Online Puja Services

అఘోరీ బాబాతో సంభాషణ

3.15.147.53

*అఘోరీ బాబాతో నా సంభాషణ*
*స్థలం : స్మశాన వాటిక, గోకర్ణం*
నేను: మీ పేరేమిటి? మీ గురువుగారెవరు?
అఘోరీ బాబా: నా పేరు కపాలీ రాంబాబా, నేను కాపాలికుల తెగకి చెందిన అఘోరీని. సాధారణంగా మేము తిని, తాగే ఏ పదార్ధమైనా కపాలంలో వేసి(మానవ పుర్రె) పుచ్చుకుంటాము. నాకు ముగ్గురు గురువులున్నారు. మొదటి గురువు ఆదినాథుడు. ఈయననే మీరు దత్తాత్రేయుడు అంటారు, మేము మాత్రం ‘ఆదినాథుడు’ అనే అంటాము. రెండవ గురువు వైష్ణవ మతస్థుడైన ‘బాబా కినారాం’. బాబా కినారాం నాకే కాదు భూమిమీద ఉండే అందరు అఘోరీలకు గురువు. సాధారణంగా అఘోరీల గురువులు శైవులని అనుకుంటారు అది తప్పు అవగాహన. అఘోరీల గురించి మీరు చెప్పుకునేదీ, ఊహించేవి కుడా చాలామటుకు తప్పే. నిజాలు తక్కువ..కల్పితాలు ఎక్కువ. అఘోరీలు చూడడానికి భయంకరంగా ఉంటారు, కొన్ని అలవాట్లు ఆటవికంగా ఉంటాయి తప్ప, మా పద్దతులను మా నీతిని మేమెప్పుడూ తప్పనివారము. మూడవ గురువు ‘బాబా గంగారాం’. వారు ప్రస్తుతం ‘కామాఖ్య’ ఉన్నారు. కామాఖ్య ఆలయంలో అమ్మవారి విగ్రహానికి బదులు కొండరాళ్ళతో ఏర్పడిన అమ్మవారి యోని ఉంటుంది. ఈ యోని నుండి ప్రతి 27 రోజులకొకసారి రుతురక్తం (Menstrual Fluids)వస్తుంది. ఇలా 4 రోజుల పాటు ఋతురక్తం వస్తుంది. ఆ ఋతురక్తాన్ని తుడిచిన తెల్లటి వస్త్రాన్నే (ఋతురక్తం తుడిచిన రక్తపు వస్త్రం) చిన్నచిన్న ముక్కలుగా కోసి ప్రసాదంగా ఇస్తారు. ఋతు రక్తం తుడిచిన గుడ్డ పీలికే అక్కడి ప్రసాదం. ఇది అస్సాం లోని గౌహతి లో ఉంది. అక్కడికి వెళ్ళదలచిన వారు అమ్మవారి ఋతు సమయంలో వెళితే ఋతురక్త వస్త్రాన్ని ప్రసాదంగా తెచ్చుకోవచ్చు. అమ్మవారి 4 రోజుల ఋతు సమయాన్ని “అంబుభాషి” అంటారు. అమ్మవారి ఋతురక్త వస్త్ర ముక్కని ప్రసాదంగా తెచ్చుకున్న మీలాంటి సాధారణ భక్తులకు రాజయోగం పడుతుంది. మావంటి అఘోరాలకు ‘వామాచార గురువు’గా ఉన్నతి లభిస్తుంది.
నేను: మీరు ఎక్కడ నుండి వచ్చారు?
అఘోరాబాబా: నేను వారణాశి లోని ‘రవీంద్రపురి’ లోగల ‘అఘోరశోధ్ సంస్థాన్’ నుండి వచ్చాను. బాబా కినారాం సమాధి వారణాశిలో ఉంది. మాకు అది గొప్ప క్షేత్రం. గోకర్ణం లో ‘శవ భేతాళం’ (necromancy) నేర్చుకోవడానికి వచ్చాను. నేర్చుకోగానే వారణాశి వెళ్ళిపోతాను. గోకర్ణ రుద్రభూమి ఒక గొప్ప అఘోరీ సాధనా స్థలం . ఇక్కడకు వచ్చి 3 సంవత్సరాలైంది.
నేను: మీ దినచర్య ఎలా ఉంటుంది.?
అఘోరీ బాబా: గట్టిగా నవ్వుతూ “మాకు దినచర్య ఉండదు. అంతా రాత్రిచర్యే!” రుద్రభూమి మాకు పుణ్య క్షేత్రం. స్మశానం ఇహపరలోకాలకు వారధి అందుకే ఇక్కడ సాధన చేసేది. మాలో అసలైన అఘోరీ రాత్రి ఒంటి గంటకు బైటకు వస్తాడు. రాత్రి ఒంటి గంట అనేది నిన్నటికి రేపటికి సంధి సమయం. అది మాకెంతో విలువైనది. పొద్దున్న మాకు రాత్రి లాంటిది. రాత్రి మాకు పొద్దున్న లాంటిది. రాత్రి ఒంటి గంట నుండి అర్ధ రాత్రి మూడున్నర వరకు సాధన ఉంటుంది. కేవలం రెండున్నర గంటలు మాత్రమే. అందులో ఆఖరి అరగంట ‘భక్షణ’ కార్యక్రమం ఉంటుంది. ఎలా అయితే మీ పూజని బట్టి పూజా సామగ్రి మారుతుంటుందో ఇక్కడ మేము ఎంచుకున్న సాధనను బట్టి కావాల్సిన పదార్ధాలు మారుతూ ఉంటాయి.
నేను: మీ పూజని యేమని పిలుస్తారు? సాధారణంగా మీ పూజా సామగ్రి లో ఏమేమి ఉంటాయి?
అఘోరీబాబా: మాపూజ పేరు ‘శవచింతామణి’(necromancy) చితిబూడిద, భక్షణ ప్రసాదం కోసం చేపలు, మానవ ఎముకలు, ooo మాంసము, కొంత మద్యం, ‘శవభేతాళ’ సాధన కోసం శవం, శవానికి ఉన్న బట్టలు (వాటిని విప్పి మేము వేసుకొని పూజ చెయ్యాలి).
నేను: మీ పూజ గురించి కొంచెం వివరంగా చెబుతారా? మీరు ooo మాంసం ఎందుకు ప్రసాదంగా తింటారు?
అఘోరాబాబా: మాపూజ మొదటి భాగం ఆదినాథుదు (దత్తాత్రేయుడు), శివుడి ఆరాధనతో మొదలవుతుంది. మీరు చేసే దత్తాత్రేయ ఆరాధన, మీరు చేసే శివారాధనలతో మా ఆరాధన ఎంతో భిన్నంగా ఉంటుంది. తదుపరి కాలభైరవ ఆరాధనా, స్మశానతార ఆరాధనలు ఉంటాయి. ఆ తదుపరి ‘భూతశుద్ధి’ అనే కార్యక్రమం ఉంటుంది. చంద్రకళలకూ మా పూజకూ దగ్గర సంబంధం ఉంది. మీరంతా అనుకునే దానికి భిన్నంగా అమావాస్య మా పూజకు ఏమాత్రం ఉపయోగపడని రోజు. ఆరోజు తాంత్రికులకి, చిల్లర మంత్రగాళ్ళకి ఉపయోగపడుతుంది తప్ప మావంటి వారికి కాదు. పౌర్ణమి మా పూజకు ఎంతో గొప్ప దినం. పౌర్ణమి రోజు చంద్రుడిలో 15 మంది నిత్య దేవతలూ మరియు 16వ దేవత అయిన మహాత్రిపురసుందరి ఉంటారు. ఆ రోజున ఆ పదహారు దేవతలను సంతృప్తి పరచడమే అఘోరీల విధి. మా ప్రధాన లక్ష్యం ఈ 16 దేవతల ద్వారా విశ్వంలోని Cosmic Energy ని పొందడమే!. పౌర్ణమి మరునాడు గల చంద్రుడిలో 14 మంది దేవతలే ఉంటారు. ఆ మరునాడు 13 మంది. ఇలా అమావాస్య రోజుకి ఎవరూ ఉండరు. అందువల్లే ప్రతీ పౌర్ణమి మాకు పవిత్రమైనది. ఆరోజు పూజ అతితీవ్రంగా అతినిశ్శబ్దంగా జరుగుతుంది. మేము చేసే పూజలన్నీ పోలికా సూత్రం [Law of Similarity] మరియు సంబంధ సూత్రం [Law of Contact] అనే రెండు సూత్రాల ఆధారంగా జరుగుతాయి. అఘోరీ సాధనలో మీకు తెలియని గొప్ప Science ఉంది. ఉదాహరణకు ఉదారంగా (అప్పనంగా) సంపదలూ, ఆరోగ్యం, అష్టాదశ ఐశ్వర్యాలు, మోక్షం మొదలైనవి సులభంగా ఇచ్చే ‘ఛిన్నముండ’ (మీరైతే ఛిన్నమస్త అంటారు) [ఛిన్న= ఖండించిన, ముండ / మస్త = శిరస్సు] మంత్రం ” oooooo " అని ఇంట్లో చదివితే ఒకలాగా, గుళ్ళో చదివితే ఒకలాగా, శవం మీద కుర్చుని రుద్రభూమిలో చదివితే మరోకలాగా పనిచేస్తుంది. ఇదే మంత్రాన్ని కుడి నుండి ఎడమకి చదివితే అంటే “ 000000" అది బాణా..... మంత్రంగా మారుతుంది. ఇవే Law of Similarity & Law of Contact లకు ఉదాహరణలు.
నేను: మీ పూజని ఇతరులు చూడచ్చా? అంటే… మీరు పూజ చేస్తున్నప్పుడు మాలాంటి వాళ్ళు వచ్చి చూడవచ్చా?
అఘోరీబాబా: ఆనందగా. మీ రిస్కు మీద మీరు రావచ్చు. కాని మీరు నాకు కనీసం 17 అడుగుల కన్నా దూరంగా ఉండాలి. నా పూజ మధ్యలో రావచ్చు లేదా వెళ్లిపోవచ్చు. మధ్యలో వెళ్లిపోవాలనిపిస్తే డైరెక్ట్ గా వెళ్ళిపోవడమే. చెప్పవలసిన పని లేదు. టార్చిలైటులు, కెమేరాలు, మొబైల్స్ దయచేసి తేవద్దు.
నేను: మీ పూజలో మంత్రాలు ఎలా ఉంటాయి? అవి ఎక్కడ నుండి గ్రహింపబడ్డాయి?
అఘోరీ బాబా: మంత్రాలు లేకుండా పూజ ఎలా ఉంటుంది? మా పూజలో ‘ఫట్’ / ‘హం’ / ‘వషట్’ తో అంతమయ్యే ‘పురుష’ మంత్రాలూ, ‘స్వాహా’ తో అంతమయ్యే ‘స్త్రీ’ మంత్రాలూ, అలాగే కొన్ని సార్లు ‘నమః’ తో అంతమయ్యే ‘నపుంసక’ మంత్రాలూ ఉంటాయి. అఘోరా మంత్రాలు ‘కనకమాలినితంత్ర’ / ‘మాత్రికాభేదతంత్ర’ / ‘హేవజ్రతంత్ర’ / ‘దత్తాత్రేయతంత్ర’ / ‘దశమహావిద్యాతంత్ర’ అనే గొప్ప అఘోరాతంత్ర గ్రంథాల నుండి గ్రహింపబడ్డాయి.
నేను: మీ ఆహారం లేదా ప్రసాదంలో ఏమేమి ఉంటాయి?
అఘోరాబాబా: అఘోరాలకు ముఖ్య ఆహారం చేపలతో మానవ ఎముకలు కలిపి ఉడకబెట్టిన oooo మాంసము. దీన్నే ప్రసాదంగా కుడా పెడతాము. చేపలు మానవ ఎముకల తో ఉడికించిన ooooo మాంసము తినడం వల్ల మాలో అనేక మార్పులు జరిగి "ప్రేతలోకం" తో సంబంధం ఏర్పడుతుంది.
నేను: ఎవరికి ప్రసాదంగా పెడతారు? దత్తాత్రేయుడికా?
అఘోరాబాబా: కాదు,’స్మశాన తార’ అనే దేవతకి....
నేను: కానీ మీరు శవాలను కుడా తింటారని విన్నాను…
అఘోరాబాబా: అవును, అరుదుగా.....రెగ్యులర్ తినమండి. శవాన్ని మేము శివ ప్రసాదంగా స్వీకరిస్తాము. వాటిని పీక్కుతినమండి. చిన్న పిసరంత ముక్క ప్రసాదంగా స్వీకరిస్తాము. ఆ ప్రసాదం శివమయం.
అయితే భారతదేశం విషం కక్కే పాశ్చాత్య మీడియా, భారతదేశంలోనే ఉన్న పాశ్చాత్య భావాల మీడియా మామీద విషం కక్కుతూ ఉంటాయి. మేమెరికీ హాని చేయలేదే! మిగతా మానవులందరూ...ఇష్టం వచ్చినట్లు సాటి జంతువులను,పక్షులను చంపి తింటున్నారే.....అది తప్పనిపించలేదా? కేవలం మేము లేశ మాత్రమైన శవ మంసాన్ని శివ ప్రసాదంగా తింటున్నాము. చాలా దుష్ప్రచారం మా మీద చేస్తున్నారే! బ్రతికున్న వాళ్ళనే మీ నాగరీక మనుజులు తింటున్నారే....న్యాయమేనా ఇది? అయినా శవం దొరకాలి కదా ! ఎలా అయితే శివుడు ధ్యానం లో కూర్చున్నప్పుడు పులి చర్మం మీద కూర్చొని ధ్యానం చేస్తాడో, మేము మా పూజను శవం పై కూర్చుని చెయ్యాలి. సాధారణంగా శవాన్ని కూర్చోవడానికే ఉపయోగిస్తాము. మాకు తిండి మీద అసలు ధ్యాస ఉండదు. తిండే కాదు మాకు వేటిపైనా మొహం ఉండదు.
నేను: అంటే అన్నిశవాలను తినరా?
అఘోరాబాబా: లేదు. ’Necromancy’ అనే విద్య నేర్చుకోవడానికి ఒక రకమైన శవం తప్పక కావాలి.అంత కంటే ప్రస్తుతం చెప్పలేను.
నేను: సాదారణంగా అఘోరాలు ఒళ్లంతా చితిబూడిద (చితాభస్మం) రాసుకుంటారు. ప్రత్యేక కారణమేమైనా ఉందా?
అఘోరీబాబా: చితాభస్మం యొక్క గొప్పదనాన్ని గురించి చెబుతూపోతే తెల్లారిపోతుంది, అంత గొప్పది ‘చితిబూడిద’. మీరు ‘ఉజ్జయినీ’ పేరు వినే ఉంటారు. అక్కడగల శివుడిని “మహాకాళేశ్వరుడు” అంటారు. అక్కడ ప్రతినిత్యం రహస్యంగా జరిగే ఒక తంతు మీకు చెబుతాను, దానిని బట్టి చితిబూడిద ఎంత గొప్పదో మీకే అర్ధమవుతుంది. ఉజ్జయినీ మహాకాళేశ్వరునికి శ్మశానం నుంచి అఘోరాలు తీసుకువచ్చే చితాభస్మంతో ప్రతీరోజూ అర్ధరాత్రి రెండు గంటలకు ‘భస్మాభిషేకం’ జరుగుతుంది. ఈ దేవాలయంలో ప్రతీ నిత్యం అర్ధరాత్రి రెండుగంటలకల్లా ‘మహాశ్మశానం’ నుంచి అఘోరాలు తీసుకువచ్చిన ‘తాజా వేడి వేడి చితాభస్మం’తో భస్మార్చన ప్రారంభమవుతుంది. ఆలయ సంప్రదాయం ప్రకారం ఈ అభిషేకాన్ని స్త్రీలు చూడకూడదు. అందువల్ల స్త్రీలకు ప్రవేశం లేదు. అర్ధరాత్రి రెండుగంటలకు ఈ దేవాలయానికి వెళ్ళిన పురుషులంతా ఈ భస్మాభిషేకం చూడచ్చు. పురుష జన్మయెత్తిన వాళ్ళంతా ఈ ‘భస్మాభిషేకం’ చూసి తీరాలన్నది నా మనవి. అలాగే ఇంకో రహస్యం చెబుతాను వినండి. ఎవరికైనా వారి తల్లి మరణించినప్పుడు, ఆవిడ దహనక్రియల అనంతరం ఏర్పడిన చితాభస్మాన్ని కొద్దిగా ఒక డబ్బాలో సేకరించి దానిని విభూదిగా ధరించిన కొడుకు ‘గోమాత’తో సమానము. వాడిలో సమస్త దేవతలు కొలువైఉంటాయి.
నేను: నన్ను కెమేరా తేవద్దని చెప్పారు. ఎందుకో తెలుసు కోవాలనుకుంటున్నాను.
అఘోరాబాబా: అవును. ఇక్కడి (గోకర్ణ రుద్రభూమి) స్మశానం లో ఫోటోలు తియ్యరాదు. ఇక్కడకొచ్చే ప్రతీ శవం చుట్టూ నల్లటి నీలపురంగు [Dark Blue Aura] కాంతి పుంజం ఉంటుంది. అలాగే మా చుట్టూ కూడా! ఆ కాంతిని కెమేరాలు బంధించగలవు. ఇంత కంటే మీకు అనవసరం. డిటైల్డ్ గా చెప్పలేను. అది అనుభవైక వేద్యం.
నేను: మీరు అసలు అఘోరీగా ఎందుకు మారారు?
అఘోరీబాబా: ముక్తి పొందడం కోసం… దానికి అనేక మార్గాలు ఉన్నాయి, అందులో ఇదొక శక్తివంతమైన మార్గం. అఘోరీ అన్న పదానికి అర్ధం తెలియక చెడుగా ప్రచారం చెయ్యడం జరుగుతోంది. నిజమైన అఘోరీ ముక్తిమార్గం కోసం తపిస్తూ ఉంటాడు. అన్ని తెలిసే ఇందులోకి వచ్చా.
నేను: గోకర్ణ రుద్రభూమి (స్మశానం) ప్రత్యేకత ఏంటో చెబుతారా?
అఘోరాబాబా: ఇక్కడ దేవతా (అవతార) దేహాలు దహనం చేయబడతాయి. ఇటువంటి స్మశానం మరెక్కడా లేదు. కాశీలో కూడా… తక్కువ కలపతో శవం బూడిదగా మారటానికి కారణం ఇక్కడి రుద్రభూమి (స్మశానం) లో ప్రవహించే ‘వెచ్చటి రుద్రశక్తి’. ఆ శక్తి ఇక్కడి స్మశానం ‘కాంపౌండ్’ వరుకు మాత్రమే ఉంటుంది. ఇది ఇక్కడి విచిత్రం. కుంభవృష్టిలో కుడా ఇక్కడ చితి ఆరకుండా మండుతుంది. నేను ఎన్నో స్మశానాలలో ఉన్నాను. చివరికి కాశీలో కూడా!.. కాని ఇక్కడి ‘వెచ్చటి అనుభూతి’ మిగతావాటిలో లేదు. ఇక్కడి ప్రేతాలు కుడా ఎంతో శక్తివంతమైనవి. అందువల్లే ఇక్కడ మా సాధన సులువుగా సాగిపోతుంది. అందువల్లే మా గురువుగారు నన్ను ఇక్కడకి పంపారు. ఒకటే గుర్తు..... శక్తివంతం కాని స్మశానాలను అసలు మేము సాధనాస్థలాలుగా ఎంచుకోము. దీని తరువాత రెండవ శక్తివంతమైన రుద్రభూమి (స్మశానం) మైసూర్ చాముండీ కొండల సమీపంలో ఉంది. మూడవ శక్తివంతమైన రుద్రభూమి (స్మశానం) ఉజ్జయినీ లో ఉంది. ఇక నాలుగవ శక్తి వంతమైన రుద్రభూమి కాశీ లో గలదు.
నేను: మీరు నాకు అనేక విషయాలను చెప్పారు. మీరు చాలా స్నేహపూర్వకంగా కుడా మాట్లాడారు ధన్యవాదములు. జై గురుదత్త!
అఘోరాబాబా: జై బాబా కినారాం. చెప్పానుకదా.. మాలోని అఘోరీ కేవలం అర్ధరాత్రి ఒంటి గంట నుండి అర్ధ రాత్రి మూడున్నర వరకు అంటే రెండున్నర గంటల పాటు మాత్రమే ఉంటాడు. మీలాగా వచ్చి మాట్లాడే వారు కుడా అరుదు. అందుకే స్నేహపూర్వకంగా మాట్లాడాను… కొద్ది నెలల క్రితం నన్ను కలవడానికి వచ్చిన విదేశీయుడికి అంతకు ముందు రోజు రాత్రి నివేదన చేసిన మిగిలిన ప్రసాదాన్ని కుడా పెట్టాను. అతను అసహ్యించుకోకుండా తినడం చూసి నాకే ఆశ్చర్యమేసింది. ఈ రోజు భారతీయుల కంటే కూడా విదేశీయులే యోగ,తంత్ర విద్యల వైపు మక్కువ చూపుతున్నారు. ఈ అఘోరీ విద్య ప్రాచీన అధర్వణ వేదం లోనిది. ఈ అఘోరీ సాంప్రదాయం లోనికి వస్తున్న వారు కూడా రాను రాను తగ్గిపోతున్నారు. మానవ ప్రపంచంలో సుఖాభిలాష పెరిగిపోతోంది. సాటి మనుజులను, సాటి జంతు- పక్షులను మోసం చేయడం ఎక్కువైపోతోంది. తన సుఖం కోసం మనిషి ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాడు. ఇది సరికాదు.
భట్టాచార్య

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya