము నుండి మోకాళ్ళపై హారాలుగా, 
మోకాళ్ళ నుండి పాదాల వరకు జీరాడుతూ, వేలాడ దీసే మూడు దండలు ఈ తావళములు. వీటిలో మొదటిది మూడు మూరలు ఉంటుంది. రెండవది మూడున్నర మూరలు ఉంటుంది. మూడవది నాలుగు మూరలు ఉంటుంది.

8.తిరువడి దండలు:
శ్రీ స్వామివారి పాదాలపై చుట్టూ అలంకరించే రెండు దండలే ఈ తిరువడి దండలు. ఒక్కొక్కటి ఒక్కో మూర ఉంటుంది.

ప్రతి గురువారం సాయంత్రం జరిగే పూలంగి సేవలో మాత్రమే శ్రీ స్వామివారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసివేసి, ఇప్పటిదాకా చెప్పుకున్న మాలలతో అలంకారం  చేస్తారు. ఆ రోజు నిలువెల్ల స్వామివారిని విశేషంగా పూలలమాలతో అలంకరిస్తారు. పూలవిల్లు లేని మన్మథుని లాగా ఆస్వామి ఆరోజు ప్రకాశిస్తారు . 

సూర్యోదయానికి విచ్చుకునే పూలు ఆ దేవుని పాదపద్మాలని చేరి, ఆయన తనువెల్లా అలంకారమై నిలిచి, ఆయన దేహానికి తమ  సుగంధాన్ని అద్దె అదృష్టాన్ని పొందాయి . సాయంత్రానికి వాడిపోయి , నిర్మాల్యమై వెళ్లిపోతాయి . అయితే మాత్రం ఏంటి , ఆ ఒక్కరోజు జీవితాన్ని, ఆ స్వామికి అర్పించి అవిచేసుకున్న పుణ్యం సామాన్యమైనది కాదుకదా ! మనిషి యొక్క మనసు కూడా ఆ పుష్పం వంటిదే ! అది అర్పించాల్సింది ఆ స్వామీ పాదాల చెంత. అప్పుడు కదా, మన మనోగంధంతోటి ఆయన పరిమళించి , మనల్ని తనలోకి ఆహ్వానిస్తారు . ఇది పూలు చెప్పే కథ . ఆ  పూల రేరేడు అయినా వేంకటేశుడు పూవులల్లో దాగి  చెప్పే సుధ ! ఈ సారి తిరుమల వెళ్ళ్లేప్పుడు గురువారం దర్శనం దొరికేలా ప్రణాళిక వేసుకోండి . ఈ పూలరారాజు సమ్మోహన రూపాన్ని దర్శించుకోండి . శుభం .   

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore