Online Puja Services

ఓం నమఃశ్శివాయ 
కార్తీకపురాణము - పదమూడవ అధ్యాయము , పదమూడవ  రోజు పారాయణము
సేకరణ: లక్ష్మి రమణ 

 ఓ జనక చక్రవర్తీ! కార్తీకమాసములో ఇంకా కూడా విధిగా చేయవలసిన ధర్మములు చాలాఉన్నాయి . వాటిని వివరిస్తాను . సావధానుడవై ఆలకించు .

కార్తీకమాసములో నదీస్నానం ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకి  ఉపనయనము చేయుట ముఖ్యము. ఒకవేళ ఉపనయనమునకు అయ్యే ఖర్చు మొత్తం  భరింప శక్యము కానప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరచినప్పటికీ ఆ కార్యమును నిర్వహించిన ఫలము దక్కుతుంది .

ఈవిధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినట్టయితే ఎంతటి  మహాపాపము చేసినా  , యెంతటి దుష్కృత్యములు చేసినా , ఆఖరికి వ్యభిచారం చేసినా  అ పాపములన్ని తొలగిపోతాయి . ఎన్ని నూతులూ, తటాకములూ త్రవ్వించినా ఇలా  ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము జేసినందువలన వచ్చే ఫలమునకు సరితూగవు.

దీనికన్నా ముఖ్యమైనది కన్యాదానము. కార్తీకమాసములో భక్తిశ్రద్ధలతో కన్యాదానము చేసినట్టయితే తను తరించడమే కాక , పితృదేవతలను కూడ తరింప జేసిన వాడు కాగలడు .ఈ విషయాన్ని వివరంగా తెలియజేసే ఒక యితిహాసాన్ని నీకిప్పుడు చెబుతాను , శ్రద్ధగా వినమని ఈ విధంగా చెప్పనారంభించాడు . 

సువీర చరిత్ర:

 ద్వాపరయుగములో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు, శూరుడు అయిన "సువీరు" డనే ఒక రాజుండేవాడు . ఆయన భార్య పేరు రూపవతి. ఒకసారి సువీరనకి  శత్రురాజుల చేతిలో ఓడిపోయి, భార్యతో అరణ్యమునకు పారిపోవలసిన దుస్థితి దాపురించింది.  ధన హీనుడయి నర్మదా నదీ తీరములో ఒక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదుల తింటూ కాలము గడపసాగాడు. 

కొన్ని రోజుల కాతని భార్య ఒక బాలికకు జన్మనిచ్చింది . తల్లిదండ్రులు ఆ బిడ్డను అతి గారాబముతో పెంచసాగారు . క్షత్రియ వంశములో జన్మించిన ఆ బాలికకు ఆహరాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ, శుక్లపక్ష చంద్రునివలె దినదినాభివృద్ధి పొందుతూ , అతి గారాబముతో పెరుగుచుండెను. ఆమె చూచువారలకు కనులపండువుగా, ముద్దు లొలుకు మాటలతో చాలా ముచ్చటగా ఉండేది .

రోజులు గడిచినకొద్దీ యవ్వనవతియై ఆమె అందములో  పూర్ణ చంద్రుని వలె ప్రకాశించసాగింది . ఒకరోజు వనప్రస్థుని కుమారుడు ఆ అమ్మాయిని చూసి , ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరాడు . అందుకా రాజు "ఓ ముని పుత్రా! ప్రస్తుతము నేను చాలా  బీదస్థితిలో ఉన్నాను. అష్ట దరిద్రములు అనుభవిస్తూన్నాను. మా కష్టములు తొలగడానికిగాను నాకు కొంత ధనమిచ్చినట్లయితే , నా కుమారైనిచ్చి పెండ్లి చేతు" నని చెప్పాడు.  తన చేతిలో రాగి పైసా అయినా లేకపోవడం చేత , ఆ బాలిక మీదున్న మక్కువతో ఆ మునికుమారుడు ,నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపస్సు చేశాడు.  కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించాడు .
రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి, తనకుమారైను ఆ మునికుమారునికిచ్చి పెండ్లిచేసి నూతన దంపతులిద్దరినీ అత్తవారింటికి పంపించాడు .ఆ విధంగా ఆ  మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి, అంతవరకు జరిగిన వృత్తాంతమంతా  చెప్పి భార్యతో సుఖంగా జీవించసాగాడు .

 సువీరుడు ముని కుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్చగా ఖర్చుపెడుతూ  భార్యతో సుఖంగా ఉన్నాడు . ఆ విధంగా  కొంతకాలము జరిగిన తర్వాత, ఆరాజు భార్యామణి మరొక బాలికకి జన్మనిచ్చింది . అ బిడ్డకు కూడా యుక్త వయస్సురాగానే, మరలా ఇంకెవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో వారు ఎదురుచూడ సాగారు.

 ఒకానొక సాధుపుంగవుడు తపతీనదీ తీరమునుండి, నర్మదానదీ తీరమునకు స్నానార్ధమై వస్తూ , దారిలోనున్న సువీరుని కలుసుకొని "ఓయీ! నీవెవరు ? నీముఖ వర్చస్సు చూస్తుంటే, రాజవంశములో జన్మించినవానిలాగా కనిపిస్తున్నావు . నీవీ అరణ్యములో  భార్యాబిడ్డలతో నివసించడానికి కారణమేమి?" అని ప్రశ్నించాడు .  

సువీరుడు "మహానుభావా! నేను ఒకప్పుడు వంగదేశముని పరిపాలించే రాజుని , నా పేరు సువీరుడు. నా రాజ్యమును శత్రువులు ఆక్రమించడం చేత భార్యా సమేతముగా ఈ  యడవిలో నివశిస్తున్నాను . దరిద్రము కంటె కష్టమైనదేదీ లేదుకదా . పుత్ర శోకము కంటె గొప్ప దుఃఖము కూడా  లేదు. అదేవిధంగా భార్యా వియోగము కంటే గొప్పసంతాపము మరొకటిలేదు. నేను రాజ్యభ్రష్ఠుడనైతిని.  కాబట్టి యీ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుతున్నాను. నాకు యిద్దరు కుమార్తెలు. వారిలో  మొదటి కుమార్తెను ఒక ముని పుత్రునికిచ్చి, వాని వద్ద కొంతధనము పుచ్చుకున్నాను . దానితోనే యింతవరకు కాలక్షేపము చేయుచున్నాను" అని తనగురించి సవివరంగా తెలియజేశాడా సువీరుడు . 

, "ఓ రాజా! నీవు యెంతటి దరిద్రుడవైనా  ధర్మసూక్ష్మములు ఆలోచింపక కన్యను అమ్ముకున్నావు. కన్యావిక్రయము మహాపాతకములలో ఒకటి.  కన్యను విక్రయించినవారు "అసిపత్రవన" మనే  నరకాన్నీ అనుభవిస్తారు .

అలా సంపాదించిన ద్రవ్యముతో దేవ,ముని, పితృదేవతా ప్రిత్యర్ధము యే వ్రతము చేసినా  వారు నశిస్తారు . అంతేగాక , కన్యా విక్రయము చేసిన వారికి పితృ దేవతలు పుత్ర సంతతి కలుగకుండా శపిస్తారు .అదేవిధంగా , కన్యను ధనమిచ్చికొని పెండ్లాడిన వారు చేసేటటువంటి  గృహస్థ ధర్మములు వ్యర్థమవడమేగాక, అతడు మాహానరకాని అనుభవిస్తాడు .

కన్యావిక్రయము చేసిన వారికి ప్రాయశ్చిత్తమే లేదని పెద్దలు చెప్పి ఉన్నారు . కాబట్టి , రాబోయే కార్తీకమాసములో  నీ రెండవ కుమార్తెను నీ శక్తికొలది బంగారు ఆభరణములతో అలంకరించి, సదాచార సంపన్నునకి , ధర్మబుద్ధిగలవానికి కన్యాదానము చేయి . ఈ విధంగా చేస్తే , నీవు  గంగాస్నానము చేసిన  ఫలము, అశ్వమేధ యాగము చేసిన ఫలమును పొందుటయేగాక, మొదటి కన్యను అమ్మడం వలన మూటగట్టుకున్న  పాప ఫలము కూడా తొలగి పోతుంది " అని రాజునకు హితోపదేశము చేశాడు 

 అందుకా రాజు చిరునవ్వు నవ్వి, "ఓ మునివర్యా! దేహ సుఖము కంటె దాన ధర్మముల వలన వచ్చిన ఫలము యెక్కువా? తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోను సిరి సంపదలతోను సుఖముగా వుండక, చనిపోయిన తర్వాత వచ్చే ఏదో  మోక్షము కోసము ప్రస్తుతమున్న అవకాశమును చేజేతులారా జార విడువమంటారా? ధనము, బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింప గలరుకాని, ముక్కు మూసుకొని, నోరు మూసుకొని, బక్కచిక్కి శల్యమై యున్న వారిని లోకము గుర్తిస్తుందా? గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు, కాబట్టి , నా రెండవ కుమర్తెను కూడా నేనడిగినంత ధనమెవరిస్తారో  వారికే యిచ్చి పెండ్లి చేస్తాను . అంతే కాని, కన్యా దానము మాత్రము చేయను" అని నిక్కచ్చిగా చెప్పాడు . ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు .

ఆ తర్వాత కొంతకాలానికి సువీరుడు మరణించాడు . వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకొనిపోయి, యమలోకములో అసిపత్రవన మనే  నరక భాగములో పడవేసి అనేక విధములుగా బాధించారు . సువీరుని పూర్వీకుడైన శ్రుతకీర్తి అనే  రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన తర్వాత స్వర్గములో  సర్వసౌఖ్యములు అనుభవిస్తూండేవాడు . సువీరుడు చేసిన కన్యావిక్రయము వలన, ఆ శ్రుతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చారు .

 అప్పుడా శ్రుతకీర్తి "నాకు తెలిసి ఉన్నంతవరకూ యితరులకు ఉపకారమును చేసి దానధర్మాదులు, యజ్ఞయాగాదులు చేసి ఉన్నాను .  నాకీ దుర్గతి ఎందుకు కలిగిందో ?" అని మనసులో అనుకుంటూ ,  నిండుకొలువు తీరిఉన్న యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి , నమస్కరించి "ప్రభూ! నీవు సర్వజ్ఞుడవు. ధర్మమూర్తివి. బుద్ధిశాలివి.  ప్రాణకోటి నంతటినీ సమంగా చూసే సమవర్తివి . నా జీవితకాలంలో నేనెన్నడూ ఏ పాపమూ చేయలేదు . నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తీసుకురావడానికి కారణమేమిటో సెలవీయాల్సిందిగా కోరుకుంటున్నాను ? " అని ప్రాధేయ పడ్డాడు . 

అప్పుడు  యమధర్మరాజు శ్రుతకీర్తిని చూసి , 'శ్రుతకీర్తీ! నీవు న్యాయమూర్తివి. ధర్మజ్ఞుడవు, నీ వెటువంటి దురాచారములూ చేయలేదు . కానీ ? నీ వంశీయుడైన సువీరుడు తన జ్యేష్ట పుత్రికను ధనమునాశించి అమ్ముకున్నాడు . కన్యని అమ్ముకునేవారి పూర్వీకులు యిటు మూడు తరాలవారు, అటు మూడు తరాల వారున్నూ,  వారు ఎంతటి పుణ్యపురుషులైనా నరక మనుభవించడమే గాక, నీచ జన్మలు ఎత్తవలసి ఉంటుంది . నీవు పుణ్యాత్ముడవని, ధర్మాత్ముడవని నాకు తెలుసు . కాబట్టి  నీకు ఒక ఉపాయాన్ని చెబుతాను విను’. అని ఇలా చెప్పసాగాడు  . ‘నీ వంశీయుడగు సువీరునకు ఇంకొక కుమార్తె ఉంది . ఆమె నర్మదా నదీతీరాన తన తల్లి వద్ద పెరుగుతోంది . నా యాశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చగలవు.  నీవు అక్కడికి వెళ్లి ఆ కన్యని  వేదపండితుడు, శీలవంతుడు అయిన ఒక విప్రునకు కార్తీకమసమున సాలంకృతముగా కన్యాదానము చేయించు.

ఆ విధముగా చేసినట్లయితే,  నీవు, నీ పూర్వీకులు, సువీరుడు, మీ పితృగణములు కూడా స్వర్గలోకమును పొందగలరు . కార్తీకమాసములో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడవుతాడు . పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినా ,లేక విధివిధానముగా ఆంబోతునకు వివాహం చేసినా  కన్యాదానఫలం దక్కుతుంది . కాబట్టి , నీవు వెంటనే భూలోకమునకు వెళ్లి నేను చెప్పినట్లు చేసి మీ పితృగణాలను తరింపజేయి’ మని చెప్పారు. 

శ్రుతకీర్తి యమునకు నమస్కరించి, సెలవు తీసుకొని, నర్మదా తీరమున ఒక పర్ణ కుటీరములో నివసిస్తున్న సువీరుని భార్యను, కుమార్తెను చూసి సంతోషపడి, ఆమెతో యావత్తు విషయములు వివరించి, కార్తీకమాసమున సువీరుని రెండవ కుమారైను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన యొక బ్రాహ్మణ యువకునికిచ్చి అతివైభవంగా వివాహము చేసాడు . ఆ విధంగా  కన్యాదానము చేయడం  వలన సువీరుడు కూడా పాప విముక్తుడై, స్వర్గ లోకములో ఉన్న పితృ దేవతలను కలుసుకున్నాడు .

 కన్యా దానము వలన మహా పాపములు కూడా నాశనమవుతాయి . వివాహ విషయములో ఎవరికైనా మాట సహాయము చేసినా , పుణ్యము కలుగుతుంది . కార్తీక మాసములో కన్యాదానము చేయాలని దీక్షబూని అచరించినవాడు, విష్ణుసాన్నిధ్యము పొందుతాడు . శక్తి కలిగియుండి ఉదాసీనత చూపు వాడు శాశ్వత నరకమును పొందగలడు .

స్కాందపురాణాంతర్గత, వశిష్ఠప్రోక్త, కార్తీక మాహత్మ్యమందలి,   పదమూడవ అధ్యాయము , పదమూడవ  రోజు పారాయణము  సమాప్తము.

సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు !!

స్వస్తి !

Videos View All

కార్తీక పురాణం - ముప్పదవ అధ్యయము
కార్తీక పురాణం - ఇరవైతొమ్మిదవ అధ్యయము
కార్తీక పురాణం - ఇరవైఎనిమిదవ అధ్యాయము
కార్తీక పురాణం - ఇరవైఏడవ అధ్యాయము
కార్తీక పురాణం - ఇరవైఆరవ అధ్యాయము
కార్తీక పురాణం - ఇరవైఐదవ అధ్యాయము

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha