Online Puja Services

వేంకటేశ్వరుని చేతుల్లోని ఆయుధాలు ఏమయ్యాయి ?

3.147.103.15

తిరుమల వేంకటేశ్వరుని చేతుల్లోని ఆయుధాలు ఏమయ్యాయి ?  
- లక్ష్మి రమణ 

తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడు స్వయంగా ఆ విష్ణుమూర్తే, శిలగా మారిన రూపమని పురాణాలు చెబుతాయి. మరి ఆ స్వామి నాలుగు చేతుల్లో ఉండాల్సిన ఆయుధాలు మూలమూర్తిలో లోపిస్తాయేందుకు? వాటిని కృత్రిమంగానే అలంకరిస్తారే తప్ప, సహజంగా ఉండే మూలమూర్తికి ఉండవు. ఎందుకిలా ?  ఎందుకు ఆయుధాలు దరించకుండా మనకు దర్శనమిస్తాడు? ఆయుధాలు లేవు అనుకుంటే, మరి స్వామి చేతుల్లో మనకి కనిపించే ఆయుధ స్వరూపాలు ఏమిటి ? 

వేంకటాద్రి సమం స్థానం
బ్రహ్మాండే నాస్తి కించన
వేంకటేశ సమో దేవో
న భూతో న భవిష్యతి.!!

అంతటి దివ్యమైన  వేంకటేశ్వరుని మూర్తి, అనుగ్రహం భూత భవిష్యత్ కాలాల్లో కూడా ఉండదు. ఇది ఆయన భక్తులకి తెలిసినదే !  కానీ , స్వామీ ఆయుధాలు ధరించక పోవడానికి కారణమైన స్థలవిశేషం చాలా మందికి తెలియకపోవచ్చు. దీనికి సంబంధించిన స్థలపురాణం ఇలా ఉంది. 

విష్ణుమూర్తి రక్షకుడు, శిక్షాదక్షుడు.  ప్రతి అవతారంలోనూ దైత్య సంహారం చేసి జగతిని రక్షించిన పురుషోత్తముడు ఆ దేవదేవుడు.  వేంకటేశ్వరుడు ఆయుధాలు ధరించి దర్శనం ఇవ్వకపోవడానికి కూడా అసుర సమాహారమే కారణం అయ్యింది.  

సింహాద అనే మహాదుష్టుడైన దైత్యుడు ఉండేవాడు.  అతడు బ్రహ్మను  గురించి తపస్సు చేసి మెప్పించి దేవదానవ, గంధర్వ, యక్ష కిన్నెర కింపురుష మానవులందరూ తనకు ఆధీనంలో ఉండేట్లు వరం సంపాదించాడు.  ఆ వర గర్వంతో అందరినీ హింసించడం ప్రారంభించాడు. ఆ బాధలు పడలేక దేవతలు తమ గోడు శ్రీనివాసునితో విన్నవించుకున్నారు.  దేవతలమొర విన్న శ్రీనివాసుడు వారిని బ్రాహ్మణ వేషంలో తొండమానుని శరణు వేడమని సలహా ఇస్తాడు.

దేవతల మొరవిన్న తొండమానుడు వారికి అభయం అయితే ఇచ్చాడు. కానీ సింహాదని ఎదిరించేందుకు శక్తినివ్వమని  శ్రీనివాసుని శరణు వేడాడు . అప్పుడు శ్రీనివాసుడు ఆ రక్కసిని మట్టుపెట్టడానికి  తొండమానునికి సహాయంగా తన శంఖం, చక్రం, గద, ఖడ్గం, ధనస్సులను ఇచ్చి ఆశీర్వదించి పంపాడు. అలా శ్రీనివాసుని ఆయుధాలతో , దేవా సైన్యంతో యుద్ధానికి తరలివెళ్లారు తొండమాన్ చక్రవర్తి.  దేవతలతో పోరాటానికి రాక్షసుడు సింహాద లక్ష కోటి బలగంతో తరలివచ్చి, పాపనాశన తీర్ధ స్థలంలో యుద్ధం చేసాడని పురాణం చెబుతోంది.

కానీ, తొండమానుడు స్వామి వారి ఖడ్గం, గద, ధనస్సుల ఆయుధాలను ఉపయోగించి ఒక 100 సార్లు ఆ రాక్షసుని తల నరికి తెన్చినా మరల బ్రతికి వచ్చేవాడు. ఆ మాయ అర్ధం కాక ఖిన్నుడైన చక్రవర్తి చెవిలో వాయుదేవుడు చక్రం ప్రయోగించమని చెబుతాడు. స్వామి వారి చక్ర మహిమతో శాశ్వతంగా ఆ దైత్యుడు మరణిస్తాడు. అలా యుద్ధంలో తొండమానుడికి సంహరించిన ఆయుధాలు, తిరిగి యుద్ధానంతరం  స్వామి వద్దకు వెళ్ళిపోయాయి.

తొండమానుడు స్వామి వారి వద్దకు వచ్చి భక్తితో ఈ విజయం స్వామి మహిమే అని కృతజ్ఞతలు వ్యక్తం చేశాడు.  ఆ భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు వరం కోరుకోమన్నారు.  ‘నీవు నాకు ఆయుధాలు అనుగ్రహించి నాకు విజయం చేకూర్చిన విషయం మనిద్దరికీ తప్ప మరెవరికీ తెలియదు,
అందరికీ తెలియాలంటే నీవు ఈ రూపంలో ఆయుధాలు ధరించకుండా వుండాలి’ అని కోరుకున్నాడు.  అలాగే ‘ స్వామి వారి ఆయుధాల ప్రసక్తి వచ్చినప్పుడు ఈ పర్వం అంతా  భక్తులు స్మరించడంచేత  నాకు శాశ్వత కీర్తి దక్కేలా  అనుగ్రహించమని వేడుకుంటాడు. 

వింత కోరికని వెలిబుచ్చిన తొండమానుడికి స్వామివారు ఇలా చెప్పారు. ‘ నాయీ సహజమైన ఆయుధాల్ని నేను వదిలినప్పటికీ,  కలియుగంలో ఒక పుణ్యశాలి నా శంఖచక్రాలను పోలినవి చేయించి విమానాదులను నిర్మింపజేస్తాడు.  అప్పుడు కృత్రిమములైన శంఖ చక్రాలను నేను  ధరిస్తానని’ అనుగ్రహించారు.ఆ విధంగా నేటికీ స్వామి ఆయుధాలు ధరించకుండానే దర్శమిస్తారు.  అయితే కృత్రిమమైన ఆయుధాల్ని స్వామికి ధరింపజేస్తారు.  వాటికి కారణం కూడా ఈ వర ప్రభావమే . 

ఆ తర్వాత స్వామి వారి ఆయుధాలు ఒకొక్క తీర్ధంగా  వసించడం ఆరంభించాయి.  వాటిల్లోని కపిలతీర్ధమే చక్రతీర్ధం. కాగా దానిపై వరుసగా శంఖ తీర్ధ, శాంగతీర్ధం, నందక తీర్ధం, కౌమోదక తీర్ధం అని పంచాయుధ తీర్దాలున్నాయి.

ఇంత  కథ ఉంది కాబట్టే కాబోలు ఆ అన్నమాచార్యుడు కొండలరాయుని పదాలు అల్లుతూ …  తొండమాను చక్రవర్తి రమ్మన్న చోటికివచ్చి నమ్మినవాడు. ఇమ్మన్నా వరములెల్లా ఇచ్చినవాడు అంటారు. చేసే వాడూ , చేయించేవాడూ సర్వమూ ఆ తిరుమల రాయుడి అయ్యుండగా చింతలు మనకెందుకు . చింతలకు జన్మనిచ్చే మనసులో కేవలం ఆ తిరుమల రాయుని పట్ల భక్తి శ్రద్ధలు నింపగలిగితే చాలు . ఆ గోవిందుడే కావలసినవన్నీ అనుగ్రహించి ఆదుకుంటాడు.  

నమో వెంకటేశాయ !!

Tirumala Tirupati Venkateswara Swami, Swamy, Balaji, Govinda, Srinivasa, TTD, ananda nilayam, srivaru, Srivaru, 

#venkateswaraswami #venkateshwara #venkateswara #ttd #anandanilayam #tondaman #srivaru #balaji #govinda #srinivasa

Quote of the day

In a gentle way, you can shake the world.…

__________Mahatma Gandhi