Online Puja Services

విచిత్రమైన ఆలయం

3.138.204.208

గుడి , గుడిలోని నంది , శివయ్య , అక్కడి కల్యాణి - విచిత్రమైన ఆలయం 
-లక్ష్మీ రమణ   

శివాలయాల్లో నందీశ్వరుడు శివునికి ఎదురుగా ఆశీనుడై , ఎవరు లోపలి వెళ్తున్నారు ? స్వామి వారికీ ఏ ఏ కోర్కెలు నివేదిస్తున్నారని కనిపెడుదుతూ , తన శృంగాల మధ్య నుండీ ఆ స్వామివారి కరుణా తరంగిణిని మనకి అనుగ్రహిస్తూ ఉంటారు . కానీ ఈ ఆలయంలో నంది చాలా వినూత్నంగా కనిపిస్తాడు . ఆలయంలో శివయ్యకి పై అంతస్థులో నందీశ్వరుడు కొలువై ఉంటాడు . పైగా తన నోటినుండీ వస్తున్న అమృతధారలతో శివయ్యని అభిషేకిస్తూ ఉంటారు . ఇదే అద్భుతమనుకుంటే, ఏకంగా గుడికి గుడే , భూగర్భం నుండీ చొచ్చుకు రావడం ఇక్కడి మరో విశేషం . సర్వరోగ హరణమైన ఆ క్షేత్ర విశేషాలు ఇక్కడ మీకోసం .
 
బెంగళూరు అనగానే పచ్చదనం కళ్లముందు కదులుతుంది. చల్లటి వాతావరణం స్నేహంగా పలకరిస్తుంది. అందుకే ఆ ప్రదేశం అందమైన పర్యాటక కేంద్రమైంది. ఇది మహానగరం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక పరంగా కూడా ఉన్నతమైన ప్రాంతం కర్ణాటక .  కర్ణాటకా రాష్ట్రం లోని బెంగళూరులో ఉన్న  మల్లేశ్వరంలో 600ఏళ్ళ నాటి ఆధ్యాత్మిక శోభతో వెలసిల్లుతున్న ఆలయం  ‘కాడు మల్లేశ్వర స్వామి’ ఆలయం.

మల్లేశ్వర శివలింగం చాలా అద్భుతంగా ఉంటుంది.  ప్రతి శివాలయంలో అడుగు పెట్టగానే మనం ముందుగా దర్శనం చేసుకునేది నంది విగ్రహాన్ని. కొందరు నంది కొమ్ముల మద్య నుండి శివుడిని దర్శనం చేసుకుంటే మరికొందరు నంది చెవిలో వారి వారి కోరికలను విన్నవించుకుంటారు. అయితే ఈ ఆలయంలో అద్భుతం ఏంటంటే ప్రతి నిత్యం నంది నోటి నుండి నీరు నిరంతరాయంగా శివలింగాన్ని అభిషేకిస్తూ ఉంటుంది .

ఇది పరమశివుడికి అంకితమైన 17 వ శతాబ్దం నాటి ఆలయం. అయితే ఈ ఆలయం ఇక్కడ నెలకొనడం వెనుక ఒక విచిత్రమైన వృత్తాంతం ఉంది .  1997లో మల్లేశ్వరంలోని కాడు మల్లేశ్వర దేవాలయం ఎదురుగా ఉన్న వీధిని వెడల్పు చేసే సమయంలో ఓ నంది విగ్రహం బయట పడింది. ఈ విషయం తెలుసుకొన్న పురావస్తుశాఖ అధికారులు ఇక్కడికి వచ్చి పూర్తిగా తవ్వకాలు జరిపిన తర్వాత ఓ దేవాలయమే బయటపడింది. 

దక్షిణ ముఖ నందీశ్వర తీర్థం:

నందీశ్వర తీర్థం ఈ ఆలయంకు మరో ప్రధాన ఆకర్షణ. ఇక్కడ నీరు నిరంతరం నంది విగ్రహం నోటి నుండి ప్రవహిస్తూ శివలింగం మీద పడుతుంది. ఈ నీరు వృషభావతి నదికి ఆది స్థానంగా భావిస్తారు .  కానీ నిజంగా ఆ నీరు ఎక్కడినుండి, అలా నందీశ్వరుని నోటినుండీ వెలువడుతోంది అనే విషయానికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు లేవు.  అటు పై శివలింగం ఎదురుగా  ఉన్న కళ్యాణి లో లేదా కోనేటిలో  ఆ నీరు చేరుతుంది. అయితే ఆ నంది నోటి నుంచి వచ్చే నీరు ఎక్కడ నుంచి వస్తుందన్న విషయం ఇప్పటికీ నిఘూడ రహస్యం. నంది నోటి నుంచి పడుతున్న శుద్ధ జలం మనం ఫిల్టర్ చేసే నీరు కన్నా కూడా శుద్ధంగా వుంది.

బంగారు తాపడం చేసిన గర్భాలయం  :

కళ్ళు మిరుమిట్లు గొలిపేలా స్వామి ఆలయం అంతర్భాగం బంగారు రంగుతో దగ దగ మెరసిపోతూ కనబడుతుంది. పై అంతస్థులో ఉన్న అంది నోటినుండీ వెలువడే జలధార సరాసరి క్రింది అంతస్థులో ఉన్న గంగాధరుని నెత్తిన అభిషేకిస్తూ ఉంటుంది . అసలు ఆలయంలోని మూల విరాట్టు ఈ విధంగా వైవిధ్యంగా  ఉన్నారు అనుకుంటే, ఆ స్వామీ బంగారు కాంతులు ఆ స్వామీ ముందరున్న కోనేటిలో ప్రతిఫలిస్తుంటుంది .  కోనేటి మెట్లమీద వెనక్కి కూర్చుని చక్కగా కోనేరు నీటిలో స్వామి ప్రతిబింబాన్ని, జలచరాలు తాబేళ్లు, వింత చేపలు కలియ తిరుగుతుంటే, చల్లని సాయత్రం, ప్రకృతి వడిలో చూడటం చక్కని అనుభూతి.

పురాతనమైన చరిత్ర :

కొన్ని పరిశోధనలు ఈ ఆలయం 400 సంవత్సరాల నాటిదిగా చెబితే, మరికొందరు మాత్రం ఈ ఆలయం ఆరు వేల సంవత్సరాలకు పూర్వం నాటిదిగా చెబుతున్నారు. ఈ ఆలయం 1997 తర్వాతే  వెలుగులోకి వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. దక్షిణాభిముఖుడైన నంది , ఆయన నోటిలోనుండీ ఉద్భవించే గంగమ్మ , ఆపై గంగాధరుడికి అభిషేకమై పవిత్రమైన తీర్థం నిండిన కల్యాణి.  వీటన్నింటినీ కలిపి ఈ దేవాలయాన్ని  శ్రీ దక్షిణముఖ నంది తీర్థ కళ్యాణి క్షేత్రం అనే పేరిట పిలుస్తూ ఉండడం కద్దు . పై అంతస్థులో నుండే నంది నుండి శివలింగంపైన ఖచ్చితంగా అభిషేకం జరిగేలా చేయడానికి  పూర్వం ఎలాంటి టెక్నాలజీ వాడరనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది . ఇక్కడి కల్యాణిలో తీర్థం సర్వపాపహరం, సర్వ రోగనివారణమని  భక్తులు విశ్వసిస్తారు. 

ఇలా చేరుకోవచ్చు :

బెంగళూరుకు అన్ని ప్రధాన నగరాలనుండి బస్సులు, రైళ్లు , విమానాలు అందుబాటులో ఉంటాయి . బెంగళూరు నుండీ బస్సు ప్రయాణం ద్వారా , కాడు మల్లీశ్వరం  చేరుకోవచ్చు . 

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi