Online Puja Services

నిర్మల భక్తి

13.59.9.236

నిర్మల భక్తి
- సేకరణ 

మధురకు దూరాన అడవిలో ఒక గురుకులం ఉండేది,     దానికి శ్రీకృష్ణుని భక్తుడైన ‘హరిదామ్యుడు’ అనే గురువు ఉండేవారు. ఆయన తన శిష్యులతో కలసి   యాత్రలకు వెళ్ళొస్తుండేవాడు. అలా ఒక రోజు  తిరుగు ప్రయాణంలో ఉండగా సాయంత్రం వేళ పెద్దవర్షం ఎడతెరపి లేకుండా కురియడం వలన వర్షం ధాటికి నీళ్లు ముంచెత్తడంతో మార్గంలోని పల్లెల్లో దారులన్నీ నీటితో నిండి నిర్మానుష్యమయ్యాయి, వేరే దారిలేక ఒక పల్లెలోని ఇంట్లో విడిది చేశారు.

ఆ భారీ గాలి, వర్షానికి దారిలోని అందరూ ఇళ్లల్లో తలుపులు బిగించుకొని ఉన్నారు.

హోరుగాలి, వానలో సుడిగాలికి ఎగిరివచ్చిన ఎండుటాకులాంటి ఒక కుర్రవాడు నిరాధారంగా తిరుగుతూ తనకేదైనా ఆశ్రయం దొరుకు తుందేమోనని పది పన్నెండేళ్ళ మధ్యన వయసున్న సన్నగా, దుర్భలంగా వున్న శరీరంపై చిన్న లాగు చొక్కా తప్ప వాన, చలి నుండి కాపాడడానికి వేరే మరింకే ఆచ్ఛాదన లేని ఒక బాలుడు. ఆ కుర్రవాడి పేరు అనంతుడు. చలికి గజగజ వణుకుతూ ఎటుపోవాలో తెలియక చాలాసేపు దారిమధ్యలో నిలబడి పోయాడు.

అటూ ఇటూ పరికించి చూశాడు, ఎవరినైనా తలుపుతట్టి ఆశ్రయం అడగాలంటే అపరిచితుడైన తనను దొంగగా భావించి లోపలికి రానివ్వరనే భయంతో అలాగే సాగిపోతుంటే ఒక పెద్ద వటవృక్షం కనిపించింది. ఆ చెట్టు మొదల్లో కాస్తంత స్థలం నీరులేకుండా కనిపించడంతో బ్రతుకు జీవుడా అని ఆ జానెడు స్థలంలో ముడుచుకొని కూర్చున్నాడు. కొంతసేపటికి నిద్రలోకి జారిపోయాడు.

తూర్పు తెలవారుతుండగా వాన ఆగిపోయింది... ప్రజలింకా తలుపులు తెరువలేదు. ఆ సమయంలో గురువు హరిదామ్యుడు వారి శిష్యులు గురుకులానికి బయలుదేరి ఆ దారిన నడిచివెళ్తుండగా అనుకోకుండా ‘అనంతుడు’ గురువుగారి దృష్టిలో పడ్డాడు.

కనీసం కప్పుకునేందుకు చిన్న దుప్పటైనా లేకుండా ఆ భయంకరమైన వాన, చలిలో ముడుచుకొని వున్న ఆ బాలుని చూసి గురువు దయార్ద్ర హృదయం ద్రవించింది. వెంటనే ఆ బాలుని దగ్గరకు వెళ్లి తట్టి లేపాడు. బాలుడు కళ్ళు తెరచి ఎదుట నిలిచివున్న గురువును చూసి భయంతో, భక్తితో లేచి నిలబడ్డాడు.

“ఎవరు నువ్వు? ఈ వాన, చలిలో ఇక్కడ ఇలా ఎందుకు పడుకున్నావు” అని ప్రశ్నించిన గురువుకు తన పేరు అనంతుడు అని, తనకెవ్వరూ లేరని, ఈ ఊరిలో ఏదైనా బ్రతుకుదెరువుకోసం పని దొరికితే చేసుకుందామని వచ్చానని, తుఫాను తాకిడికి ఎటుపోవాలో తెలియక ఈ చెట్టునాశ్రయించానని చెప్పడంతో గురువు జాలిగుండె కరిగి, తనతో తన ఆశ్రమానికి రమ్మని చెప్పాడు. మహదానందంతో అనంతుడు గురువును అనుసరించాడు.

గురుకుల ఆశ్రమానికి చేరుకున్నాక తన శిష్యుడిని పిలిచి అనంతుడికి భోజనం పెట్టి మార్చుకొనేందుకు బట్టలిచ్చి ఇకపై ఆ కుర్రవాడు ఇక్కడే వుండి ఆశ్రమంలో ఏదో ఒక పని చేసుకుంటూ తల దాచుకునేటట్టు ఏర్పాటు చేయమన్నాడు.

గురువుకు కృతజ్ఞతలు చెప్పుకొని అనంతుడు ఆ శిష్యుడి వెనుక వెళ్ళాడు.

ఆ రోజునుండి ఆశ్రమంలో తోటపని, ఇతర చిన్నా, చితక పనులు చేసుకుంటూ నమ్మిన బంటులా అందరి తలలో నాలుకలా మసలుకుంటూ అందరితోపాటు గురువుగారి మన్ననకు పాత్రుడయ్యాడు.

కొంతకాలం తర్వాత ఎందుకో అనంతుడు మొఖం చాలా ఉదాసీనంగా మారడం గమనించాడు గురువు. ముందులా హుషారుగా కాకుండా ఏదో పరధ్యానం, అసంతృప్తి అతనిలో కనిపిస్తున్నాయి. అన్ని విధాలా విచారించగా అతనిపట్ల ఎవ్వరూ అనుచితంగా ప్రవర్తించలేదని, అన్నీ సక్రమంగానే వున్నాయని తెలిసింది. అయితే ఆ మార్పుకు కారణమేమిటి? అంతుబట్టలేదు గురువుగారికి.

అసలు కారణం     వచ్చిన క్రొత్తలో తినడానికి తిండి, తలదాచుకోవ డానికి నీడ దొరికాయని సంతోషించాడు. కానీ కొన్ని రోజుల తర్వాత తన పనులు తాను చేస్తూనే ఇక్కడికి వచ్చే అందరినీ గమనించేవాడు. అనేకమంది ఇక్కడకు వచ్చి గురువువద్ద ఆధ్యాత్మిక విద్య, స్తోత్రపాఠాలు నేర్చుకొనేవారు. ధ్యానమందిరంలో కూర్చొని పూజలు, ప్రార్థనలు చేసేవారు. ఇవన్నీ చూశాక అనంతుడు వారంతా గొప్పవారు, చదువుకున్నవారు, వారు మంత్రాలతో, ప్రార్థనలతో, భగవంతుని కీర్తిస్తూ దైవానుగ్రహానికి పాత్రులవుతున్నారని, తనకు చదువు, సంధ్యా, వాక్సుద్ధి లేదు కాబట్టి ఎలా ప్రార్థించాలో తెలియక నిరాశా, నిస్పృహలతో వున్నాడు. రోజంతా కష్టపడి పనిచేసి, వేళకి తిని, పడుకొనే తనకు దైవానుగ్రహం ఎందుకు లభిస్తుంది?
తనపట్ల దైవం ఎలా ప్రసన్నం కాగలడు?  ఇదీ అతనిలో నైరాశ్యానికి మూలకారణం.

ఒకనాడు హఠాత్తుగా ఒక చిత్రమైన పరివర్తన అనంతుడి ముఖంలో కనిపించడంతో గురువుగారు ఆశ్చర్యపడ్డాడు.

ఎన్నడూ లేని ఒక క్రొత్తకాంతి అతని మొఖంలో చోటు చేసుకుంది. అతని మాటల్లో, చేతల్లో సంతోషం, ఉత్సాహం పొంగిపొర్లుతున్నాయి.

అందుకు కారణమేమైవుంటుందా అని తెలుసుకోవాలని నిశ్చయించు కున్నాడు గురువుగారు.

ఆరోజు మధ్యాహ్నం భోజనానంతరం ఎవరికి వారే ఎండవేళలో తమ తమ కుటీరాల్లోకి వెళ్ళిపోయారు. గురువు గారు కూడా తన కుటీరంలోనికి వెళ్లి తలుపులు మూసుకొని కిటికీలో నుండి అనంతుడిని గమనించసాగాడు.

ఎప్పటిలా తన పనులన్నీ ముగించుకొని కుటీరం దగ్గర అరుగుపైన కూర్చున్న అనంతుడు ఒకసారి లేచి నిలబడి చుట్టూ పరికించి చూశాడు. ఎవరూ లేరని తననెవరూ గమనించడం లేదని దృఢపడ్డాక మెల్లగా ముందుకు నడిచాడు. అది చూసిన గురువు కుటీరం నుండి బయటకు వచ్చి అనంతుడు తనను చూడకుండా జాగ్రత్తపడుతూ అతడేం చేస్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో గమనించ సాగాడు.

అనంతుడు తిన్నగా కుటీర ధ్యానమందిరంలోనికి వెళ్లి తలుపులు మూసుకొనడం చూసి గురువుగారు దిగ్భ్రాంతి చెందాడు.

వెంటనే సడీచప్పుడు చేయకుండా కుటీర మందిరం వద్దకు వెళ్లి చాటుగా అనంతుడు ఏం చేస్తున్నాడో చూడసాగాడు.

అనంతుడు మందిరం మధ్యలో వున్న శ్రీ కృష్ణుని విగ్రహంముందు మోకాళ్ళపై కూర్చొని ప్రార్థనా పూర్వకంగా భక్తితో ఏదో మాట్లాడడం చూసి గురువుగారు శ్రద్ధగా విన్నాడు..

"కృష్ణా! అందరూ నిన్ను స్తోత్ర పాఠాలతో స్తుతించి, ప్రార్థించి నీ మన్ననలు పొందుతున్నారు..
నాకు చదువురాదు.. పూజలు రావు.. స్తోత్రాలు రావు... అందుకే నిన్ను నాకు తెలిసిన విద్యతో ప్రసణ్ణున్ని చేసుకోవాలని వచ్చాను.    రోజూ నా ప్రదర్శన చూసి నన్ను అనుగ్రహించి నీ దర్శనభాగ్యం ప్రసాదించడం నా అదృష్టం. అందుకే ఈరోజు మరికొన్ని క్రొత్త ఆటలు ఆడి నిన్ను సంతోషపెట్టాలని వచ్చాను. చూసి ఎలా ఉన్నాయో చెప్తావు కదూ?" అంటూ తన సంచిలో నుండి 10 బంతులు బయటకు తీసి వాటిని గాలిలో ఎగురవేస్తూ ఒక్కటికూడా క్రిందపడకుండా ఆడాడు, ఆ తర్వాత అరచేతిని నేలపై మోపి తల క్రిందికి, కాళ్ళు పైకి పెట్టి మందిరం అంతా నడిచాడు. ఆ తర్వాత చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేశాడు. అన్నీ ముగిశాక మోకాళ్ళపై మోకరిల్లి స్వామితో.. "కృష్ణా! చెప్పు! ఈ రోజు నేను ప్రదర్శించిన విద్యలు నీకు నచ్చాయా?” అని భక్తితో అడిగాడు.

వెనువెంటనే భగవానుడి విగ్రహంనుండి కనులు మిరుమిట్లు గొలిపే ప్రకాశవంతమైన వెలుగు వెలువడింది. ఆ వెలుగుతోపాటు స్వామి మాటలు కూడా ప్రతి ధ్వనించాయి..."మిత్రమా! అనంతా!! నీ విద్యలు అమోఘం... అవి చూసి నేను చాలా ఆనందించాను. రేపు కూడా వచ్చి నీ ఆటలు ప్రదర్శిస్తావు కదూ?" అన్నాడు.

"తప్పకుండా కృష్ణా!" అని లేచి నిలబడ్డాడు అనంతుడు.

బయటనుండి ఈ దృశ్యం చూసి… , శ్రీ కృష్ణుని పలుకులు విని గురువుగారు శిలాప్రతిమలా నిలబడిపోయాడు.

తలుపులు తెరిచిన అనంతుడు గురువును చూసి ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు.

కానీ గురువుగారు అతన్ని ఆమాంతం ఆలింగనం చేసుకున్నాడు..“నాయనా అనంతా! ఎన్నో దశాబ్దాలనుండి ఏకదీక్షతో నేను స్వామిని కొలుస్తున్నాను, ఎన్నో మంత్రాలు జపిస్తున్నాను. ఎందరికో నేర్పిస్తున్నాను. కానీ ఇంతవరకు నాకు ఆ భగవానుడి సాక్షాత్కారం లభించలేదు. ఈ రోజు నిర్మల భక్తిభావంతో సరళ హృదయంతో నీవు ఆటలాడి స్వామిని మెప్పించి సాక్షాత్కారాన్ని పొందావు. నీవు ధన్యుడవు. ఈ రోజునుండి నీవు ఈ ఆశ్రయంలో పనివాడవు కాదు.. నా ప్రథమ శిష్యుడవు.. నీకు సకల విద్యలూ నేర్పిస్తాను” అన్నాడు ఆనందాశ్రువులతో...

 దైవానుగ్రహం పొందాలంటే కేవలం జప తపాదులు, యజ్ఞయాగాదులు, మంత్రతంత్రాలు మాత్రమే కాదు. వాటితో బాటుగా ముఖ్యంగా కావల్సింది నిర్మలమైన భక్తి, స్వచ్ఛత తప్పక ఉండాలి.

సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 

Quote of the day

May He who is the Brahman of the Hindus, the Ahura-Mazda of the Zoroastrians, the Buddha of the Buddhists, the Jehovah of the Jews, the Father in Heaven of the Christians give strength to you to carry out your noble idea.…

__________Swamy Vivekananda