Online Puja Services

గుడిలో చేసే ప్రదక్షణాలకీ విశ్వ గమనానికీ సంబంధం ఉందా ?

3.133.141.6

గుడిలో చేసే ప్రదక్షణాలకీ విశ్వ గమనానికీ సంబంధం ఉందా ?
-సేకరణ 

 గుడికెళ్ళినపుడు ప్రదక్షిణాలు చేస్తాం. "స్వామి నాకు ఫలాన పని అయ్యెటట్టు చూడు, నీకు 108 ప్రదక్షిణాలు చేస్తాను, ఈ పరీక్ష గట్టెకెట్టట్లు చేయి 11 ప్రదక్షిణాలు చేస్తా అని" రకరకాలుగా కోరుతూంటారు. ఆంజనేయస్వామికి , నవగ్రహాలకి ప్రత్యేకంగా ఇంత సంఖ్యలో ప్రదక్షిణాలు చేస్తామని మొక్కుతుంటారు . అసలా ప్రదక్షిణలు అంతటి ఫలితాన్ని అనుగ్రహిస్తాయా ? ఇది నిజంగా పరిశీలించాల్సిన అంశమే .   

ఈ జగత్తులో సూర్యుని చుట్టు అనేక గ్రహాలు తిరుగుతూంటాయి. మనం నివశిస్తున్న గ్రహమైన భూమితో సహా !  అలా ప్రదక్షిణ చేయడం వలనే అవి సుస్థిరమైన స్థానాన్ని పొందగలుగుతున్నాయని చెప్పవచ్చు. విశ్వంలో జననం నుండి మరణం వరకు ఒక ప్రదక్షిణే కదా ! ఎన్నో జన్మల కర్మ ఫలాలను అనుభవించడం , వాటి దుష్ఫలితాలను తొలగించుకునేందుకు తాపత్రయ పడటమే ఒక ప్రదక్షిణ కాదంటారా .

నవమాసాలు మోసి, రక్త మాంసాలను పంచి, ప్రాణాలను కూడ లెక్క చేయకుండా, బిడ్డకు జన్మనిచ్చి, తమకంటే బిడ్డను ఉన్నతస్థాయిలో ఉంచేందుకు తపనపడే తల్లి కి ఎంతటి ఉన్నతస్థానం ఇస్తామో, ప్రప్రధమ దైవంగా భావిస్తామో, ఏమి చేస్తే కృతఙ్ఞత ప్రకటింపబడుతుందో తెలిపే వివరణ మన వినాయకస్వామి వివరించేశారు . గణాధిపత్యం ఎవరిదనే మీమాంసలో తన తల్లిదండ్రులకి కేవలం ముమ్మారు ప్రదక్షిణ చేయడం చేత విశ్వానికి ప్రదక్షిణ చేసినట్టని బుద్ధిగణపతి నిరూపించారు కదా ! కనుక మూడు సార్లు భూప్రదక్షిణ చేసినా, 100సార్లు కాశి యాత్ర చేసినా, కార్తీక,మాఘ స్నానాలు చేసినా, అమ్మకు, అయ్యకూ ప్రదక్షిణం చేసిన దానితో సమానం కాదు . 

ప్రదక్షిణం  అనే పదానికి భగవాన్ రమణ మహర్షి వివరణ చూడండి . 

ప్ర అక్షరం -సమస్త పాప నాశనకారి

ద అక్షరం - కోరికలన్ని తీరుతాయనే భావం

క్షి అక్షరం - రాబోయే జన్మ జన్మల రాహిత్యాన్ని సూచిస్తుంది

ణం అక్షరం - అఙ్ఞానం వీడి ఙ్ఞానం ప్రసాదించే ఆవృతం అని అర్ధం. 

గాన స్వరూపుడైన ఆ సుబ్రహ్మణ్యుని దివ్యావతారమైన రమణుల వాక్కుకన్నా ప్రామాణికం ఇంకేముంటుంది !! 

ప్రదక్షిణ చేసేటప్పుడు, చేతిలొ కాగితం పై లెక్కించుకుంటు, ధ్యాసంతా ఎపుడెపుడు 108 అవుతాయా, తొందరగ చేద్దాం అని అనుకోకూడదు.  ‘భక్తి  శివుడి మీదా చిత్తం చెప్పుల మీద’ అని వెనకిటికీ సామెత చెప్పినట్టు , ఆవిధంగా  భగవంతుని మీద ధ్యాసలేకుండా చేసే ప్రదక్షిణాలకు ఎటువంటి ఫలితం ఉంటుంది చెప్పండి ?

నెలలు నిండిన  స్త్రీ, నిండు కుండతో నడిచే వ్యక్తి ఎలా నడుస్తారో, అంత నెమ్మదిగా, దైవ నామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణా విధానంలో ఎంత నెమ్మదిగా ఉంటే అంత ఫలితం ఉంటుందని విఙ్ఞులు అంటారు. ప్రదక్షిణ చేసేటప్పుడు ఇష్టమైన దైవాన్ని స్మరించాలి. అడుగులో అడుగు వేసుకుంటూ, అడుగు అడుగుని అనుసరిస్తూ, చేతులు నిశ్చలంగా జోడించి, దైవ నామస్మరణతో ప్రదక్షిణ చేయాలని పెద్దలంటారు. దీనినే "చతురంగ ప్రదక్షిణ" ని చెబుతారు . 

సృష్టి, స్థితి, లయ కారకులను స్మరిస్తూ చేసే ప్రదక్షిణాల సంఖ్య కనీసం మూడుగా ఉండాలని పెద్దలు చెబుతారు . అదే పంచభూతాలలోని పరమాత్మను దర్శిస్తూ చేసేవి 5 ప్రదక్షిణాలు కాగా నవగ్రహ ఆలయాలలో చేసే ప్రదక్షిణలు తొమ్మిది కనీసం. 

సాధారణంగా చేసే ప్రదక్షిణాలలో మొదటిది “ మన పరిచయాన్ని స్వామికి నివేదించేది - అయ్యా ఫలాన వ్యక్తిని ప్రదక్షిణ చేయడానికి వచ్చానని చెప్పడానికి. రెండవది పరమాత్ముడవైన నిన్ను శరణువేడుతున్ననై చేసేది. ఇక మూడవది నాకీ సంకల్పాన్నిచ్చినందుకు నీకు కృతఙ్ఞతలు అని భగవంతునికి చెప్పుకునేది .  అనుగ్రహాన్నివ్వమని వేడుకునేది. 

అందువల్ల ఆ విధంగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఈ విషయాలని జ్ఞప్తిలో ఉంచుకొని పరమాత్మ అనుగ్రహాన్ని అర్థించండి.  ప్రదక్షిణాలు గురించి అన్యులు కారుకూతలు కూస్తే, ఇది సృష్టిలో ఉన్న విజ్ఞానమని, విజ్ఞానమే లేని కుహనా మేధావులకు లేనిపోని సందేహాలు రావడం సహజమేనని తెలియజేయండి . 

శుభం !! సర్వేజనా సుఖినోభవంతు !!

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi