Online Puja Services

శ్రీకృష్ణుని ఆరాధన .

13.59.195.118

ఎంతటి క్లిష్ట సమస్యల్లో ఉన్న బయటపడే మార్గం కోసం శ్రీకృష్ణుని ఆరాధన . 
- లక్ష్మి రమణ 

దశావతారాలలో ఎత్తింది ఒకే ఒక్క విష్ణుమూర్తి . కానీ ఆ దశావతార మూర్తులని వారంలో వేరువేరు రోజుల్లో పూజించడం వలన ఫలితాలు మరింత విశిష్టంగా ఉంటాయి . అయితే వారం మొత్తం పూజచేయోద్దా ? అంటే, చక్కగా చేసుకోవచ్చు . ప్రతిరోజూ , ప్రతి ఘడియా , ప్రతి క్షణం ఏ మూర్తిలో మన అంతరంగం లయమవుతోందో ఆ మూర్తిని చక్కగా అర్చించుకోవచ్చు . ఆ నామాన్ని నిరంతరమూ స్మరించవచ్చు. అయితే, ఆదివారం సూర్యుణ్ణి, సోమవారం శివుణ్ణి, మంగళవారం ఆంజనేయుని ఇలా వారానుసారం ప్రధానమైన దేవతలని అర్చిస్తుంటారు కదా ! అలా దశావతారాలలో విష్ణుస్వరూపాన్ని అర్చించడానికి వేరువేరు వారాలని ప్రధానమైనవిగా చెప్పారు . అందులో ప్రత్యేకించి శ్రీ కృష్ణుని పూజ ఏవారం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం . 

శ్రీకృష్ణుడు అందమైనవాడు. స్త్రీ పురుష భేదం లేకుండా జీవులన్నింటినీ సమ్మోహితులని చేసిన రూపం కృష్ణ పరమాత్మది .  మధుర భక్తి భావనతో అర్చించేవారికి అనుకూలంగా ఉండే అద్భుత సౌందర్యం మూర్తీభవించిన పురుషోత్తమ రూపం శ్రీకృష్ణ అవతారం . శ్రీవారు ఈ అవతారాన్ని ధరించి అష్టమి నాడు జన్మించారు. అందువల్ల ఆయన్ని ప్రతి నెలలోనూ వచ్చే కృష్ణపక్షము లోని అష్టమి నాడు తప్పకుండా పూజించాలి . 

చిన్నారి అల్లరి కిట్టయ్యగా పూజిస్తారా, గోపకాంతల మదిని దోచిన మోహనకృష్ణునిగా పూజిస్తారా, గోవర్ధన గిరినెత్తి గోవుల (జీవులని) కాపాడిన గోపాలునిగా ఆరాధిస్తారా, దుష్టసంహారంచేసి రక్షించిన భగవంతునిగా అర్చిస్తారా అనేది మీ ఇష్టం . ఏ రూపంలో ఆయన్ని అర్చించినా ఆ కృష్ణ సాన్నిధ్యం మధురంగా , మధురాతి మధురంగా ఉంటుంది.    

ప్రత్యేకించి శ్రీకృష్ణుడు జగద్గురువు. గీతాచార్యునిగా ఆయన ఈ జగతికి జ్ఞానబోధ చేశారు . ఆచార్యునిగా, గురువుగా ఆయన్ని గురువారం పూజించడం అద్భుతమైన ఫలితాలని అందిస్తుంది . గురువాయారూర్ (గురువు , వాయువూ కలిసి ప్రతిష్టించిన శ్రీకృష్ణుని రూపం) గా అర్చించడం చక్కని జ్ఞానాన్ని, పుష్టిని అందిస్తుంది .  శ్రీకృష్ణుని సంతానగోపాలా రూపంలో అర్చించడం వలన సంతానం కలుగుతుంది . శ్రీకృష్ణ నామం ఎక్కడ స్థిరంగా నిత్యమూ పలికే చోట ఆ శ్రీదేవి నివాసముంటుందని ప్రతీతి . రుక్మిణీదేవితో కలిసిఉన్న రూపాన్ని శుక్రవారం శ్రీవిష్ణు హృదయవాసిని అయినా లక్ష్మీ స్వరూపంగా అర్చించుకోవచ్చు . 

కృష్ణుని పూజవల్ల ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా అనుసరించాల్సిన మార్గం ఏమిటి ? అనే మార్గదర్శకత్వం దొరుకుతుంది . సరైన సమయంలో అటువంటి స్ఫురణ కలగడం కూడా ఒక భాగ్యమే మరి ! అటువంటి పరిష్కారం బుద్ధికి స్ఫురించేలా చేస్తారా జగద్గురువు . 

అలంకార ప్రియుడైన శ్రీకృష్ణుడికి చక్కగా అలంకారం చేసి , తులసీదళాలు సమర్పించండి . ఆవు పాలు, వెన్న, క్షీరాన్నం, మధుర పదార్థాలు నివేదించండి . 

కృష్ణం వందే జగద్గురుమ్ !! శుభం .

Quote of the day

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.…

__________Rabindranath Tagore