Online Puja Services

వ్యాధులు తగ్గించే వైద్యనాథుడు ఇక్కడి శ్రీకంఠేశ్వరుడు.

18.220.178.207

వ్యాధులు తగ్గించే వైద్యనాథుడు ఇక్కడి శ్రీకంఠేశ్వరుడు. 
లక్ష్మీ రమణ 

మృత్యువు నుండీ అమృతత్వాన్ని ప్రసాదించేవారే పరమేశ్వరుడు .  వైద్యనాథుడు . సకాలములైన వ్యాధులనుండీ రక్షించి శుభాన్ని ,  శివుడు. అలా ఆ పరమేశ్వరుడు వ్యాధుల్ని నయంచేసే స్వామిగా కొలువై , కొలుపులందుకొంటున్న క్షేత్రం నంజనగూడు . త్రివేణీ సంగమ స్థలిలో పరశురామ ప్రతిష్టితమై ఉన్న ఈ నంజనగూడు దేవాలయం ఎంతో ప్రసిద్ధిని పొందిన దివ్యక్షేత్రం . 

నంజనగూడు : 
కర్నాటక రాష్ట్రం లోని మైసూరుకి దాదాపు 25 కిలోమీటర్లదూరంలో ఉన్న దివ్య ధామం నంజనగూడు.  నంజనగూడు అంటే కన్నడములో విషాన్ని మింగినవాడు కొలువైన ప్రదేశం అని అర్థం . దేవదానవులు క్షీరసాగరాన్ని మథించినప్పుడు పుట్టిన హాలాహలాన్ని, లోకాలని దహించనివ్వకుండా తన కంఠంలో నిలిపాడు పరమేశ్వరుడు . అలా నీలంగా మారిన కంఠంతో నీలకంఠేశ్వరునిగా పేరొందారు . స్వయంగా ఆ నీలకంఠుడు , గరళాన్ని తన కంఠంలో నిలిపిన అనంతరం ఈ క్షేత్రంలో వెలశారని స్థలఐతిహ్యం . ఈయననే శ్రీకంఠేశ్వరుడు అని కూడా పిలుస్తారు . ఈయనని గౌతముడు ప్రతిష్టించారని చెబుతారు . అయితే స్వామీ అర్థాంతరంగా అంతర్ధానమయ్యారనీ, ఆతర్వాత పరశురాముడు తిరిగి స్వామిని ఇక్కడ నెలకొల్పారనీ స్థలపురాణం.  

పరశురామ క్షేత్రం :
 ఈ ఆలయానికి సమీపంలో కపిలానది, కౌండిన్యనది, చూర్ణవతి నదుల త్రివేణీ సంగమం ఉంది. దీనికి పరశురామ క్షేత్రం అని పేరు. ఈ పేరు రావడం వెనుక నంజుడేశ్వరుని అవతారగాథ ఉంది . మొదట ఇక్కడ నంజుడేశ్వరుని ఆలయానికి పక్కనున్న ఆదికేశవుని ఆలయమే ఉండేదట. అయితే పరశురాముడు తన తల్లిని సంహరించిన తరువాత ఈ ప్రాంతానికి వచ్చి నదీస్నానం చేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడని అంటారు. అలా ఆయన తన గొడ్డలిని ఈ నదీజలాలలో శుభ్రం చేసుకుంటున్న తరుణంలో ఆగొడ్డలి, ఆ నీటిలో దాగిఉన్న  ఇప్పటి నంజుడేశ్వరలింగానికి తాకి గాయమయ్యిందట . నెత్తురోడుతున్న శివలింగాన్ని చూసి అపచారం జరిగిందని పరశురాముడు భయపడుతూ పరమేశ్వరుణ్ణి శరణు వేడారు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై తనని అక్కడే గుడికట్టి పూజించమని పరుశురాముణ్ణి ఆదేశించారు. సంతోషంగా పరుశురాముడు ఇక్కడ నంజుడేశ్వరునికి ఆలయాన్ని నిర్మించారు . 

నంజుడేశ్వరుడు ,  తనని దర్శించుకున్న ప్రతిఒక్కరూ తప్పనిసరిగా పరుశురాముణ్ణి కూడా దర్శించుకుంటారని పరశురామునికి వరాన్ని అనుగ్రహించారట . 

టిప్పుసుల్తాన్ కొలిచిన దైవం :
ఇక్కడ నంజుడేశ్వరుడు రోగాలని నయం చేసే దేవునిగా పేరొందారు . ఒకసారి టిప్పుసుల్తాన్ పట్టపుటేనుఁగు చూపుని కోల్పోతే, ఆయన నంజుడేశ్వరుని శరణువేడారట .  హకీం (వైద్యునిగా) కొలిచారట . అప్పుడా ఏనుగు తిరిగి కంటిచూపుని పొందిందని ఇక్కడివారు చెబుతారు . 

భక్తులపాలిటి ధన్వంతరి : 
అభిషేక ప్రియుడైన పరమేశ్వరుడిని ప్రత్యేక సందర్భాలలో వండిన అన్నముతోను అభిషేకించడం శివాలయాల్లో చూస్తుంటాం.  కానీ నంజుడేశ్వరునికి మాత్రం రోజూ అన్నంతోనే అభిషేకం చేస్తారు.  ఇలా రోజూ అన్నంతో అభిషేకించడం వల్ల స్వామి పైన ఉన్న విష ప్రభావం కొంతైనా తగ్గుతుందని అంటారు. అలాగే ప్రత్యేకంగా తయారు చేసిన ఆయుర్వేద మందును ప్రసాదంగా నివేదిస్తారు.  అదే విధంగా వెన్న, సొంఠీ, చక్కరతో చేసిన సుగందిత సక్కరై అనే ప్రసాదాన్ని నివేదిస్తారు.  సుగంధిత సక్కరై అనే ప్రసాదాన్ని నివేదిస్తారు. 

జాతరలు : 
భక్తుల అనారోగ్యాలను దూరం చేసే ఈ స్వామికి ఏడాదికి రెండుసార్లు ప్రత్యేక జాతర్లను నిర్వహిస్తారు. పెద్దజాతర సందర్భంలో రథోత్సవం పంచమూర్తులకు ఘనంగా జరుగుతుంది. శ్రీకంఠేశ్వరుడిని, పార్వతీదేవిని, గణపతిని, సుబ్రహ్మణ్యస్వామిని, చండికేశ్వరుడిని ఐదు ప్రత్యేక రథాలలో ఉంచి వేలాది భక్తులు ఈ రథాలను పురవీధులలో లాగి ఊరేగిస్తారు. 

ఇలా చేరుకోవచ్చు :
దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన ఈ ఆలయంలో గరళకంఠుడైన స్వామీ శ్రీ నంజుడేశ్వరునిగా   కొలువై భక్తుల అనారోగ్యాలను దూరం చేసే ధన్వంతరిగా పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడికి చేరుకోవాలంటే హైదరాబాద్ నుండీ బెంగళూరుకు రోడ్డుమార్గంలో చేరుకోవచ్చు . సుమారుగా 18 గంటల ప్రయాణం అవుతుంది . 

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi