Online Puja Services

దత్తాత్రేయుడు ధరించిన పదహారు అవతారాల విశేషాలు !

3.138.200.66

దత్తాత్రేయుడు ధరించిన పదహారు అవతారాల విశేషాలు !
- లక్ష్మి రమణ 

దత్తాత్రేయుడు ఆశ్రిత వల్లభుడు.  కేవలం దత్త అనే రెండక్షరాల నామాన్ని నిరంతరం స్థిరంగా అనుకుంటూ , మననం చేసుకుంటూ ఉంటే చాలు , అటువంటి భక్తునికి దత్తుడై అడిగిందల్లా అనుగ్రహించే వరదుడు.  ఆయన మహిమలు అనంతం.  వాటిని వర్ణించడం , ఆయన అనుగ్రహాన్ని వివరించడం చాలా క్లిష్టమైన పని . దత్తనుగ్రహం కలిగినవాడికి దారిద్య అంటే ఏమిటో కూడా తెలియదు . అంతలా వెంట ఉండి ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని , సౌభాగ్యాన్ని, సిద్ధిని, అనుగ్రహాన్ని ఇవ్వగలిగిన సద్గురుమూర్తి దత్తమహాప్రభువు . గురువు కృప ఉంటె, కానీ కార్యమే లేదు . అటువంటి  షోడశ కళా పరిపూర్ణుడైన ఆ దత్త గురువు   ధరించిన అవతార విశేషాల గురించి చెప్పుకుందాం . 
   
శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాల గురించి సనాతన అవలంబీకులకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దత్తావతారంలో లీలా విశేషం యోగానుసంధానమై ఉంటుంది . ఆయనకీ  షోడస సంఖ్యకు (16) చాల దగ్గర సంబంధం ఉంది. దత్తస్వామి వారి అపరావతారమైన శ్రీపాద శ్రీవల్లభ ల వారు 16వ సంవత్సరం వరుకు పీఠికాపురంలో ఉన్నారు. ఆ తర్వాత  30వ సంవత్సరం వరుకు కురువపురంలో ఉన్నారు. అయినప్పటికీ, ఆ గురుదేవుని వయస్సు 16వ సంవత్సరం లోనే నిలిచిపోయింది. అదే విధంగా దత్తాత్రేయుల వారి వయసు కూడా పదహారే! దత్తదేవుని  అవతారలూ పదహారే! సుప్రసిద్ధమైన ఆ దత్తుని  నామాలు కూడా పదహారే! 

పంచాక్షరీ మహామంత్రం ఈశ్వరావలంబకులకి పరిచయం లేనిది కాదు.ఇది అనంత శక్తి స్వరూపంగా వేదాలు పేర్కొన్నాయి.  అలాగే దత్త సంప్రదాయంలో “షోడశాక్షరీ మంత్రం” మహా శక్తి వంత మైనది. అత్యంత రహస్యమైనది . గొప్ప అంతరార్థం కలిగినది .   ఆ మంత్రం గురించి ఉపనిషత్తులు ఇలా చెబుతాయి . “కావాలంటే 16సార్లు నీ తల నరికి ఇవ్వు.  కాని షోడశాక్షరీ మంత్రాన్ని మాత్రం ఇవ్వద్దని” చెపుతాయి. దీని అర్థం ఎవరికీ మంత్రాన్ని ఇవ్వొద్దని కాదు . దానిపైన నమ్మకం లేనివాడికి, దురాచార పరుడికీ, దాని విలువ అర్థం కానీ వానికీ ఆ మంత్రాన్ని ఇవ్వొద్దని . 

ఇందులో దాగిన అద్భుతాన్ని తెలుసుకుంటే, మన ఋషులు ఎందుకు అలా చెప్పారో అర్థం అవుతుంది .  16 సంఖ్య లో ని 1 ని 6 ని కలిపితే  7 వస్తుంది.(1+6=7). ఋషుల భావన ప్రకారం సప్తమ సంఖ్య “మూలతత్వాన్ని” తెలుపుతుంది. అలాగే శ్రుతులు సప్త(7) సంఖ్య ని “అనంతమని”, “పరబ్రహ్మ” అని సూచించాయి. కాబట్టి పై వివరణ లో ఋషులు, శ్రుతుల వివరణ ప్రకారం అవి చెప్పిన ములతత్వం-అనంతం అనే పాదాలకి అర్థం దత్తత్రేయుడుగా చెప్పవచ్చు.

అందుకే  దత్త సంప్రదాయం లో “సప్తావరణపూజ”కు అధిక ప్రాధాన్యత ఉంటుంది . అలాగే దత్తాత్రేయుడు ఉండే లోకం 7వదైన ఊర్ధ్వలోకం - సత్యలోకం. అదేవిధంగా మన శరీరంలో ఉండే 7వ చక్రం పేరు “సహస్రారచక్రం”. సహస్రారంలో పరమాత్మ ఉంటారు .  సాధకుడు తన యోగముచేత కుండలిని శక్తిని జాగృతంచేసి మొదటి చక్రమైన మూలాధారం నుండి ఊర్ధ్వ గామిగా ప్రయాణిస్తూ,  7వ చక్రమైన సహస్రారం చేరుకొని అక్కడి శక్తి అనుగ్రహాన్ని పొందడం దత్తుని చేరుకోవడంగా చెప్పుకోవాలి . 

దత్తుని అవతారాల గురించి చెప్పుకుంటే, అది యుగయుగములు చరిత్ర అవుతుంది . దత్తాత్రేయుల వారికి కలియుగానికి పూర్వయుగములలో, ప్రస్తుత  కలియుగములో అనేక అవతారాలు ఉన్నాయి . ఇవన్నీ కూడా  గురుతత్వాన్ని, దత్తసంప్రదాయాన్ని సూచిస్తూ ఉంటాయి. అదేవిధంగా పూర్వ మరియు ప్రస్తుత యుగములలో వివిధ “దత్తావతార అంశలు” వచ్చి, దత్తాత్రేయుడు ఇచ్చిన పనిని నిర్వర్తించి తిరిగి దత్తలీనమయ్యాయి. ఆ అవతారాల విశేషాలు ఇలా ఉన్నాయి.  

శ్రీ యోగిరాజ -కార్తీక పౌర్ణమి 
 శ్రీ అత్రి వరద -కార్తీక బహుళ పాడ్యమి 
శ్రీ దత్తాత్రేయుడు- కార్తీక బహుళ విదియ  
శ్రీ కాలాగ్ని శమనుడు - మార్గశిర శుద్ధ చతుర్దశి 
శ్రీ యోగి జన వల్లభుడు - మార్గశిర పౌర్ణమి 
శ్రీ లీలా విశ్వంభరుడు - పుష్య పౌర్ణమి 
శ్రీ సిద్ధ రాజు - మాఘ పౌర్ణమి 
శ్రీ జ్ఞాన సాగరుడు - ఫాల్గుణ దశమి  
శ్రీ విశ్వంభరావధూత - చైత్ర పౌర్ణమి 
శ్రీ మాయాముక్త అవధూత - వైశాఖ శుద్ధ చతుర్దశి 
శ్రీ మాయా యుక్తావధూత - జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి 
శ్రీ ఆదిగురుదత్త - ఆషాడ పౌర్ణమి 
శ్రీ శివరూప దత్త -శ్రావణ శుద్ధ అష్టమి 
శ్రీ దేవ దేవ దత్త- భాద్రపద శుద్ధ చతుర్దశి 
శ్రీ దిగంబర దత్త - ఆశ్వీజ పౌర్ణమి 
శ్రీ కృష్ణ శ్యామ కమలనమన లోచన దత్త - కార్తీక శుద్ధ ద్వాదశి 

ఈ విధంగా  శ్రీ దత్తాత్రేయ ప్రభువు, 16 అవతారాలు ధరించినట్టు, దత్త పురాణం చెబుతోంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, స్వామి ఆయా కార్యాలు చేయడానికి,  విశేషమైన ఉపదేశాలు చేయడానికి ధరించిన రూపాలే షోడశావతారాలు గా ప్రసిద్ధి చెందాయి. ఈ అవతారాలుఅన్నీ  దత్త భక్తులకు చాలా విశేషమైనవిగా భావిస్తారు. ఆయా రోజులలో, స్వామివారికి విశేష పూజలు చేసి, నామ జపము, గురు చరిత్ర,పారాయణ చేయడం ద్వారా స్వామి కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తూ శలవు !!
 
శుభం . 

Quote of the day

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.…

__________Rabindranath Tagore