Online Puja Services

మాఘ నవరాత్రుల్లో మాతంగీ మాతని ఎందుకు పూజించాలి ?

3.145.166.7

మాఘ నవరాత్రుల్లో  మాతంగీ మాతని ఎందుకు పూజించాలి ? 
- లక్ష్మీరమణ 
 
సూర్యమానానుసారం వచ్చే , ధనుర్మాస పుణ్యకాలం అంతా కూడా వైష్ణవారాధనతో గడిపి ఉంటాం . దీని తర్వాత చాంద్రమానం ప్రకారంగా మార్గశిరం, పుష్యమాసం పూర్తయి మాఘమాసంలోకి అడుగు పెడతాం . ఈ మాఘమాసం దేవీ ఆరాధనకు పాశస్త్యమైనదిగా చెప్పబడుతోంది. సాధారణంగా మనం చేసుకునే దసరా నవరాత్రులు కాకుండా సంవత్సర కాలంలో నాలుగు సార్లు నవరాత్రులు వస్తాయి . వీటిని ప్రత్యక్ష , గుప్త నవరాత్రులుగా చెప్తారు.  వాటిల్లో మాతంగీ నవరాత్రులుగా పిలువబడే, మాఘమాస నవరాత్రులు చాలా విశేషమైనవి .మాఘ శుద్ధ పాడ్యమి నుండీ ఈ నవరాత్రుల పుణ్య కాలం ఆరంభమై  మాఘ శుద్ధ నవమి వరకూ ఈ పర్వదినాలు కొనసాగుతాయి.  (22-01-23 నుండీ 30-01-23 వరకూ) నూతన సంవత్సరంలో వచ్చే ఈ దివ్య కాలం లో అమ్మని మాతంగీదేవిగా ఆరాధిస్తే, అనితర సాధ్యమైన సాహిత్యము, తెలివి, విజ్ఞానము సిద్ధిస్తాయి. 

సంవత్సరంలో నాలుగు నవరాత్రులు : 

నవరాత్రి వ్రతము ఏడాదిలో ఈ నాలుగు సార్లూ చేసుకోవడం జన్మజన్మ పుణ్యఫలమే. మనకి ముఖ్యమైన నవరాత్రులు నాలుగు.  అవి చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రి, ఆషాడ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో వచ్చే దేవీ నవరాత్రులు, మాఘమాసంలో మాతంగి నవరాత్రి లేదా శ్యామలాదేవి నవరాత్రులు.  

ప్రత్యక్ష, గుప్త నవరాత్రిల మధ్య తేడా ఏమిటి ?

నవరాత్రి దీక్ష అనేది మొదటి రెండుసార్లు అంటే చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో వచ్చే దసరా పండుగ లేదా  దేవీనవరాత్రులు జరుపుకుంటాము . వీటినే  ప్రత్యక్ష నవరాత్రి అని పిలుస్తారు.  మరో రెండు సార్లు నవరాత్రిని ఆషాడమాసంలో , మాఘమాసంలో జరుపుకుంటాము. వీటిని రహస్య నవరాత్రి లేదా గుప్త నవరాత్రి అంటారు . 

ఈ గుప్త నవరాత్రులు రెండింటిలో కూడా కొన్ని ప్రత్యేకతలున్నాయి .  ఆషాడంలో అయితే వారాహి నవరాత్రి అని, మాఘమాసంలో అయితే శ్యామలా నవరాత్రులని పిలుస్తారు.  వీటిని ఈ కాల ప్రాముఖ్యత తెలిసిన  కొంతమంది సాధకులు, గురువులు, మంత్ర పరిజ్ఞానము తెలిసిన వారు తప్పక ఆచరిస్తూ ఉంటారు . 

 వేడుకల మధ్య తేడా ఏమిటి? 

ప్రత్యక్ష నవరాత్రులనేవి కుటుంబము స్నేహితులతో కలిసి ఉత్సవంగా ప్రదర్శనగా జరుపుకుంటారు. కానీ  గుప్త నవరాత్రిని జరుపుకునే విధానం వేరు .  ఈ నవరాత్రుల్నీ  దేవి సాన్నిధ్యంలో, ఏకాంతంగా జరుపుకుంటారు.  కేవలం దేవతా ప్రీతికై తంత్ర, మంత్రాలు, పారాయణా కార్యక్రమాలు ,  హోమాదికాలను, వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.  భారతదేశమంతటా కూడా ఈ గుప్త నవరాత్రులను జరుపుకునే సంప్రదాయం పురాతన మహర్షులు మనకి అందించారు .  ఇవి చాలా అప్రాముఖ్యమైనవి, అదే సమయంలో గుప్తమైనవి కూడా ! అందువల్ల పెద్దగా  ఆడంబరాలు అట్టహాసాలు, పెద్ద హడావిడి లేకుండా జరుపుకోవడం ఆనవాయితీ . 

ఎందుకు జరుపుకోవాలి ?

ఈ  గుప్త నవరాత్రులు యెంత ఫలవంతమైనవంటే, చాలా త్వరితంగా మన కోర్కెల్ని తీర్చగలిగిన శక్తి గలిగినవి . సాధారణ పూజలు, వ్రతాల కన్నా అత్యంత త్వరితంగా ఫలితాన్ని అనుగ్రహించగలిగినవి . అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన కోరికలు  ధర్మబద్ధమైనవిగా ఉండాలి . అమ్మ ధర్మ నిష్ఠాపరురాలు . ధర్మముగా మీరు ఏం అడిగినా కన్నా తల్లిలా అనుగ్రహిస్తుంది . అధర్మమగా ప్రవర్తిస్తే, తల్లి దండించినట్టే , ఆగ్రహిస్తుందని గుర్తుంచుకోవాలి . 

పూజ ఎలా చేసుకోవాలి ?

అభీష్టాలని సిద్ధింపజేసుకోవడానికి ముందుగా సంకల్పం చెప్పుకొని ,  ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా వృద్ధి పొందడానికి పంచ పూజలు చేసి ఇంట్లో చేసిన నైవేద్యాన్ని సమర్పించి అమ్మ నామాన్ని జపం చేయవచ్చు. మంత్రోపదేశం ఉన్న వారు మంత్రజపాన్ని చేసుకుంటారు. ఇవన్నీ కాకుండా, చక్కగా లలితా సహస్రనామాన్ని చదువుకుని అమ్మని యధాశక్తి పూజచేసి, నివేదన సమర్పించినా కూడా ఫలితం అనుగ్రహిస్తుంది . 

ఎవరీ మాతంగి రాజశ్యామల: 

మాతంగి రాజశ్యామల దేవి శ్రీ లలితా పరాబట్టారికా స్వరూపము కొలువుతీరినప్పుడు, మహామంత్రిగా ఆ జగత్స్వరూపానికి కుడి పక్కన నిలిచి ఉంటుంది .  ఈ దేవదేవి  సకల విద్యలకూ నిలయం . నీలసరస్వతీ స్వరూపంలో అమ్మ చేతిలో వీణని ధరించి దర్శనమిస్తారు . ఆవిడని ఆరాధిస్తే, అబ్బని విద్య అనేది లేనేలేదు . శక్తి ఆరాధనలో చాలా విశేషమైన ప్రాధ్యమున్న ఈ పర్వదినాలలో అమ్మని సేవించడం ద్వారా అనితర సాధ్యమైన సాహిత్యము, తెలివి, విజ్ఞానము సిద్ధిస్తాయి. 

శుభం !

#rajasyamala #matangi

Tags: mathangi, matangi, rajasyamala, raja shyamala, raja syamala

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore