Online Puja Services

అష్టాదశ శక్తిపీఠం-14 ప్రయాగే మాధవేశ్వరీ

18.216.190.167

అష్టాదశ శక్తిపీఠం-14

ప్రయాగే మాధవేశ్వరీ

శ్రీ మాధవేశ్వరీ దేవి ధ్యానం 

మాధవేశ్వరీ మాంగళ్యా ప్రయాగ స్థల వాసినీ
త్రివేణీ సంగమే తీరే భుక్తి ముక్తి ప్రదాయినీ

భారతదేశంనందలి పుణ్యక్షేత్రాలు, నదీతర ప్రాంతములో ఆవిర్భవించి భక్తుల పాపాలన్నీ కడిగివేసి నిష్కళంకులుగా తరింపచేస్తున్నాయి. సుజలపూర్ణమయిన సప్తనదులు అనగా గంగా, యమున, సరస్వతీ, గోదావరి, కావేరి, నర్మదా, సింధునదులు భారతపుణ్యభూమి మీదగా ప్రవహిస్తూ ఎన్నో పవిత్ర స్థలాలను అనుసంధిస్తున్నాయి. వీటితోపాటు బ్రహ్మపుత్ర, సరయూ, పల్గునీ, గోమతి, భీమ, తుంగభద్ర, పెన్న, మహానది, ఇంద్రావతి, తపతి, సబర్మతీ మొదలగు పెక్కు నదుల ప్రవాహంతో భూమాత సస్యశ్యామలంగా పునీతమవుతుంది.

పవిత్ర నదులకు ప్రతి 12 సంవత్సరములకు ఒకసారి పుష్కరోత్సవాలు జరుగుతాయి.

అదేవిధముగా పుణ్యదాయకమైన నాసిక్‌, ఉజ్జయిని, హరిద్వార్‌ మరియు అలహాబాద్‌ క్షేత్రలములనందు కుంభమేళా ఉత్సవాలు జరుగుతాయి. ఇవి ప్రతి 12 సంవత్సరములకు ఒకసారి ఒక్కొక్క ప్రదేశములో వైభవంగా జరుగుతాయి. బృహస్పతి (గురుగ్రహము) వృషభరాశిలో నుండగా, సూర్యుడు మకర సంక్రమణమైనపుడు కుంభమేళా ఉత్సవాలు జరుగుతాయి. ఇట్టి కుంభ పర్వకాలమునందు లక్షలాది యాత్రికులు అలహాబాద్‌ వద్ద గల త్రివేణి సంగమం నందు పవిత్రస్నానములు చేసి, పూజాది కార్యక్రమాలు మరియు పిండ ప్రదానాలు నిర్వహించుతారు.

ఉత్తరప్రదేశ్‌ నందలి అలహాబాద్‌ జిల్లా ముఖ్యపట్టణమైన అలహాబాద్‌ను ప్రయాగ, త్రివేణి అని కూడా అంటారు. ప్రయాగ తీర్థరాజమని పురాణములలో చెప్పబడినది. గంగ, యమున, సరస్వతీ నదుల సంగమంతో ఈ ప్రాంతము త్రివేణిగా ప్రసిద్ధి చెందినది. ప్రయాగక్షేత్రం నందు త్రివేణి సంగమంతో పాటు అష్టాదశ శక్తి పీఠాలలో పదునాల్గవది అయిన శ్రీ మాధవేశ్వరి పీఠం. సతీదేవి హస్తాంగుళీయకం పడిన ప్రదేశముగా ప్రసిద్ధి. శ్రీ మాధవేశ్వరి శక్తిపీఠం త్రివేణి సంగమం వద్ద వుండేది అని పురాణాలు చాటుతున్నాయి. ప్రయాగ క్షేత్రమున శ్రీమాధవేశ్వరి అనే నామంతో శక్తిపీఠం లేదు. క్షేత్రంలోని అలోపిదేవిని శ్రీమాధవేశ్వరి దేవిగా భక్తులు కొలుస్తారు. శ్రీఅలోపిదేవి విగ్రహరహితమై మరియు గుప్తగాను మందిరంలో ఉంటుంది.

అలహాబాద్‌ రైల్వేస్టేషన్‌కు సుమారు 3 కి.మీ. దూరంలోగల ‘దారాగంజి’ అనే ప్రాంతము నందు గల అలోపిబాగ్‌లో అమ్మదర్శనము చేయవచ్చును. ఇది అలోపిశంకరి శక్తిపీఠంగాను, మహేశ్వరి పీఠంగాను ప్రసిద్ధి చెందినది. విశాలమైన ప్రాంగణంలో అమ్మవారి మందిరం వుంది. పీఠమునకు మధ్య ఒక రంద్రము దర్శనమిస్తుంది. దీనిపై అమ్మవారి ఊయల వ్రేలాడుతూ వుంటుంది. భక్తులు తెచ్చిన కొబ్బరికాయను పండాలు రంధ్రము నందు అమ్మవారికి సమర్పించుతారు. భక్తులు అమ్మవారి ఊయలను భక్తి శ్రద్ధలతో ఊపుతారు. మందిరం వెనుక భాగమున నవదుర్గలు, గణపతి, శివలింగాలు మొదలగు మూర్తులున్నారు. త్రివేణి సంగమం నుంచి కూడా అలోపిబాగ్‌ చేరవచ్చును.

అలోపిబాగ్‌ నుంచి సుమారు 4 కి.మీ. దూరంలో శ్రీ కళ్యాణి దేవి అర్థశక్తిపీఠం కలదు. మందిరంలోని కళ్యాణిదేవికి కుడివైపున పార్వతీదేవి మరియు ఎడమవైపున మహాకాళి దేవిని దర్శించగలం. ఇది అర్ధశక్తి పీఠంగా ఖ్యాతి పొందినది. ఆలయ ప్రాంగణములో శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ రాధాకృష్ణులు, శ్రీరామలక్ష్మణుల సమేత జానకీమూర్తులను సందర్శించవచ్చును.

కళ్యాణిదేవి మందిరమునకు సుమారు 6 కి.మీ.ల దూరమున మీర్‌పూర్‌ గ్రామము నందు శ్రీలలితాదేవి సిద్ధిపీఠం కలదు. ఆలయ ప్రవేశ ముఖద్వారం పశ్చిమముఖంగాను, శ్రీలలితాదేవి తూర్పుముఖంగాను ఉంటుంది. శ్రీ లలితాఅమ్మవారికి ఇరువైపుల శ్రీమహాలక్ష్మి మరియు శ్రీమహాసరస్వతి మూర్తులున్నారు. ఆలయ పూజారి శ్రీలలితాదేవిని ప్రయాగమాధవేశ్వరిగా వర్ణించుచున్నారు.

సర్వేజనా సుఖినోభవంతు  

- రామ కృష్ణంరాజు గాదిరాజు 

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore