Online Puja Services


కార్తీక పురాణం  
ప్రథమాధ్యాయం -మొదటిరోజు పారాయణం 
సేకరణ: లక్ష్మి రమణ 

శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండమునందలి ఆర్యావర్తమందు, నైమిశారణ్యములో శౌనకాది మహామునులతో ఒక  ఆశ్రమమును నిర్మించుకొని సకల పురాణములు, పుణ్య చరిత్రలు వారికి వినిపిస్తూ, సూతమహాముని కాలం గడుపుతున్నారు .

ఒకరోజు, శౌనకాది మునులు గురుతుల్యుడైన ఆ సూతమహర్షిని , “ఆర్యా ! తమ వలన అనేక పురాణేతిహాసములను, వేదవేదాంగ రహస్యములను సంగ్రహముగా తెలుసుకున్నాము .కార్తీక మాస మహత్యమును కూడా వివరించి,  దాని ఫలమును తెలియజేయమని” వేడుకున్నారు . 

 అప్పుడు సూతమహర్షి, 'ఓ ముని పుంగవులారా ! ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు - సృష్టికర్త అయిన ఆ  బ్రహ్మను కోరగా-  బ్రహ్మదేవుడు నారదునికి , విష్ణుమూర్తి - లక్ష్మీ దేవికి, సాంబశివుడు-పార్వతీ దేవికీ  ఆ గాథను వినిపిచారు . అలాంటి ప్రాస్త్యమైన  పురాణ కథను మీకు ఇప్పుడు చెబుతాను . 

ఈ కథను వినడంవలన మానవులకు ధర్మార్ధములు  కలగడమే గాక, వారు యిహమందును,  పరమందును, సకలైశ్వర్యములతో తులతూగుతారు. కాబట్టి దీనిని  శ్రద్ధగా వినండి.” అని ఇలా చెప్పడం  ఆరంభించారు .

 పూర్వము ఒకానొక రోజు  పార్వతీ పరమేశ్వరులు ఆకాశ విహారం చేస్తుండగా, పార్వతీ దేవి, 'ప్రాణేశ్వరా సకలైశ్వర్యములు కలుగజేసేది , వర్ణభేదములు లేక సకల మానవులు ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులున్నంత వరకు ఆచరింపబడేది అయినటువంటి  వ్రతము'ను వివరించండి అని కోరింది.

అప్పుడు మహేశ్వరుడు మందహాముతో ,  'దేవీ!' నీవు అడుగుతున్నా వ్రతము స్కాందపురాణములో చెప్పబడిఉన్నది. దానినిప్పుడు వశిష్ట మహాముని మిథిలాధీశుడైన జనక మహారాజునకు వివరించబోతున్నారు. ఒకసారి ఆ మిథిలా నగరము వైపుగా నీ దృష్టిని సారించమని’ ఆ దృశ్యాన్ని చూపించారు . 

అక్కడ , మిథిలా నగరములో వశిష్టుని రాకకు జనకుడు సంతసించి, అర్ఘ్యపాద్యములతో సత్కరించి, కాళ్ళు కడిగి, ఆ జలమును శిరస్సుపై జల్లుకొని 'మహాయోగీ! మునివర్యా! తమ రాక వల్ల, తమ పాద ధూళీ చేత- నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమయ్యాము. తమరు ఇక్కడికి ఏపనిమీద వచ్చారో సెలవీయండి , అని వేడుకొన్నాడు .

అందుకు వశిష్టుడు 'జనక మహారాజా! నేనొక మహా యజ్ఞము చేయాలనుకుంటున్నాను .  దానికి కావలసిన అర్ధ బలమును, అంగ బలము నీ ద్వారా సమకూర్చుకొని , ఆ  క్రతువు ప్రారంభించాలని నిశ్చయించుకున్నాను . అందుకే ఇటుగా వచ్చానని చెప్పారు . అప్పుడు  జనకుడు, 'ముని చంద్రమా! అది మా భాగ్యం. అవన్నీ నేను తప్పక సమకూరుస్తాను . స్వీకరించండి . 

కానీ - చాలాకాలము నుండి నాకొక సందేహము ఉంది . తమబోటి దైవజ్ణ్జులనడిగి దానికి సమాధానం తెలుసుకోవాలి అనుకుంటున్నాను . నాయదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది. గురు రత్నా! సంవత్సరములో కల మాసములలో కార్తీక మాసమే ఎందుకు అంత పవిత్రమైనది? ఆ కార్తీక మాస గొప్పతనమేమిటి ? అని ప్రశ్నించారు  .  కార్తీక మహత్మ్యము గురించి వివరింపవలసినదీ, అని ప్రార్థించారు .

వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి “రాజా! తప్పక నీ సంశయమును తీర్చగలను. నే చెప్పబోయే వ్రతకథ సకల మానవులు ఆచరించదగినది. సకల పాపహరమైనది . ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసములో చేయదగిన ఈ వ్రతఫలం అనంతం. వినడానికి ఇంపైనదీ , విన్నంతనే ఇహ పర బాధలనుండి విముక్తిని ప్రసాదించి , సౌఖ్యాన్ని అనుగ్రహించేది. నీ వంటి సజ్జనులు ఇటువంటి కథని తెలుసుకోవడం ఉత్తమమైనది . కాబట్టి శ్రద్ధగా వినమని” ఇలా చెప్పడం ప్రారంభించారు .   

“ఓ మిథిలాధీశ్వరా! జనక మహారాజా! ఏ మానవుడైనను, ఏ వయసు వాడైనను, ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసములో, సూర్య భగవానుడు తులారాశియందుండగా, వేకువ జామున లేచి కాలకృత్యములను తీర్చుకొని, స్నానమాచరించి, దానధర్మములను, దేవతా పూజలను చేసినట్లయితే,  దాని వలన అగణిత పుణ్యఫలము లభిస్తుంది . కార్తీక మాస ప్రారంభము నుండి ఇలా చేస్తూ , శివలింగార్చన , విష్ణుసహస్రనామార్చన చేస్తుండాలి . 

           ముందుగా కార్తీక మాసముకు ఆధిదేవత అయిన ఆ దామోదరునికి నమస్కరించి, 'ఓ దామోదరా! నేను చేయు కార్తీక వ్రతమునకు ఎలాంటి ఆటంకములు రానీయక నన్ను కాపాడు, అని ధ్యానించి, వ్రతమును ప్రారంభించాలి .

కార్తీక స్నాన విధానము

           'ఓ రాజా! ఈ వ్రతమాచరించే టటువంటి రోజులలో సూర్యోదయమునకు పూర్వమే లేచి, కాలకృత్యములు తీర్చుకొని, నదికి బోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు, నమస్కరించి, సంకల్పము చెప్పుకొని, మళ్ళీ  నీట మునిగి సూర్య భగవానునకు అర్ఘ్యప్రదానం  చేసి , పితృదేవతలకు క్రమ ప్రకారముగా తర్పణములు చేసి, గట్టుపై మూడు దోసిళ్ళ నీళ్ళు పోయవలెను.
                 
 ఈ కార్తీక మాసములో పుణ్య నదులైన గంగ, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున, మున్నగు నదులలో ఏ ఒక్క నదిలో స్నానమాచరించినా గొప్ప ఫలము కలుగుతుంది .

              ఆ ఆతర్వాత  తడి బట్టలు విడిచి , మడి బట్టలు కట్టుకొని,   శ్రీమహావిష్ణువుకు ప్రీతి కరమైన పుష్పములు  తానే కోసితెచ్చి, నిత్య ధూప, దీప, నైవేద్యములతో భగవంతునికి పూజ చేసి, గంధము తీసి భగవంతునికి సమర్పించి, తాను బొట్టు పెట్టుకొని, పిమ్మట అతిధి అభ్యాగతులను పూజించి, వారికి ప్రసాదమిచ్చి , తన ఇంటి వద్ద కానీ, దేవాలయములో కానీ, లేక రావిచెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణమును చదువుకోవాలి .

      ఆ సాయంకాలము సంధ్యావందనము ఆచరించి. శివాలయములో  కానీ, విష్ణ్వాలయములో కానీ, లేక తులసి తోట వద్ద కానీ, దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యమును తయారు చేసి స్వామికి సమర్పించి, అందరికీ పంచిపెట్టి, తర్వాత తాను స్వీకరించాలి . మరునాడు మృష్టాన్నముతో భూత తృప్తి చేయాలి .

            ఈ విధముగా వ్రతమాచరిస్తే,  స్త్రీ, పురుషులకు పూర్వజన్మల్లోనూ , ప్రస్తుత జన్మలోనూ  చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులవుతారు . ఈ వ్రతము చేయడానికి అవకాశము లేని వారు, వ్రతము చేసిన వారిని చూసి , వారికి నమస్కరిస్తే,  అటువంటి వారికి కూడా సమాన ఫలితం దక్కుతుంది .

కార్తీక పురాణం ప్రథమాధ్యాయం మొదటి రోజు పారాయణము సమాప్తము.

సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు !
- స్వస్తి-

Videos View All

కార్తీక పురాణం - ముప్పదవ అధ్యయము
కార్తీక పురాణం - ఇరవైతొమ్మిదవ అధ్యయము
కార్తీక పురాణం - ఇరవైఎనిమిదవ అధ్యాయము
కార్తీక పురాణం - ఇరవైఏడవ అధ్యాయము
కార్తీక పురాణం - ఇరవైఆరవ అధ్యాయము
కార్తీక పురాణం - ఇరవైఐదవ అధ్యాయము

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore