Online Puja Services

ఈశ్వరానుగ్రహానికి దొంగలు కూడా పాత్రులు కాగలుగుతారా ?

3.139.72.78

ఈశ్వరానుగ్రహానికి దొంగలు కూడా పాత్రులు కాగలుగుతారా ?
- లక్ష్మి రమణ 

కిరాతులైన వారిని పరమేశ్వరుడు అనుగ్రహించిన ఉదంతాలని  మనం ఇదివరకే ఎన్నో చెప్పుకొని ఉన్నాం . తెలిసీ , తెలియక శివపూజ చేసినా , పొరపాటున ఆ శివలింగము మీద ఒక్క బిల్వదళము అర్పించినా ఆ పుణ్యము శివసాయుద్యాన్నే కలిగిస్తుంది . అటువంటి నిరూపణలు మనకి శివపురాణంలోనూ, స్కాందపురాణం తదితర పురాణ వాగ్మయంలో లభ్యం అవుతున్నాయి . ఆ కరుణాసముద్రుని కటాక్షానికి జీవులన్నీ ఒకే రకంగా పాత్రమవుతాయి. చతుషష్టికళా నాథుడైన ఆ పరమేశ్వరుని లీలా విలాసములలో దొగతనం లేదంటారా ! భక్తుల హృదయాలు దోచే సోమేశ్వరుని కటాక్షానికి పాత్రమైన ఒక దొంగ వృత్తాంతం స్కాంద పురాణం ఇలా వివరిస్తుంది . 

పురాణం సామాన్యమైనది కాదు . వేదము, వేదాంతమూ అర్థం కాని సామాన్యులని పరమాత్మ సన్నిధిని పరిచయం చేసి , ముక్తిమార్గంలో నడిపించే అమృతం పురాణం . అటువంటి అమృత సమన్వయమైన ఈ కథ పరమాత్మ దృష్టిలో ఎంతటి సమానవం ఉంటుందో చెప్పేది . ఆయన కటాక్షం, భక్తి కలిగిన ప్రతి ఒక్కరికీ అందుతుందని చెప్పేటటువంటి . ఇక ఆలస్యం లేకుండా చక్కగా ఈ చిక్కని కథని ఆస్వాదించండి . 

పూర్వం ఒకానొక నగరంలో సంఘం చేత బహిష్కృతుడైన ఒక దొంగ ఉండేవాడు.  అతను ఎంతో దుర్మార్గుడు శిశు హత్యలు చేశాడు. ప్రతిరోజూ మద్యపానం చేసి, జూదమాడుతూ , పైలాపచ్చీసుగా తిరుగుతూ  సర్వ దుర్గుణాలతో సావాసం చేస్తూ జీవనం సాగించేవాడు . పైగా అతనికి దుస్సంగత్వం ఒకటి . ఎప్పుడూ తన వంటి వ్యసన పరులతో, దుర్మార్గులతో కలిసి సంచరిస్తూ ఉండేవాడు.

బురదలో కమలం వికశించినట్టు , ఇంతటి నీచత్వంలోనూ ఒక సుగుణం ఉంది . నిరంతరం శివా శివా అని శివుని తలుస్తూ ఉండేవాడు . ఇదిలా ఉండగా ఒకనాడు అతను జూదమడ్డానికి ఒక జూదశాలకు వెళ్ళాడు.  ఆటమీద ఆట ఆడుతున్నాడు . ఆ ఆట ఆడుతూ ఆడుతూ చివరికి ఓడిపోయాడు.  చేతిలో ఉన్న డబ్బు మొత్తం పోయింది . జేబులు ఖాళీ అయిపోయాయి .  అయినా ఆట ఆపలేదు. గెలుస్తానని నమ్మకంతో అప్పు పెట్టి ఆడాడు . ఓడిపోయాడు . చివరికి  డబ్బు లేదని గెలిచిన జూదరులకి మొండి చెయ్యి చూపించాడు . 

 ఆ మాట విని కోపంతో వారందరూ ఇతణ్ణి  దారుణంగా కొట్టారు.  ఆ డబ్బు ఇవ్వాల్సిందే అని పట్టుబట్టారు.  ఏంచేయాలా అని ఆలోచిస్తూ , అలవాటు ప్రకారం శివశివా అనుకుంటూ ఎదురుగా ఉన్న శివాలయానికి వెళ్ళాడు . అక్కడ శివలింగం పైన వెండి గంట కనిపించింది. ఆ క్షణం అతనికి అక్కడ శివలింగం కాకుండా దాని  పైనున్న గంట మాత్రమే కంటికి ఇంపుగా కనిపించింది . శివుని శిరస్సున చంద్రరేఖ లా ఉన్న ఆ గంటని దొంగలించి, ఆ ధనంతో తన అప్పు తీరుద్దామనుకున్నాడు.  

వెంటనే యుక్తాయుక్తాలు ఆ శివునికి విడిచేశాడు .  శివలింగం మీదకెక్కి గంటను అందుకోబోయాడు.  అదే సమయంలో కైలాసంలో లయకారుడు తన కింకరులని పిలిచి ఇలా చెప్పారు .  “ఓ కింకరులారా! ఇప్పుడు భూలోకంలో నా తల మీద కెక్కి, గంటని దొంగలించిన వ్యక్తి నా భక్తుడు.  నిరంతరమూ నన్నే స్మరించే అతను నాకెంతో ప్రీతిపాత్రుడు. అతని సమయం ఆసన్నమైనది . కాబట్టి ఓ వీరభద్రా ! నీవు వెంటనే భూలోకంలో దొంగ ఉన్న శివాలయానికి వెళ్లి, అతన్ని స్వయంగా ఇక్కడికి తీసుకురా!” అని ఆజ్ఞాపించారు. 

 శివాజ్ఞను అనుసరించి వీరభద్రుడు ప్రమదగనాలను వెంటబెట్టుకుని దొంగ ఉన్న ఆలయం దగ్గరికి వెళ్ళారు. స్వయంగా ప్రమథ  గణాలతో వచ్చిన వీరభద్రుని కోలాహలం విని ఆ దొంగ బెదిరిపోయాడు . అలా పారిపోతున్న ఆ దొంగని ఆపిన వీరభద్రుడు , “ఓరీ భక్తా ! ఎందుకు అలా పరిగెడుతున్నావు? పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహించాడు. ఇక నీవు చేరవలసినది కైలాసానికి ! రా ! ఈ దివ్యమైన విమానాన్ని అధిరోహించు”. అని సాదరంగా ఆహ్వానించాడు. 

 వీరభద్రుడు మాట వినగానే ఆ దొంగకి ధైర్యం వచ్చింది.  వెంటనే వెనక్కి వచ్చాడు.  వీరభద్రుడు అతన్ని ఎక్కించుకుని, కైలాసానికి తీసుకు వెళ్లాడు.  అలా ఆ దొంగ శివానుగ్రహంతో శివలోకంలో పరిచారకుడిగా మారాడు.  

కనుక జీవులందరికీ బాగా ఉండాల్సింది  శివ భక్తి మాత్రమే! సదా జగత్తుని సృష్టించి, పోషించి లయం చేసే పరమేశ్వరుని వదిలి, మూర్ఖత్వంతో క్షణభంగురమైన పరధర్మాల వెంట పరుగులు తీసేవారు పరమ మూర్ఖులు. కరుణాసముద్రుడై అందరినీ తన దగ్గరికి చేర్చుకొని ఆర్తిని తీర్చే భోళా శంకరుడు మనల్ని చేతులు చాచి ఆహ్వానిస్తున్నప్పుడు, మనం మరోవంకకి పోవలసిన అవసరమేముంది ? ఇక్కడ మరోసారి శివుడు అంటే కేవలం శివుడు మాత్రమే కాదు ఆయనే విష్ణువు, బ్రహ్మ సకల దేవతా స్వరూపుడూ కూడా అని అర్థం చేసుకోవాలి . అందుకేకదా ఆయన్ని సర్వేశ్వరుడు అన్నారు . శివలింగములో కింద ఉండే పీఠము లేదా యోని విష్ణువు అయితే, పైనున్న లింగము శివుడు . ఇలా వారిరువురూ అభేదమైనవారు . అందువల్ల  ఈశ్వర రూపం అయిన కనుక లింగార్చనమే సర్వ శ్రేష్టమైనది. ఆవిధంగా మనం ఆ పరమేశ్వరుని అర్చించి ఆయన కృపకి పాత్రులము కాగలమని ఆశిస్తూ ..  శుభం !!

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi