Online Puja Services

అష్టాదశ శక్తిపీఠం-2 శ్రీ కామాక్షి దేవి

18.217.144.32

కామాంక్షీ కాంచికాపురే

శ్రీ కామాక్షి దేవి ధ్యానం – కంచి (తమిళనాడు)
 

కాంచీపురశ్రితే దేవి కామాక్షి సర్వమంగళా
చింతాతన్మాత్ర సంతుష్టా చింతితార్థఫలప్రదా

కాంచీపురం మోక్షదాయకమైన పట్టణాలలో ఒకటిగా ప్రసిద్ధి. కామాక్షీదేవి పీఠం అష్టాదశ శక్తి పీఠాలలో శ్రీ కామాక్షి అమ్మవారు రెండవ పీఠంగా పరిగణింపబడుతుంది. సతీదేవి కంకాళము పడినచోటుగా ప్రసిద్ధి. ”కామాక్షీ కామదాయినీ” అని లలితా సహస్రనామాలు పేర్కొన్నాయి. తన కరుణామయైన కంటి చూపుతోనే భక్తుల కోర్కెలను తీర్చగలిగే మహాశక్తి. అమ్మను ఆరాధించి మూగవాడైన భక్తుడు వాక్కును సంపాదించుకొని అయిదు వందల శ్లోకాలతో అమ్మను కీర్తించాడు.

పురాణ కాలంలో పార్వతీదేవి, పరమశివుని కనులు తన హస్తములతో మూయగా ప్రపంచమంతా చీకటితో నిండిపోయింది. పాప పరిహారానికై మట్టితో శివలింగము తయారుచేసి పూజించెను. అంతట శివుడు పార్వతిని అనుగ్రహించాడు. నాటినుంచి కాంచీపురమున ఫాల్గుణమాసంలో పార్వతీదేవి కళ్యాణం అత్యంత వైభముగా జరుపుచున్నారు. కాంచీ క్షేత్రమును సత్యవ్రతక్షేత్రమని, భాస్కరక్షేత్రమని, తేజసక్షేత్రమని, శివశక్తి క్షేత్రమని, శక్తి క్షేత్రమని పేర్కొనబడింది. క్షేత్రంలో వెలసిన శైవ, వైష్ణవ, జైన, బౌద్ధ దేవాలయములు భారతీయ కళాసంస్కృతికి ప్రతీకలుగా నిలిచాయి.

శ్రీ కామాక్షి దేవాలయము నందు అమ్మవారి గర్భాలయము వెనుక భాగమున శ్రీ ఆదిశంకరుల ప్రతిమ ప్రతిష్ఠించబడింది. జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు కాంచీపురము నందు శంకరమఠమును క్రీ.పూ. 482 సంవత్సరములో స్థాపించారు. శ్రీ ఆదిశంకరాచార్యులు తొలి పీఠాధిపతి. భారతీయ ధార్మిక జీవనంలో అవ్యవస్థ నెలకొన్నప్పుడు అజ్ఞానం ముసురుకొన్నప్పుడు, ఆచార కొండల పేరిట ఆర్భాటాలు తోడయినప్పుడు శ్రీ ఆదిశంకర భగవత్పాదులు ఉదయించారు. కేరళ రాష్ట్రంలోని, త్రిచూర్‌ సమీపమున, పవిత్ర పూర్ణానది తీరంలో గల కాలడి గ్రామం నందు జన్మించారు శ్రీ శివగురు, ఆర్యాంబ దంపతులకు లేకలేక కలిగిన సంతానం జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యులు.


శ్రీ శంకరుడు సకల విద్యలనూ నభ్యసించి, దేశం నలుదిక్కులా మూడుమాట్లు పర్యటించి, అద్వైత ప్రభలను ఉజ్జ్వలంగా నిలిపారు. భారత ఖండంలో నాలుగువైపుల నాలుగు పీఠాలు స్థాపించారు. ఉత్తరాన గల హిమాలయ పర్వతాల్లో జోషీమఠమును, అలకనంద తీర్థమున గల బదరికాశ్రమం నందు స్థాపించారు. ఇచ్చట శ్రీ నారాయణుడు మరియు శ్రీ పున్నాకరీ అమ్మవారి దర్శనం లభ్యమవుతుంది. దక్షిణాన కర్ణాటక రాష్ట్రంలోని తుంగానది తీరం నందు శ్రీ శృంగేరీ మఠమును స్థాపించారు. ఇచ్చట శ్రీ ఆది వరాహమూర్తి మరియు శ్రీ కామాక్షి అమ్మవారు కొలువైనారు.

తూర్పున ఒరిస్సా రాష్ట్రంలోని, పూరి క్షేత్రము నందు మహారధి తీర్థమున గోవర్ధన మఠమును స్థాపించారు. క్షేత్రం నందు శ్రీ జగన్నాథుడు మరియు శ్రీ విమలాదేవిని దర్శించగలము. పడమరన గుజరాత్‌ రాష్ట్రమున ద్వారకా క్షేత్రం నందలి గోమతి నదీ తీరంలోగల శ్రీ ద్వారకాధీశుని ఆలయమునకు ఎడమవైపున శ్రీ శారదాపీఠం స్థాపించారు. ఇచ్చట శ్రీ సిద్ధేశ్వరుడు మరియు శ్రీ భద్రకాళి అమ్మవారు వెలిశారు. ఇవిగాక సన్యాసీ సంప్రదాయంతో సుమారు 1200 మఠాలున్నట్లుగా తెలుస్తోంది. శ్రీ ఆదిశంకరాచార్యులు దేశంలోని అష్టాదశ శక్తిపీఠాలను దర్శించి, శ్రీ చ్రకములను స్థాపించారు.

సర్వేజనా సుఖినోభవంతు


- రామ కృష్ణంరాజు గాదిరాజు 

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore