Online Puja Services

శ్రీ రామకృష్ణులు చెప్పిన సీతారామలక్ష్మణుల విలక్షణమైన కథ .

18.220.140.5

శ్రీ రామకృష్ణులు చెప్పిన సీతారామలక్ష్మణుల విలక్షణమైన కథ . 
- లక్ష్మి రమణ 

 శ్రీరామకృష్ణ పరమహంస గారు జగతిలో అత్యధికులు విశ్వశించే  సద్గురువు. ఆయన భగవంతునిలో తాదాత్మ్యత చెందుతూ , ఆ పరమాత్మని కనుగొనే  మార్గాన్ని తన అనునూయులకి అనుగ్రహించారు . ఆయన బోధనా విధానం కూడా విలక్షణమైనది ! చాలా చిన్న కథలోనో, ఒక సంఘటన ద్వారానో ఆయన ఏంటో గొప్ప విషయాన్ని అర్థమయ్యేలా చెప్పేవారు . అలా ఒకసారి ఆయన చెప్పిన సీతారామ లక్ష్మణుల కథ భగవంతుని దర్శనాన్ని ఎలా పొందాలో తెలియజేస్తుంది .  

అరణ్యవాసములో సీతారామలక్ష్మణులు అరణ్యాలగుండా సాగిపొతున్నారు. అది ఎంతో ఇరుకైన దారి. ఆ దారిలో వెళ్లంటే, వారు ముగ్గురూ ఒకరి వెనుక ఒకరు నడవాల్సిన పరిస్థితి . ముగ్గురిలో అందరికంటే ముందుగా కొదండపాణియిన రాముడు, ఆయిన వెనుక సీతమ్మ, అమె వెనుక ధనుర్భాణ హస్తుడైన లక్ష్మణ స్వామి నడుస్తున్నారు.  

 రాముడి పట్ల భక్తి, ప్రేమాసక్తుడైన లక్ష్మణుడు ఆ శ్యామసుందరుండైన శ్రీరాముని చూడకుండా ఉండలేరు. సీతాకోక చిలుక పూల సౌదర్యం ఆస్వాదించకుండా ఎలాగైతే ఉండలేదో , అలాగే ఆయన శ్రీరాముని ముఖ కమలాన్ని విడిచి ఉండలేరు .  కానీ, ఏమిటి చేయడం ? రాములవారు కనపడకుండా, ఆ ఇరుకుదారిలో సీతమ్మ అడ్డంగా వస్తోంది . దాంతో రాముని చూడలేక లక్ష్మణుడు  పరితపించాడు. 

అమ్మకి లక్ష్మణుడి మనసు తెలీదా ? ఆమె అమ్మ కదా ! లక్ష్మణుడి బాధని గ్రహించి ,  కొంచేము ప్రక్కకు తొలిగి "అదిగో చూడు" అన్నది.  అప్పుడు లక్ష్మణుడు కళ్ళార తన ఇష్టమూర్తిని చూసి సంతృప్తిని పొందారు.        

ఇదే రీతిలో జీవునకు ఈశ్వరునికూ మధ్య మాయాశక్తి అయిన జగజ్జనని వుంది. అమె దయతలచి పక్కకు జరిగితే కానీ, జీవుడుకి  ఈశ్వరుని దర్శనం ప్రాప్తించదు.  కాబట్టి,  ఆ మహామాయ అయినా అమ్మ  కృపలేకుంటే నిత్యానిత్యవస్తు వివేచనము, వేదాంత విచారము ఎంత జరిపినా కూడా అది నిష్ప్రయోజనమే. 

శ్రీరాముడు సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపాన్ని అందరికీ తెలిసినదే !  అలాగే సీతమ్మ , లక్ష్మీ రూపమని, ఈమే త్రిమాతలలో ఒకరని, వీరు ఆ జగజ్జనని రూపాలని కూడా తెలుసు. ఇక లక్ష్మణుడు శేషువు యొక్క రూపము.  ఈ శేషువు ప్రాణరూపుడై సర్ప రూపములో మూలాధార చక్రములో వుంటారని కూడా ఇక్కడ మనము అన్వయించుకోవాలి.

అటువంటి  ప్రాణశక్తీ సహస్రారముని అంటే పరబ్రహ్మముని  చేరటానికి మధ్య, సంసారము అనే  మాయ వుంటుంది. ఆ మాయని  ప్రక్కకు తొలగమని వేడుకోవాలి. అంటే, సాధన చేయాలి . అప్పుడు కాని పరబ్రహ్మస్వరూపముని చేరుకోలేమని భావము. 

ఈ దివ్యమైన కథ వల్ల తెలుసుకోవాల్సినదేమంటే, భక్తీ, విశ్వాసాలే మన సాధనకు ఆయిధాలు. కనుక ఆ శ్రీరాముని, తద్వారా సచ్చిదానంద పరబ్రహ్మాన్ని సాధన ద్వారా , శ్రీ గురుని అనుగ్రము వల్ల చేరుకోగలరని ఆశిస్తూ  ..... శలవు . 

Quote of the day

The Vedanta recognizes no sin it only recognizes error. And the greatest error, says the Vedanta is to say that you are weak, that you are a sinner, a miserable creature, and that you have no power and you cannot do this and that.…

__________Swamy Vivekananda