Online Puja Services

ముక్కుపుడక ఎందుకు కుట్టించుకోవాలి ?

52.14.84.29

ముక్కుపుడక ఎందుకు కుట్టించుకోవాలి ?
సేకరణ 

ఆడపిల్లలకు జరిగే సంస్కారాలలో ముక్కు, చెవులు కుట్టించడం చాలా ప్రధానమైనది.  దీనికి అధ్యాత్మికంగా, విఙ్ఞాన పరంగా కూడా చాలా కారణాలున్నాయి. ఈ రంధ్రాల ద్వారా సౌర శక్తి అనేది ప్రవహిస్తుంది అనేది మన పెద్దలు చెబుతున్నమాట . ఇదే కాకుండా యోగ సంబంధమైనవి, ఆరోగ్య సంబంధమైన కారణాలు కూడా ఉన్నాయి . అందుకే మనవాళ్ళు పెళ్ళికీ, ముక్కుపుడకకీ లింకు పెడుతున్నారు . 

అందానికి ఉపమానం అమ్మాయే కదా ! సంపంగిలాంటి ముక్కుకి చమక్కుమనే ముక్కెర ఉంటె, ఆ కళే  వేరు ! అందుకే దక్షణాది వారు ఖచ్చితంగా ముక్కెర పెట్టుకుంటూ ఉంటారు . బహుశా రవి వర్మకి దక్షణాది మహిళల్లో అమ్మవారు కనిపించడానికి వారు ముక్కెర ధరించడం కూడా ఒక కారణం కావొచ్చు . ఆ ఆభరణం వలన  వచ్చే అందమే కాదు, దానిలోని దైవత్వం కూడా అలాంటిదేనని నిస్సందేహంగా చెప్పొచ్చు . 

భామాకలాపం :

ముక్కుపుడక అనేది మన సంప్రదాయంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందిన ఆభరణమని చెప్పుకోవాలి . దీనికి సంబంధించి కూచిపూడి భామాకలాపంలోని ఒక ఘట్టాన్ని చూడండి .  ఒకసారి సత్యభామ చెలికత్తెను శ్రీకృష్ణుని వద్దకు రాయబారం కోసం వెళ్ళమంటుంది. ఎన్ని లంచాలు ఇస్తానన్నా, ఎన్ని నగలు ఇస్తానన్నా వెళ్లనంటుంది. విసిగిన సత్య చివరకు అసలు నీకేం కావాలో చెప్పవే అని అడిగితే సత్యభామ ముక్కున ఉన్న ముక్కెర కావాలంటుంది. అది ఇవ్వగానే లంకెబెందెలు దొరికినంత సంతోషం తో శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళి రాయబారం నడుపుతుంది. పురాణాల్లో కూడా అంతటి ప్రాముఖ్యత ఉంది ముక్కెరకు. హిందూ దేవతలు అందరికీ ముక్కెర తప్పకుండా ఉంటుంది.

దుర్గమ్మ ముక్కెర :

బెజవాడ కృష్ణానది పొంగి కనకదుర్గమ్మ ముక్కెరను తాకితే భూమి మీద ఎవ్వరూ మిగలరని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారు కాలజ్ఞానంలో చెబుతారు. 

భర్తకి ముక్కెరకీ సంబంధం :

అలంకారంగా స్థిరపడిన ముక్కెరను మేనమామ లేదా కాబోయే భర్త మాత్రమే బహూకరించడం అనేది ప్రాచీన కాలంనుంచీ వస్తున్న సాంప్రదాయం. బయటి వాళ్ళెవరైనా ఇవ్వజూపితే అది చాలా తప్పు. ఒకవేళ వాళ్ళనుంచి తీసుకున్నారు అంటే వాళ్ళు దేవదాసీలై ఉంటారు. ఎందుకంటే ఇది భర్త ప్రేమకు గుర్తు.

అందుకే ‘మగని ప్రేమకే గుర్తు మగువ ముక్కుపుడక’ అన్నాడో కవి. తాళిబొట్టు మాదిరిగానే వివాహసమయంలో ధరించిన ముక్కుపుడకను జీవితాంతం తీయరు కొందరు. అది ఉన్నంతకాలం భర్త క్షేమంగా ఉంటాడన్నది వారి నమ్మకం. అందుకే దీన్ని సౌభాగ్యానికి సంకేతంగా చెబుతారు. భార్య పెట్టుకున్న ముక్కుపుడక బరువు, సైజు, డిజైన్ భర్త ఆర్థిక స్తోమతను తెలిపేవిగా ఉండేవి.

ముక్కెరలు రకాలు :

రాజుల వంశానికి చెందిన మహిళల ఆభరణాల్లో ఒకటి నుండి 17 వరకు వివిధ రత్నాలు ఉన్న ముక్కుపుడకలు ఎన్నో ఉండేవి. పూర్వకాలంలో ఏడేళ్ళ వయసులోనే ముక్కు కుట్టించి బంగారుతీగ చుట్టించేవారు. పెరిగిన తర్వాత దాన్ని తీసి రాళ్ళు పొదిగిన పుడకలు పెట్టేవారు. ఎంత పేదవారైనా దీనిని మాత్రం బంగారంతోనే చేయించుకుంటారు. దక్షిణ భారతదేశంలో దీన్ని ఎక్కువగా కుడివైపు పెడితే, ఉత్తరాదిన మాత్రం ఎడమవైపు పెడుతుంటారు. ఈ ప్రస్తుతకాలంలో కూడా పెద్ద ముత్యపు ముక్కెరను మరాఠీ మహిళలు చాలా ఇష్టంగా ధరిస్తారు. కొందరిలో ఇది దాదాపు గడ్డం వరకు వస్తుంది. ఇప్పటికీ కొందరు ఆదివాసులలో పెద్దవైన బులాకీలు వాడతారు. ఒక్కో ప్రాంతాన్ని ఆచారాన్ని బట్టి ముక్కు పుడకలు ఉంటాయి. 

ఎప్పుడు కుట్టించాలి :

సాధారణంగా ఐదు, ఏడు, పదకొండు సంవత్సరాల ఆడపిల్లలకు ముక్కు కుట్టిస్తారు. లేదా వివాహానికి సంసిద్ధమైన ఆడపిల్లలకి కుట్టిస్తారు. వివాహ సమయానికి ఆడపిల్ల ముక్కుకి ముక్కు పుడక తప్పనిసరిగా ఉండాలని ఇప్పటికీ చాలా కుటుంబాలలో భావిస్తారు. చిన్న వయసులో కుట్టించడం వల్ల ఆరోగ్య పరంగా మంచిది.

ముక్కుపుడక ధరించడం వల్ల కలిగే లాభాలేమిటి?

ముక్కుకి ఎడమ వైపున చంద్ర నాడి ఉంటుంది.కనుక ముక్కుకు ఎడమ వైపున అర్థ చంద్రాకారంలోని బేసరి ధరించాలి. కుడివైపు సూర్యనాడి ఉంటుంది. కాబట్టి కుడి వైపున మండలాకారమైన ఒంటి రాయి బేసరి ధరించాలని శాస్త్రోక్తం. మధ్యలో ముక్కెర ధరించాలి. ఇది సాధారణంగా ముత్యం లేదా కెంపు ని బంగారం తో చుట్టించి ధరిస్తారు.

ముక్కుకి ఎడమవైపున ధరించే ముక్కు పుడక లేదా ముక్కు బేసరి వల్ల ఆడవారికి గర్భకోశ సంబంధమైన వ్యాధులు తగ్గుతాయి. పురుటి నొప్పులు ఎక్కువగా కలుగకుండానే సుఖప్రసవం అవుతుంది. కన్ను, చెవి కి సంబంధించిన నరాలు ఆరోగ్యంగా ఉంటాయి. చెవిపోటు, చెవుడు వంటివి కలుగ కుండా ముక్కుపుడక కాపాడుతుంది. శ్వాస సంబంధమైన వ్యాధులు కలుగవు. ప్రత్యుత్పత్తి వ్యవస్థ మెరుగు పడుతుంది. బంగారు ధాతువు శుద్ధతకి ప్రతీక. వంట వండేటపుడు ఉచ్ఛ్వాస నిశ్శ్వాసలు శుద్ధమై ఆహారం శుద్ధం అవుతుంది.కొన్ని ధర్మశాస్త్రాల ప్రకారం దైవ నివేదనకి ముక్కుపుడక లేకుండా వంట చేస్తే పనికిరాదు. కాబట్టి ప్రతి భారతీయ మహిళ తప్పనిసరిగా ముక్కుపుడక ధరించాలి. మెదడులో ఉండే నాడీ వ్యవస్థని కూడా సరిచేయగల శక్తి ముక్కు పుడకకి ఉంది.
ఇన్ని ఉపయోగాలూ , ఇంతటి చరిత్రా ఆధ్యాత్మిక ప్రశస్తి ఉన్న ముక్కు పుడకని ధరించి, ధరింపజేసి తరించండి . సరేనా !! 

Quote of the day

In a controversy the instant we feel anger we have already ceased striving for the truth, and have begun striving for ourselves.…

__________Gautam Buddha