Online Puja Services

మొలతాడు ఎప్పుడు కట్టుకోవాలి ? ఎందుకు కట్టుకోవాలి ?

3.14.132.214

మొలతాడు ఎప్పుడు కట్టుకోవాలి ? ఎందుకు కట్టుకోవాలి ? 
- లక్ష్మి రమణ 

మొలతాడు లేకపోతే మొగవాడే కాదు అనే సవాలు ‘ మొలతాడుకట్టిన మగాడివే అయితే‘ అని తెలుగునాట అనడంలో వినిపిస్తుంది . ఈమొలతాడు మగవారికే కాదు ఆడవాళ్ళకి కూడా ఉంటుంది .  నడుముకి కిందకట్టే ఈ బంధనంలో బోలెడంత ప్రయోజనం , పురాణ ప్రాశస్త్యం ఉంది . ఆ కథా కమామిషూ ఇక్కడ చెప్పుకుందాం . 

పుట్టిన 11వ రోజున మొలతాడు కడతారు. ఆ సమయంలో ముత్యాల మొలతాడు, బంగారు మొలతాడు, వెండి మొలతాడు లేదా ముంజ దర్భలతో పేనిన మొలతాడు కడతారు. ఆ తరువాత ఈ లోహపు సూత్రాలు ప్రతిరోజూ ధరించదానికి పిల్లలకు అసౌకర్యంగా వుంటుంది కాబట్టి, రోజువారీ వాడకానికి నల్లని/ఎర్రని నూలు తాడు కడతారు. మొలత్రాడు అనగానే సందే తాయత్తులు, సరిమువ్వగజ్జెలు వేసుకొని, బంగారు మొలతాడు కట్టిన చిన్ని కృష్ణుడు చేతిలో వెన్నముద్ద , చెంగల్వపూవు పట్టుకొని కనిపించే ఉంటాడు .  

చేతవెన్న ముద్ద చెంగల్వ పూదండ
బంగారుమొలత్రాడు పట్టుదట్టి
సందెతాయెతులు సరిమువ్వగజ్జెలు
చిన్నికృష్ణా ! నిన్ను చేరికొలుతు. 

అని కదా చిన్ననాడు చదువుకున్న పద్యము! ఇక రామదాసు తన కీర్తనలో శత్రుఘ్నునికి బంగారు మొలతాడు చేయించానని చెబుతూ .. ఇలా పాడతాడు . 

ఇక్ష్వాకు కులతిలకా ఇకనైన పలుకవే రామచంద్రా
నన్ను రక్షింప కున్నను రక్షకు లెవరింక రామచంద్రా …
శత్రుఘ్నునకు చేయిస్తి బంగారు మొలతాడు రామచంద్రా
ఆ మొల త్రాటికి పట్టె మొహరీలు పదివేలు రామచంద్రా…

ఈ సంప్రదాయాన్ని గురించి శ్రీకృష్ణదేవరాయల ఆముక్త మాల్యద, శ్రీనాథుడి శృంగారనైషధం, ఆంధ్ర ప్రతాపరుద్రీయం, మనుచరిత్ర, వంటి గ్రంథాలు కూడా ప్రస్తావించాయి.  ఇక సి పి బ్రౌన్ గారు తన  తెనుగు-ఇంగ్లీష్ నిఘంటువులో multaad ను ఈ  విధంగా నిర్వచించాడు "a band of twisted silver or gold wire, worn by the Indians round the waist."

ఇంతటి చరిత్రున్న మొలతాడు అసలెందుకు కడతారు ?

బిడ్డలకు ఆడ మగ అందరికీ కూడా  మొలతాడు కట్టడం జరుగుతుంది . మగవాళ్లకు ఇది జీవితాంతం ఉండాల్సిందే . అంత్యేష్టిలో దహన సమయంలో వస్త్రాలతో పాటు ఈ మొలతాడునూ కోసివేస్తారు.( కట్ చేస్తారు.) 

శరీరం రెండు భాగాలు. ఊర్థ్వ అథో భాగాలు. నిలువునా రెండు భాగాలు కుడి ఎడమలు . 

నాభికి దిగువ భాగం అథో భాగం అది అపవిత్రం. శరీరం లోని ఎడమ భాగం గూడా అంతే. అందుకే , ఎడమ చేత్తో ఏదైనా ఇవ్వడం, ఎడమ కాలు ముందు పెట్టడం అమంగళం అని భావిస్తాము.ఎడమ చేత్తో నీళ్ళు తాగడం గూడా ఆచారపరులు ఇష్టపడరు. ఉదాహరణకి 
అగ్ని కార్యం ( పితృకార్యం)లో పత్ని చేసేది పురుషుడి కుడి చేతికి సహకరించడమే.

కుడి చేతిలో హవ్యం ఉండగా దాని పైన వేయవలసిన నేయి యజమాని ఇక తన ఎడమ చేత్తో వేసుకోవలసి వస్తుంది . ఎడమ చేయి తగలకుండా పత్ని తన కుడి చేత్తో ఆ పని నిర్వర్తిస్తుంది. అలాగే , నాభికి దిగువ కొట్టడమూ యుద్ధ నీతికి విరుద్ధం( ఇతర కారణాలు ఉంటే తప్ప). దానికోసం సూచనా రేఖలాగా మగవారికి ఇలా ఖచ్చితంగా మొలతాడు ఉండాలని చెప్పి ఉండవచ్చు . 

ఇక ఈ ఉదంతాన్ని పరిశీలించండి . భారతంలో యుద్ధానంతరం కృష్ణుడు ద్వారకకు పోతూ ఉండగా, ఉదంకుడు అనే ఋషి తటస్థ పడి, సామర్థ్యం ఉండీ నీవు ఈ ఘోర కలి ఆపలేదు— అని ఆగ్రహంతో శపింపబోతాడు. కృష్ణుడు అతణ్ణి శాంత పరచి, తన తప్పు ఏమీ లేదని వివరిస్తాడు. ఆపై నీకు నన్ను స్మరించినంత మాత్రం చేత జలం లభిస్తుంది అని వరం ఇస్తాడు . 

తర్వాత చాలా రోజులకు ఉదంకుడు ఏదో జలరహిత ప్రదేశంలో పోతూ ఉన్నాడు. ఎక్కడా ఎంతసేపటికీ నీటి పోబిడి లేదు. శ్రీకృష్ణుడు ఇచ్చిన వరం గుర్తుకొచ్చి,  ఆయన ఇచ్చిన వరాన్ని పరీక్షించదలిచాడు . శ్రీకృష్ణుణ్ణి తలుచుకున్నారు. ఇతడి చిత్తశుద్ధి తెలిసిన కృష్ణ పరమాత్మ ఇంద్రుణ్ణి అతడికి అమృతం ఇవ్వు అని ఆదేశించారు.

ఇంద్రుడు ఒక సామాన్య మానవుడుగా దిగివచ్చాడు. మొల కిందికి ఒక తోలు సంచిలో మొలత్రాతికి వేళ్ళాడే బోటిల్ లాగా అమృతం కట్టుకొని, ఒంటరిగా ఉన్న ఋషిని సమీపించి ‘స్వామీ ! నీళ్ళు తాగుతారా?’ అని అడిగాడు. ఆ సంచీ నాభికి దిగువగా ఉన్నదని, అది అపవిత్రజలం అనీ, అంత దాహంలోనూ ఋషి వద్దు అన్నాడు.

తర్వాత కొంత సేపటికి కృష్ణుడే అక్కడ కనిపించాడు. మీకు ఇంద్రుడు అమృతం తెచ్చాడు. మీరు స్వీకరించ లేదు. అన్నాడు. ఐనా మీ పేర తృష్ణార్తులకు ఈ మరు భూముల్లో జలం అపుడపుడూ వర్షిస్తుంది. వాటికి  ‘ఉత్తంక మేఘాలు’అని పేరు ఏర్పడుతుంది. అని వరమిచ్చాడు శ్రీ హరి. ఈ కథ సుఖాంతమైనా , ఇంద్రుడు అలా అమృతాన్ని మొలకి కట్టుకున్న కారణం చేత,  నాభి దిగువకు మొలతాడు ధరించే ఆచారం ఏర్పడి ఉంటుంది.

స్త్రీ లకు కూడ ఒక వయసు వరకూ మొలతాడు ఉంటుంది. తర్వాత వాళ్ల శరీరానికి బంధం కాకుండా దాన్ని వదలివేస్తారేమో. స్త్రీ లకు గూడా అర్హత కలవాళ్ళకు యజ్ఞ కార్య సహకారంలో మౌంజీ ధారణ తాత్కాలికంగా ఉంటుంది.

ఇక తాయెత్తు రక్షగా కట్టడం ఉన్నదే. బాల కృష్ణుడికీ మన వాళ్లు కట్టారు కదా! ఇక ఈ మొలత్రాటికి సంబంధించిన ఇతరమైన అనేక విషయాలు ఇలా ఉన్నాయి !

బొజ్జ కొంచం పెరిగితే ఈ  మొలతాడు సంకేతమిస్తుంది. 'లావవుతున్నావు సుమా, జాగ్రత్తలు తీసుకో' అని. 'మొలతాడు తెగేతట్లు తింటేనే ప్రీతైన తిండి' అనే సామెత వుండనేవుంది.

మగవారు వంటిపై ఎటువంటి వస్త్రమూ లేకుండా స్నానం చెయ్యకూడదంటారు. అలాంటప్పుడు ఈ మొలతాడు ఉపయోగపడుతుంది. "గోచిగుడ్డను నిలపడానికి మొలతాడు వచ్చింది" అని వ్యాఖ్యానించారు బూదరాజు రాధాకృష్ణ.

మొల నూలు అనేది రాహు గ్రహీత సూచకం అని చెబుతారు . బిడ్డ తల్లి నుండీ విడి పడ్డాక తల్లిని అనుసంధానం చేసే బంధనం ఉండదు . అందుకు  రక్షగా ఈ మొలత్రాడు కడతారు. వినాయకునికి నాగమే బంధనంగా ఉంటుంది చూడండి . 

 నాభి,పేగు హెర్నియా  రాకుండా ఉండటానికి కూడా మొల నూలు సాంప్రదాయం వచ్చింది అంటారు పెద్దలు .

ఆడ పిల్లలకు సిగ్గుబిళ్ళ లేదా మరుగుబిళ్ళ అనబడే 'అంగానికి మరుగు సొమ్ము' అనే వెండి బిళ్ళను కట్టడానికి ఈ  మొలతాడు అవసరమవుతుంది. ఈ ఆచారం తెలుగు, తమిళ సాంప్రదాయాలలో ఎక్కువగా కనిపిస్తుంది. తమిళంలో దీనిని అంగత్తుకోఅరైముడి అంటారు.

ఆభరణాలలో శృంఖల అనేది మగవారి మొలతాడు; మేఖల (స్త్రీలు ధరించు ఎనిమిది పేటల మొలనూలు) అనేది ఆడవారి మొలతాడు. స్త్రీల మొలనూలుకు ఒడిదారము, కక్ష్య, కాంచి, రశనా, చిత్తిక అని పేర్లు వున్నాయి.

భార్య వుండగా పురుషుడు మొలతాడు తీసెయ్యరాదు అనే సంప్రదాయం  హిందువులలో వున్నది. రూక్షోణీ అని పిలువబడే ముంజతృణముతో అల్లిన బ్రహ్మచారి మొలత్రాడును తీసేసి, పెళ్ళినాడు కొత్త మొలతాడు కట్టుకుంటాడు పురుషుడు. భార్య మరణించినపుడు పురుషుడి మొలతాడును కోసి విధురుణ్ణి చేేస్తారు. ఐతే, పురుషుడు మళ్ళీ కొత్తమొలతాడు కట్టుకొని పునర్వివాహానికి సిద్ధమయ్యే అవకాశం వుంది. 

దీని నుండే "మొలతాడు వున్న మగాడివైతే …" అనే సవాలు వాక్యం వచ్చింది. అంటే, వివాహం చేసుకోడానికి అర్హుడవైతే అని అర్థం.

#molatradu #multaad

Tags: molatradu, multaad, 

Quote of the day

May He who is the Brahman of the Hindus, the Ahura-Mazda of the Zoroastrians, the Buddha of the Buddhists, the Jehovah of the Jews, the Father in Heaven of the Christians give strength to you to carry out your noble idea.…

__________Swamy Vivekananda