Lord Shiva

Om Tryambhakam Yajamahe
Sugandhim Pushtivardhanam |
Urvarukamiva Bandhanan
Mrityor Mukshiya Maamritat ||
పంచారామాల్లో ఒకటైన భీమారామము భీమవరమునకు రెండుకిలోమీటర్లదూరంలో గునుపూడిలో ఉంది. పంచారామాల్లో భీమవరం ఉమా సోమేశ్వర స్వామి దేవస్థానం ఎంతో విశిష్టమైనది. ఇక్కడిలింగమును చంద్రుడు ప్రతిష్ఠించాడని స్థలపురాణంలో చెప్పబడింది. చంద్రుని పేరున దీనిని సోమేశ్వరక్షేత్రమని పిలుస్తారు. ఇక్కడ ప్రతీ కార్తీకమాసంలో బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి.
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో ప్రముఖ పట్టణమైన భీమవరంలో స్వామి వారి దేవాలయం కొలువై ఉంది. చాళుక్య భీములు నిర్మించిందిగా శాసనాలు చెబుతున్నాయి. దేవాలయంలో ఉన్న శివలింగం అమావాస్య నాడు నలుపు వర్ణంలోను, పౌర్ణమి రోజున గోధుమ వర్ణంలో దర్శనమివ్వడం ఈ ఆలయ ప్రత్యేకత. ఆలయంలో శివుడి గుడి పై భాగంలో అన్నపూర్ణమ్మ వారి కొలువై ఉండడం మరో ప్రత్యేకత. అలాగే పంచ నందీశ్వరాలయంగా కూడా ఈ ఆలయానికి పేరు. దేవాలయం ముందు భాగంలో రెండు నందులు, ధ్వజస్తంభం వద్ద మరో నంది, ఆలయ ప్రాంగణంలో ఒక నంది. దేవాలయం ఎదురుగా ఉన్న చంద్రపుష్కరిణిలో మరో నంది ఉండడం వల్ల ఆ పేరు వచ్చింది. దేశంలో ఉన్న స్పటికలింగాల్లో ఇది ఒకటి.
చాళుక్య భీముడు ఈ దేవాలయానికి ప్రాకారాలను, గోపురాన్ని నిర్మించాడనడానికి చారిత్రక ఆధారాలు కనిపిస్తున్నాయి. అందువలన ఇది భీమారామంగా పిలువబడుతుంది. ఇక్కడి శివలింగ చంద్రప్రయిష్టితం కనుక సోమేశ్వరం అనికూడా పిలువబడుతుంది. భక్త సులభుడైన పరమశివుడు ఇక్కడ సోమేశ్వరస్వామి పేరుతో నిత్య పూజలందుకుంటూ ఉంటాడు. ఇక్కడి అమ్మవారు అన్నపూర్ణగా భక్తులను అనుగ్రహిస్తూ వుంటుంది. ఈ క్షేత్రంలోని చంద్ర పుష్కరిణిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తూ వుంటారు.
శ్వేతవర్ణంలో కనిపించే ఈ లింగము క్రమ క్రమముగా అమావాస్య వచ్చే సరికి భూడిద లేదా గోధుమ వర్ణమునకు మారిపోతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యదాతధంగా శ్వేతవర్ణములో కనిపిస్తుంది. ఈ దేవాలయంలోని లింగము చంద్రునిచే ప్రతిష్ఠించిన చంద్రశిల కనుక ఈ మార్పులు కలుగుతున్నాయని అంటుంటారు. ఈ మర్పులను గమనించాలంటే పౌర్ణమికి అమావాస్యకు దర్శిస్తే తెలుస్తుంది. ఆలయపు ముందు బాగమున కోనేరు కలదు ఈ కోనేరు గట్టున రాతి స్తంభముపై ఒక నందీశ్వరుని విగ్రహము కలదు ఈ నందీశ్వరుని నుండి చూస్తే శివాలయంలోని లింగాకారం కనిపిస్తుంది. అదే దేవాలయం ముందున్న రాతి గట్టు నుండి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది. ఈ ఆలయము రెండు అంతస్తులుగా ఉంటుంది. అదిదేవుడు సోమేశ్వరుడు క్రింది అంతస్తులో ఉంటే అదే గర్భాలయ పైబాగాన రెండవ అంతస్తులో వేరే గర్భాలయంలో అన్నపూర్ణాదేవి ఉంటుంది.
త్రిపురాసుర సంగ్రామంలో కుమారస్వామి చేత విరుగకొట్టబడిన శివలింగం ముక్కలలో ఒకటి పడిందని. అందువలన ఇది పంచారామాలలో ఒకటి అయింది. ఈ లింగం చంద్రప్రతిష్ఠితమని విశ్వసించబడుతుంది. ఈ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించడం వెనుక కూడా ఓ పురాణ కథ ఉంది. చంద్రుడు తన గురువైన బృహస్పతి భార్య తారను మోహించాడు. గురువు భార్యను మోహించిన పాపానికి ప్రాయశ్చిత్తముగా ఆయన ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని విశ్వసించబడుతుంది.
ప్రతి ఏడాది ఇక్కడ మహా శివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవాలు అయిదు రోజులపాటు జరుగుతాయి. అలాగే దేవీనవరాత్రులు కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటారు.