Online Puja Services

వైశాఖ పురాణ తొమ్మిదవ అధ్యాయ మహత్యం .

3.134.118.95

ఈశ్వరుడు చెప్పిన వైశాఖ పురాణ తొమ్మిదవ అధ్యాయ మహత్యం .
- లక్ష్మి రమణ 

శృతదేవుడు చెప్పిన పిశాచత్వ మోక్ష కథను విన్నశృతకీర్తి మహారాజు తిరిగి విధంగా అడిగారు.  “ఓ శృతదేవ మహామునీ ! ఇక్ష్వాకువంశ రాజు అయిన హేమాంగదుడు జలదానము చేయకపోవడం వల్ల మూడు మార్లు చాతకంగా జన్మించి, ఆ తర్వాత బల్లి జన్మని పొంది  నా గృహంలో ఉన్నారు కదా! పుణ్యాన్ని కలిగించు యజ్ఞ యాగాదికములను, దానాలను చేసిన హేమాంగదుడు కర్మానుసారము జాతకము మొదలైన జన్మలను ఎత్తవలసి వచ్చింది.  కానీ, సత్పురుషులను సేవించకపోవడం వలన గ్రద్ద గాను, పలుమార్లు కుక్కగాను జన్మించడం అనేది  మాత్రము తగినట్టుగా నాకు తోచడం లేదు.  హేమాంగద మహారాజు సజ్జనులను పూజించలేదు కాబట్టి, ఆయనకి పుణ్య లాభము కలగకపోవచ్చు. పరులను ఎవరిని పీడించలేదు కదా! మరి ఆయనకి శునకాది జన్మలెందుకు కలిగాయో వివరించి నా సందేహాన్ని తీర్చండి” అని అడిగారు.  అలా ప్రశ్నించిన శృతి కీర్తిని మెచ్చి శ్రుతి దేవుడు తిరిగి ఈ విధంగా చెప్పసాగారు. 

 ఓ రాజా! విను.  ఈ విషయంలో పార్వతికి శివుడు కైలాస శిఖరాన చెప్పిన విషయాన్ని వివరిస్తాను.  భగవంతుడు ఈ లోకములన్నింటినీ సృష్టించారు.  వారి స్థితిని ఇహలోక సంబంధము, పరలోక సంబంధము అని రెండు విధాలుగా ఏర్పరిచారు.  ఇహలోక సంబంధములుగా జలసేవ, అన్నసేవ, ఔషధసేవ అని ఇహలోక స్థితికి మూడు హేతువులను ఏర్పరిచారు.  ఇవి మూడు కూడా ఇహలోక స్థితికి స్థితికి సర్వలోకముల లోనూ  ముఖ్య హేతువులు.  అదేవిధంగా, పరలోక సుఖస్థితికి సాధుసేవ, విష్ణు సేవ, ధర్మ మార్గ సేవ అనే మూడు కూడా ముఖ్యమైన హేతువులు. ఇవి భగవంతుడు ఏర్పరచిన విధానములని వేదములలో చెప్పబడ్డాయి. 

 ఇంట్లో ఉండి సంపాదించుకున్న ఆహార పదార్ధము ప్రయాణమున ఆహారానికి ఉపయోగపడినట్లుగా, ఇహలోకములో మనము చేసిన సాధుసేవ విష్ణుసేవా  ఫలాలు పరలోక స్థితికి ఉపయోగపడతాయి. మంచివారికి సజ్జనులకు అష్టమైన కార్యము, మన మనసుకు ఇష్టమైనప్పటికీ కూడా దానివల్ల ఏదో ఒక అనర్థమే కలుగుతోంది.  సజ్జనులకు అప్రియమైనది మనకు ప్రియమైనప్పటికీ, దానిని ఆచరించడడం వలన చివరికి మనకు నష్టమే జరుగుతుంది. దానిని వివరించడానికి ఉదాహరణగా అతి ప్రాచీనమైన ఇతివృత్తాన్ని వివరిస్తాను.  పార్వతి, పరమేశ్వరుల ఈ కథ సర్వ పాపాలను పోగొడుతుంది. విన్న వారికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది.  అంటూ పరమేశ్వరుడే  స్వయంగా వివరించిన తన కథను శృతదేవుడు ఈ విధంగా చెప్పసాగారు. 

“పూర్వము దక్ష ప్రజాపతి అపూర్వమైన యజ్ఞాన్ని చేయదలిచారు.  అంతకు పూర్వమే ఆయన కుమార్తె అయిన సతీదేవిని నాకు (శివునికి )ఇచ్చి వివాహం చేశారు.  అల్లుడైన నన్ను యజ్ఞానికి రమ్మని పిలవడానికి కైలాసానికి వచ్చారు.  ఆ విధంగా వచ్చిన దక్ష ప్రజాపతిని చూసి నేను (శివుడు ) లేచి నిలబడలేదు . నేను  దేవతలందరికీ గురువును.  వేదాలు వివరించు త్రికాలస్వరూపాన్ని .  చంద్రుడు ఇంద్రుడు మొదలగు దేవతలు నాకు కానుకలు తెచ్చేవారు.  అంటే వారు సేవక ప్రాయలు. ప్రజాపతులలో ఒక్కడైన దక్ష ప్రజాపతి నాకు పిల్లనిచ్చిన మామగా  గౌరవార్హుడైనప్పటికీ కూడా,అక్కడ సభతీర్చి ఉన్న సమయంలో  పరాత్పరుడైన నేను, ప్రజాపతులలో ఒకరిని చూసి లేచి గౌరవించుట వారికి శ్రేయస్కరము కాదు.  యజమాని సేవకుని చూసి లేవకూడదు.  భర్త తన భార్యను చూసి లేవరాదు.  గురువు శిష్యుని చూసి లేచి నిలబడకూడదని పండితుల మాట కదా! అందువల్ల నేను లేచి నిలబడలేదు . ఈ విధంగా చేయడం వల్ల సేవకాదుల ఆయువు ధనము కీర్తి సంతతి మొదలైనవి వెంటనే నశిస్తాయని తలచాను. 

కానీ నా ఆలోచన శక్తిని, ఔన్నత్యాన్ని  గమనించని దక్ష ప్రజాపతి ధర్మసూక్ష్మాన్ని గ్రహించక, అల్లుడు తనని గౌరవించలేదని నా పై కోపం తెచ్చుకున్నారు.  కోపాన్ని, ఉద్రేకాన్ని ఆపుకోలేక వెంటనే నన్ను చూస్తూ ..  ఓహో ఎంత గర్వము! ఏమీ ఈ గర్వము! తనని తాను తెలుసుకొన జాలని అవివేకి,అయిన దరిద్రుడు ఈ శివుడు. ఇతనికి తన కంటే మామ మాన్యుడనే విషయమే తెలియదా ! ఈశ్వరుడు అనే పదములోనే ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాడు. ఇంతటి మర్యాద హీనుడైన ఇతని ఐశ్వర్యం ఎంత గొప్పదో కదా! వయసెంతో అతనికే తెలియదు. శుష్కించిన  ఒక ఎద్దు తప్ప ఇతని ఐశ్వర్యము ఏమున్నది ? పాపము, కపాలము ఎముకలను ధరించి ,  వేద బాహ్యమైన పాషండుల చేత పూజించబడే వాడు ఇతడు.  ఇటువంటి వాడిచ్చే మంగళకరమైన ఫలము  ఏముంటుంది? శాస్త్రములు చర్మధారణని అంగీకరించవు.  దరిద్రుడై చలికి బాధపడుతూ, ఈయన అపవిత్రమైన గజ చర్మాన్ని ధరిస్తూ ఉంటాడు. పోనీ, నివాసము చూద్దామా అంటే  స్మశానము.  అలంకారమా సర్పము.  ఇది ఇతని ఐశ్వర్యము ఇటువంటి ఈశ్వరుడు ఇటువంటి శివుడు పేరుకు మాత్రమే ఈశ్వరుడు.  శివ శబ్దార్ధము నక్క.  ఆ నక్క తోడేలను చూసి పారిపోతుంది. ఈ శబ్దమే ఈతని  ఔచిత్యాన్ని వివరిస్తోంది. అసలు  సజ్జనులితని దైవముగా అంగీకరించరు.  దురాత్ముడైన నారదుడు వచ్చి చెప్పగా విని నేను ఇతనికి నా కుమార్తె అయిన సతీదేవిని ఇచ్చి మోసపోయాను.  ధర్మ వ్యతిరేకతమైన ప్రవర్తన గల ఇతని వివాహమాడిన నా కుమార్తె అయిన సతీదేవి ఇతని ఇంట్లోనే ఉండి ఈ సుఖములను అనుభవిస్తూ ఉండుగాక !! ఇటువంటి ఇతడు, ఇతని వివాహం చేసుకున్న నా కుమార్తె వీళ్ళిద్దరూ నాకు మెచ్చ తగిన వాళ్ళు కారు . నీచ కులము వాని దగ్గర ఉన్న పవిత్ర కలశం విడువదగినదగినట్టుగా వీరు నాకు విడవదగిన వారు” అని రకరకాలుగా పరమేశ్వరుడైన నన్ను నానారకాలుగా నిందించాడు.  కుమార్తె అయిన సతీదేవిని అల్లుడైన నన్ను యజ్ఞానికి పిలవకుండానే తన ఇంటికి మరలిపోయాడు. 

ఆ తర్వాత యజ్ఞవాటికను చేరి, దక్ష ప్రజాపతి రుత్వికులతో కలిసి యజ్ఞాన్ని ప్రారంభించారు. అయినా ఆయన  పరమేశ్వర నిందని ఆపలేదు. బ్రహ్మ విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరూ దక్షుని యజ్ఞానికి వచ్చారు. సిద్ధులు, చారణలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు ఇలా  వారు వీరు అని లేదు , అందరూ కూడా వచ్చారు. 

పుణ్యాత్మురాలైన సతీదేవి స్త్రీ సహజమైన చాపల్యము చేత ఆ యజ్ఞాన్ని చూడవచ్చిన బంధువులను చూడాలని తలపోసింది.  నేను (శివుడు) వద్దని వారించినప్పటికీ, స్త్రీ స్వభావాన్ని అనుసరించి యజ్ఞానికి వెళ్లాలని తలచింది. నేను పలికిన ప్రతి మాటకు సమాధానం చెప్పింది.  అప్పుడు నేను “ఓ సుందరి నీ తండ్రి అయిన దక్షుడు నన్ను సభలో నిందిస్తారు . సహింపరాని ఆ నిందను విని నువ్వు శరీరమును విడుస్తావు సుమా! ఆ నీ తండ్రి చేసే నిందని గృహస్థ ధర్మాన్ని అనుసరించి సహించు.  నేను నిందను విని సహించినట్లు, నువ్వు సహించి ఉండలేవు కాబట్టి యజ్ఞసాలకు వెళ్లొద్దు.  అక్కడ శుభము జరగదు.  ఇది నిశ్చయము.” అని ఆమెని ఎంతగా వారించినా వినలేదు. ఒంటరిగా ఆయన తండ్రి చేసే యజ్ఞానికి పోతలచి ప్రయాణం అయింది.  అప్పుడు శివుని వాహనమైన నంది వృషభ రూపాన వచ్చి, ఆమెను ఎక్కించుకొని యజ్ఞసాలకు తీసుకువెళ్లారు.  పరమేశ్వరుని పరివారమైన భూత సంఘములు ఆమెను అనుసరించి వెళ్లాయి.  సతీదేవి యజ్ఞసాలకు వెళ్లి, తన పరివారాన్ని ఆ యజ్ఞశాలకి వెలుపల ఉంచి తాను లోపలికి వెళ్లారు. 

యజ్ఞశాలలో ప్రవేశించిన సతి దేవిని బంధువులు ఎవరు పలకరించలేదు.  దానిని సతీదేవి గమనించి, ఒక్క సారి నేను చెప్పిన మాటలను స్మరించుకుని, యజ్ఞ వేదిక దగ్గరకు వెళ్లారు.  తండ్రి అక్కడ ఉన్న సభ్యులు ఆమెను చూసి పలకరించక మౌనంగా ఉన్నారు.  దక్షుడు యజ్ఞమున చేయవలసిన రుద్రాహుతిని విడిచిపెట్టి, మిగిలిన దేవతలను ఉద్దేశించి ఆహుతులను ఇచ్చారు. తండ్రి చేసిన ఈ అకృత్యాన్ని గమనించి కన్నీరు కన్నీరు విడిచిన సతి దేవి, ఈ విధంగా పలికారు.  “తండ్రీ  ఉత్తములను అవమానించుట ధర్మము కాదు.  అటువంటి అవమానము శ్రేయస్సును కలిగించదు. రుద్రుడు లోకకర్త, లోక భర్త, అందరికీ ప్రభువు.  అతడు నాశరహితుడు.  అటువంటి రుద్రునికి హవిస్సును ఆహుతిగా ఇవ్వకపోవడం యుక్తముకాదు.  ఇటువంటి బుద్ధి నీకే కలిగిందా? ఇటువంటి దుర్భర బుద్ధిని ఇక్కడ ఉన్నవారు కలిగించారా? ఇక్కడ ఉన్న వారెవరు కూడా నువ్వు చేసే పని మంచిది కాదని చెప్పకపోవడం ఆశ్చర్యంగా ఉంది . విధివిధానము వారికి తెలియనిదా !అని ప్రశ్నించారు. 

 సతీదేవి మాటలను విని సూర్యుడు నవ్వాడు.  అక్కడ ఉన్న భృగు మహర్షి, సతి దేవిని పరిహసిస్తూ తన గడ్డంలో చరుచుకున్నారు.  కొందరు చంకలు కొట్టుకున్నారు.  మరికొందరు పాదములు తొడలు కొట్టుకున్నారు.  ఈ విధంగా సభలోని వారు దక్షుణ్ణి సమర్థిస్తూ సతి దేవిని పరిహాసిస్తూ విచిత్ర వికారములను ప్రదర్శించారు.  విధిరాతకు లోబడిన దక్షుడు కూడా ఆమెను, నన్ను (శివుని) బహు విధాలుగా నిందించారు.  రుద్రాణి అయిన సతిదేవి దక్షుని మాటలను విని కోపించింది.  భర్త నిందను విన్నందుకు ప్రాయశ్చిత్తముగా యజ్ఞశాలలోని వారందరూ చూస్తుండగా యజ్ఞ వేదికలో ఉన్న అగ్నిగుండములో శరీరాన్ని విడిచారు.  ఆ దృశ్యాన్ని చూసిన వారందరూ హాహాకారాలు చేశారు. 

దాంతో నా (ఈశ్వరుని) పరివారమైన ప్రమదులు పరుగున వచ్చి ఆ విషయాన్ని నాకు తెలియజేశారు. 

వైశాఖ పురాణం  9వ అధ్యాయం సంపూర్ణం. 

సర్వం శ్రీ విష్ణు చరణారవిందార్పణమస్తు !! 

 

#vaisakhapuranam

Vaisakha Puranam

Quote of the day

We should not fret for what is past, nor should we be anxious about the future; men of discernment deal only with the present moment.…

__________Chanakya