Online Puja Services

వల్లీ కళ్యాణ కథా పారాయణం .

3.145.178.157

వివాహం, పుత్రలాభం, ఆరోగ్యం, విద్యాసిద్ధి ప్రదాయకం వల్లీ కళ్యాణ కథా పారాయణం .
- లక్ష్మీరమణ  
 
సుబ్రహ్మణ్యునికి భార్యలు ఇద్దరు . ఒకరు దేవసేనాదేవి . ఈవిడని ఇంద్రుని కుమార్తెగా చెబుతారు. దేవీభాగవతం ప్రకారం బ్రహ్మమానస పుత్రిక అయిన షష్టీ దేవీ స్వరూపంగా, సుబ్రహ్మణ్యుని దేవేరి అయిన దేవసేనా స్వరూపంగా ఆరాధిస్తారు. ఇక మరో దేవేరి శ్రీవల్లి. సుబ్రహ్మణ్యుడు శ్రీవల్లీదేవిని చేపట్టిన కథ అమృతప్రాయం. పెళ్ళికావలసినవారు ఈ కథని చదివితే వారికి త్వరగా పెళ్ళి అవుతుంది. వంశం నిలబడుతుంది. చక్కని సంతానం కలుగుతుంది . పిల్లలకి ఆరోగ్యం సిద్ధిస్తుంది. వారికి చదువులు బాగా వస్తాయి. రండి ఆ కథని చెప్పుకుందాం . 
   
నారదుడు లోక సంచారి. పాపం, ఆయనకి కలహభోజనుడు అనే పేరే కానీ, ఆయన ఆరాటం అంతా లోకకల్యాణం కోసమే ! ఆ విదాంగా ఒకనాడు ఆ నారాయణ దాసుడు సుబ్రహ్మణ్యుని దర్శనానికి వచ్చారు.  లోకములలో తాను చూసిన విశేషములన్నీ చక్కగా కుమారస్వామికి వివరించసాగారు. 

అయోనిజగా (ఒక స్త్రీ గర్భం నుండీ మానవులు జన్మించే మార్గం లో జన్మించనిది) జన్మించిన అపురూప సౌందర్య రాశి అయిన వల్లీ దేవిని గురించి కూడా ఆయన అలాగే వివరించారు. ఆయన ఉద్దేశ్యం శ్రీవల్లీ సుబ్రహ్మణ్యుల కళ్యాణమే . “అయోనిజ అయిన ఆ వల్లీ దేవి పసిబిడ్డగా అడివిలో ఒక భిల్లు నాయకునికి దొరికింది.  ఆ పిల్లను తీసుకు వచ్చి ఆయన  అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఆమె రాశీభూతమయిన సౌందర్యము. అటువంటి వల్లి అగ్ని స్వరూపుడవైన నీకు తగిన కన్య.  పైగా నీవు సర్ప స్వరూపుడవు.  ఆ కన్నె చుటూ కూడా ఎల్లప్పుడూ సర్పాలు పరివేష్టించి ఉంటాయి. ఆమెని రక్షిస్తూ ఉంటాయి. కాబట్టి నీవు తప్ప ఆమెను మరెవ్వరూ చేపట్టలేరయ్యా” అని చెప్పారు . 

 ఆ మాటలను విని వల్లీ దేవిని చూడాలన్న కోరికతో సుబ్రహ్మణ్యుడు భిల్లపురానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళడానికి ముందే నారద మహర్షి  భిల్లరాజుని చూడ వచ్చారు .  ఆ ఆటవికరాజు మంచి పువ్వులు, తేనే, పళ్ళు తీసుకువచ్చి నారదుడికి సేవలు చేసి సేదతీర్చారు .  అయ్యా మహర్షీ ! నా కూతురు వల్లీదేవికి తగిన వరుడు ఎవరు? సెలవియ్యండి” అని కోరారు.  అసలు మన మహర్షిలా వారి రాక అందుకోసమే కదా !  తీరిగ్గా గొంతు సవరించుకొని ఆ నారదమునీంద్రుడు ఇలా చెప్పారు .  “ఓ రాజా ! నీ కూతురు  పెళ్ళి చేసుకో బోయేవాడు లోకంలోనే ఉత్తమమైనవాడు.  ఆది దంపతుల అల్లారు ముద్దుల తనయుడు. ఆ శక్తిమాతకి ప్రతిరూపం .  జ్ఞానానికి నిర్వచనం .  మహావీరుడు దేవసేనాధిపతి అయినా ఆ సుబ్రహ్మణ్యుడు మాత్రమే. అది నీకు నీ కూతురు అనుగ్రహించిన  అదృష్టమే అదృష్టం” అన్నారు . భిల్లురాజు నారదుని మాటలు విని చాలా పొంగిపోయాడు. 

ఇదిలా ఉంటె, కుమారస్వామి వల్లీ దేవి విహరిస్తున్న పూల వనంలోకి ప్రవేశించారు.  వల్లీ దేవి వంక చూసి బహుశః బ్రహ్మ తన సృష్టి శక్తిలోని సౌందర్యమునంతటిని ఒకచోట రాశీభూతం చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తే శ్రీ వల్లి అయి ఉంటుంది అనుకున్నారు .  వారిద్దరి చూపులూ కలిశాయి .  అయినా వల్లీదేవి తండ్రితో నారదమహర్షి చెప్పినమాటలు విని ఉన్నది . అప్పుడే ఆమె మనస్సు ఆ సుబ్రహ్మణ్యునికి  అంకితమయ్యింది . అందువల్ల ఆమెలో ఆయన పట్ల ఆకర్షణ కలుగలేదు , దాని స్థానంలో భక్తి కలిగింది . కానీ సుబ్రహ్మణ్యుడు ఆమెని పరీక్షించదలిచారు . మహా తేజో స్వరూపంతో , గొప్ప సౌందర్యంతో, వీరత్వలక్షణాలతో ఉన్న ఆయన  ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి , “వల్లీ! నన్ను పెళ్లి చేసుకుంటావా ?” అని అడిగారు . ఆమె అయ్యా నేను సుబ్రహ్మణ్యుని తప్ప మరొకరిని వివాహం చేసుకోను . మీరు మరేదైనా మాట్లాడదలిస్తే , నా తల్లిదండ్రులని సంప్రదించండి అని సమాధానమిచ్చింది .   

ఆమె అలా చెప్పగానే సుబ్రహ్మణ్యుడు తానే ఆమె వలచిన పార్వతీ తనయుడనని తెలియజేశారు.  ఆమె పొంగిపోయింది. అలా వారిద్దరూ ఒకరి నొకరు చూసుకుంటూ తన్మయులై సమయాన్ని మరిచిపోయారు. విరిసిన పూల వనంలో చిలుకా గోరింకలై విహరిస్తూ ఉండిపోయారు. వారిద్దరి సౌందర్యం ముందు ఆ వనంలోని పూవులే చిన్నబోయాయా అన్నట్టు ప్రక్రుతి పరవశించిపోయింది .   

వల్లీ దేవి కనిపించకపోవడంతో ఆమె తండ్రి పరివారంతో కూడా కలిసి వెతుకుతూ, వల్లీ సుబ్రహ్మణ్యులున్న వనానికి చేరుకున్నారు.  సుబ్రహ్మణ్యుడు వేటగాని వేషంలో తన కూతురికి దగ్గరగా ఆ భిల్ల నాయకుడికి కనిపించారు. 

 అప్పుడాయనకి కూతురి రక్షణ పట్ల  త్రండ్రికి వచ్చే సహజమైన ఆందోళన కలిగింది.  వెంటనే పట్టలేని ఆగ్రహంతో దేవసేనానితో యుద్ధానికి తలపడ్డారు. పరివారంతో కలిసి ఆయన మీద బాణాలు వేశారు. సుబ్రహ్మణ్యుడు పేలగా నవ్వుతూ, వాటినన్నింటినీ స్వీకరించి వల్లీదేవి వంక చూసి వారి మీద సమ్మోహనాస్త్రమును ప్రయోగించారు. ఆ తర్వత వాళ్ళు స్పృహలోకి వచ్చే సరికి , నెమలివాహనము మీద వల్లీదేవితో కలిసి దంపతులుగా దర్శనమిచ్చారు . 

అప్పుడర్థమయ్యింది భిల్లురాజుకి తన కూతురు పక్కన ఉన్నదెవరని !! భిల్లులందరూ నేలమీద పడి ఆ వల్లీ సమేత సుబ్రహ్మణ్యుడికి సాష్టాంగ నమస్కారం చేసి పొంగిపోయారు. ఈలోగా నారదమహర్షి  దేవసేనతో పార్వతీ పరమేశ్వరులతో అక్కడకు విచ్చేశారు. వల్లీదేవి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించింది. ఆమెను అనుగ్రహించి వారంతా కూడా ఆ దంపతులని దీవించారు . 

ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా వల్లీ సమేతుడై  భక్తుల కోర్కెలు అనుగ్రహించడానికి సుబ్రహ్మణ్య స్వామి తిరుత్తణిలో వెలసి ఉన్నారు. ఈ స్వామిని అర్చించడం వలన , దర్శనం చేసుకోవడం వలన జన్మజన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి . వివాహం, ఆరోగ్యం, జ్ఞానం సిద్ధిస్తుంది . వంశాభివృద్ధి జరుగుతుంది. 

శ్రీ వల్లీ దేవాసేనా సమేత సుబ్రహ్మణ్య కటాక్ష సిద్ధిరస్తు! శుభం.  

#subrahmanyeswara #valli #srivalli #kumaraswamy

Tags: subrahmanyeswara, Valli, Srivalli, Sri valli, karthikeya, kumaraswamy, kalyanam, devasena, katha, parayana

Quote of the day

To be idle is a short road to death and to be diligent is a way of life; foolish people are idle, wise people are diligent.…

__________Gautam Buddha