Online Puja Services

భోగభాగ్యాలనిచ్చే భోగి !

3.148.113.155

భోగభాగ్యాలనిచ్చే భోగి !
- లక్ష్మీరమణ 

ధనుర్మాసం భోగి పండుగతో ముగుస్తుంది . అప్పటికి పంటలు (పౌష్యములు) అన్ని చక్కగా ఇంటికి చేరుకుంటాయి .  రైతులందరూ సంతోషంగా ఉంటారు . వారికి పంటలు పండించడంలో సహకరించిన పశువులని కూడా ఈ కాలంలో పూజించి కృతఙ్ఞతలు తెలియజేస్తారు .  ఈ  ధనుర్మాస పర్యంతమూ  భూదేవి ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. విశేషించి ఇది ప్రక్రుతి ఆరాధనకు సంబంధించిన పండుగ సమయం . సంక్రాంతి పండుగ భోగి పండుగతోనే మొదలవుతుంది .  ఆ విశేషాలని ఇక్కడ తెలుసుకుందాం. 

ఈ మాసంలో భూదేవిని రంగవల్లికలతో అలంకరిస్తాం . ముగ్గులలో  పసుపు కుంకుమలు, పూలు, రేగిపండులు పెట్టి ఆ దేవతని ఆరాధిస్తాం. ఇందులో ముగ్గులపై ఉపయోగించే బియ్యపు పిండిని సూక్ష్మ జీవులకి ఆహారంగా అందించడం అనే గొప్ప కారుణ్యం కూడా దాగుంది . ధనుర్మాసంలోనే పంటలన్నీ మనకి చేతికొస్తాయి.  మనకి పౌష్యములు అనుగ్రహించినందుకు  అమ్మని పౌష్య లక్ష్మీగా కొలుచుకుంటాం . భూమి పంచభూతాలలో ఒకటి. పంచభూతాలలో ఏ ఒక్కటి లేకపోయినా పౌష్యములు ఉండవు. అవి లేనినాడీ పోషణ జరుగదు కాబట్టి భూమి మీద మనుగడే ఉండదు. మనం పూజించే పోష్య లక్ష్మే గోదామాత . 

ఆ భూమాతే గోదామాతగా ప్రభవించింది. ప్రకృతి స్వరూపంగా విరిసి పరమాత్మని చేరుకుంది. ఆవిడ శ్రీ రంగనాథునికి తాను ధరించిన తర్వాత, అవే పూలమాలలు సమర్పించేవారు . భూదేవిగా ఆమె పరమాత్మ కోసం పుష్పించి, ఆ విధంగా పరమ సౌందర్యం భక్తితో తదాత్మాతని పొంది, ఆ విధంగా భక్తిలో రమించడం ద్వారా తనని తాను అలంకరించుకొని, ఆ సౌందర్యప్రభలతో పరమాత్మను పొందారని కదా అర్థం. గోదామాతగా అమ్మ ఆచరించి మరీ, ఆ పరమ పురుషున్ని పొందడానికి కావలసింది భక్తి మాత్రమే అని మరో సారి చాటి చెప్పారు . 

మరో విధంగా చూసినా పోషించేవాడు విష్ణువు . ఆ పోషణకి అవసరమైన సరుకు సమకూర్చేది పౌష్యలక్ష్మి. అందువల్ల వారిద్దరికీ ఉన్నది ప్రకృతీ పరమాత్మల సంబంధం . 

ఇక్కడ అమ్మవారు తాను రచించిన పాశురాల్లోనూ అదే సందేశాన్నిస్తారు . చలి కాలం బాధిస్తోందని, బద్ధకించ వద్దు . ఇది పరమాత్మని చేరుకొనే సమయం . రండి మనందరమూ ఆ పరమాత్మ సన్నిధికి పోదామంటుంది . ఇక్కడ వణికించే చలికాలం , మనకున్న మోహబంధాలే తప్ప మరొకటి కాదు . పరమ ప్రకాశం ప్రభవించే చోట చీకటి, జ్ఞానజ్యోతి వెలిగేచోట అజ్ఞాన తిమిరాలు ఎలా ఉంటాయి ? అదే విధంగా ధనుర్మాసములో మనస్సనే ధనుస్సుకి భక్తి అనే బాణాన్ని సంధించి , భగవంతుని పొందడమే లక్ష్యంగా సాధన చేస్తే, తప్పకుండా దుర్లభమయిన ఆ పరమాత్మ సాన్నిధ్యాన్ని పొందగల్గుతాము .   

అమ్మ గోదాదేవిగా మార్గాళీ వ్రతాన్ని ఆచరించి, రోజుకొక పాశురంతో పరమాత్మని అర్చించారు . ఆ వ్రత సమాప్తి జరిగి ఆమె స్వామిని చేపట్టి భోగములందిన రోజు భోగి . గోదాపాశురాలతో నిత్యమూ ఈ ధనుర్మాసంలో పూజించినవారికి, కాత్యాయనీ వ్రతాన్ని ఆచరించినవారికీ చక్కని, సద్గుణ సంపన్నుడైన వరుడు భర్తగా లభిస్తాడు .

భోగి  రోజున తలంటి  స్నానం చేసి భగవదార్చనలు చేయడం శ్రేయప్రదం.  చలిమంటలు వేయడం ఈరోజున పాటించవలసిన ఆచారం.  

పాఠకులకి భోగి పండుగ శుభాకాంక్షలతో , శుభం 

#bhogi #sankranthi #kanuma

Tags: bhogi, sankranthi, kanuma, festivals

Quote of the day

God can be realized through all paths. All religions are true. The important thing is to reach the roof. You can reach it by stone stairs or by wooden stairs or by bamboo steps or by a rope. You can also climb up by a bamboo pole.…

__________Ramakrishna