Online Puja Services

ఓం నమఃశ్శివాయ 
కార్తీకపురాణము ,దశమాధ్యాయము పదవ రోజు పారాయణము 
సేకరణ: లక్ష్మి రమణ 

జనకుడు వశిష్ఠులవారిని చూసి  "మునిశ్రేష్ఠా! అసలు యీ అజామీళుడు ఎవరు ? అతని పూర్వజన్మ మెటువంటిది? పూర్వజన్మలో ఎటువంటి పాపములు చేశాడు ? ఇప్పుడు విష్ణుదూతలు అతన్ని వైకుంఠానికి తీసువెళ్లారు కదా ! ఆ తర్వాత ఏం జరిగింది ?వివరించండి” అని ప్రార్ధించాడు . అప్పుడా మునిశ్రేష్ఠుడు జనకమహారాజుని చూసి , ఈ విధంగా చెప్పనారంభించాడు . 

        “జనకా! అజామీళుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొనిపోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువైన  యమధర్మరాజు దగ్గరికి వెళ్లి , "ప్రభూ! తమ ఆజ్ఞ ప్రకారము అజామీళుని తీసుకొనిరావడానికి వెళ్ళాము . కానీ అక్కడికి విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి, అజామీళుని విమానమెక్కించి, వైకుంఠమునకు తీసుకుపోయారు. ఇక   మేము చేసేదేమీలేక , విచారిస్తూ ఇక్కడికి తిరిగివచ్చాము ." అని భయకంపితులై విన్నవించుకున్నారు .

"ఔరా! ఎంతపని జరిగింది ? ఎప్పుడూ ఈ  విధముగా జరిగి ఉండలేదే? దీనికి బలమైన కారణము ఏదైనా వుండి ఉండవచ్చును" అని యముడు తన దివ్య దృష్టితో అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని, "ఓహో! అదా సంగతి! తన అవసానకాలములో  'నారాయణా' అని వైకుంఠవాసుని నామస్మరణ చేశాడు . అందుకుగాను విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకుపోయారు . తెలియక గాని, తెలిసి గానీ మృత్యుసమయములో  హరినామ స్మరణ ఎవరు చేస్తారో , వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగుతుంది . ఆవిధంగా , అజామీళునకు వైకుంఠప్రాప్తి  కలిగింది కదా!" అనుకున్నాడు .

అజామీళుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశములోని  ఒక శివాలయములో అర్చకుడుగా ఉండేవాడు . అతడు తన అపురూపమైన అందంచేత, సిరిసంపదలచేత, బలముచేత గర్విష్ఠియై, వ్యభిచారియై, శివారాధన చేయక, శివాలయముకు సంబంధించిన ధనమును అపహరిస్తూ ,  శివునికి   ధూపదీప నైవేద్యములను సమర్పించక , దుష్టసహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరిగేవాడు . 

ఒక్కొక్కప్పుడు శివాలయములో పరమేశ్వరుని కెదురుగా పాదములుంచి పడుకునేవాడు . ఇతనికొక బీద బ్రాహ్మణస్త్రీతో రహస్య సంబంధముండేది . అమె కూడా అందమైనది.  బీదరికం వల్ల ఆమె భర్త చూసీ చూడనట్టుండి , భిక్షాటనకై వూరూరా తిరుగుతూ ఏదోవేళకు యింటికి వచ్చి కాలం గడుపుతుండేవాడు.

ఒకనాడు పొరుగూరికి వెళ్లి యాచన చేసి పెద్దమూటతో బియ్యము కూరలూ నెత్తినిబెట్టుకొని వచ్చి అలసిపోయి వచ్చాడు .  "నాకు ఈ రోజు బాగా  ఆకలి వేస్తోంది . త్వరగా వంటచేసి వడ్డించు “ అని భార్యతో చెప్పాడు .  అందుకామె, అతన్ని  చీదరించుకుంటూ , నిర్లక్ష్యముతో కాళ్లు కడుక్కోవడానికి నీళ్లుకూడా ఇవ్వకుండా , అతని వంక కన్నెత్తయినా  చూడక, విటులపై మనస్సు గలదై, భర్తని తూలనాడసాగింది . దాంతో  భర్తకు కోపము వచ్చి, మూలనున్న కఱ్ఱ తీసి నాలుగు బాదాడు  .

దాంతో ఇంకారెచ్చిపోయిన  ఆమె భర్త చేతినుండి కఱ్ఱ లాక్కొని,  భర్తను అంతకు  రెండింతలు కొట్టి బైటకుత్రోసి తలుపులు మూసేసింది . అతడు చేసేదేమీలేక , అప్పటికే భార్యపై విసుగు పుట్టి ఉండడం వలన , ఇక యింటిముఖము పట్టరాదని తలపోసి దేశాటనానికి వెళ్ళిపోయాడు . 
భర్త యింటినుండి వెళ్లిపోయాడని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుని ఉండగా ,  ఒక చాకలి వాడు ఆ దారిని వెళుతుండడాన్ని గమనించి , ఆ రాత్రికి తనతో గడపమని ఆహ్వానించింది .

         అప్పుడా  చాకలి "తల్లీ! నీవు బ్రాహ్మణ స్త్రీవి . నేను ,చాకలివాడిని. మీరీవిధముగా నన్ను పిలవడం యుక్తమైనది కాదు . నేను ఇటువంటి పాపాన్ని  చేయజాలను" అని బుద్ధిచెప్పి వెళ్ళిపోయాడు .  ఆమె ఆ చాకలి వాని అమాయక త్వమునకు లోలోన నవ్వుకొని అక్కడి నుండి బయలుదేరి,  ఆగ్రామ శివార్చకుని దగ్గరకు వెళ్లి  తన కామవాంచ తీర్చమని పరిపరివిధముల బ్రతిమాలి, ఆ రాత్రంతా అతనితో గడిపి వుదయమున యింటికి వచ్చి "అయ్యో! నేనెంతటి పాపమునకు ఒడిగట్టాను ? అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను యింటినుండి వెళ్లగొట్టి , క్షణికమయిన కామవాంఛకు లోనయి మహాపరాధము చేశాను " అని పశ్చాత్తాపపడింది . వెంటనే ఒక కూలివానిని పిలిపించి, కొంత ధనమిచ్చి తన భర్తను వెదకి తీసుకురావలసినదిగా చెప్పి పంపించింది . కొన్ని రోజుల తర్వాత, ఆమె  భర్త యింటికి తిరిగి వచ్చాడు . అప్పుడు అతని  పాదములపైబడి తన తప్పులను క్షమించమని ప్రార్థించింది . అప్పటినుండి యామె మంచి నడవడికను అవలంబించి భర్త అనురాగమును పొందగలిగింది  .

ఇదిలా ఉండగా , శివార్చకునకు ఏదో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణిస్తూ మరణించాడు . అతడు రౌరవాది నరక కూపములబడి, నానాబాధలు పొంది, మరల నరజన్మ మెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీకమాసములో  నదీస్నానము చేసి, దేవతాదర్శనము చేసి ఉండడం వలన , ఏడు  జన్మముల పాపములు నశించిపోయాయి. అందుకే ఈ జన్మలో  అజామీళుడై పుట్టాడు .    ఇప్పటికి తన అవసానకాలములో  'నారాయణా' అని శ్రీహరిని స్మరించడం వలన వైకుంఠమునకు పోయాడు .

బ్రాహ్మణుని భార్యఅయిన ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయింది . అనేక యమయాతనలను అనుభవించి ఒక మాలవాని యింట జన్మించింది . ఆతను కూతురి జన్మరాశి చూపించగా తండ్రిగండమున పుట్టినదని జ్యోతిష్యుడు చెప్పాడు .

అప్పుడా తండ్రి ఆ శిశువును తీసుకుపోయి అడవిలో వదలిపెట్టాడు . అంతలో ఒక  విప్రుడు ఆదారిన పోతూ  పిల్లయేడుపు విని జాలికలిగి తీసుకుపోయి తన యింట దాసికిచ్చి పోషించమన్నాడు . ఆ బాలికనే అజామీళుడు ప్రేమించాడు . ఇదే వారి పూర్వజన్మవృత్తాంత” మని వివరించాడు వశిష్ఠమహర్షి .
 నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించడం , దానధర్మములు చేయడం , శ్రీహరి కథలను ఆలకించడం , కార్తీకమాస స్నానం విధిగా ఆచరించడం వంటి వాటి ప్రభావముల వలన నెటువంటివారైనా  మోక్షము పొందగలరు .  కార్తీకమాసములో వ్రతములు, పురాణ శ్రవణములు చేసినవారు  ఇహపర సుఖాలని  పొందగలరు.

 స్కాందపురాణాంతర్గత, వశిష్ఠప్రోక్త, కార్తీక మాహత్మ్యమందలి, దశమాధ్యాయము- పదవ రోజు పారాయణము సమాప్తము.

సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు !!

స్వస్తి !

Videos View All

కార్తీక పురాణం - ముప్పదవ అధ్యయము
కార్తీక పురాణం - ఇరవైతొమ్మిదవ అధ్యయము
కార్తీక పురాణం - ఇరవైఎనిమిదవ అధ్యాయము
కార్తీక పురాణం - ఇరవైఏడవ అధ్యాయము
కార్తీక పురాణం - ఇరవైఆరవ అధ్యాయము
కార్తీక పురాణం - ఇరవైఐదవ అధ్యాయము

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya