Online Puja Services

కాళేశ్వరం, తెలంగాణ స్థలపురాణం

18.117.153.38
కాళేశ్వరం, తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహదేవ్ పూర్ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన మహదేవ్ పూర్ నుండి 17 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రామగుండం నుండి 47 కి. మీ...కరీంనగరకు 125km దూరంలో కలదు...

స్థలపురాణం: ఈ క్షేత్రానికి గొప్ప పౌరాణిక నేపథ్యం ఉంది. కాళుడు (యముడు) ఇక్కడ శివుని కోసం ఘోర తపస్సు చేసి పరమశివున్ని ప్రసన్నం గావించుకొని తన పేరున కాళేశ్వర క్షేత్రాన్ని వెలయింప జేసుకున్నట్లు స్థలపురాణం చెబుతోంది. ఈ విషయాన్ని స్కాందపురాణంలో సూత మహర్షి శౌనకాది మునులకు చెప్పినట్లుగా ఉంది. అలాగే గౌతమీ పురాణంతో కూడా ఈ క్షేత్రం విశిష్టత చాటబడి ఉంది.

పరివార ఆలయాలు: కాళేశ్వర, ముక్తీశ్వర స్వాముల వార్ల ఆలయానికి సరస్వతీ దేవాలయం, సూర్య దేవాలయం, ఆది ముక్తీశ్వరాలయాలతో కూడిన పరివార ఆలయ సముదాయం ఉంది. దేశంలో సూర్యదేవాలయాలలో ఒకటి కాళేశ్వరం, మరొకటి కోణార్క్, ఇంకొకటి అరసవల్లిలో ఉన్నాయి. సరస్వతి అమ్మవారికి దేశంలో మూడు ఆలయాలున్నాయి. ఒకటి కాళేశ్వరంలో మహా సరస్వతి, రెండోది బాసరలో జ్ఞాన సరస్వతి, మూడోది కాశ్మీరులో బాలసరస్వతి ఆలయం ఉంది.

కాగా శ్రీ శంకర భగవత్పాదులు ఆదిశంకారాచార్యులు, తదుపరి శారదాపీఠాధిపతులు తమ శిష్య గణాలతో ఉత్తర భారత దేశం నుంచి దక్షిణ భారతదేశంలోని కాళేశ్వరంకు వచ్చి శ్రీ కాళేశ్వర, ముక్తీశ్వర స్వాముల వార్లకు దక్షిణాన మహా సరస్వతి అమ్మవారిని ప్రతిష్ఠించినట్లుగా జనశ్రుతి ఉంది. ఇప్పటికీ ఇదే పరంపర కొనసాగుతోంది. పిరమిడ్ ఆకారంలో ఆలయం: కాళేశ్వరాలయం శిఖరం పిరమిడ్ ఆకారంలో నిర్మించబడి ఉంది. (ఇది ప్రస్తుతానికి లేదు). ఈ ఆలయానికి ఉత్తరాన మరొక చిన్న గుడి ఉండేది. అందులో అన్నపూర్ణ ప్రతిమ ఉండేది. ఇప్పటికీ ఆలయంలో గణపతి మత్స్యావతారం, చతుర్ముఖలింగం, సూర్య, విష్ణు, నంది మొదలైన విగ్రహాలున్నాయి. కాగా తెలంగాణాలో ప్రసిద్ధ క్షేత్రంగా ప్రఖ్యాతి గాంచిన ఈ దేవాలయం కాకతీయ ప్రతాపరుద్ర చక్రవర్తి ఆస్థాన కవీంద్రుడు విద్యానాథుడు త్రిలింగ దేశానికి మహా సరిహద్దుగా కీర్తించాడు.

దక్షిణ కాశీగా ప్రసిద్ధి: ఉత్తర భారతదేశంలో మహోన్నతకాశీ పవిత్ర పుణ్య శైవ క్షేత్రంగా విరాజిల్లుతోంది. కాశీ విశే్వశ్వర, విశాలాక్షిలను సందర్శించుకున్న వారికి కైలాసప్రాప్తి లభిస్తుందన్న విశ్వాసం హైందవులకు ఉంది.

అందుకే కాశీ వెళ్లడానికి ప్రతీ శైవభక్తులు ఉబలాటపడతారు. అయితే పూర్వకాలం కాశీకి కాళినడకతో వెళ్లేవారు. ఈ క్రమంలో కాశీకి వెళ్లిన వాడు కాటికి పోయినట్లేనని అనే నానుడి ఉంది. అయితే కాశీకి సరిసమానమైన క్షేత్రాన్ని దక్షిణ భారతదేశంలో కాళేశ్వర క్షేత్రాన్ని పూర్వం ఋషులు కనుగొన్నారు. ప్రయాగలో గంగా, యమున, సరస్వతి మూడు పవిత్ర నదుల సంగమం ఉంది. దీన్ని త్రివేణి సంగమం అంటారు. అదేవిధంగా కాళేశ్వరం గోదావరి, ప్రాణహిత, సరస్వతి (అంతర్వాహిని)... ముక్కంటి నుంచి జాలువారినది) కలిసి త్రివేణిసంగమం కావడంతో కాశీ క్షేత్రానికి, ప్రయాగ క్షేత్రానికి సరిసమానతను, పుణ్యం పవిత్రతలను చేకూర్చి దక్షిణ భారత కాశీ క్షేత్రంగా ఖ్యాతిని తెచ్చి దక్షిణ దేశ శైవభక్తులకు కాళేశ్వరాన్ని మరో కాశీగా చేరువజేశారు.

కాశీ కన్నా వరిముళ్లు కన్నా ఎక్కువ మహిమాన్విత మైనదిగా కాళేశ్వర క్షేత్రానికి భక్తుల మనోభావాలున్నాయి.

త్రిలింగ శైవ క్షేత్రాలలో ఒకటి:
రెండు తెలుగు రాష్ట్రాలలోని కర్నూలు జిల్లాలోని శ్రీశైలం, తూర్పుగోదావరి జిల్లాల్లోని ద్రాక్షారామం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర శైవ క్షేత్రాలతో కూడిన మూడు ప్రపంచ ప్రసిద్ధ శైవ క్షేత్రాలుండగా వాటిలో ఒక ప్రసిద్ధ శైవ క్షేత్రంగా కాళేశ్వర క్షేత్రం అనాధి నుంచి ఖ్యాతిని పొందింది.
పూర్వం ఆ మూడు క్షేత్రాల మధ్య ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలు గల ఉమ్మడి (ఆంధ్రప్రదేశ్) ప్రాంతాన్ని ‘‘త్రిలింగ దేశం’’ అని పిలిచారు.
ద్వారాల విశిష్టత: కాళేశ్వర గర్భాలయానికి నాలుగువైపులా ద్వారాలున్నాయి. ఈ విశేషం దేశంలో మూడు ఆలయాలకే ఉంది. అవి కాళేశ్వరంలోని కాళేశ్వర, ముక్తీశ్వరాలయం, కాశీ విశే్వశ్వర స్వామి ఆలయం, నేపాల్‌లోని పశుపత ఆలయం.
యమకోణం: భక్తులకు యమదోషం తొలగించడానికి పూర్వం మునులు ఆలయంలోకి వెళ్లే ద్వార మార్గంలో యమకోణాన్ని ఏర్పాటు చేశారు. ఇందులోకి ఒక దిక్సూచి ఆధారంతో వెళతారు. దీంతో తాము యమదోషాలను నివారించుకున్నట్లుగా భక్తులు నమ్ముతారు.
శని, సర్పదోష పూజలు: ఆలయంలో శనివారం శనిపూజలు, మంగళ, గురు వారాలు కాలసర్ప దోష నివారణ పూజలు జరుగుతాయి. ఈ పూజలతో అన్నీ శుభాలే కలుగుతాయని భక్తులకు అత్యంత విశ్వాసం.

ఒకే పానవట్టంపై రెండు లింగాలు:
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆలయంలో ఒకే పానవట్టంపై ముక్తీశ్వర (శివుడు), కాళేశ్వరు (యముడు)లకు రెండు జంట లింగాలున్నాయి. ముక్తీశ్వర లింగానికి రెండు నాసికా రంధ్రాలున్నాయి. ఈ నాసికా రంధ్రాల్లో అభిషేకానికి ఎన్ని పాలు, లేదా ఎన్ని నీళ్లు పోసినా లోనికి పోతాయి. బయటకు రావు. అభిషేకం చేసినవి త్రివేణి సంగమంలో కలుస్తాయని ‘‘కాళేశ్వర ఖండం’’ అనే గ్రంథం వివరిస్తోంది.
ఇలా ఉండగా మొదటగా కాళుడికి (యముడికి), తర్వాత ముక్తీశ్వరునికి (శివునికి) పూజలు జరుగుతాయి. పార్వతీదేవి శుభానందాదేవి అవతారంలో ఆలయంలో దర్శనమిస్తుంది. గౌతమీ అభీష్టం, ముక్తీశ్వరుని ఆదేశాల మేరకు సచ్చిదానంద రూపిణియగు కాశీ అన్నపూర్ణాదేవి (పార్వతీ దేవి) శుభానందదేవిగా వెలిసింది.
శివుని వాయుభాగంలో ఉండి బంగారు ఛాయ గలిగి సర్వాభరణములను ధరించి తాంబూలం నములుతూ దివ్య భాషణలు చేస్తూ ఈశ్వరున్నీ, భక్తులనూ ఆనందపరవశులను చేస్తూ శుభానందాదేవి కొలువై ఉంది. ఈ క్రమంలో ఆరాధనలతో, అభిషేకాలతో మహదానందులై శివుడు, యముడు జంటగా భక్తులకు కోరిన వరాలిస్తారని పూజారులు చెబుతారు.
అష్ట తీర్థాలు: పూర్వం ఇక్కడ మునులు బ్రహ్మతీర్థం, చిత్సుఖ తీర్థం, వ్యాస తీర్థం, నరసింహతీర్థం, హనుమత్‌తీర్థం, జ్ఞానతీర్థం, పక్షి (వాయస) తీర్థం, సంగమ తీర్థం, అను ఎనిమిది తీర్థాలతో ఎంతో పునీతంగాను, పవిత్రంగాను క్షేత్రాన్ని భాసింపజేశారు.

ప్రకృతి విభూతి రాళ్లు: కాళేశ్వరాలయానికి పడమర వైపు సుమారు 1 కి.మీ. దూరంలో ఉన్న యమగుండం మీద ఆది ముక్తీశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయం చుట్టూ ప్రకృతి సిద్ధమైన విభూతి రాళ్లు లభిస్తాయి. అందుకే ప్రకృతిసిద్ధ విభూతి రాళ్ల క్షేత్రంగా పేరుంది. ఈ విభూతిని దిద్దుకుంటే శివునికి ప్రీతిపాత్రులవుతారన్న ప్రబలమైన నమ్మకం భక్తుల్లో ఉంది. అందుకే ఈ విభూతిరాళ్లను ఎంతో భక్తితో పలువురు ఇక్కడకు వచ్చి సేకరించుకొని భద్రపరుచుకొని తద్వారా దేహానికి పూసుకుంటూ శివారాధన చేస్తుంటారు.

పిండ ప్రదానాల క్షేత్రం: ఇక్కడి గోదావరి త్రివేణి సంగమంలో పితృదేవత పిండ ప్రదానాలు చేస్తే వారికి కైలాస ప్రాప్తి, వైకుంఠ ప్రాప్తి లభిస్తుందన్నది హైందవులకు ప్రబలమైన నమ్మకం.
అందుకే ఇక్కడ పితృతర్పణాలు చేయిస్తారు. ఇందుకే కాళేశ్వర క్షేత్ర పిండ తర్పణాల క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.
గౌతమిగా మారిన గోదావరి: సమీపంలోని మంత్రపురి (మంథిని) గౌతమ మహాముని తపో భూమిగా వర్ధిల్లింది. దీంతో గౌతమ మహాముని పాదాలను అభిషేకించి గోదావరి నదీమ తల్లి గౌతమిగా మరో పేరు దాల్చి ప్రపంచ ప్రఖ్యాతి పొందినది.
 
-  శ్రీనివాస గుప్తా వనమా
 

Quote of the day

What matters is to live in the present, live now, for every moment is now. It is your thoughts and acts of the moment that create your future. The outline of your future path already exists, for you created its pattern by your past.…

__________Sai Baba