Online Puja Services

శ్రీమహాలక్ష్మి ఏ ఐదింటా వుంటుందంటే

3.133.111.85
శ్రీమహాలక్ష్మి ఏ ఐదింటా వుంటుందంటే
 
క్షీరసాగర మథనం జరుగుతుండగా..అకస్మాత్తు గా లక్ష్మీ దేవి ఆవిర్భవించింది. ఆవిర్భవిస్తున్న స్థితి ని ఎంతో అద్భుతం గా వర్ణిస్తారు పోతన గారు. ఆ తల్లి ఈ లోకములన్నీ కూడా అనుగ్రహించడం కొసం పైకి వస్తుంటే .. శిరస్సు నించి పాదాల వరకు ఆ రూప వైభవాన్ని కళ్లకు కట్టినట్టు వర్ణిస్తారు.  .
 
తొలకరి ప్రారంభమయ్యే సమయములో ఆకాశంలో వచ్చేటువంటి మెరుపు ని సౌదామిని అంటాం. అది కంటిని ఆకర్షిస్తుంది.  థళుక్కు థళుక్కు మనే మెరుపు కి అందరూ ఆ దిశ గా చూస్తారు. లక్ష్మీ దేవీ మెరుపు కూడా అలాటిదే.  లక్ష్మీ దేవి వైభవాన్ని ఎక్కడ ఎవరు వర్ణించినా, స్తుతించినా, శ్లాఘించినా - మెరుపు తీగ తో పోల్చి చెబుతారు. ఎందుకంటే, అందరి కంటినీ అమితం గా ఆకర్షించే శక్తి మెరుపుకి వుంటుంది. విద్యుల్లతలా ఆమె కరుణా కటాక్షాలు కూడా లోకం పట్ల కాంతులు వెదజల్లుతూ వుంటుంది.
ఆమె ఒక్క సారి కన్ను తెరిచి, క్రీగంట చూస్తే చాలు. లోకములన్నీ బ్రతుకుతాయి.  చైతన్యాన్ని విప్పుకుంటాయి.

ఆమె శరీరం అంతా కూడా మిల మిలా , ధగ ధగా మెరిసిపోతూ వుంటుంది. ఆమె ఒక కాంతి పుజం. ఆ కరుణా వీక్షణాలు ప్రసరించిన  ఉత్తరక్షణానే, ఇక అలా ఇలా కాని,  ఆ ఐశ్వర్య వైభవం మాటలకందని రీతిలో వుంటుంది. ఆ ఉత్సాహం కానీ, ఉల్లాసం కానీ, ఐశ్వర్యం కానీ, పూనిక కానీ, సంపద కానీ, అన్నీ కూడా అంత పుష్కలత్వాన్ని పొందుతాయి.

ఇక్కడొక ముఖ్యమైన విషయాన్ని అందరూ గ్రహించాల్సి వుంటుంది. ఐశ్వర్యమూ అంటే - కేవలం ధన సంబంధిత సంపద మాత్రమే అని   అనుకోకూడదు. అది కాదు.  

లక్ష్మి అంటే ఎవరు అని అభిప్రాయపడుతున్నారు? : మనల్ని విశేషముగా సత్కరించాలి అనుకుంటే ఆ తల్లి ఆడపిల్ల గా ఇంటికొస్తుంది. ఆడపిల్లా అంటే శ్రీ మహాలక్ష్మి అని అర్ధం. ఆడపిల్ల పెళ్లయి, అత్తవారింటికి వెళ్ళి తన సత్ప్రవర్తనతో, సత్శీలతతో ఇరు వంశీకులని తరింపచేస్తుంది. మగపిల్లాడికి ఆ అవకాశం లేదు. అసలు ఆడపిల్ల వచ్చిందీ అంటే నే లక్ష్మీ దేవి వచ్చిందని. ఆడపిల్ల  - అటు వెనక పదితరాలు, ఇటు ముందు పది తరాలను, తండ్రితో కలిపి 21 తరాల వారిని తరియింపచేస్తుంది. 
ఆడపిల్ల ఇంటికొచ్చిందంటే, లక్ష్మి దేవి వచ్చినట్టే.

మగపిల్లాడికి పెళ్లయ్యాక ఆ ఐశ్వర్యం ఎవరిదీ అంటే అతనిది కాదు. ఆ ఇంటి ఇల్లాలిది. ఒకప్పుడు దేవేంద్రుడు లక్ష్మీ దేవిని స్తుతించినప్పుడు స్వయంగా తానే చెబుతుంది. తాను ఎక్కడెక్కడు నివాసమై వుండేది!  . 

కైలాసం లో పార్వతీ దేవిగా 
వైకుంఠం లో లక్ష్మీ దేవి గా
బ్రహ్మ లోకం లో సరస్వతిగా
మహా రాజు దగ్గర రాజ్య లక్ష్మి గా 
ప్రతి ఇంటి ఇల్లాలి లో - గృహలక్ష్మి గా వుంటానని చెబుతుంది.
 
'గృహము' అని ఎప్పుడంటారంటే ఆ ఇంట్లో ఇల్లాలు వున్నప్పుడు మాత్రమే! ఇంటి యజమాని ఎంత అలసిపోనీండి ఇల్లాలి నవ్వుతో, మాటలతో, సేవలతో సేద తీరుతాడు.ఎంత ఐశ్వర్యం వుండనీండీ, ఎన్ని కోట్లు వుండనీండీ. ఆమె వెళ్ళిపోయాక ఆ ఇల్లు ఆయనకు మనశ్శాంతి  ఇవ్వలేదు. గృహము అంటే మేడ కాదు. భార్యయే గృహము. అందుకే గృహలక్ష్మీ గృహే గృహే అని అంటారు. లక్ష్మీ దేవి ని దర్శించడం  ఎంత సులువైనదీ  అంటే, నీ భార్య లో, సాటి వారి ఇల్లాలిలో, సోదరి లో చూడవచ్చు.  
ఈ భావన చాలు. లక్ష్మీ కటాక్షం పొందేందుకు ఈ ఒక్క భావన హేతువు గా నిలుస్తుంది. 

దేశానికి అరిష్టం ఎక్కడ పట్టుకుందీ అంటే కనపడిన ప్రతి ఇల్లాలి వంకా చూడకూడని చూపు చూడటం వల్ల, అది దోష భూయిష్టమౌతోంది. అలా కాకుండా,  ప్రతి ఇల్లాలిని గనక లక్ష్మీ స్వరూపం గా అటువంటి పవిత్రమైన దృక్కులు కలిగి వుంటే, దేశమంతా కూడా లక్ష్మీ కటాక్షం తో విలసిల్లుతుంది. వర్ధిల్లుతుంది.
అందుకే లక్ష్మీ ఎక్కడెక్కడ నెలవై వుంటుందీ అంటే 5 స్థానాలు అని చెప్పింది శాస్త్రం 

అవేమిటంటే : 

1. గోవు యొక్క వెనకతట్టు. 
 
(రోజుకొక్క సారైనా గోవు వెనక తట్టు చూసిన వారు, ప్రదిక్షణ చేసిన వారూ లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందుతారు. ఇంటిముందుకు వచ్చి నిలబడిన గో మాతకు చేతులారా పండూ, ఫలమూ, పరక ని తినిపించిన వాడు సాక్షాత్తు లక్ష్మీ దేవికి పాయసం తినిపించినంత ఫలాన్ని పొందుతాడు.)
 
2. పద్మం. -  పద్మము లక్ష్మీ స్థానం.
 
3. ఏనుగు యొక్క కుంభస్థలం.
 
4. సువాసినీ యొక్క పాపిట ప్రారంభ స్థానం.  
 
5. మారేడు దళం.  
 
ఈ ఐదూ లక్ష్మీ నెలవుండే స్థానాలు. 
 
లక్ష్మీ లోకాన్నంతటినీ చూస్తుంది. లోకమంతా ఆమెని చూస్తుంది. ఆమె ఒక మెరుపు. ఆ తల్లి  ఎక్కడ వుంటే అక్కడ సంతోషం వుంటుంది. లక్ష్మీ కటాక్షం అంటే అర్ధం - సంతోషం గా వుంటమే. అన్నీ వున్నవాని విషాదం కన్నా, ఏమీ లేకపోయినా సంతోషంగా వున్న వాడి దే అసలైన లక్ష్మీకటాక్షం. 
 
- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు.

Quote of the day

What matters is to live in the present, live now, for every moment is now. It is your thoughts and acts of the moment that create your future. The outline of your future path already exists, for you created its pattern by your past.…

__________Sai Baba