Online Puja Services

కృపాచార్యుడూ, అశ్వత్థామా కలిసి చేసిన అకృత్యాలు ఈ రెండూ

18.191.135.224

కృపాచార్యుడూ, అశ్వత్థామా కలిసి చేసిన అకృత్యాలు ఈ రెండూ !!
-సేకరణ 
     
  కృపాచార్యుడు శతానంద మహర్షి మనుమడు. మహాభారతంలో కౌరవులకు, పాండవులకు గురువు. మహాభారత యుద్ధములో కౌరవుల తరపున యుద్ధం చేసాడు. యుద్ధం ముగిసిన తరువాత బ్రతికిఉన్న వారిలో ఇతడు ఒకడు. సప్త చిరంజీవులలో ఒకడు. యుద్ధం తరువాత అర్జునుడి మనుమడైన పరీక్షిత్తుకు ఆచార్యునిగా నియమింపబడ్డాడు.

పాండవులకూ కౌరవులకూ  అందరికీ కృపాచార్యుడే మొదటి గురువు. ఆ తరవాతనే ద్రోణా చార్యుడి పాఠాలు వచ్చాయి.

 కృపాచార్యుడి తోబుట్టువు కృపి. ద్రోణాచార్యుడికి భార్య అయింది. కృపీ ద్రోణాచార్యుల సంతానమే అశ్వత్థామ. అంచేత, కృపాచార్యుడికి అశ్వత్థామ మేనల్లుడన్నమాట. వీళ్లు ముగ్గురూ అధర్మానికే కొమ్ముకాస్తూ కౌరవులవైపే యుద్ధం చేశారు. దానిలో జరిగిన రెండు అకృత్యాల్లో కృపాచార్యుడూ అశ్వత్థామా భాగస్వాములయ్యారు.

మొదటిది, అభిమన్యుణ్ని ఏకాకిని చేసి ఒకేసారి ఆరుగురు దాడిచేసి చంపడం. అర్జునుణ్ని చంపిగానీ యుద్ధాన్ని విరమించమని శపథం చేసి సుశర్మతో సహా పదివేల మంది అతన్ని దూరంగా తీసుకొనిపోయారు. ఆ సంశప్త కులతో అక్కడ యుద్ధం జరుగుతూన్నప్పుడు, ద్రోణాచార్యుడు చక్రవ్యూహం పన్నాడు.

దానిలోకి చొరబడడమైతే వచ్చును గానీ బయటపడడం మాత్రం చేతగాదు అభిమన్యుడికి. అయితే, అర్జునుడు సంశప్తకులతో యుద్ధం చేస్తూ ఉండడంతో, ఇక్కడ అభిమన్యుడు వ్యూహంలోకి చొరబడవలసివచ్చింది గత్యంతరం లేక. ద్రోణుడూ ,అశ్వత్థామా, కృపుడూ,కృతవర్మా ,కర్ణుడూ, బృహద్బలుడూ అనే ఆరుగుర్నీ వేరువేరుగా ఓడించాడు అభిమన్యుడు. అప్పుడు ద్రోణుడు విల్లునొకణ్నీ గుర్రాలనొకణ్నీ రథానికి అటుపక్కా ఇటుపక్కా రక్షిస్తూ ఉండే పార్శ్వరక్షకుల్ని ఒక్కణ్నీ పడగొట్ట మని పథకం వేశాడు. కర్ణుడు విల్లు విర గ్గొడితే, గుర్రాల్ని కృతవర్మ చంపాడు; కృపుడు పార్శ్వరక్షకుల్ని మట్టుబెట్టాడు. అలా ఒక్కణ్ని చేసి అభిమన్యుణ్ని చంపడంలో కృపాచార్యుడి చెయ్యి కూడా ఉంది.

రెండోది, నిద్రపోతూన్న ఉప పాండవుల్నీ ధృష్టద్యుమ్నుణ్నీ శిఖండినీ చంపడం. దుర్యోధనుడు కూడా చనిపోయిన తరవాత, సౌప్తికపర్వంలో అశ్వ త్థామకు సాయపడ్డవాళ్లు కృతవర్మా, కృపా చార్యుడూను. సౌప్తిక పర్వమనేది నిద్ర పోతూన్నప్పుడు యోద్ధల్ని పశువుల్ని చంపినట్టు చంపిన కథనాన్ని చెప్పే భాగం. దుర్యోధనుడి చేత చివరి సేనాపతిగా తిలకాన్ని పెట్టించుకొన్న అశ్వత్థామ, తనతోబాటు బతికి ఉన్న కృపుడూ, కృతవర్మలతో కలిసి శత్రువులకు కనిపించకుండా రాత్రి అడవిలో ఒక మర్రిచెట్టు కింద ఉన్నాడు.

వాళ్లిద్దరూ నిద్రపోయారు గానీ అశ్వత్థామకు కునుకు పట్టలేదు. అక్కడ అతను ఒక గుడ్లగూబ ఆ చెట్టు మీదున్న గూళ్లల్లో నిద్రపోతూన్న కాకుల్ని చంపడాన్ని చూశాడు. తాను కూడా తన తండ్రిని చంపిన ధృష్టద్యుమ్నుణ్ని అలాగే చంపాలని నిశ్చయం చేసుకొన్నాడు. ఆ ఆలోచనను విన్న మేనమామ కృపా చార్యుడు బోధ చేశాడు. 

 ఈ రోజు రాత్రి పాంచాలురందరూ గెలిచామన్న ధీమాతో, కవచాలు తీసేసి నిశ్చింతగా నిద్రపోతూంటారు. ఆ అవస్థలో ఎవడైనా క్రూరుడై ద్రోహం చేస్తే, వాడు ఘోర నరకంలో మగ్గిపోవడం ఖాయం. ఇంత చెప్పినా, మేనల్లుడు మేనమామ మాటను పెడచెవిన పెట్టాడు. అశ్వత్థామ ఒక్కడూ వాళ్ల శిబిరానికి బయలుదేరుతూంటే, కృతవర్మా ,కృపుడూ సాయంగా వెళ్లారు. శిబిర ద్వారం దగ్గర నిలుచుని, ఎవరైనా పారిపోతూంటే వాళ్లను చంపడానికి సన్నద్ధులై పొంచి కాపలా కాశారు.

 ఇంతగా పాండవులకు విరుద్ధంగా ప్రవర్తించి కూడా చివరికి బతికినవాళ్లు కౌరవుల్లో ఈ ముగ్గురే. నిజానికి వీళ్లు కౌరవులు కారు, కౌరవుల అధర్మానికి కొమ్ముకాసినవాళ్లు. అశ్వత్థామ ద్రోణా చార్యుడి కొడుకు; కృతవర్మ భోజవంశం వాడైన యాదవుడు; కృపాచార్యుడు గౌతమ వంశంవాడు. అశ్వత్థామ తాను చేసిన జుగుప్సాకరమైన పనివల్ల అడవు ల్లోనే అజ్ఞాతంగా ఇప్పటికీ బతికే ఉన్నాడని చెబుతారు. 

కృపాచార్యుడు పాండవులతో సంధి చేసుకొని, వాళ్ల దగ్గరే ఉన్నాడు. అభిమన్యుడి భార్య ఉత్తరకు పరీక్షిత్తు పుట్టిన తరవాత, ఆ కుర్రాడికి విలువిద్యను కృపాచార్యుడే నేర్పాడు. 

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore