Online Puja Services

రామ రావణ యుద్ధము ఎలా జరిగింది ?

3.16.81.94

రామ రావణ యుద్ధము ఎలా జరిగింది ?
-సేకరణ: లక్ష్మి రమణ 

శ్రీరామచంద్ర ప్రభువు లోకోత్తర పురుషుడు . ఆ సీతమ్మతల్లి పరమ సాధ్వి . అందుకే ఆ కథని విన్నా, చదివినా అనంతపుణ్యం లభిస్తుంది . సందేహమే అక్కరలేదంటారు వాల్మీకి మహర్షి . రామ రావణ యుద్ధం ఒక మహా సంగ్రామం . నభూతో , నభవిష్యత్ అన్న చందంగా జరిగిన పోరు అది . సర్వ భయనాశకం అయినా ఆ కథని, దేవదానవులు కూడా వీక్షించిన ఆ దృశ్యాన్ని ఇక్కడ మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం. చదువుతూ భావనచేయండి. యుద్ధరంగంలో నారబట్టలతో , ఇంద్రుని రథంపైన , విల్లు ఎక్కుపెట్టి నిలిచిన మహావీరుడైన రామదర్శనం తప్పక దొరుకుతుంది . 

రావణాసురుడు సీతమ్మని ఎత్తుకొచ్చాడు . రాముడు వానరసేన సాయంతో సీతమ్మ జాడ కనిపెట్టి, రావణుడి మీద యుద్ధం ప్రకటించాడు . హితవు చెప్పిన విభీషణుణ్ణి రావణుడు వెళ్ళగొట్టాడు . దాంతో విభీషణుడు రాముడి శరణుజొచ్చి , రాముని సేనలో భాగమయ్యాడు . 

విభీషణుడి లాగానే, రావణుని తల్లికి పినతండ్రి అయిన మాల్యవంతుడనే వృద్ధుడు రావణునికి యుద్ధం మానమని హితవు పలుకబోయాడు. అతనిని రావణుడు కఠినంగా దూషించాడు. వానర సేనా, రామలక్ష్మణులూ అజేయులు, అసమానులు అని రావణుడు విన్నాడు.  కాని కాని ప్రహస్తుని నాయకత్వములోని రావణ సేనాబలం కూడా పరాజయం ఎరుగనిది. ముఖ్యంగా ప్రహస్తుడూ, ఇంద్రజిత్తూ, నికుంభుడూ - వీరిలో ఎవరైనా తప్పక రామలక్ష్మణులను కడతేర్చగలరనీ, కనుక ఇక ఇంద్రుని వజ్రాయుధాన్ని గడ్డిపోచలా తలిచే కుంభకర్ణుడూ, తనూ యుద్ధానికి రావలసిన అవుసరమే రాదనీ రావణుడి విశ్వాసం.

సైన్యాన్ని సమాయత్తపరచి అన్ని యెడలా రక్షణకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేయించాడు రావణుడు. తూర్ప ద్వారంలో ప్రహస్తుడు, దక్షిణాన మహాపార్శ్వ, మహోదరులు, పశ్చిమాన ఇంద్రజిత్తు, ఉత్తరాన శుక, సారణులు అప్రమత్తులై యున్నారు. విరూపాక్షుడు లంకానగరం మధ్యనున్నాడు. రావణుడు స్వయంగా ఇతర స్థలాలతో పాటు ఉత్తర ద్వారాన్ని పర్యవేక్షిస్తానని చెప్పాడు. 

రాముడు  చివరిసారిగా తన దూతగా  అంగదుణ్ణి పంపి రావణునికి తన  సందేశాన్ని వినిపించాడు. ‘సీతనిచ్చి శరణు కోరితే రాముడు క్షమించి వదిలి వేస్తాడని’ అంగదుడు చెప్పాడు. కానీ, అంగదుని రావణుడు తృణీకరించాడు.

అలా మొదలైన యుద్ధంలో ధూమ్రాక్షుడు, వజ్రదంష్ట్రుడు, నరాంతకుడు, కుంభహనువు, మహానాధుడు, సమున్నతుడు, ప్రహస్తుడు వంటి రాక్షస మహావీరులు హతులయ్యారు. ఇక లాభం లేదనుకొని రావణుడు స్వయంగా మహావీరులైన రాక్షసగణాలను వెంటబెట్టుకొని దివ్యరథంపై యుద్ధానికి బయల్దేరాడు. 

రావణుని వెంట వచ్చిన రాక్షససేన - కదలి వచ్చే కాటుక కొండలలాగా ఉంది. వారి మధ్య శ్వేతఛత్ర ధారియై రావణుడు ప్రచండ భానునిలా మెరిసిపోతున్నాడు. రావణుని తేజస్సును చూసి రాముడు ఆశ్చర్యపోయాడు. సీతను అపహరించిన పాపానికి రావణునికి అంత్యకాలం సమీపించిందని చెబుతూ రాముడు ధనుస్సు ఎక్కుపెట్టాడు. 

లంకా నగర రక్షణార్ధమై తక్కిన రాక్షస నాయకులను రావణుడు వెనుకకు పంపేశాడు. కాలనాగులవంటి తన బాణాలతో వానర సైన్యాన్ని చిందరవందర చేయసాగాడు. 

హోరాహోరీగా యుద్ధం సాగుతోంది . రావణ విజృంభణ మొదలయ్యింది . రావణాసురుని ధాటికి సుగ్రీవుడు మూర్ఛపోయాడు. గవాక్షుడు, ఋషభుడు, గవయుడు, జ్యోతిర్ముఖుడు, నలుడు వేసిన పర్వత శిఖరాలను రావణుడు పిండి పిండి చేసేశాడు. 

హనుమంతుని అరచేతి చరుపుకు రావణుడు, రావణుని పిడికిలి పోటుకు హనుమంతుడు కంపించిపోయారు. నీలుడు అంగుష్ఠమాతృడై రావణుని చికాకు పరచాడు. నీలుడు అగ్ని పుత్రుడు గనుక రావణుని ఆగ్నేయాస్త్రం నీలుని సంహరించలేకపోయింది. లక్ష్మణుడి బాణాలతో రావణుడి ధనుసు విరిగిపోయింది. రావణుడి శక్తితో లక్ష్మణుడు తెలివి తప్పాడు. అతనిని రావణుడు ఎత్తలేకపోయడు. హనుమంతుడు లక్ష్మణుని ఎత్తి రామునివద్ద పడుకోబెట్టాడు. హనుమంతుని గుద్దుకు రావణుడు నెత్తురు కక్కి మూర్ఛిల్లాడు. కానీ అంతలోనే తెలివి తెచ్చుకొని, మళ్ళీ శరాఘాతం ప్రాంభించాడు.

రామ రావణ యుద్ధము: 

హనుమంతుని భుజాలపై అధిరోహించి రాముడు రావణునిపై పోరు సాగించాడు. రావణుని వాడి బాణాలకు ఆంజనేయుడు జంకలేదు. అప్పుడు జరిగిన భీకరసంగ్రామంలో రావణుని రథం, గుర్రాలు, ఛత్రం, ధ్వజం ధ్వంసమయ్యాయి. కిరీటము నేలబడింది. ధనుసు చేజారింది. విశ్రాంతి తీసికొని మరునాడు యుద్ధానికి రమ్మని రాముడు రావణునికి చెప్పాడు. సిగ్గుతో రావణుడు లంకలోకి వెళ్ళిపోయాడు. 

అవమాన భారంతో క్రుంగిపోయిన రావణుడు కుంభకర్ణుని లేపి యుద్ధానికి పంపాడు. కుంభకర్ణుడు కూలిపోయిన తరువాత కుంభ నికుంబాధి వీరులు, దేవాంతక, నరాంతక, అతికాయ, త్రిశిరులనే రావణ నందనులు, మత్తుడు, ఉన్మత్తుడు అనే రావణ సోదరులు - అంతా యుద్ధానికి వెళ్ళి వారుకూడా మరణించారు. పిదప యూపాక్షుడు, శోణితాక్షుడు, ప్రజంఘుడు, కంపనుడు, ఇంద్రజిత్తు కూడాయుద్ధంలో రామలక్ష్మణుల చేత, వానర భల్లూక సైన్యం చేత మరణించారు. ఇంద్రజిత్తు మరణంతో రావణుడు తెలివితప్పి పడిపోయాడు. 

ఆ తర్వాత లేచి, కోపంతో సీతను చంప బోయాడు. సుపార్శ్వుడు అనే బుద్ధిమంతుడైన అమాత్యుడు అతనిని వారించి, వీరోచితంగా యుద్ధంచేసి విజయుడవు కమ్మని, ఈ విధంగా స్త్రీనిచంపి, చరిత్రలో హీనుడిగా నిలిచిపొద్దని హితవు  చెప్పాడు. 

ఇక రావణుడు అన్నింటికీ తెగించి మహోదరుడు, మహాపార్శ్వుడు, విరూపాక్షుడు వంటి మహావీరులతోను, సైన్యంతోను ఉత్తర ద్వారంగుండా యుద్ధరంగంలో అడుగుపెట్టాడు. రామ లక్ష్మణ సుగ్రీవాదుల పేర్లమీద జయజయ ధ్వానాలు చేస్తూ, ఉత్సాహంతో పరవళ్ళు తొక్కుతూ వానర వీరులు రాక్షసులనెదుర్కోవడానికి ముందుకు దూకారు.

కానీ, రావణుని మహోగ్ర శర ధాటికి వానర సైన్యము ఛిన్నాభిన్నమైంది. అతనికితోడు విరూపాక్షుడు కూడా విజృంభించాడు. రావణుడు రామునిపైకి ఉరికాడు. విరూపాక్షుడు, మహోదరుడు, మహాపార్శ్వుడు గొప్ప యుద్ధం చేసి మరణించారు. రావణుడు తన వాడి బాణాలతో రామలక్ష్మణాదులను వేధించ సాగాడు. లక్ష్మణుడు రావణుని సారథి తల యెగురగొట్టాడు. ధనస్సు విరిచేశాడు. మనుష్య శీర్షం చిత్రించి ఉన్న రావణ పతాకాన్ని ముక్కలు చేశాడు. విభీషణుడు రావణుని గుర్రాలను చావగొట్టాడు. విభీషణునిపై రావణుడు వేసిన అస్త్రాలను, శక్తిని లక్ష్మణుడు నిర్వీర్యం చేసేశాడు. 

వానరులు జయజయధ్వానాలు చేశారు. రావణుడు విసిరేసిన శక్తి వక్షస్థలానికి తగిలి లక్ష్మణుడు మూర్ఛపోయాడు. సోదరుని అవస్థకు పరితపిస్తూనే ప్రళయాగ్నిలా రాముడు రావణునిపై బాణవర్షం కరిపించసాగాడు. రాముడు తనవారిని ఉద్దేశించి - "మీరు సౌమిత్రిని రక్షిస్తూ, యుద్ధం చూస్తూ ఉండండి. నేను రాముడంటే ఏమిటో చూపిస్తాను. జగత్తు అరావణం కానాలి" అన్నాడు. 

రామ రావణ సంగ్రామం చెలరేగింది. ఎంతో సమయం యుద్ధం చేసిన రావణుడు గాలిలోకి ఎగిరి మేఘంలోకి దూరిపోయి లంకలోకి వెళ్ళిపోయాడు. హనుమంతుడు గరుడగమనంతో వెళ్ళి మూలికలతో సహా పర్వతాన్నే పెకలించుకొని వచ్చి లక్ష్మణుని ప్రాణం రక్షించాడు. లక్ష్మణుడు లేచి నిలబడి, "అన్నా! ముందు నువ్వు ప్రతిజ్ఞ చెల్లించుకో. నీ కంట పడ్డాక శత్రువు బతికి ఉండగలడా? ఈ సాయంసంధ్యలో సూర్యుడు అస్తమించకుండానే రావణుడు కడతేరాలి" అన్నాడు. అదే సమయంలో ఇంద్రుడు పంపగా మాతలి దివ్యమైన రథంతో సారథిగా వచ్చాడు. రాముడు సంతోషించి ప్రదక్షిణం చేసి రథం యెక్కాడు. 

రావణుడు వజ్రసదృశమైన శూలాన్ని చేతబట్టి మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. రావణుడు విసిరేసిన శూలం ఎదురుపడి రాముని బాణాలు కాలిపోయాయి. అప్పుడు రాముడు మాతలి తెచ్చిన ఇంద్రశక్తిని విసిరేశాడు. అది రావణుని శూలాన్ని నిర్మూలించింది. రావణుడు కూడా శరపరంపరతో రాముని ముంచెత్తాడు. రాముడు విడచిన తీవ్ర బాణాలతో రావణుడి శరీరం రక్తసిక్తమయ్యింది. చివరకు అస్త్రవిహీనుడైన రావణుని పరిస్థితి గమనించి అతని సారథి రథాన్ని దూరంగా తీసుకుపోయాడు. 

అగస్త్యుడు అక్కడికి వచ్చి యుద్ధ పరిశ్రాంతుడై యున్న రామునకు సనాతనము, పరమ రహస్యము అయిన "ఆదిత్య హృదయము"ను ఉపదేశించాడు. రాముడు ఆచమించి ఆ మంత్రరాజాన్ని మూడు మార్లు జపించాడు. జ్యోతిర్గణాధిపతి, దినకరుడు, జయభద్రుడు, సహస్రాంశుడు, తమోఘ్నుడు, శత్రుఘ్నుడు అయిన ఆదిత్యునకు నమస్కరించాడు. ధనుస్సు ధరించి రావణ సంహారానికి దీక్ష పూనాడు. 

రావణుని సారధి మళ్ళీ రధాన్ని రాముని ముందుకు తెచ్చాడు. సకలాయుధ సంపన్నమై, ఒక గంధర్వ నగరంలా ఉన్న ఆ రథం అప్రదక్షిణంగా వచ్చింది. ఇక రావణుని మరణం తప్పదని గ్రహించిన రాముడు తమ రధాన్ని ప్రదక్షిణ మార్గంలో పోనిమ్మని మాతలికి చెప్పాడు. 

సర్వ శక్తులనూ ఒడ్డి రాముడు, రావణుడు శరవర్షాన్ని కురిపింప సాగారు. వారి బాణాలు ఆకాశాన్ని కప్పేశాయి. ఆ సందర్భంలో "రామరావణ యుద్ధం - రామరావణ యోరివ" - వారి యుద్ధానికి అదే సాటిగానీ , మరొక పోలిక లేదు - అని దేవగణాలు ఘోషించాయి. వారి రథాలు యుద్ధరంగమంతా కలియదిరిగాయి. రాముని బాణాలకు రావణుని పతాకం కూలింది. గుర్రాలు తొలగిపోయాయి. మహా సర్పాలవంటి రాముని బాణాలకు రావణుని తల తెగిపడింది. కాని వెంటనే మరొకటి మొలిచి ఉంది. ఇలా నూటొక్కసార్లు రావణుని తలలు తెగగొట్టినా మరల మరల మొలుస్తూనే ఉన్నాయి. "రామా! ఇలా కాదు. బ్రహ్మాస్త్రాన్ని సంధించు" అని మాతలి అన్నాడు. అప్పుడు రాముడు తనకు అగస్త్యుడిచ్చిన బ్రహ్మాస్త్రాన్ని తీశాడు. రాముడు ఆ దివ్యాస్త్రాన్ని వేదోక్తంగా అభిమంత్రించి, ధనుస్సును బాగా లాగి సావధాన చిత్తుడై విడచాడు. వజ్రసమానమైన బ్రహ్మాస్త్రం నిప్పులు చిమ్ముతూ రావణుని గుండెను చీల్చి, అతని రక్తంతో పూయబడినదై, ఉపశమనం కోసం భూమిలో ప్రవేశించి, సావధావంగా తిరిగి వచ్చి రాముని అమ్ముల పొదిలో చేరింది. 

సకలదేవతలు రామునకు అంజలి ఘటించారు. సుగ్రీవ విభీషణ అంగదాదులు, లక్ష్మణుడు, ఇతర సహమిత్రులు విజయోత్సాహంతో రణాభిరాముడైన రాముని యధావిధిగా పూజించారు. ఇంతటితో రావణుని కథ అంతమయ్యింది. రాముని ప్రతిజ్ఞ చెల్లింది .

ఓం శాంతి శాంతి శాంతిః

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore