Puranam

ఓం నమః శ్శివాయ 
కార్తీక పురాణం తృతీయాధ్యాయం  - మూడవరోజు పారాయణ  
సేకరణ: లక్ష్మి రమణ 

జనక మహారాజా! కార్తీకమాసములో  ఏ ఒక్క చిన్నదానము చేసినా , అది గొప్ప ప్రభావము గలదై వారికి సకల ఐశ్వర్యాలనీ కలగజేయడమే కాక,  మరణానంతరము శివసాన్నిధ్యమును ప్రసాదిస్తుంది . 

         కాని, కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడువలేక, కార్తీకస్నానములు చేయక, అవినీతిపరులై, భ్రష్టులై సంచరించి చివరకి క్షుద్రజన్మలు పొందుతారు. అంటే,  కోడి, కుక్క, పిల్లిగా వంటి జన్మలు పొందుతారు .

       కనీసము కార్తీకమాస శుక్లపౌర్ణమి నాడైనా, స్నానదాన జపతపాదులు చేయకపోవుటవలన అనేక చండాలాది జన్మలెత్తి చివరకి  బ్రహ్మరాక్షసిగా పుడతారు . దీనిని గురించి నాకు తెలిసిన ఒక ఇతిహాసాన్ని నీకు వినిపిస్తాను . సపరివారముగా శ్రద్ధగా విను అని ఇలా చెప్పనారంభించారు .

   భ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట:

          ఈ భరత ఖండములోని దక్షిణ ప్రాంతములోని ఒక గ్రామములో మహావిద్వాంసుడు, తపశ్శాలి, జ్ఞానశీలి , సత్యవాక్య పరిపాలకుడు అయిన 'తత్వనిష్ఠు'డనే  బ్రాహ్మణుడు ఉండేవాడు . ఒకనాడా బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరాడు .

          ఆ తీర్థసమీపములో ఒక మహావట వృక్షంబుపై భయంకర ముఖములతోనూ, దీర్ఘకేశములతోనూ, బలమైన కోరలతోనూ, నల్లని బాన పొట్టలతోనూ, చూసే వారికి భయాన్ని కలిగించేలా ఉండే ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసిస్తుండేవారు. ఆ దారిన వెళ్లే  బాటసారులను బెదిరించి,  వారిని భక్షిస్తూ ఉండేవాళ్ళు . 

             తీర్థ యాత్రకై బయలుదేరి అఖండ గోదావరీ పుణ్యక్షేత్రములో  పితృదేవతలకు పిండప్రదానము చేయదానికి బయల్దేరిన ఆ  విప్రుడు అదే వృక్షము దగ్గరికి వచ్చేసరికి ,  యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతన్ని చంపబోయారు. అప్పుడా  బ్రాహ్మణుడు వారి  భయంకర రూపములను చూసి  గజగజ వణకుతూ ,       నారాయణస్తోత్రము ను గట్టిగా చదువుతూ, "ప్రభో!ఆర్తత్రాణపరాయణా! అనాధ రక్షకా! ఆపదలోఉన్న గజేంద్రుని, నిండుసభలో అవమానాల పాలవుతున్న మహాసాధ్వి ద్రౌపదినీ, బాలుడగు ప్రహ్లాదునీ రక్షించిన విధముగానే - యీ పిశాచాల బారినుండి నన్ను రక్షించు తండ్రీ!" అని  వేడుకున్నాడు .  

ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి "మహానుభావా! మీ నోటినుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయ్యింది . మమ్మల్ని రక్షించండి " అని ప్రాధేయపడ్డారు.   వారి మాటలకు ఆ విప్రుడు ధైర్యం తెచ్చుకుని “ మీరెవరు? ఎందుకు మీకీ రాక్షస రూపాలు కలిగాయి ? మీ వృత్తాంతము తెలియజేయండి " యని ప్రశ్నించాడు . 

             "విప్రపుంగవా! మీరు పూజ్యులు. ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు, మీ దర్శనభాగ్యం వలన మాకు పూర్వజన్మ జ్ఞానము కలిగింది . ఇకనుండి మీకు మా వలన ఏ ఆపదా కలుగదు" అని అభయమిచ్చారు . ఆ తర్వాత వారిలోని ఒక  బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతాన్ని ఇలా చెప్పనారంభించాడు . 

         "నాది ద్రావిడదేశం. బ్రాహ్మణుడను. నేను మహా పండితుడనని గర్వించాను . న్యాయాన్యాయ విచక్షణలు విడిచి పశువులాగా  ప్రవర్తించాను . బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్థులవద్ద దౌర్జన్యంగా ధనం లాక్కొని , దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక, పండితులని అవమానపరుస్తూ , పిసినారినై లోకకంటకుడిగా ప్రవర్తించసాగాను 

           ఒకరోజు ఒక పండితుడు కార్తీకమాస వ్రతమును యథావిథిగా ఆచరించి భూతతృప్తి కోసం బ్రాహ్మణ సమారాధన చేసే ఉద్దేశ్యంతో తగిన ధనాన్ని సమకూర్చుకోవడానికి నగరానికి వెళ్ళి ,  తిరుగు ప్రయాణములో మాయింటికి అతిథిగా వచ్చారు . ఆ పండితుని నేను దూషించి, కొట్టి అతని వద్దఉన్న ధనము, వస్తువులు లాక్కొని నా యింటినుండి గెంటేశాను .

 అందులకా విప్రునకు కోపమొచ్చి, 'ఓరి నీచుడా! అన్యాక్రాంతముగా డబ్బుకూడబెట్టినది చాలక, మంచి చెడ్డలు తెలియక, తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తుసామాగ్రిని దోచుకున్నావు .  కాబట్టి , నీవు రాక్షసుడవై నరభక్షకుడివిగా నిర్మానుష్య ప్రదేశంలో నుందువుగాక' యని శపించాడు . దాంతో  నాకీ రాక్షస రూపము కలిగింది .

బ్రహ్మస్త్రమునైనా తప్పించుకోవచ్చును గాని బ్రాహ్మణశాపమును తప్పించలేము గదా! నేను నా అపరాధము క్షమింపుమని ఆయనని ఎన్నో విధాల ప్రార్ధించాను . అప్పుడతను దయదలచి 'ఓయీ! గోదావరి క్షేత్రములో ఒక వటవృక్షము ఉంది.  నీవు దానిపైన నివశించు.  ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి, పుణ్యఫలమును సంపాదించి ఉంటాడో ,   అటువంటి  బ్రాహ్మణుని వలన పునర్జన్మని పొందగలవు ' అని శాపవిమోచనాన్ని అనుగ్రహించి వెళ్ళిపోయాడు . అప్పటినుండీ నేను ఈ రాక్షస రూపంలో ఉండి , నరమాంస భక్షణ చేస్తూ కాలంగడుపుతున్నాను. కాబట్టి , ఓ విప్రోత్తమా , నన్నూ , నా కుటుంబాన్నీ రక్షించు అని వేడుకుంటూ  తన వృత్తాన్ని వివరించాడు  మొదటి బ్రహ్మరాక్షసుడు . 

ఇక  రెండవ రాక్షసుడు తన కథ చెప్పడం మొదలుపెట్టాడు .    "ఓ ద్విజోత్తమా! నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సహవాసముచేసి తల్లితండ్రులను బాధించి వారికి తిండిపెట్టక మాడ్చి అన్నమో రామచంద్రా అని వారు అల్లాడిపోయేలా చేసాను . వారి ఎదురుగానే  నా భార్యాబిడ్డలతో కలిసి పంచభక్ష్య పరమాన్నములని ఆరగించాను . దానధర్మములు అంటే ఏమిటో నాకు తెలీదు . నేనెప్పుడూ వాటిని ఆచరించలేదు . నా  బంధువులను కూడా హింసించి, వారి ధనాన్ని అపహరించి రాక్షసునివలె ప్రవర్తించాను . దానికి ప్రతిఫలంగానే నాకీ రాక్షత్వం కలిగింది . నాన్ని పాపపంకిలము నుండీ ఉద్ధరించు !” అని ఆ బ్రాహ్మణుని పాదాలమీదపడి పరిపరి విధాలా వేడుకుంటూ , తన కథని వివరించాడు రెండవ రాక్షసుడు . 

ఆ తర్వాత మూడవ రాక్షసుడు  తన కథని మొదలుపెట్టాడు. "మహాశయా! నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా పనిచేసేవాడిని . స్నానమైననూ చేయక, కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుతుండే వాడిని.  భగవంతునికి ధూపదీప నైవేద్యములైనా సమర్పించక , భక్తులు తెచ్చిన సంభారాలని  నా వుంపుడుగత్తెకు తారుస్తూ ,  మద్యమాంసములను సేవిస్తూ పాపకార్యములు చేసినందు వల్ల , నా మరణానంతరము నాకీ  రూపము ప్రాప్తినిచ్చింది. కాబట్టి వారిద్దరితోపాటు , నన్నుకూడా ఉద్ధరించి పాపవిముక్తుని చేయమని " ప్రార్ధించాడు . 

ఓ జనక మహారాజా! తపోనిష్టుడైన ఆ విప్రుడు పిశాచాల దీనాలాపము లాలకించి 'ఓ బ్రహ్మరాక్షసులారా! భయపడకండి . మీరు పూర్వజన్మలలో చేసిన ఘోరకార్యాలవల్లనే మీకీరూపములు కలిగాయి . నావెంట రండి . మీకు విముక్తిని కలిగిస్తాను  ' అని వారిని ఓదార్చి తనతోటి ఆ ముగ్గురినీ తనతోటి తీసుకువెళ్లాడు. అలా వారి  యాతనావిముక్తి కోసం తానె  సంకల్పము చెప్పుకొని,  స్వయముగా గోదావరిలో స్నానం చేసి , ఆ  స్నానపుణ్యఫలముని , ఆ  ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోశాడు . దాంతో  వారివారి రాక్షసరూపములు మాసిపోయాయి . ముగ్గురూ కూడా దివ్యరూపములు ధరించి వైకుంఠమునకు చేరారు .

 కాబట్టి , ఓ జనక మహారాజా ! కార్తీకమాసములో గోదావరీ స్నానమాచరించినట్లయితే , హరిహరాదులు సంతృప్తి పొంది , వారికి సకలైశ్వర్యములు ప్రసాదిస్తారు . అందువలన, ఎంత ప్రయత్నించయినాసరే, కార్తీకస్నానాలని చక్కగా ఆచరించాలి”. అని చెప్పారు . 

 స్కాందపురాణాంతర్గత, వశిష్ఠప్రోక్త, కార్తీక మాహత్మ్యములోని మూడవ యధ్యాయము, మూడవ రోజు పారాయణము సమాప్తము. 

సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు . స్వస్తి .

Videos View All

కార్తీక పురాణం - ముప్పదవ అధ్యయము
కార్తీక పురాణం - ఇరవైతొమ్మిదవ అధ్యయము
కార్తీక పురాణం - ఇరవైఎనిమిదవ అధ్యాయము
కార్తీక పురాణం - ఇరవైఏడవ అధ్యాయము
కార్తీక పురాణం - ఇరవైఆరవ అధ్యాయము
కార్తీక పురాణం - ఇరవైఐదవ అధ్యాయము

Quote of the day

First they ignore you, then they laugh at you, then they fight you, then you win.…

__________Mahathma Gandhi