Online Puja Services

సుఖదుఃఖాలు

3.144.238.20

ఫ్రెండ్స్ చాలా వరకు మన ఆలోచనలే మన సుఖ దుఃఖాలకి కారణం.అలలు కదిలే సంద్రలో అలజడి ఉంది మన ఆలోచనల్లో కదిలే బుద్దిలో మన సుఖం దుఃఖం దాగి వుంది. ఓ ఆలోచనకి కారణమేదైనా ఆ ఆలోచన స్థావరం మాత్రం మనమే.ఆలోచన మతి తప్పి మనసు గతి తప్పి పరిగెడుతుంది. అది మన మనస్సుకి హాయిగా ఉన్నా. మళ్ల ఆలోచన తప్పు అని ఆ మనసే కోపంతో మందలిస్తుంది. అప్పుడు ఒక క్షణం ఆగి ఆలోచించండి ఎందుకు మందలించింది అని. ఒక అనవసరపు ఆలోచన మనలను ఇబ్బంది పెడుతుందంటే ఆ ఆలోచన ఆలోచించలేనంత బిజీ గా మనముండాలి లేదా అది మర్చిపోయేంత మనసు మనకుండాలి.

ఫ్రెండ్స్ అసలు మనిషి రోజులో ఎన్ని ఆలోచనలు చేస్తాడు అనే డౌట్ వచ్చింది నాకు. మీకు కూడా ఎప్పుడో ఒకప్పుడు వచ్చే ఉంటుంది కదా.వచ్చినా డౌట్ పరిశోధించి కొంచెం తెలుసుకున్ననాడోయ్. సాధారణంగా మనం ఖాళీగా ఉన్నా.. లేక ఏదో ఒక పని చేస్తున్నా కూడా మన బ్రేయిన్ ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుందంట మనకు తెలియకుండానే అలా జరుగుతూంటాయట.

ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. నిద్రలో ఉన్నప్పుడు కూడా మన మెదడు యాక్టీవ్‌గా ఉంటుంది. మనకు తెలియకుండానే నిద్రలో కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం. మామూలుగా ఒక మనిషి రోజుకు ఎన్ని రకాల ఆలోచనలు చేస్తాడు. అంటే రెండు వందల నుంచి మూడు వందల వరకూ ఆలోచనలు చేస్తాడని ఇది వరకు పలువురు నిపుణులు పేర్కొన్నారు అంట.

కానీ అది తప్పని.. కెనడాలోని క్వీన్స్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వీరు వ్యక్తి ఆలోచనలపై అనేక రకాల పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలలో అనేక విషయాలను వెల్లడించారు. ఒక మనిషి సగటున రోజుకు 6 వేల వరకు ఆలోచనలు చేస్తాడని కెనాడా క్వీన్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు.

వామ్మో మన బ్రెయిన్ ఇన్ని ఆలోచనలు ఆలోచిస్తుందా. మరి అసలు ఆలోచనలు రాకుండా చేసుకోవటం సాధ్యమవుతుంది అంటారా.

అస్సలు సాధ్యం కాదు.  ఆలోచనలను పరిశుద్ధం చేసుకోవాలి కానీ అవి రాకుండా చేస్తానంటే కుదిరేది కాదు. ఎందుకంటే మన జీవనం అంతా ఆలోచనలతోనే ముడిపడివుంది. మనకి మల్లెపూల వాసన వచ్చిందంటే అప్పటికే  అక్కడి గాలి మల్లెపూలతో మమేకత చెందిందని అర్ధం. అంటే గాలే మల్లెపూల వాసనగా మారింది. 

ఆ గాలిని, వాసనను ఎలా విడదీస్తాం ? కాకపోతే ఆ మల్లెల వాసన గాలి సహజగుణం కాదని తెలుసుకోగలుగుతాం. అలాగే శరీరంతో మమేకతచెంది దేహ అవసరాలన్నీ తానుగా వ్యక్తంచేసే మనసుని దేహం నుండి వేరుచేయలేం. మనసు దేహంగా మారింది. కాబట్టే ఆకలి వేస్తుందన్న విషయం గుర్తించగలుగుతుంది. జ్ఞాని అయినా ఆకలిని మనసుతో గ్రహించాల్సిందే. కాకపోతే ఆ అవసరం మనసుది (తనది) కాదని, దేహానికి చెందిందని తెలుసుకొని జీవిస్తాడు. భగవంతుని సృష్టిలోనే దేహంతోపాటు ఆలోచన కూడా ఒక భాగంగా ఉంది. దాన్ని వదిలించుకుందామని అనుకుంటే  ఇక జీవనం ఉండదు. 

ప్రజ్ఞగా ఉన్న మనసు ఆలోచించకుండా ఎలా ఉంటుంది ? మనం జన్మించినదే కర్మ పూర్తిచేసుకోవటం కోసం.  అది ఆలోచన లేకుండా సాధ్యం కాదు ! తప్పు-ఒప్పు తెగించుంటే బాగుండేదేమో అంది అంతరాత్మ. ఇదిలా ఆలోచించక ముందే తెగించుండాల్సింది అంది కర్మ. మొత్తానికి రెండింటి మధ్య జీవితం గడిచిపోతుంది. ఆ గడిచిపోయే జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అనుకుంటే ఆలోచనలు కట్టడి చేయాలి అనుకుంటే మీకు నచ్చిన సాధన చేయండి కచ్చితంగా సాధ్యపడుతుంది ఆలోచన కట్టడి చేయడం. 

నేను అయితే కొంత వరకు శివనామస్మరణతో ఈ మధ్య ధ్యానంతో కొంచెం కట్టడి చేయగలిగేను అనుకుంటున్నా. మీరు మీకు నచ్చిన భగవన్నామస్మరణతో ధ్యానంతో ఆలోచనలకు కళ్ళెం వేయండి ఆ తండ్రి పాదాలచెంత చేరువరకు ఆనందంగా ఉండండి శివయ్య అందరిని చల్లగా చూడు తండ్రి 

- బి. సునీత 

Quote of the day

What matters is to live in the present, live now, for every moment is now. It is your thoughts and acts of the moment that create your future. The outline of your future path already exists, for you created its pattern by your past.…

__________Sai Baba