Online Puja Services

వైశాఖమాసములో ఆచరించవలసిన ధర్మాలు.

3.147.54.6

అనంత పుణ్యాన్ని అనుగ్రహించే వైశాఖమాసములో ఆచరించవలసిన ధర్మాలు. 
- లక్ష్మి రమణ 

 పరమపవిత్రమైన వైశాఖ మాసములో చేయదగిన దానాల గురించి తెలుసుకున్న రాజర్షి అంబరీషుడు, ధర్మాసక్తి కలవాడై నారద మహర్షిని సూర్యుడు మేష రాశిలో సంచరించే దివ్యమైన ఈ వైశాఖమాసములో పాటించవలసిన ధర్మాల గురించి ప్రశ్నించారు. ఆయన ధర్మాసక్తికి సంతోషించినవాడై నారద మాహర్షి  వైశాఖమాసపురాణములోని నాల్గవ అధ్యాయములో - ఈ మాసములో పాటించాల్సిన ధర్మాలని ఈ  విధంగా చెప్పసాగారు. 

నూనెతో తలనంటుకొని చేసే అభ్యంగస్నానము, పగటినిద్ర, కంచుపాత్రలో తినడం , ( వ్రతము ఆచరించేవారు పాత్రలో, కంచములో తినకూడదు. అరటీఅకు, విస్తరాకు, తామరాకు తదితర ఆకుల్లో తినడం శ్రేష్ఠము) అదే విధంగా మంచముపై పడుకోవడం, గృహస్నానము (నాదీ స్నానం చేయాలి) , నిషిద్దములైన ఆహారములు (తామసిక, రాజసిక ఆహారాలు), ఉల్లి మొదలైన వాటిని తినకుండా ఉండడం ఈ వ్రతాన్ని చేసేవారు పాటించాలి . రెండుసార్లు తినకూడదు. పగలు మాని రాత్రిళ్ళు తినకూడదు.  పగటిభోజనం చేసి రాత్రి భోజనమును మానేయాలి.

వైశాఖమాస వ్రతము చేసేవారు తామరాకులో భుజించినట్లయితే  పాప విముక్తుడై వైకుంఠమును చేరుకుంటారు. అదేవిధంగా  యెండలోనడచి అలసిన వారి పాదములను కడిగి ఆ జలమును భక్తి శ్రద్దలతో తలపై జల్లుకొనవలెను. ఇది ఉత్తమమైన వ్రతము. మార్గాయాసముతో అలిసిన  బ్రాహ్మణుని ఆదరించి, చక్కని ఆసనముపైన గూర్చుండబెట్టి, ఆతనిని   శ్రీ మహావిష్ణువుగ భావించి వారి పాదములను నీటితో కడిగి యా పవిత్రజలమును తలపై జల్లుకొన్నట్లయితే వాని పాపములన్ని పటాపంచలై పోతాయి. గంగ మొదలైన సర్వతీర్థములలో స్నానము చేసిన పుణ్యఫలము సిద్ధిస్తాయి.

ఈ మాసములో శక్తిని కలిగి ఉండి కూడా దానములు ఆచరించనివారు, విష్ణువుని పూజించనివారు, ధర్మాన్ని ఆచరించనివారు గాడిద , కంచర గాడిద, కుక్క వంటి నీచ జన్మలు పొందుతారు . హీనమైన పిశాచ జన్మల్లో సంచరిస్తారు.  

శ్రీమహావిష్ణువును ధ్యానిస్తూ, నదీ స్నానము ఆచరించిన వారు గత మూడు జన్మలలో చేసిన పాపములను గూడ పోగొట్టుకోగలరు. ప్రాతఃకాలము  సూర్యోదయ సమయములో సముద్రస్నానము చేసినట్టయితే ఏడేడు  జన్మలలో చేసిన పాపములును పోవును. జాహ్నవి, వృద్దగంగ, కాళింది, సరస్వతి, కావేరి, నర్మద, కృష్ణవేణి యని గంగానది యేడు విధములుగ ప్రవహించి సప్తగంగలుగా ప్రసిద్దిచెందింది. 

అటువంటి సప్తగంగలలో ప్రాతఃకాలస్నానములో వైశాఖమున చేసిన కేవలం స్నానం వలన కోటి జన్మలలో చేసిన పాపములను గూడ వదిలిపోతుంది. దేవా నిర్మితాలైన సరస్సులలో స్నానము వలన  సర్వపాపములు నశించి పుణ్యప్రాప్తి కలుగుతుంది. గోపాదమంత ప్రమాణము కల బహిర్జలములో (లోతు ఎక్కువ లేకున్నా ఆరుబయట తక్కువ జలముతో ఉన్న సెలయేళ్లు) గంగాది సర్వతీర్థములు వసిస్తాయి . ఈ విషయమును గమనించి భక్తి శ్రద్దలతో వాటిలో స్నానము ఆచరించాలి.

రసద్రవ్యములలో క్షీరముత్తమము. క్షీరము కంటె పెరుగు ఉత్తమము. పెరుగుకంటె నెయ్యి ఉత్తమము. నెలలలో కార్తికమాసముత్తమము. కార్తికముకంటె మాఘమాసముత్తమము. మాఘముకంటె వైశాఖముత్తమము. ఇలా వైశాఖములో చేసిన పుణ్యకరమైన వ్రతము, దానము మున్నగునవి వటవృక్షములాగా మరింతగా పెరుగుతుంది.

కాబట్టి ఇటువంటి పవిత్రమాసములో ధనవంతుడైన, దరిద్రుడైన, యధాశక్తి వ్రతము ఆచరించాలి. వైశాఖవ్రతమును చేయనట్లయితే ఎన్ని  వ్రతములు చేసినా అవియన్ని వ్యర్థములే.  స్త్రీ యెన్ని నగలు  ధరించినా  వస్త్రము లేకపోతె ఏవిధంగా అయితే శోభించదో అదే విధంగా ఎన్ని  వ్రతములని ఆచరించినా వైశాఖవ్రతమును ఆచరించనట్లయితే  అవి శోభించవు. కాబట్టి ప్రతి ప్రాణి నీ విషయమును గమనించి వైశాఖమాస వ్రతమును తప్పక ఆచరించాలి. 

సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు వైశాఖమాసములో వ్రతాన్ని ఆచరించి  శ్రీమహావిష్ణువు అనుగ్రహాన్ని పొందాలి . ఈ విధంగా చేయనివారికి   నరకము తప్పదు. వైశాఖ స్నానాదికముచే సర్వపాపక్షయమై, వైకుంఠప్రాప్తి కలుగుతుంది. తీర్థయాత్రలు, తపము, యజ్ఞములు, దానము, హోమము మున్నగు వానిని యితర మాసములలో చేసినట్టయితే వచ్చే ఫలములకంటె వైశాఖమున వ్రతము చేయడం వలన వచ్చే ఫలము ఆత్యధికము . 

మదమత్తుడైనా  మహారాజైనా, కాముకుడైనా , యింద్రియలోలుడైనా  వైశాఖమాస వ్రతము ఆచరించినట్టయితే సర్వదోషములో  నశించిపోయి  పుణ్యవంతుడై వైకుంఠమును చేరుకుంటారు. 

శ్రీ మహావిష్ణు అనుగ్రహసిద్ధిరస్తు !!

 

#vaisakhapuranam

Vaisakha Puranam

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi