Online Puja Services

దక్షిణ బదరీనాథ్ క్షేత్రం

18.118.45.162

ఒక్క పొద్దు ఉండి దర్శనం చేసుకున్నవారికి కొంగుబంగారం దక్షిణ బదరీనాథ్ క్షేత్రం !!
- లక్ష్మి రమణ 
 
దక్షిణ కాశీ అనే మాటని దక్షిణాదిన వెలసిన అనేకానేక మహిమాన్విత శైవ క్షేత్రాల గురించి చెప్పుకుంటూ ఉంటాం . కాశీ వరకూ వెళ్లలేని భక్తులు దక్షణ కాశీగా పేరొందిన క్షేత్రాలని దర్శించుకొని , కాశీ విశ్వేశ్వరుని దర్శించిన అనుభూతిని పొందుతారు . ఈ విధంగా ఉన్న వైష్ణవ క్షేత్రాల గురించి ఎప్పుడైనా విన్నారా ?  దక్షిణ బదరీనాథ్  పేరొందిన క్షేత్రం ఈ తెలుగు నేల మీదినే ఉంది. లక్ష్మీ నారసింహ స్వామిగా వెలసిన శ్రీహరి ఇక్కడ కొలుపులు అందుకుంటున్నాడు . ఒక్క పొద్దు ఉండి దర్శనం చేసుకున్నవారికి కొంగుబంగారం ఈ లక్ష్మీ నారసింహుడు.  విశిష్టమైన ఈ క్షేత్రం గురించి తెలుసుకుందాం .  

దక్షిణ బదరీనాథ్ క్షేత్రం:
 
తెలంగాణా రాష్టంలోని నిజామాబాద్ జిల్లా ముఖ్యమైన జిల్లాలలో ఒకటి . ఈ జిల్లాలోని లింబాద్రి గుట్టపైన నారసింహుడు కొలువై ఉన్నాడు . ఈ ఆలయం యావత్ భారతావని లోనే ప్రత్యేకమైన ఆలయంలలో ఒకటి  అంటే అతిశయోక్తి కాదు . ఈ ఆలయంలోని ఆ ప్రత్యేకత ఏమిటంటే , నరుడు , నారాయణుడు ఒకే గర్భాలయంలో స్వయంభువులై వ్యక్తం కావడం , పూజలు అందుకోవడం.  ఈ ప్రత్యేకత వల్లనే లింబాద్రి గుట్ట ఆలయం దక్షిణ బదరీనాథ్ క్షేత్రంగా పేరొందింది .  ఇటువంటి నరనారాయణుల  వ్యక్తీకరణ మళ్ళీ మనకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రఖ్యాత పుణ్య క్షేత్రం బదరికాశ్రమం లోని బదరీనాథ్  మాత్రమే కావడం విశేషం . 

లింబాద్రి గుట్ట శ్రీ లక్ష్మీ నృసింహ స్వామీ:

నిజామాబాద్ జిల్లాలో భీమగల్ సమీపంలో , సహజసిద్దంగా ఏర్పడిన రెండు  ఆంతస్థుల కొండపైన ఉత్తర ముఖముగా స్వామి దర్శమిస్తారు. జీవుడూ (నరుడు) , దేవుడు ( నారాయణుడు) ఒకే  గర్బాలయంలో కొలువుదీరిన ఈ ఆలయంలో  మహిమాన్వీతమైన స్వయంభూ శ్రీ లీంబాద్రీ లక్ష్మీ నృసింహ స్వామీ శాంతమూర్తిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ ముగ్గురూ ఒకే గర్భాలయంలో దర్శనమిస్తారు . సాధారణంగా ఏ నరసింహ క్షేత్రంలో చూసినా స్వామి వారి విగ్రహం ఉగ్ర రూపంతో ఉంటుంది.  కానీ, ఈ క్షేత్రంలో నారసింహుడు తన శక్తి స్వరూపమైన  లక్ష్మీదేవిని తొడపైన కూర్చోబెట్టుకుని శాంత రూపంతో దర్శమిస్తారు . పవిత్ర బద్రీనాథ్‌ క్షేత్రం తర్వాత గర్భాలయంలో స్వామి వారి మూలవిరాట్టు పక్కన నరనారాయణుల విగ్రహాలు ఇక్కడ మాత్రమే ఉన్నాయి. దీంతో ఈ క్షేత్రానికి దక్షిణ బద్రీనాథ్‌గా విశిష్టత వచ్చింది.

గుట్టపైన ఉన్న రెండు అంతస్తులకీ  చేరుకోవడానికి మెట్లమార్గం ఉంటుంది .  మొదటి అంతస్తులో శ్రీవారి మాడ వీధులు, కమలా పుష్కరిణి, కళ్యాణ మంటపం, రథం గుడి, అయోధ్య ఆంజనేయ స్వామి ఆలయం ఉంటాయి. రెండవ అంతస్తులో లోతైన రాతి గుహలో కొలువుదీరిన స్వామి వారి మూల విరాట్టు ఉంది. 

పరమాత్మ దర్శనం అంత సులభంగా సాధ్యం కాదుకదా ! ఎంతో సాధనతో గానీ ఆ స్వామిని చేరుకోవడం సాధ్యం కాదు . అదే విధంగా ఇక్కడ విశిష్టమైన నారసింహుని దర్శించుకోవడానికి యోగమార్గాన్ని పోలిన గుహలోకి తలవంచి జాగ్రత్తగా ప్రయాణిస్తూ దాదాపు 250 మీటర్లు ప్రయాణించాలి . అప్పుడు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన రాతిగుహలో స్వయం వ్యక్తమైన దివ్యనారసింహుని దర్శనం అవుతుంది .  అక్కడే ఉన్న నరనారాయణుల్ని దర్శనం చేసుకోవచ్చు .  

ఈ గుహ మార్గం ప్రవేశ ద్వారం వద్ద జోడు లింగాలు ఉంటాయి. ఈ లింగాలు ఇక్కడ ఏర్పడడానికి ఒక కారణముంది . అలాగే అయోధ్య హనుమాన్  ఆలయం ఉంటుంది . కమలా పుష్కరిణి ఉంటుంది . ఇవన్నీ ఇక్కడ ఏర్పడడానికి కారణమైన ఆ స్థల మహాత్య విశేషం ఇలా ఉంది .  

జోడులింగాల పరమేశ్వరుడు :
 
పరమశివుడు తనకు సంప్రాప్తించిన బ్రహ్మహత్యా దోష నివారణకై తపమాచరించి దోష విముక్తుడై శ్రీవారి ఆజ్ఞచే ఈ క్షేత్రంలోనే జోడు లింగాల రూపాన వెలిసాడట. ఇందుకు ప్రతీకగా గర్భాలయ మార్గ ప్రవేశ ద్వారం వద్ద భక్తులకు జోడు లింగాలు దర్శనమిస్తాయి. 

హనుమాన్‌ శ్రీరాముని ఆజ్ఞతో కవి పుంగవుడైన హనుమంతుడు ఇక్కడకు వచ్చి తపమాచరించి నరసింహుని రూపంలో ఉన్న శ్రీరాముని దర్శించాడట. అందుకే కొండ దిగువ ప్రాంతంలో క్షేత్ర పాలకుడైన అయోధ్య హనుమాన్‌ ఆలయం కనిపిస్తుంది.

కమలా పుష్కరిణి:

యముడు ఈ క్షేత్రంలో బిల్వవృక్ష రూపంలో తపమాచరించి శాంతి పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇంద్రుడు ఈ క్షేత్రంలో స్వామిని కమలాలతో పూజించి శాప విముక్తుడైనాడట. ఇక్కడి పుష్కరిణికి కమలా పుష్కరిణిగా పేరు. సతీ విక్రయ దోషనివారణకై సత్య హరిశ్చంద్రుడు నరసింహుని సేవించి తరించాడట. నరనారాయణులు సన్నిధానంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారట. ధర్మరాజు ఈ క్షేత్రాన్ని దర్శించి కృతార్థుడైనట్లు, ప్రహ్లాదుడు ఇక్కడే తపమాచరించినట్లు పురాణకథనం.

భక్తుల పాలిటి కొంగుబంగారం : 

శ్రీ మదుత్తరాది మఠాదిపతులు శ్రీ శ్రీ శ్రీ సత్యాత్మ తీర్థ శ్రీ పాదుల వారి ఆద్వర్యంలో ఆలయ ధర్మకర్త నంబి లింబాద్రి గారి చేతులమీదుగా విశేషపూజలందుకుంటున్న లింబాద్రి గుట్ట దర్శించుకున్న భక్తుల కొంగుబంగారం గా ప్రసిద్ది చెందింది. పచ్చని కొండల నడుమ ప్రకృతి రమణీయత మధ్యన అలరారే ఈ క్షేత్రంలోని స్వయంభూ శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారిని సందర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తారు. ఏటా కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కార్తీక పౌర్ణమి రోజున జరిగే రథోత్సవానికి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా భక్తులు వస్తారు. భీమ్‌గల్‌ మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో లింబాద్రి గుట్ట ఉంది. 

దర్శనం : 

మహిమాన్వితమైన స్వయంభూ శ్రీ లీంబాద్రీ లక్ష్మీ నృసింహ స్వామీ మూల విరాట్ మహశక్తీ వంతమైనది. నిండు ఓక్కపోద్దు (ఉపవాస దీక్ష )తో మాత్రమే దర్శనభాగ్యం శుభప్రదం.

ఆలయ దర్శనం :- 

ఉదయం 06:00 నుండి మద్యాహ్నం , 02:30 ని ¦¦వరకు

శుభం 

#dakshinabadrinath #limbadrigutta #lakshminrusimhaswami

Tags: dakshina, badrinath, badarinath, limbadri, gutta, limbadrigutta, lakshmi, nrusimha, narasimha

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi