Online Puja Services

కంచి గరుడ సేవ అని ఎందుకంటారు?

13.59.136.170

కంచి గరుడ సేవ అని ఎందుకంటారు?
- లక్ష్మీరమణ 

గరుక్మంతుడు శ్రీ మహావిష్ణువుకి అనుంగు సేవకులు . శ్రీమహావిష్ణువు ఏ కార్యార్థమై తరలి వెళ్తున్నా , తన భుజస్కందాలమీద ఆయనని ఎక్కించుకుని రివ్వున ఎగిరి క్షణాల్లో గమ్యాన్ని చేర్చే శ్రీవారి వాహనం గరుక్మంతుడు. ఆ శ్రీహరి ఏ రూపంలో ఈ భూమిమీద ఉన్నా, ఆయా రూపాల్లోనూ స్వామివారికి వాహనంగా గరుక్మంతుడు దర్శనమిస్తుంటారు. రామాలయం, కృష్ణాలయం, నారసింహాలయం, వెంకటేశ్వర ఆలయం , పద్మనాభాలయం ఇలా శ్రీవారు పలురూపాల్లో ఎక్కడున్నా ఆ గరుక్మంతుడు వాహనమై వెంటే ఉంటారు . అలాగే కంచిలో వేంచేసి ఉన్న వరదరాజస్వామి వారి ఆలయంలోనూ ఒక భారీ గరుడవాహనం ఉంది. దీనికీ  కంచి గరుడ సేవ అనే నానుడికి ఒక విడదీయలేని సంబంధముంది .  ప్రస్తుతం ఒక జాతీయంగా మారిపోయిన ఈ మాట వెనుకున్న ఆసక్తికరమైన విషయం. తెలుసుకుందాం . 

వైనతేయుని పరాక్రమానికి తిరుగేలేదు . తన తల్లి దాస్య విముక్తి కోసం సురలోకం నుండీ అమృతాన్ని తీసుకొని వస్తుంటే ఇంద్రుడు అడ్డగించి ఆయనమీద బ్రహ్మాస్త ప్రయోగం చేశాడు . ఆ బ్రహ్మాస్త్రం గౌరవాన్ని తగ్గించకుండా ఉండడం కోసం తన రెక్కల్లోని ఒక ఈకని విదిల్చాడట ఆ గరుక్మంతుడు. అంతటి బలశాలి , ధీశాలి , పరాక్రమశాలి మన గరుడభగవానుడు. అందుకే నిద్రించేముందర వైనతేయుణ్ణి స్మరిస్తే , దుస్వప్నాలు రావు .  తలచినంత మాత్రం చేత , స్వప్నములో కూడా  రక్షణగా ఉన్నాడంటే, మెలకువగా ఉన్నప్పుడు కూడా స్మరిస్తే,  ఇంకెంత రక్షణనిస్తాడో స్వామి . 

 ఆకాశంలో గరుడిని చూడటం, అతడి మాట వినడం గొప్ప అదృష్టంగా భావిస్తారు భక్తులు. భక్తులకే కాదు ఆ స్వామి దూతగా సులోకాధీశులందరికీ ప్రియమైనవాడు వైనతేయుడు.  స్వామివారి కళ్యాణమైనా , బ్రహ్మోత్సవమైనా , యజ్ఞమైనా మరే శుభకార్యమైనా  గరుడధ్వజమై  దేవీదేవతలకి ఆహ్వానం ఇచ్చేది ఈ గరుక్మంతుడేకదా ! 
 
గరుడవాహనంపైన స్వామి ఊరేగుతుంటే ఉండే శోభే వేరు . తిరుమల కోనేటిరాయుని బ్రహ్మోత్సవాల్లో కూడా  గరుడవాహనంపై చిద్విలాసమూర్తి విహరిస్తుంటే దర్శించుకోవాలని కోట్లాది భక్తులు కోరుకుంటారు.

 అయితే ‘కంచి గరుడ సేవ’ అన్న జాతీయం రావడం వెనుకమాత్రం ఆసక్తికర విషయం ఒకటుంది . 108 దివ్యదేశాల్లో ఒకటైన పవిత్రమైన కంచిలో ఆ వైకుంఠనాథుడు శ్రీ వరదరాజ పెరుమాళ్‌గా భక్తులను అనుగ్రహిస్తుంటాడు. కంచిలో భారీ ఇత్తడి గరుడ విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహంపైనే ఉత్సవమూర్తిని ఉంచి గరుడసేవ నిర్వహిస్తారు. దానిపై ఉండే స్వామి విగ్రహానికంటే గరుత్మంతుని వాహనం పెద్దదిగా ఉంటుంది. 

ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారిని సిద్ధం చేయడం కోసం ఈ ఇత్తడి గరుడ వాహనాన్ని కూడా శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇంట్లో ఉన్న ఇత్తడి సామాను మెరిపించాలంటేనే బోలెడంత శ్రమ చేయాలి . ఇక అంత భారీ గరుడ మూర్తిని  శుభ్రం చేసి, స్వామివారి సేవకి సిద్ధం చేయాలంటే, సామాన్యమైన శ్రమ సరిపోదు. ఈ  క్రమంలో అయ్యవార్లు అలిసిపోతుంటారు.

 గరుక్మంతుడు గొప్పవారే . కానీ అక్కడ ఉన్న పెరుమాళ్ళు ఆయనకంటే గొప్పవారు కదా ! పైగా ఈయన కేవలం వాహనం . ఆయన పెరుమాళ్ళు .  వరాలు అనుగ్రహించే వరదరాజు .  “ఈ గరుడమూర్తిని తోమి తోమి శ్రమపడి శుభ్రం చేసేకంటే,  స్వామి వారికి మరింత సేవ  చేస్తే మనకెంతో పుణ్యం కదా! అనుగ్రహించి పెరుమాళ్ళు వరాలని అనుగ్రహిస్తాడుకాదా ! ఈ గరుడ వాహనాన్ని యెంత తోమినా ప్రయోజనం ఏముంది ?” అని ఆ గరుడవాహనాన్ని శుభ్రం చేసేవారు వాపోతుంటారట. 

అదీ సంగతి . ‘ఇదంతా కంచి గరుడ సేవరా నాయనా’ అని మనవాళ్ళు వృధాగా శ్రమ పడినప్పుడు అనుకోవడం వెనుక ఇంత  కథ ఉంది . 

#kanchigarudaseva

Tags: kanchi garuda seva, varadaraja, perumal, kanchi, garuda

Quote of the day

May He who is the Brahman of the Hindus, the Ahura-Mazda of the Zoroastrians, the Buddha of the Buddhists, the Jehovah of the Jews, the Father in Heaven of the Christians give strength to you to carry out your noble idea.…

__________Swamy Vivekananda