Online Puja Services

అష్టాదశ శక్తిపీఠం-18 కాశ్మీరేతు సరస్వతి

18.119.131.178

 

అష్టాదశ శక్తిపీఠం-18

కాశ్మీరేతు సరస్వతి

శ్రీ సరస్వతీ దేవి ధ్యానం

జ్ఞాన ప్రదా సతీమాత కాశ్మీరేతు సరస్వతీ
మహావిద్యా మహామాయా భుక్తిముక్తి ప్రదాయినీ

భారతమాత శిరోభాగాన వెలిగే పచ్చల కిరీటమే కాశ్మీరు భూప్రాంతము. ప్రకృతి అందాలన్నీ మూటగట్టి రాసిపోసిన సుందర దివ్య ఆరామం కాశ్మీర్‌. సుందర దృశ్యముగా కనిపించు మంచు పొగలతో నిండిన హిమాలయ పర్వతాలు, గలగల సాగే సెలయేళ్లు. నయనానందకరమైన సరస్సులు, మధురఫల వృక్షసంపద, పరిమళాలు విరజిల్లు పుష్పజాతులతో ప్రకృతిపరచిన సౌందర్యాల రాశిగా కాశ్మీరులోయ ఖ్యాతి గాంచినది. ప్రఖ్యాత వేసవి పర్వత విశ్రాంతి కేంద్రంగా గణతికెక్కింది.

అనాదికాలంలో కాశ్మీర్‌ పెద్ద జలార్ణవంగా ఉండేది. ఇది జలోద్భవానికి దానవుడు యొక్క నివాసం. జలాశయంలో ఉన్నంతవరకు చావులేకుండా వరం పొందినాడు. అందిన జీవరాశులను భక్షిస్తూండేవాడు. కశ్యప మహాముని దేవతల సాయంతో నాగలి సహాయంతో సరోవర ప్రాంతాన్ని దున్ని, నీటిని ఇంకింపచేశాడు. దానవుని మరణంతో జనవాసం ఏర్పడింది. ఈవిధముగా కాశ్మీర్‌ భూభాగము అవతరించినట్లు పురాణగాథ.

పురాణేతిహాసాల్లో కాశ్మీర్‌ ప్రశస్తి ఉంది. హిందు రాజులనేకమంది కాశ్మీర్‌ భూప్రాంతమును పరిపాలించారు. 3వ శతాబ్దంలో అశోకుని సామ్రాజ్యంలో ఒక భూభాగము ఉండేది. అక్బరు మహాచక్రవర్తి కాశ్మీర్‌ భూభాగాన్ని జయించి మొగలు సామ్రాజ్యంలో కలుపుకున్నాడు. ఆఫ్గనిస్తాన్‌ రాజు అహమ్మద్‌షా అబ్దాలి దండయాత్ర చేసి రాజ్యపాలనకు వచ్చాడు. 1819 సంవత్సరములో పంజాబు మహారాజు రాజారంజిత్‌సింగ్‌ ఆధిపత్యంలోనికి వచ్చింది. రంజిత్‌సింగ్‌ మరణం తరువాత సిక్కులతో యుద్ధంచేసి బ్రిటీష్‌వారు వశపరచుకొన్నారు. కాశ్మీర్‌ భూభాగము కొరకు పాకిస్తాన్‌ సైన్యము భారత సైనికులతో యుద్ధంచేసి, కొంత భూభాగమును వారి ఆధిపత్యంలోనికి తెచ్చుకొన్నారు. ఇప్పటికి సరిహద్దు సమస్య ఇరుదేశాలకు వుంది.

కాశ్మీర్‌ రాజ్యపాలన చేసిన మహమ్మదీయులు నిరంకుశులై మత చాంధసత్వంతో హిందూ దేవాలయమును నేలమట్టము చేశారు. సికిందర్‌ (1389-1413) పానలో హిందూ దేవాలయములను కూలగొట్టడం ప్రభుత్వ నిత్యకృత్యాలలో ఒకటైంది. దీనికి ప్రత్యేకంగా ప్రభుత్వ విభాగం ఒకటి ఏర్పరచినారు. పరాస్పోర్‌, అవంతిపూర్‌, తాపార్‌ తదితర ప్రాంతాలలోని ప్రసిద్ధ దేవాలయములను కూల్చినట్లుగా పర్షియన్‌ చారిత్రక పత్రాల్లో స్పష్టంగా పేర్కొనబడింది. ఇస్లాంను స్వీకరించని హిందువులపై జిజియా పన్ను వేశాడు. ఇస్లాం మతం పుచ్చుకోని కాశ్మీర్‌ బ్రాహ్మణుల మెడలోని యజ్ఞోపవీతాన్ని సికిందర్‌ బలవంతముగా త్రెంచి, వాటిని తూకం వేస్తే అవి ఏడు మణుగులు బరువు తూగాయంట! అలీషా పాలనలో (1413) కాశ్మీర్‌లో మిగిలిన పండిత కుటుంబాలు కేవలం పదకొండు మాత్రమే. 1489లో ఫతేషా 24 వేలమంది కాశ్మీర్‌ హిందువుల మెడమీద కత్తిపెట్టి ఇస్లాంలోనికి బలవంతముగా మార్పించారు.

తాను కూల్చిన కాళికాలయంలోనికి ప్రవేశించిన నేరానికి, కాశ్మీర్‌ పండితులందరికి ముక్కు, చెవులు కోసేయమని ఆజ్ఞ జారీచేశాడు. మొగలాయి షాదుషాల ఏలుబడిలో మతసహనం పాటించగా కొంత ప్రశాంతత ఏర్పడినది. తిరిగి ఔరంగజేబు కాలములో దేశవ్యాప్తముగా దేవాలయములను కూల్చివేయడానికి సంకల్పము చేశారు. ఇస్లాం మతచాంధసులు కాశ్మీర్‌లో అనేక హిందూ దేవాలయములను నేలమట్టం చేశారు. నేలమట్టమైన ఆలయాలలో శ్రీ సరస్వతీ ఆలయం కూడా ఉండవచ్చును. నేడు కాశ్మీర్‌ శోధిస్తే ఎక్కడా శ్రీ సరస్వతీ పీఠం కనిపించుటలేదు. శ్రీనగర్‌నందలి శ్రీ శంకరాచార్యుల పర్వతము మీద శ్రీ సరస్వతీ ఆలయం ఉండేది అని పరిశోధకులు భావించుచున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో పద్దెనిమిదవదిగా పరిగణించబడుతోంది. అష్టాదశ శక్తిపీఠాల్లో చివరిది.

సతీదేవి కుడి చెంపభాగం కాశ్మీర్‌ ప్రాంతములో పడినట్లుగా పురాణాలు చాటుతున్నాయి. సరస్వతీపీఠం అనుపేరుతో ఎక్కడా దర్శించలేక పోవుచున్నాము. కాశ్మీర్‌ ప్రాంతములో అనేక శక్తిపీఠాలు కలవు. వాటిని ప్రతివారు సరస్వతీపీఠంగా చాటుతారు. వీటిలో ముఖ్యమైన స్థానం శారికాదేవి మందిరము. ఇది హరిపర్వతంపై వుంది. అమ్మ అద్భుతమైన మౌనశిల రూపములో దర్శనమిస్తుంది. ఇదే సరస్వతి పీఠంగా స్థానికులు కొలుస్తారు. మహాయోగులు, మహాత్ములు, పుణ్యపురుషులు హరిపర్వతం చేరి, అమ్మ సన్నిధిలో మౌనవ్రతం పాటించి, సిద్ధులు పొందుచున్నారు. ప్రతి శనివారం అద్భుత మౌనశిల నుంచి మౌనచక్రం బయటకు వచ్చి, సిద్ధులకు దర్శనమిస్తుంది. ఇది సృష్టిలో అద్భుతమైన చర్యగా భావించవచ్చును. మరో విషయము మౌనశిలలో ఒక మూలన గల గుంటలో నీరు ఉద్భవించుతుంది.

దాని నుంచి ఎంతనీరు మనము తీసుకుంటే, అంత నీరు మళ్ళీ ఉద్భవించ గలదు. భక్తులు ఈ నీరును పవిత్రమైన గంగా జలంగా భావించి సేవించుతారు. యాత్రికులు మౌనంగా, దీక్షగా అమ్మను ప్రార్ధన చేస్తే వారి కోరికలు తప్పక తీరగలవు అని గట్టి నమ్మకం. ఆషాడమాసంలోని శుక్లనవమితో కూడిన శనివారం నాటి మౌనచక్రం యొక్క దర్శనం చాలా పుణ్యదాయకం. భక్తుల కోరికలు తీర్చగల మహిమతో నిండి ఉంటుంది. శ్రీనగర్‌ జనరల్‌ బస్‌స్టాండుకు ఈశాన్యంగా హరి పర్వత్‌ పోర్టు ఉంది. బస్‌స్టాండ్‌కు సుమారు 10 కి.మీ. దూరంలో గల హరిపర్వతం (హరిపర్బత్‌ కోట) చేరుటకు బస్‌ సర్వీసులున్నాయి. కొండ క్రింద నుంచి మెట్లు మార్గం.

సర్వేజనా సుఖినోభవంతు 

- రామ కృష్ణంరాజు గాదిరాజు 

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore