Online Puja Services

బద్రీనాథ్ చరిత్ర

18.221.222.47

శివుడు తన ఇంటిని కోల్పోయిన ఘట్టం:

బద్రీనాథ్ చరిత్ర

సద్గురు బదరీనాథ్ ఆలయం కథ చెప్తున్నారు. దాని చరిత్ర, వేయేళ్లకంటే పూర్వమే ఆదిశంకరాచార్యులు ఆలయాన్ని ఎలా ప్రతిష్ఠించిందీ వివరిస్తున్నారు.

బదరీనాథ్ గురించి ఒక పురాణ గాథ ఉంది. ఇక్కడ శివపార్వతులు నివసించారు. అద్భుతమైన ప్రదేశం. సముద్రమట్టానికి 10,000 అడుగుల ఎత్తున ఉంది. ఒక రోజు శివపార్వతులు వాహ్యాళికి వెళ్లి వచ్చారు. వాళ్లు వచ్చేటప్పటికి వాకిట్లో ఓ చిన్న పిల్లవాడు ఏడుస్తూ కూర్చున్నాడు. పిల్లవాడి వైపు చూసిన పార్వతిలో మాతృహృదయం ఉప్పొంగింది. బిగ్గరగా ఏడుస్తున్న పిల్లవాణ్ణి ఎత్తుకోబోయింది. శివుడు, ‘‘పిల్లవాణ్ణి ముట్టుకోకు,’’ అని పార్వతీ దేవిని వారించాడు. ఆవిడ, ‘‘ఎందుకంత క్రూరత్వం, అలా ఎలా అనగలుగుతున్నారు?’’ అని అడిగింది

శివుడు, పార్వతీ దేవితో ఇలా అన్నాడు, ‘‘ఈ పిల్లవాడు మంచి పిల్లవాడు కాడు. మన వాకిట్లో తనంతట తాను ఎలా ప్రత్యక్షమయ్యాడు? చుట్టుపక్కల ఎవరూ లేరు. పోనీ, తల్లిదండ్రుల పాదాల ముద్రలు మంచులో ఎక్కడా కనిపించడం లేదు. వీడు పిల్లవాడు కాడు’’ అని.
కానీ పార్వతీ దేవి, ‘‘వీల్లేదు. నాలోని మాతృత్వం పిల్లవాణ్ణి ఇలా ఏడుస్తూ వదిలేయ లేదు’’ అని, ఆమె పిల్లవాణ్ణి ఎత్తుకొని ఇంట్లోకి తీసుకొని వెళ్లింది. ఆమె ఒడిలో కూర్చున్న పిల్లవాడు చాలా సంతోషంగా కనబడ్డాడు, శివుని వైపు ఆనందంగా చూస్తున్నాడు. శివుడికి ఏం జరగబోతోందో తెలుసు. అయినా, ‘‘సరే కానీ, ఏం జరుగుతుందో చూద్దాం’’ అన్నాడు.

పార్వతీ దేవి పిల్లవాణ్ణి సముదాయించింది. అన్నం తినిపించింది. అతన్ని ఇంట్లో వదిలి దగ్గరలోని వేడినీటి బుగ్గల్లో స్నానం చేయడానికి శివునితోపాటు వెళ్లింది. వాళ్లు తిరిగి వచ్చేటప్పటికి ఇంటి లోపలవైపు తలుపుకు గడియ పెట్టి ఉంది. పార్వతీ దేవి ఆశ్చర్యచకితురాలైంది, ‘‘తలుపెవరు వేశారు..?’’ శివుడు ‘‘నేను చెప్పానుకదా? పిల్లవాణ్ణి ఎత్తుకోవద్దని. నీవు పిల్లవాణ్ణి ఇంట్లోకి తెచ్చావు, వాడు లోపలి నుండి తలుపు గడియ పెట్టాడు’’.

పార్వతీ దేవి ‘‘ఇప్పుడేం చేద్దాం’’ అన్నది.

శివుడికి రెండే మార్గాలున్నాయి: ఒకటి, ముందున్న దాన్నంతా దహించివేయడం. రెండు, మరో నివాస స్థానం వెతుక్కోవడం. అందువల్ల ఆయన, ‘‘ఎక్కడికన్నా వెళదాం. ఈ పిల్లవాడు నీకు చాలా ప్రియమైన వాడు కదా. నేను వాణ్ణి ఏమీ చేయను’’ అన్నాడు.

ఆ విధంగా శివుడు తన నివాసం కోల్పోయాడు. శివపార్వతులు ఆ ప్రాంతమంతా తిరిగారు. తగిన చోటు కోసం వెతికారు. చివరికి కేదార్‌నాథ్ లో స్థిరపడ్డారు. మరి ఇదంతా ఆయనకు ముందే తెలియదా? అని మీరు అడగవచ్చు. మీకెన్నో విషయాలు తెలుసు, కాని మీరు వాటినలా జరగనిస్తారు.
*ఆది శంకరాచార్యులు – బదరీనాథ్*

ఇక్కడి ఆలయాన్ని నిర్మించింది ఆదిశంకరాచార్యుల వారు కాబట్టి బదరీనాథ్‌కు ఒక చారిత్రక ప్రాముఖ్యం కూడా ఉంది. ఆదిశంకరులు వెయ్యేళ్లకు పూర్వం కేరళలోని కాలడిలో జన్మించారు. ఆయన బాలమేధావి. మానవాతీత సామర్థ్యాలున్న అత్యద్భుతమైన పండితుడు. రెండేళ్ల వయస్సులో సంస్కృతంలో ధారాళంగా మాట్లాడేవాడు, రాసేవాడు. నాలుగేళ్ల వయస్సులో వేదాలు అప్పజెప్ప గలిగాడు. పన్నెండేళ్ల వయస్సులో సన్యాసం తీసుకొని ఇల్లు వదిలిపెట్టాడు. అంత చిన్న వయస్సులో కూడా శిష్యుల్ని సంపాదించి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని పునః స్థాపించడానికి దేశమంతా పర్యటించడం ప్రారంభించాడు.

ఆదిశంకరులకు మార్గదర్శకుడు గౌడపాదులు. ఆయన మార్గ దర్శకత్వంలో శంకరులు సాటిలేని కృషి సాగించారు. గౌడపాదులు కూడా మన సంప్రదాయంలో భాగం. ఆయన అసమానమైన గురువు. కాని ఆయన బోధనలనెప్పుడూ ఎవరూ రాయలేదు. తన బోధనలను ఎవరూ రాయకుండా ఆయన జాగ్రత్త తీసుకున్నాడు. వేలాదిమందికి ఆయన బోధించి ఉంటాడు. కాని ఆయన పదిహేను, ఇరవైమందిని ప్రధాన శిష్యులుగా తయారుచేశాడు. ఈ గొప్ప వ్యక్తులు దేశంలో ఆధ్యాత్మిక శాస్త్రాన్ని పునః స్థాపించారు. వాళ్లు కొత్త మతాన్ని స్థాపించలేదు.

బదరీనాథ్ ఆలయాన్ని నిర్మించింది ఆదిశంకరులు. ఆయన అక్కడ తన సొంత ఊరి మనుషుల్నిపూజారులుగా ఏర్పరిచాడు. ఈ నాటికీ, ఆ ఆలయంలోని పూజారులు, అప్పట్లో ఆదిశంకరులు అక్కడ నెలకొల్పిన కుటుంబాల వారసులే. ఈ ఆలయంలో పూజారులని ‘నంబూద్రీ’ లంటారు. ఒక సందర్శనానికి ఈ ప్రాంతం అద్భుతమైన స్థలం. పట్టణం అంత గొప్పగా ఉండదు. కాని పరిసరాలు అద్భుతంగా ఉంటాయి. గోవింద్ ఘాట్ నుండి బదరీకి కారు ప్రయాణం అత్యద్భుతంగా ఉంటుంది. ఇది సుమారు 25 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ప్రపంచంలో అటువంటిది మరొకటి ఉండదు. ఈ 25 కి.మీ. ప్రయాణం మాత్రం అసాధారణం. పర్వతాలెలా ఉన్నాయో వర్ణించడానికి మాటలు చాలవు.

హిమాలయాలకు వెళ్ళడంలోని అంతరార్ధం ఏదో సాధించడానికి కాదు. లయమై పోవడానికి ఇదొక గొప్ప అవకాశం.

కాలడి నుండి బదరీనాథ్‌కు 3000 కిలోమీటర్లకు పైగా కాలినడక. ఆదిశంకరులు కేవలం దక్షిణం నుండి ఉత్తరానికే కాదు తూర్పు నుండి పడమటికి కూడా అంతదూరం నడిచారు. భారతదేశం కింది నుండి పైకి, పైనుండి కిందికీ మూడుసార్లు, తూర్పు నుండి పడమటికి ఒకసారీ నడిచారు. ఒకసారి ఆయన ఉత్తరాపథంలో ఉన్నప్పుడు, అయన తల్లికి మరణ దశ ఆసన్నమైన దని ఆయన అంతరంగం చెప్పింది. ఆమె మరణ సమయంలో ఆమె దగ్గరుంటానని, ఆయన ఆవిడకి వాగ్దానం చేశారు. అప్పుడే ఆమె ఆయనకు 12 సంవత్సరాల వయస్సులోనే సన్యాసం తీసికోవడానికి అనుమతించింది. ఆయన తల్లి జబ్బు పడిందనిపించగానే హుటాహుటిన తల్లివద్దకు నడిచివచ్చారు. మరణ సమయంలో తల్లి దగ్గర ఉన్నారు. కొద్దిరోజులు తల్లితో గడిపి, ఆమె మరణించిన తర్వాత మళ్లీ ఉత్తరాదికి నడిచి వెళ్లిపోయారు. హిమాలయాలకు వెళితే మీరు ఆశ్చర్యపోతారు. ఎవరైనా ఇంతింత దూరం, ఈ హిమాలయాల్లో ఎలా నడవగలరు? అందులో ఎంత ప్రయత్నం ఉందో ఊహించుకోండి. మోటార్ వాహనాలపై ప్రయాణం ‘తీర్థయాత్ర’ అన్నది లేకుండా చేసింది. మీరు నడిచినట్లయితే అది మీ జీవితాన్ని నిజంగా సుస్థిరపరుస్తుంది.

హిమాలయాలకు వెళ్ళడంలోని అంతరార్థం ఏదో సాధించడానికి కాదు. లయమై పోవడానికి ఇదొక గొప్ప అవకాశం. లయమవ్వ లేకపోయినా కనీసం మన ఉనికి ఎంత చిన్నదో అని అయినా తెలుసుకోగలగాలి. వేలాది సంవత్సరాల క్రితం రోడ్లూ, కార్లూ, బస్సులూ లేని కాలంలో, ఈ పర్వతాల మొదలు చివర తెలుసు కోవడానికి మ్యాప్ లు కూడా లేనికాలంలో, ప్రజలు ఈ పర్వతాల్లో ప్రయాణించారంటే మీరు నమ్మగలరా? కేవలం నడుస్తూ, వెళ్లడమే. మీరు యోగమార్గంలో నడవదలచుకుంటే ఇలా ఉండగలగాలి. అంతం ఎక్కడో తెలియదు, నడుస్తూ పొండి. ‘‘అది ఎక్కడ ఆరంభమవుతుందో, ఎక్కడ అంతమవుతుందో నాకు అవసరం లేదు. నేను అక్కడికి చేరే వరకు నడుస్తాను, నడుస్తూనే ఉంటాను.’’ మనిషిలో ఇటువంటి వైఖరీ, శక్తీ లేకపోయినట్లయితే ఆధ్యాత్మిక మార్గం లో నడవడం అసాధ్యం.

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya