Online Puja Services

శివరాత్రికి ఇలా పూజిస్తే,

18.116.90.141

శివరాత్రికి ఇలా పూజిస్తే, దూడ వెంట ఉండే ఆవులా మహేశ్వరుడు వెంటే ఉంటాడు . (శివరాత్రి ప్రత్యేకం )
- లక్ష్మి రమణ 
 
శివునికి రుద్రుడు అని పేరు . రుద్రుడు అంటే దుఃఖాన్ని నాశనం చేసేవాడు, శుభములని ఇచ్చే శివుడు అని అర్థం. ఆ స్వామిని మహా శివరాత్రి నాడు రుద్రపారాయణలతో అభిషేకిస్తాము. శివనామస్మరణతో రోజంతా ఉపవాసం ఉండి , రాత్రికి జాగారం చేసి శివార్చనలు చేస్తాం . ఇలా రక రకాలుగా శివార్చనలు ఆరోజంతా చేస్తుంటారు .  అయితే, ఈ రోజు ఆచరించవలసిన పూజా విధి  ఏ విధంగా ఉండాలి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం . 

మాహామాఘి - శివరాత్రి : 

శివరాత్రి మాఘమాసంలోని బహుళ చతుర్దశి రోజు వస్తుంది . ఈ రోజుని మహామాఘి అని కూడా పిలుస్తారు .  సాధారణంగానే మాఘమాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాదికాలు పూర్తిచేసుకొని శివ, కేశవార్చనల్లో తరించామని చెబుతున్నాయి శ్రుతులు . శివరాత్రినాడు , ‘మళ్ళీ రాత్రంతా జాగారం చేయాలి’ అనుకుంటూ, ఉదయం ఎక్కువసేపు నిద్రపోవడం కూడదు. 

శివుడు నిరాకారుడు, అలాగని ఆకారం లేనివాడా ? కాదు, సర్వసాకారాలకు మూలమైనవాడై ఉన్నాడు . అటువంటి ఆది, మద్య, అంతమూ లేని జ్యోతి స్వరూపుడు.  అమరి ఆయన్ని ఏ రూపంలో అర్చించుకోవాలి ? అందువల్ల  లింగ స్వరూపంలో శివుని ఆరాధిస్తారు. 

ఏ లింగాన్ని ఆరాధించాలి ?

మహా శివరాత్రి శివారాధనకు సర్వోత్కృష్టమైన రోజు. కనుక ఉదయాన్నే శివనామ స్మరణతో నిద్రలేచి, స్నానాది నిత్యకర్మలు పూర్తి చేసుకోవాలి .  తరువాత శివ పూజ చేసుకోవాలి. ఆ పూజ ఎలా చేసుకోవాలి అంటే, శివుణ్ణి  షోడశోపచారాలతో ఇంట్లోనే పూజించుకోవచ్చు . ఇక్కడ ఏ లింగానికి పూజ చేయాలి అనే సందిగ్ధం కూడా చాలా మందికి ఉంటుంది . స్పటికలింగము, బాణ లింగములని ఆరాధించేప్పుడు  చాలా నియమ నిష్టలు అవసరం. అలా కాకుండా, వెండి, బంగారంలతో  చేసిన లోహ లింగాలను నిత్యమూ అర్జించుకోవచ్చు. నాదగ్గర అవీ లేవండీ అంటారా, మట్టితో లింగాన్ని తయారు చేసి, చక్కగా అర్చించుకోండి. సర్వాభీష్టఫలప్రదం మృత్తికా శివలింగం .  లేదా శివాలయానికి వెళ్ళి, అర్చన లేదా  అభిషేకము చేయించుకోవడం శ్రేష్ఠమైనది. 

శివార్చన ఎలా చేయాలి ?

 శివుడు గంగాధరుడు, అభిషేక ప్రియుడు అని అందరికీ తెలిసిన విషయమే ! ఆయనకీ  అశుతోషుడు అని మరో పేరు . అంటే వెంటనే సంతోషించే దేవుడు అని అర్థం . అందుకే ఆయన సులభ ప్రసన్నుడు . అభిషేక ప్రియుడైన ఈ స్వామిని నమక , చమక మంత్రాలతో ఆరాధిస్తూ,  కొబ్బరినీళ్ళు, ఫలరసాలు, పంచామృతాలు, చెరుకు రసము, పాలు మొదలైన వాటితో అభిషేకిస్తారు. వెయ్యికి లింగాలని మట్టితో చేసి వాటిని పూజించే మహాలింగార్చన కూడా మహా శివరాత్రినాడు చేయించుకోవడం విశేషమైనఫలాన్నిస్తుంది . ఇలా శక్త్యానుసారం శివార్చనలు చేసుకోవచ్చు . 

మంత్రాలు రావని బాధ అవసరం లేదు :
 
శివుని మూర్తి , లేదా చిహ్నము లింగము లేనప్పుడు మట్టితో లింగాన్ని చేసుకున్నాం . శివార్చనకు మంత్రాలు రాకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు .  శివనామం ఒక్కటే చాలు.  శివాయనమః అనే పంచాక్షరాలు పలుకుతూ శివుని ధ్యానించండి . వీలయితే ఆయన మీద ఇందాక చెప్పుకున్న ద్రవ్యాలని పూస్తూ , అభిషేకం చేస్తూ ఆ శివనామాన్ని చెప్పండి . మారేడు దళాలు, తులసీదళాలు, జిల్లేడు, ఉమ్మెత్త, తుమ్మి వంటి పూలతో పూజించండి . 

మనసారా స్మరించడమే మహాదేవుని అనుగ్రహానికి కారణం.  విభూది ధరించి, రుద్రాక్షలు ధరించి శివార్చను చేయాలి. రుద్రాక్షలను శుచిగా ఉన్నప్పుడు మాత్రమే ధరించాలి అని గుర్తుపెట్టుకోండి.  మహాదేవ మహాదేవ అని పలికే వారి వెంట పార్వతీ సహితుడైన శివుడు నిరంతరంగా తోడై నీడై ఉంటాడు. పరిగెడుతున్న దూడ వెంట వదలకుండా పరుగుపెట్టే గోమాతలాగా ఆ మహేశ్వరీ సహిత మహేశ్వరుడు ఆ భక్తుని కాచుకునే ఉంటాడు. 

శివాయ నమః 

#shivaratri #sivaratri

Tags: shivaratri, sivaratri, sivarathri,

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi