Online Puja Services

పిల్లల్లో తెలివితేటలు పెరగాలంటే ఈ 28 నామాలే తారకమంత్రాలు

18.222.179.186

పిల్లల్లో తెలివితేటలు పెరగాలంటే ఈ 28 నామాలే తారకమంత్రాలు !
- లక్ష్మీరమణ 

ప్రతిఇంట్లో అమ్మకి ఉండే కంప్లైంట్ మా పిల్లలు సరిగ్గా చదువుమీద ద్రుష్టి పెట్టట్లేదు అని . చదువంటే కేవలం క్లాసు పుస్తకాల్లో ఉండేది మాత్రమే కాదు కదా ! చదువు అంటే విజ్ఞానం. అది సముద్రం.  అనంతం . అటువంటి అనంతమైన జ్ఞానాన్ని ఇవ్వగలిగినవాడు కారుణ్యమూర్తి అయిన ఆ కార్తికేయుడు. ఆయనే వేద స్వరూపము. సంపూర్ణ జ్ఞానప్రదాత.. అటువంటి  ఆ స్కందుని ఈ  28 నామాలకీ ప్రజ్ఞావివర్ధక నామాలని పేరు. వీటిని ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేసి , బొట్టు పెట్టుకొని, ఆ కార్తికేయునికి  నమస్కారం చేస్తూ, చెప్పుకోవడం  పిల్లలకి నేర్పించండి.  వారికి చక్కని జ్ఞానం, తెలివితేటలు తప్పక వస్తాయి. ఆరోగ్యం, ఆయుష్షు వృద్ధి చెందుతాయి. 

సుబ్రహ్మణ్యుని 28నామాలకీ ఎంతో విశిష్టత ఉంది. ఈ ప్రజ్ఞా వివర్ధనమైన కార్తికేయ స్తోత్రం రుద్రాయమల తంత్రము లోనిది.   పిల్లలకి చెప్పేప్పుడు మీరు ఆ నామాల అర్థాన్ని కూడా వివరిస్తూ నేర్పించారంటే వాళ్ళు అదే భావనతో భగవంతుని ముందర ఒక్కోనామాన్ని చెబుతారు.  ఆ విధమైన క్లేశరహితము, స్వచ్ఛమైన మసస్సు ఆ చిన్నారుల్లో ఉంటుంది. అందువల్ల వారికి ఆ సుబ్రహ్మణ్యుని అనుగ్రహం కూడా త్వరగా సిద్ధిస్తుంది.
   

1. యోగీశ్వరః – యోగీశ్వరులకు అధిపతి అయినవారు 
2. మహాసేనః – దేవసైన్యానికి అధిపతి, దేవసేనాపతి
3. కార్తికేయః – ఆరు కృత్తికా నక్షత్రములచే పోషింపబడిన వాడు
4. అగ్నినందనః  – పరమశివుని జ్ఞానాగ్ని నుంచి ఉద్భవించినవాడు మరియు పరమశివుని తేజస్సు కొంత సేపు భరించినందువల్ల, అగ్ని దేవునికి కూడా తనయుడిగా పిలువబడినవాడు.
5. స్కందః – పరమశివుని తేజస్సు నుండి జన్మించినవాడు
6. కుమారః – కుమార అన్న నామం కేవలం సుబ్రహ్మణ్యునికే సొంతమైనది . ఎందుకంటే, జగత్తుకి మాతా పితలు ఆదిదంపతుల అన్యోన్యతా  ప్రతిరూపం కేవలం స్కంద కుమారుడు మాత్రమే.
7. సేనానీః – దేవసేనలకు అధిపతి, దేవసేనాధ్యుక్షుడు.
8. స్వామీ శంకరసంభవః – శంకరుని దివ్యమైన తేజస్సు నుండి పుట్టినవాడు.
9. గాంగేయః – పరమశివుని తేజస్సు అగ్నిదేవుడు భరించలేక, గంగా మాతకి ఇచ్చేస్తే, గంగా మాత కొంత సేపు శివుని తేజస్సును భరిస్తుంది. అందువల్ల, గంగా మాతకి కూడా పుత్రునిగా పిలబడ్డవాడు కాబట్టి గాంగేయ అనే నామం వచ్చింది.
10. తామ్రచూడః – కుక్కుటమును అధిరోహించిన వాడు.
11. బ్రహ్మచారీ – ఎల్లప్పుడూ బ్రహ్మనందు రమించువాడు.
12. శిఖిధ్వజః – అగ్ని ధ్వజముగా కలవాడు
13. తారకారిః – తారకాసురడనే రాక్షస సంహారము చేయుటకు అవతారం దాల్చిన వాడు, తారకాసురుడిని, ఇతర రాక్షస గణములను సంహరించి దేవతలను రక్షించినవాడు.
14. ఉమాపుత్రః – ఉమాదేవి, అంటే పార్వతీ అమ్మ వారి ముద్దుల తనయుడు. అందుకే సుబ్రహ్మణ్య స్వామి వారు అచ్చం అమ్మవారి లానే ఉంటారు.
15. క్రౌంచారిః – పర్వత రూపములో ఉన్న క్రౌంచ అనే రాక్షసుడిని సంహరించినవాడు.
16. షడాననః – ఆరు ముఖములు గలవాడు.
17. శబ్దబ్రహ్మసముద్రః – జ్ఞాన స్వరూపుడు, అంటే వేదములు ఏ పరబ్రహ్మ స్వరూపమును గురించి ఘోషిస్తున్నాయో, ఆ వేద శబ్దములచే ప్రతిపాదించబడిన వాడు.
18. సిద్ధః – పరిపూర్ణ సిద్ధ స్వరూపుడు
19. సారస్వతః – సరస్వతీ స్వరూపము, అంటే జ్ఞాన స్వరూపము.
20. గుహః – సకలజీవుల హృదయ గుహలో కొలువై ఉన్నవాడు.
21. భగవాన్ సనత్కుమారః –  బ్రహ్మ గారి నలుగురు మానస పుత్రులలో ఒకరైన సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడిగావచ్చారని,  శ్రీవిద్యా రహస్యంలో మాహాత్మ్యఖండంలో వివరించబడినదని, శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నిర్ధారించారు.
22. భోగమోక్షఫలప్రదః – ఈ భూమి మీద మనం సుఖంగా జీవించడానికి అవసరమైన సంపదతో పాటు అంత్యమునందు మోక్షమును కూడా ఇవ్వగలిగినవాడు.
23. శరజన్మా – శరవణతటాకము (రెల్లు పొదల) నుండి జన్మించినవాడు.
24. గణాధీశః – సకల దేవతలకు, గణములకు అధిపతి అయిన వాడు.
25. పూర్వజః – అందరికన్నా ముందున్నవాడు, అంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు, కేవలం ఒక అవతారం మాత్రమే కాదు, ఎప్పుడూ ఉండే పరబ్రహ్మ స్వరూపం. ఆయన ఎప్పుడూఉన్నవాడు, పుట్టుక లేనివాడు.
26. ముక్తిమార్గకృత్ – ముక్తి మార్గమును బోధించే గురు స్వరూపం. అంత్యమున ముక్తిని ప్రసాదించి, తనలో కలుపుకునే స్వామి.
27. సర్వాగమప్రణేతా – సకల ఆగమములకు మూలము.
28. వాంచితార్ధప్రదర్శనః – అభీష్టములను నెరవేర్చే తండ్రి.

 
ఆ కార్తికేయుడే స్వయంగా కార్తికేయ స్తోత్రము పఠించడం వలన కలిగే ఫలశృతిని చెప్పి ఉన్నారు . “ఈ ప్రజ్ఞావివర్ధన కార్తికేయ స్తోత్రము రుద్రయమల తంత్రములోనిది. ఎవరైతే ఈ 28 నామములు ప్రతీ దినం ప్రాతః కాలం భక్తి శ్రద్ధలతో చదువుతారో, వారు సరస్వతీ అనుగ్రహం పొంది, చక్కని తెలివితేటలు, మంచి వాక్కు మరియు జ్ఞానమును పొందుతారు.” 

శుభం భవతు ! కార్తికేయ అనుగ్రహ సిద్ధిరస్తు !!

#subrahmanyeswara #karthikeya

Tags: subrahmanyeswara, subrahmanya, karthikeya, kartikeya, children, wisdom

Quote of the day

To be idle is a short road to death and to be diligent is a way of life; foolish people are idle, wise people are diligent.…

__________Gautam Buddha