Online Puja Services

సంసార సాగరాన్ని దాటించగల నావ భగవద్గీత - నాల్గవ అధ్యాయం .

3.135.216.174

సంసార సాగరాన్ని దాటించగల నావ భగవద్గీత - నాల్గవ అధ్యాయం .
- లక్ష్మీరమణ  

భగవద్గీతా పారాయణ మహత్యాన్ని ఈ మార్గశిరమాసంలో తెలుసుకొని ఆయా అధ్యాయాలని శ్రద్ధగా చదవడం వలన ఖచ్చితంగా దుర్లభమైన భగవద్సాక్షాత్కారాన్ని , వైకుంఠ వాసాన్ని పొందవచ్చు. అసలు ఈ మాసమునకే మోక్షమాసం అని పేరు. అనంతమైన పాప రాశిని ధగ్ధం చేయగలిగిన, అనంత పుణ్య ప్రదమైన ఆ భగవద్గీతలోని నాలుగవ అధ్యాయ పారాయణా ఫలితాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరిస్తూ , భయంకరమైన సంసార సాగరాన్ని దాటించగల నావవంటిది ఈ అధ్యాయ మహిమ అని వివరించారు. మొదట శ్రీమన్నారాయణుడు లక్ష్మీ దేవికి వివరించిన ఈ అధ్యాయ మహిమని పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇలా చెబుతున్నారు .  

“దేవీ ! ఏ అధ్యాయ పారాయణం మహత్యం చేత రేగు చెట్ల రూపంలో ఉన్న కన్యకలు శాప విముక్తులై స్వర్గాన్ని పొందారో ఆ భగవద్గీతా అధ్యాయం చతుర్దాధ్యాయం .  గంగాతటములో వారణాసి అనేటటువంటి పురము ఒకటి ఉన్నది.  అక్కడ విశ్వనాధుని ఆలయములో భరతుడనే మహాత్ముడు యోగనిష్ట కలవాడై, ఆత్మ చింతాతత్పరుడై నిత్యము శ్రీమద్ భగవద్గీత చతుర్ధాధ్యాయమును పారాయణ చేస్తూ ఉండేవాడు.  కొంత కాలమునకు అతడు శీతోష్ణముల పట్ల, సుఖదుఃఖాల పట్ల సమ భావము కలవాడై, మహాత్ములని సందర్శించాలనే కోరికతో ప్రపంచ పర్యటనము చేయడానికి బయలుదేరాడు. 

 ఒక రోజున అరణ్యంలో ప్రయాణం చేస్తుండగా సాయం సంధ్యా సమయం అవడం చేత కాలకృత్యాలు తీర్చుకుని గీతా చతుర్ధాధ్యాయాన్ని పారాయణ చేసి ఒక రేగు చెట్టు మూలంలో శిరస్సు నుంచి మరొక రేగు చెట్టు వైపుకు పాదములు చాచి నిద్రకు పక్రమించాడు. ప్రాతః కాలంలో అక్కడ నుంచి లేచి మరొక చోటకి వెళ్ళాడు.  అప్పటి నుండి ఐదు రోజులు గడిచేటప్పటికీ ఆ వృక్షాలు రెండు కూడా క్రమంగా కృసించిపోయి,  కాలధర్మము చెందాయి.  తిరిగి ఉత్తమ బ్రాహ్మణ కులములో పూర్వజన్మ స్మృతి గల బాలికలై జన్మించారు. అలా వారికి  ఏడు సంవత్సరములు నిండాయి . 

 దైవ వశమున ఒకనాడు ఆ భరత మునీంద్రుడు పర్యటన చేస్తూ, వారి ఇంటికి వెళ్లారు.  అప్పడా కన్యలు ఆయన్ని గుర్తుపట్టి ,  సాష్టాంగ ప్రణామాలు చేసి,  “మహాత్మా! మీ దయవలన మేము ఇద్దరమూ తరించాము. మేము అరణ్యములో రేగు చెట్ల రూపంలో ఉన్నప్పుడు మీ శరీర స్పర్శ వలన మానవ జన్మమును పొందాము.”  అని సంతోషముగా విన్నవించారు. అప్పుడాయన సావధానంగా వారి చరిత్రని తెయజేయమని కోరారు. “మునివర్య గోదావరి తీరములో చినపాపము అనే ఒక పుణ్యక్షేత్రం ఉంది. అక్కడ సత్యతపుడు అనే తపస్వి ఉన్నారు.  ఆయన గ్రీష్మ రుతువులో పంచాగ్ని మధ్యలో, వర్షాకాలంలో వర్షించే వర్షధారలలోనూ, శీతాకాలంలో కంఠము లోతు గల చల్లని నీటిలోనూ నిలిచి ఘోరమైనటువంటి తపస్సును ఆచరిస్తూ ఉండేవారు.  

అటువంటి తపస్సు చేత కృశించి పోయిన ఆయాన దేహం పైన చర్మం అంటా కూడా మొదలు పడిపోయింది. అయినప్పటికీ నిష్కల్మషమైన ఆయన అంతర్భాగపు తేజస్సు చేత ఆయన ప్రకాశవంతంగా కనిపించేవారు.  నిత్యము ఆత్మ ధ్యాన నిమగ్నుడై ఉండే ఆతపస్వి ఉపదేశాలని వినేందుకు స్వయంగా బ్రాహామా దేవుడే అక్కడికి విచ్చేసేవారు. ఒక్కొక్కసారి ఆ బ్రాహామా వచ్చినా, సత్యతపుడు సమాధి నుండీ బయటికి వచ్చేవారు కారు. అయినప్పటికీ బ్రహ్మగారు ఆయనని  కూడా పరమ మిత్ర భావంతో గౌరవిస్తూ ఉండేవారు. 

 అటువంటి సత్యతపుని తపస్సుని చూసి ఆయన తపోబలము తన పడడవికి ఎక్కడ చేటు తెస్తుందో నని భయపడిన ఇంద్రుడు దుష్ట పన్నాగం పన్నాడు.  అప్సరా గణాలని పిలిచి, వారిలో ఉన్న మా ఇద్దరినీ , స్వర్గరాజ్యమును కోరి తపస్సు చేస్తున్న ఈ సత్యతపుని  తపస్సుకు విఘ్నాన్ని కలిగించండి అని ఆజ్ఞాపించారు. దాంతో  మేమిద్దరం కూడా అతని ఆజ్ఞనుసారంగా సత్య తప్పుడు తపమాచరిస్తున్న ప్రదేశానికి వెళ్లి, అక్కడ మధురముగా గానం చేయడం ప్రారంభించాము. నృత్యం చేస్తూ, ఆయన్ని ఆకర్షించి తపోభంగం చేయడానికి ప్రయత్నం చేశాము. 

అప్పడా మునీంద్రుడు మాపైని కోపంతో చేతిలోకి జలాన్ని తీసుకొని ‘ మీరిద్దరూ కూడా గంగా తీరంలో రేగుచెట్లై జన్మించండి’  అని శపించారు. ఆ వెంటనే మేము మా స్వామీ ఆజ్ఞకి బద్ధులమై ఈ పాపకార్యానికి ఒడిగట్టామని గ్రహించి , మాపై దయతో ‘భరతముని మీ సన్నిధికి వచ్చేంతవరకు మీకీ శాపం ఉంటుంది.  ఆ తరువాత మీరు శాప విముక్తిని పొంది పూర్వజన్మ స్మృతి కలవారై మానవలోకములో జన్మించి క్రమంగా మీ పూర్వ స్థానాలను పొందగలరు’ అని శాప విమోచనాన్ని అనుగ్రహించారు . 

 కాబట్టి ఓ మునిపుంగవా ! ఆ రోజు నుండీ మేము రేగు వృక్షాల రూపంలో పది ఉన్నాము.  మా మీరు మా సన్నిధికి వచ్చి, గీతా చతుర్ధాధ్యాయ పారాయణ చేసేంతవరకు కూడా తరు రూపంలో ఉండిపోయాము.  ఆ తరువాత తరురూపము పోయి మానవత్వము సంప్రాప్తించింది.”  అని చెప్పారు . అప్పుడు భారతమునీంద్రుడు, “కన్యలారా ! ఆ మహత్యము నాది కాదు . ఖచ్చితంగా భగవద్గీతలోని చతుర్దాద్యాయ శ్రవణా ఫలితము.  కాబట్టి ఇక మీదట మీరు  గీతా చతుర్ధాధ్యాయమును పారాయణ చేస్తూ,  మిక్కిలి భయంకరమైనటువంటి ఈ సంసార సాగరాన్ని దాటి  ముక్తిని పొందండి” అని వారికి ఉపదేశించారు.  

కాబట్టి ఓ పార్వతీ ! ఈ గీతలోని నాలుగవ అధ్యాయాన్ని పారాయణ  చేయడం చేత వృక్షముల కూడా తరిస్తాయి. మానవులు తమ సంసార సాగరాన్ని దాటి ముక్తిని పొందగలరు .”  అని పరమేశ్వరుడు తెలియజేశారు . 
 
సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు !!

 

#bhagavadgita #bhagavadgeeta

Tags: Bhagavadgita, bhagawadgeeta, 

Quote of the day

We should not fret for what is past, nor should we be anxious about the future; men of discernment deal only with the present moment.…

__________Chanakya