Online Puja Services

చక్కని సంతానంతో, సౌభాగ్యాలతో వర్ధిల్లాలి అంటే వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించాలి .

18.118.102.225

చక్కని సంతానంతో, సౌభాగ్యాలతో  వర్ధిల్లాలి అంటే వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించాలి . 
- లక్ష్మి రమణ 

శృతదేవ మహాముని..  ఆ బల్లి విష్షులోకాన్ని పొందడము అనేది నాకు ఇంకా ఆశ్చర్యంగానే ఉంది . దయచేసి అందుకుగల కారణాన్నిమరింత వివరంగా తెలియజేయండి అని  శ్రుతకీర్తి మహారాజు అభ్యర్ధించారు . అప్పుడు ఆ మునీంద్రుడు “ ఓ రాజా ! శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమన ధర్మాలను వినాలని నీ కోరిక యుక్తమైంది.  నీ బుద్ధికి గల సద్భావనా శక్తిని ఈ కోరిక తెలియజేస్తోంది.  ఎన్నో జన్మల పుణ్యము ఉన్నప్పుడే శ్రీమహావిష్ణువుకి సంబంధించిన కథా ప్రాసంగాన్ని వినాలని ఆసక్తి కలుగుతుంది.  నువ్వు యువకుడవు రాజాధిరాజు అయినప్పటికీ కూడా నీకు ఈ విధంగా విష్ణు కథాసక్తి, ధర్మ జిజ్ఞాస ఉండడం చేత నువ్వు పరిశుద్ధుడవైన ఉత్తమ భాగవతుడవని తలపోస్తున్నాను.  కాబట్టి జన్మ సంసార బంధాలను విడిపించి ముక్తిని కలిగించి శుభకరములైన భాగవత ధర్మాలని నీకు వివరిస్తాను విను”  అంటూ ఈ విధంగా వైశాఖ పురాణం లోని  ఏడవ అధ్యాయాన్ని చెప్పసాగారు.  

రాజా !యధోచితమైన శుద్ధి, మడి, స్నానము, సంధ్యావందనము, దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణాలు విడవడం, అగ్నిహోత్రము, పితృశ్రార్ధము మానకుండా ఉండడము, వైశాఖ వ్రతాచరణము ఇవి గొప్ప పుణ్యాన్ని ప్రసాదించేటటువంటి కార్యక్రమాలు.  వైశాఖ ధర్మాన్ని ఆచరించని వారికి ముక్తి లభించదు. సర్వధర్మములలోనూ వైశాఖ వ్రత ధర్మము ఉత్తమమైనది, సాటిలేనిది. రాజులేని రాజ్యములోని  ప్రజల లాంటి అనేక ధర్మాలు ఉన్నాయి.  అవి దుఃఖాన్ని ప్రసాదించేవే కానీ సుఖసాధ్యాలైతే కావు. 

 వైశాఖమాస వ్రత ధర్మాలు ఆచరించడం చాలా సులభము. సువ్యవస్థీతమైనటువంటి రాజు పరిపాలనలో ఉన్న ప్రజలకు లాగా సుఖాన్ని శాంతిని అవి ప్రసాదిస్తాయి.  అన్ని వర్ణాల వారికి అన్ని ఆశ్రమముల వారికి సులభంగా, ఆచరణ సాధ్యంగా ఉండి పుణ్యాన్ని ప్రసాదించే ఈ ధర్మాలను ఆచరించడం ఉత్తమమైనది.  నీటితో నిండిన పాత్రను దానం చేయడం, మార్గమధ్యంలో చెట్ల నీడలో చలివేంద్రాలను ఏర్పాటు చేయడం, చెప్పులను, పావుకోళ్లను దానం ఇవ్వడం, గొడుగును విసనికర్రని దానం ఇవ్వడం, నువ్వులతో కూడిన తేనెను దానం ఇవ్వడం, ఆవు పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న వీటిని దానం చేయటం ; ప్రయాణం చేసే వారికి సౌకర్యంగా మార్గములలో బావులు, దిగుడు బావులు, చెరువులు తవ్వించడం; కొబ్బరి, చెరుకు గడల రసము, కస్తూరి వీటిని దానం చేయడం, మంచి గంధాన్ని పూయడం, మంచము, పరుపు దానం ఇవ్వడం, మామిడి పండ్ల రసాన్ని, దోస పండ్ల రసాన్ని దానం చేయడం; దమనము, పుష్పాలు, సాయంకాలం వేళ పానకాన్ని, పూర్ణిమ రోజులలో పులిహోర మొదలైన చిత్రాన్నాన్ని దానముగా, ప్రతిరోజు దద్దోజనాన్ని దానం చేయడం, తాంబూలధానము, చైత్ర అమావాస్యనాడు వెదురు కొమ్మల దానము వీటిలో ముఖ్యమైనవి.  ఆయా కాలాలలో పూసే కాసే అనేక విధాలైన ఫల పుష్పాలను కూడా దానము చేయవచ్చు.  

ప్రతిరోజు సూర్యోదయానికి ముందుగా స్నానం చేయాలి. శ్రీమహావిష్ణువు పూజ తరువాత విష్ణు కథా శ్రవణం చేయాలి. అభ్యంగన స్నానము వైశాఖములో చెయ్యకూడదు. ఆకులలోనే భోజనం చేయాలి.  ఎండలో ప్రయాణంలో అలసిపోయిన వారికి విసినికర్రతో వీచటం, సుగంధ పుష్పాలతో ప్రతిరోజు విష్ణు పూజలు చేయడం, పళ్ళు పెరుగన్నము నివేదించడం, ధూప దీపాలతోటి సేవ చేయడం, గోవులకు ప్రతిరోజు గడ్డిని పెట్టడం సద్బ్రాహ్మణుల పాదములను కడిగి, ఆ నీటిని తన పైన జల్లుకోవడం ముఖ్య కర్తవ్యాలు. 

అలాగే, బెల్లము, సొంటి, ఉసిరిక, పప్పు, బియ్యం, కూరగాయలు వీటిని దానం చేయాలి.  ప్రయాణికులను ఆదరించి, కుశల ప్రశ్నలు అడిగి కావలసినటువంటి ఆతిథ్యాన్ని అందించాలి.  ఇవి వైశాఖ మాసంలో తప్పకుండా చేయవలసిన ధర్మాలు.  ఈ మాసంలో వికశించే పుష్పాలు, చిగురించే చెట్ల చిగుళ్లతో విష్ణు పూజలు చేసి, విష్ణువును తలుచుకుని పుష్పాలని దానం ఇవ్వడం, దధ్యాన్న నివేదనం మొదలైనవి సర్వపాపాలను హరిస్తాయి.  అఖండ పుణ్యాన్ని ఇస్తాయి. 

అలా కాదని పుష్పాలతో శ్రీమహావిష్ణువుని అర్జించకుండా విష్ణు కథా శ్రవణము చేయకుండా వ్యర్థంగా కాలం గడిపేటటువంటి స్త్రీ పతి  సౌఖ్యమును, పుత్ర లాభాన్ని పొందదు.  ఆమె కోరికలేవి తీరవు. శ్రీమహావిష్ణువు వివిధ రూపాలలో ప్రజలను పరీక్షించడానికి పవిత్ర వైశాఖ మాసంలో సంచరిస్తూ సపరివారంగా మహామునులతోటి సర్వదేవతలతోటి వచ్చి ప్రతి గృహములోను నివసిస్తారు.  అటువంటి పవిత్ర సమయంలో వైశాఖ పూజాదికములను చేయని మూఢుడు. అటువంటివాడు  శ్రీహరి కోపానికి గురవుతాడు. రౌరవాది నరకాలను పొంది, రాక్షస జన్మను ఐదు మార్లు పొందు తాడు.  ఇటువంటి కష్టములు వద్దనుకున్నవారు యధాశక్తిగా వైశాఖ వ్రతాన్ని ఆచరిస్తూ, ఆకలి గలవారికన్నా దప్పికగలవారికి జలాన్ని తప్పకుండా ఇవ్వాలి. జలము అన్నము సర్వ ప్రాణుల ప్రాణానికి ఆధారము కదా! అటువంటి దానముల చేత సర్వ ప్రాణులలో ఉన్న సర్వాంతర్యామి అయిన శ్రీమహావిష్ణువు సంతోషించి వరాలని ప్రసాదిస్తారు.  సర్వసుఖ భోగాలను, సంపదలను కలిగించి ముక్తిని ప్రసాదిస్తారు. జలదానము చేయని వారు పశువులా జన్మిస్తారు.  అన్నదానము చేయనివారు పిశాచముల జన్మించుతారు. 

అన్నదానం చేయక పిశాచత్వమును పొందిన వారి కథని నీకు వినిపిస్తాను. ఓ రాజా  ఇది చాలా ఆశ్చర్యకరమైన కథ అంటూ ఆ కథని ఈ విధంగా చెప్పసాగారు. 

వైశాఖ పురాణం  ఏడవ అధ్యాయము సంపూర్ణం. 

శ్రీ విష్ణు చరణారవిందార్పణమస్తు !!

 

#vaisakhapuranam

Vaisakha Puranam

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi