Online Puja Services

ఒకరు పూజకి వాడిన ఆసనాన్ని మరొకరు కూర్చోవడానికి వేసుకోవచ్చా ?

3.141.202.54

ఒకరు పూజకి వాడిన ఆసనాన్ని మరొకరు కూర్చోవడానికి వేసుకోవచ్చా ? 
- లక్ష్మీరమణ 

పూజ చేసుకొనేప్పుడు ఆసనం లేకుండా చేయకూడదు. సాధారణంగా ఇళ్లల్లో ఒకరు వాడిన ఆసనాన్నే మిగిలివారూ వేసుకొని కూర్చొని పూజలు చేస్తుంటారు. ఈ మధ్య ఆలయాల్లో కూడా వివిధ కార్యక్రమాలు చేసుకొనే భక్తుల కోసం ఆసనాలని అందుబాటులో ఉంచుతున్నారు. వాటినే అర్చకస్వాములు , భక్తులూ కూడా వాడుతున్నారు. వాటిల్లో ప్లాస్టిక్ వీ, బట్టతో చేసినవీ , తుంగతో  అల్లినవీ, వెదురు చాపలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇలా అందరూ వాటిని వాడవచ్చా? ఏ ఆసననని వాడాలి ? అసలు ఆసనం అవసరమా  అనేది సందేహం. దానికి పండితుల విశ్లేషణ ఇలా ఉంది. 

‘ఆత్మసిద్ధి ప్రధానశ్య సర్వరోగనివారణం
 నవసిద్ధి ప్రదానశ్య ఆసనం ప్రతికీర్తితం’
అని ధర్మశాస్తం . 

ఆసనం అనేది ఆత్మ సాక్షాత్కారాన్ని సిద్దింపజేస్తుంది.  సర్వరోగాలనూ నివారిస్తుంది.  నవనిధులనూ ప్రసాదిస్తుంది. జపం చేసుకొనేప్పుడు అందుకే కింద కూర్చొని చేయకూడదు. మానవ శరీరం ఒక విద్యుత్ అయస్కాంత క్షేతం . నిత్యం ఛార్జింగ్ , డిస్ఛార్జింగ్ జరుగుతూనే ఉంటాయి. మనస్సు అన్యధా కాకుండా , భగవంతుని పై నిలిపి , ఏకాగ్రతలతో జపం చేసినప్పుడు ఖచ్చితంగా శక్తి అనేది జనిస్తుంది . అది భూమ్యాకర్షణ శక్తివలన లాగివేయబడుతుంది. అందువల్ల భూమికి , సాధకునికి మధ్యలో ఆసనం అనేది ఉంటె ఆ శక్తి అనేది ఆ సాధకునిలో నిలిచి , సాధనలో ఉన్నతికి దోహదం చేస్తుంది. ఒక్కసారి మనం జపం చేసే లేదా ధ్యానం చేసే ఆ లక్ష్యం సిద్ధించింది అంటే, ఇక కోరినవన్నీ సిద్ధించినట్టేగా !! అది నవగ్రహాల అనుగ్రహం కావొచ్చు, ఆరోగ్యం , ఐశ్వర్యాల అనుగ్రహం కావొచ్చు , ఆత్మజ్ఞాన జిజ్ఞాస కావొచ్చు, ఏకోరికాలేని మోక్ష సమాధి కావొచ్చు. వీటన్నింటికీ భగవంతుని జపం , ధ్యానం , తపస్సు , పూజ ఇవే కదా మార్గాలు . 

పూర్వం సాధకులు కృష్ణాజీనము (జింకచర్మం ) , వ్యాఘ్రాజీనము (పులి చర్మం) పైన కూర్చొని సాధన చేసేవారు. ప్రస్తుతం ఉన్న సమాజ కట్టుబాట్లకు లోబడి దర్భాసనం , ధావళి, పట్టువస్త్రము లని ఆసనములుగా వినియోగించవచ్చు . కృష్ణాజీనము పైన కూర్చొని జపం చేస్తే జ్ఞానం సిద్ధిస్తుందని , వ్యాఘ్రాజీనము మోక్షసిద్ధి నిస్తుందని శాస్త్రం . వీటన్నింటికన్నా దర్భాసనం వేసుకొని జపం చేయడం వలన ఉత్తమ ఫలితాలని పొందవచ్చు . ఏ ఆసనాన్ని వేసుకున్నా , దాని క్రింద ఒక దర్భని వేసుకోమని ధర్మశాస్త్రం చెబుతోంది. పీటల్లాంటి చెక్క ఆసనాన్ని కూడా వేసుకోవచ్చు. అయితే చెక్క మీద కూర్చోనేప్పుడు ఒక తెల్లని వస్త్రాన్ని దానిపై వేసుకొని, ఆ తర్వాత దానిని ఆసనంగా ఉపయోగించవచ్చు. 

ఇలా ఒకరు వాడిన ఆసనాన్ని మరొకరు వాడడం నిషిద్ధమని కూడా మన పండితులు చెబుతున్నారు. కారణమని తెలుసుకోవడానికి ఈ చిన్న ఉదంతాన్ని పరిశీలించండి . 

ఒక ఇంట్లో రోజూ ధ్యానం చేసే ఒక యోగి మహాత్ముడున్నారు. ఒకనాడు వారింటికి ఒక అతిధి వచ్చారు. ఆయన చక్కగా ఉదయాన్నే లేచి, అన్ని కార్యక్రమాలూ ముగించుకొని ,  ఆ యోగి ధ్యానం చేసే ఆసనం మీద కూర్చొని పూజా కార్యక్రమాన్ని కూడా ముగించారు. అలా ఆయన ఒక పదిరోజులపాటు అతిధిగా యోగి గారింట్లో ఉన్నారు. ఆయన వెళ్ళిపోయాక , యోగిగారు తిరిగి తన సాధన చేయడం మొదలుపెట్టారు. తాను పూర్వమున్న స్థాయికి  చేరుకోవడం ఆయనకి దుస్సాధ్యం అనిపించింది. ధ్యానంలోకి వెళ్ళగానే , లౌకికమైన ఎన్నో ఆలోచనలు తేనెతుట్టెలోని ఈగల్లా ముసురుకోవడం ఆరంభించాయి. ‘ఇదీ ఆసనం మహిమ’ అని తెలుసుకోవడానికి ఆయనకి మరో పదిరోజుల సమయం పట్టింది. 

వేరువేరు వ్యక్తుల వైబ్రేషన్స్ , ధ్యాన స్థాయిలు , తీవ్రత వేరువేరుగా ఉంటాయి. కాబట్టి అలా ఒకరు వాడిన ఆసనాన్ని మరొకరు వాడకుండా ఉండడమే శ్రేయస్కరం. కాబట్టి గుడిలో పూజలకు వెళ్లేప్పుడు కూడా మన దర్భాసనాన్ని, లేదా ఒక పట్టువస్త్తాన్ని మనతో తీసుకువెళ్ళడం ఉత్తమెత్తమం . ఇంటి యజమాని నిత్యమూ పూజకి ఉపయోగించే ఆసనాన్ని ఇతరులు ముట్టుకోకపోవడం ఆ ఇంటికే  క్షేమదాయకం.  

#poojaasanam #pooja #puja

Tags: Pooja, Puja, asanam, mat

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi