Online Puja Services

తోడుపెళ్ళికూతుర్ని కూర్చోబెట్టడం ఎందుకు ?

18.222.164.228

పెళ్ళికూతుర్ని చేయడం, వారికి కొక తోడుపెళ్ళికూతుర్ని కూర్చోబెట్టడం ఎందుకు ?
లక్ష్మీ రమణ 

పెళ్లి రెండురోజుల తర్వాత ఉన్నప్పటికి, ఈ రోజే పెళ్ళి కూతుర్ని మంగళస్నానాలు చేయించి, పెళ్లికూతురిగా  అలంకరిస్తారు . ఇందులో విశేషం ఏముందని అనుకోవచ్చు . ఇది చాలా అద్భుతమైన సంప్రదాయం . నిజానికి ఈ సంప్రదాయంలో హిందూ సంస్కృతీ యొక్క ఔన్నత్యమే దాగుంది . ఆ విశేషాలని ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

 పెళ్లి కూతుర్ని చేయడం, లేదా పెళ్లి కొడుకుని చేయడం  అనేది  మన సంస్కృతిలో అంతర్భాగమైనటువంటి ఒక ప్రక్రియ .  వారిని సంప్రదాయబద్ధంగా స్నానం చేయించి, నుదుటన కళ్యాణ తిలకం దిద్ది, బుగ్గన చుక్కపెట్టి, చక్కగా పూలతో జడ వేసి , పట్టుబత్తలు కట్టించి, పెద్దలు హారతిచ్చి ఆశీర్వాదం చేస్తారు . అలా చేయగానే , వారి శరీరంలో ఒక వినూత్నమైన కళ ప్రవేశిస్తుంది. అంతకు ముందర లేనటువంటి కాంతి ఏదో వారి ముఖాల్లో స్పష్టంగా కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది .  ఇది ఆదిదంపతుల కళ. వారి ఆశీర్వచనానికి చిహ్నం ఈకళ.  

ఇక, ఆ తర్వాత సంప్రదాయబద్ధంగా పెళ్లి కూతురిచేత పూజలు చేయించడం ఆచారం. ఇక్కడ మనం రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని గుర్తు చేసుకోవాలి . పోతనగారు భాగవతంలో చెప్పినట్టు , “ నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ “ అని పురాణ దంపతులైన ఆ ఉమామహేశ్వరులని ఆ రుక్మిణీదేవి అర్చించినట్టు , నవవధువు చేత అర్చింపజేస్తారు. దీనివల్ల ఆ వరుడికి ఆయుష్షు వృద్ధి చెందుతుంది. లక్ష్మీ దేవి, ఆ వాసుదేవుని వరించి, ఆయన్ని గెలిచిన విధంగా వరుని మనసుని గెలిచి, ఆయనకీ సౌభాగ్యాన్ని ఇవ్వగల లక్ష్మీగా ఉండేటటువంటి శక్తి ఈ ప్రక్రియవల్ల ఆ నవవధువుకి సంప్రాప్తిస్తుంది. 

అదేవిధంగా గౌరీ పూజని అనుష్ఠానం చేయించి, ఆ పెళ్లి కూతురిచేత చెరకు గడలు, మొలకెత్తిన శనగలు , నల్లపూసలు, పగడాలు, ఎర్రని పూలు, తాటాకు వంటి వాటిని వారి వారి సంప్రదాయానుసారంగా సువాసినులకి ఇప్పిస్తారు . దీనివల్ల ఆమె మాంగల్యానికి గౌరీదేవి అనుగ్రహం సిద్ధినుంచి, అత్తవారింట్లో శోభాగ్యంతో విలసిల్లుతుంది అని విశ్వాసం . 

ఇక తోడుపెల్లి కూతురు లేదా తోడుపెల్లికొడుకు ఉండడం అనేది పెళ్ళికూతురికి / పెళ్లికొడుకుకి సౌకర్యవంతంగా ఉండడానికి , ఇంకా వారికి ఎటువంటి అశుభాలూ వాటిల్లకుండా ఉండడానికీ పాటించే ఆచారంగా పెద్దలు చెబుతున్నారు .  వధూవరులని ఆశించి ఉన్న ఆదిదంపతుల కళ ఈ తోడు పెళ్లి కూతురు లేదా తోడు పెళ్ళికొడుకు వల్ల సంరక్షింపబడుతుందని భావన . వీటన్నిటితోపాటుగా కులదేవత ఆశీర్వాదాన్ని, గురువు ఆశీర్వాదాన్ని తప్పకుండా తీసుకోవాలని పెద్దలు చెబుతున్నారు . 

కాబట్టి పెళ్ళికూతుర్ని చేయడం అనేది కేవలం వేడుకకు మాత్రమే చేసే విధానం కాదు . ఇందులో ఎంతో ఆధ్యాత్మిక ఔన్నత్యం ఉంది. ఇదేకాకుండా ఈ విధానంలో మనం ఉపయోగించేటటువంటి పసుపు, కుంకుమ, చందనం , గోరింటాకు, పన్నీరు , పూలు, సుగంధద్రవ్యాలు నవదంపతులు మధ్య అనురాగం, ఆప్యాయతలకు పునాది వేస్తాయి. వారిని మానసికంగా శారీరికంగా తమ బంధాన్ని స్వాగతించడానికి సిద్ధంగా  చేస్తాయి . అదన్నమాట సంగతి ! 

Quote of the day

If you shut the door to all errors, truth will be shut out.…

__________Rabindranath Tagore