Online Puja Services

రామాయణంలోని భరతుడు

3.144.113.197

రామాయణంలోని భరతుడు:

రామాయణంలోని భరతుడు దశరథుని మూడవ కుమారుడు. అతని తల్లి కైకేయి. పెద్ద అన్న రాముడంటే అతనికి అమితమైన గౌరవం, ప్రేమ. అతని నిష్కల్మషమైన భ్రాతృభక్తి మనందరికీ ఆదర్శనీయం.

వివాహం తర్వాత భరతుణ్ణి తన తల్లి పుట్టిల్లు అయిన కేకయదేశానికి పంపించారు. దశరథుడికి ఆ సమయంలోనే రామునికి పట్టాభిషేకం చేయాలన్న ఆలోచన కలిగింది. శ్రీరామపట్టాభిషేకాన్ని దశరథుడు ప్రకటించాడు. కానీ, భరతుని తల్లి కైకేయికి ఈ ఆలోచన రుచించలేదు. ఆమె తన బిడ్డ రాజు కావాలని కోరుకుంది. కుయుక్తితో, రాముని పట్టాభిషేకానికి అడ్డుపడింది. పూర్వమెప్పుడో తనకు ఇవ్వబడిన రెండు వరాలను ఇప్పుడు తీర్చవలసిందిగా దశరథుణ్ణి కోరింది. వాటిలో మొదటి కోరిక ప్రకారం, రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి. రెండవ కోరిక ప్రకారం భరతుడికి పట్టాభిషేకం జరగాలి. 

ఇది విన్న శ్రీరాముడు ఏమీ చలించలేదు. ఆడిన మాట తప్పకపోవడం, పితృవాక్య పరిపాలనం, రాజ్య సింహాసనం కంటే ఎంతో ముఖ్యమని అతడికి చక్కగా తెలుసు. దశరథుడే తనతో అడవికి పొమ్మని నేరుగా చెప్పకపోయినప్పటికీ, తన తండ్రికి అసత్యదోషం అంటకూడదన్న ఉన్నతమైన భావనతో అడవికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. ఒక ఆదర్శవంతురాలైన భార్యగా సీతకూడా రాముడితో అడవుకు ప్రయాణమయింది. అక్కడ ఎదురుకాబోయే కష్టాలకు ఆమె భయపడలేదు. ఎప్పుడూ రాముడితో కలిసి ఉండే లక్ష్మణుడు కూడా రాముడి వెంట అడవులకు వెళ్ళాడు. రాముడి వియోగాన్ని భరించలేని దశరథుడు మరణించాడు 
.
 ఆ విషయాలేవీ భరతుడికి తెలియవు. వసిష్ఠుడు పంపిన కబురుతో తన తమ్ముడు శతృఘ్నునితో కలిసి భరతుడు తిరిగివచ్చాడు. తాత పంపిన కానుకలు తల్లికి అందించి భక్తితో నమస్కరించి, కుశల ప్రశ్నలు అయ్యాక, "అమ్మా! నగరం అంతా కళాకాంతీ లేకుండా శూన్యంగా ఉంది. ప్రజలందరూ దుఃఖిస్తున్నారు. కారణం ఏమిటి?" అని అడిగాడు. తల్లి ద్వారా జరిగిన విషయం తెలియగానే భరతుడు మూర్ఛపోయాడు. కాసేపటికి తేరుకుని తల్లితో, "రాక్షసీ! ఎంత పని చేశావు? ఇటువంటి వరాలు అడగడానికి నీకు నోరెలా వచ్చింది? అన్న రాముడు నార బట్టలు కట్టుకుని అడవిలో నానాకష్టాలు పడుతుంటే, నేను ఇక్కడ రాజ్యాభిషేకం ఎలా చేయించుకోను? అన్నకు నా ముఖం ఎలా చూపించగలను? నాకేది ఇష్టమో నీకు తెలిసి కూడా ఇలా ఎందుకు ప్రవర్తించావు?" అని దూషించాడు. రాముని తల్లి కౌసల్య, లక్ష్మణుని తల్లి సుమిత్ర ల పాదాల వద్దకు చేరి ఎంతో రోదించాడు. 

 తండ్రి దహనసంస్కారాలు పూర్తి అయ్యాక, వసిష్ఠుడు భరతుణ్ణి పట్టాభిషేకానికి తయారుకమ్మన్నాడు. భరతుడు, "మునివరా! అటువంటి మాటలను నేను వినలేను. పుణ్యమూర్తి శ్రీరాముణ్ణి ప్రార్థించి వెనుకకు తీసుకువస్తాను. ఆయన రాకపోతే నేను కూడా అక్కడే ఉండిపోతాను." అని పలికి శతృఘ్నుణ్ణి, ముగ్గురు తల్లులను వెంట తీసుకుని అడవికి బయలుదేరాడు. అతని వెంట సైన్యం, నగర పౌరులందరూ బయలుదేరారు.

 సైన్యసమేతంగా వస్తున్న భరతుణ్ణి లక్ష్మణుడు దూరం నుంచే గమనించాడు. అన్నతో, "అన్నా! మనం ప్రాణాలతో ఉండడం చూడలేని భరతుడు మనల్ని చంపడానికి సైన్యంతో సహా వస్తున్నాడు. వారితో పోరాటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈసారి వీణ్ణి వదిలిపెట్టను!" అన్నాడు. ఈ మాటలు విన్న రాముడు, "లక్ష్మణా! నా తమ్ముడివై ఉండి కూడా ఇటువంటి మాటలు ఎలా పలుకగలుగుతున్నావు? భరతుడు ఉత్తముడు. కలలో కూడా మనకు హాని తల పెట్టడు. మనల్ని అయోధ్యకు తీసుకువెళ్ళడానికే అతడు వస్తున్నాడు" అని అన్నాడు. శ్రీరాముని విశాలహృదయాన్ని అర్థం చేసుకున్న లక్ష్మణుడు సిగ్గుతో తల వంచుకున్నాడు.

 సైన్యాన్ని దూరంగా నిలిపి, శతృఘ్నునితో కలిసి, తన తల్లులను వెంట పెట్టుకుని భరతుడు రామలక్ష్మణులున్న పర్ణశాలకు వచ్చి వారికి ప్రణామం చేశాడు. రాముడు వనవాసానికి వచ్చిన తరువాత జరిగిన విషయాలన్నీ భరతుడు రాముడితో చెప్పాడు. అందరి సమక్షంలో భరతుడు, "అన్నా! నా తల్లి చేసిన పాపానికి నా మీద కోపం చూపించవద్దు. రాజ్యాన్ని పాలించే అర్హత నాకు లేదు. దయచేసి నీవు అయోధ్యకు తిరిగిరా! లేకపోతే నేనిక్కడే ప్రాణాలు విడుస్తాను" అని ప్రార్థించాడు. రాముడు, "ఇది ఏమిటి భరతా! మన వంశాచారాలు పాటించకుండా మాట్లాడుతున్నావు. నా వంటివాడే తండ్రి మాట వినకపోతే, ప్రజలకు ఆదర్శంగా ఎవరు నిలుస్తారు? నేను ఇట్టే వనవాసం పూర్తి చేసుకుని తిరిగి వస్తాను. నీవు అయోధ్యవాసుల సంక్షేమాన్ని చూడు! అని సమాధానం చెప్పాడు.

 చివరకు భరతుడు తనకు బదులు రాముని పాదుకలకు పట్టాభిషేకం చేసి, రాముడు తిరిగి వచ్చేవరకు మాత్రమే పరిపాలించడానికి ఒప్పుకున్నాడు. త్రికరణశుద్ధిగా ఆ మాటను నిలబెట్టుకున్నాడు.  రాజ్యభోగాలు అనుభవించే అవకాశం ఉన్నా, అన్నింటినీ వదులుకుని అన్నగారిలా తాను కూడా నార బట్టలు కట్టుకుని, కటికనేల మీద నద్రిస్తూ నిరాడంబరమైన జీవితం గడిపాడు. 

 రాముడు రావణుణ్ణి సంహరించి పదునాలుగేళ్ళ తరువాత తిరిగి అయోధ్యకు వచ్చేటప్పుడు భరతుడికి తాను రావడం ఇష్టమోకాదో కనిపెట్టమని చెప్పి తనకంటే ముందుగా హనుమంతుణ్ణి పంపాడు. హనుమంతుడు భరతుణ్ణి కలుసుకుని, అతడి వైఖరిని నిశితంగా పరిశీలించి, తిరిగివెళ్ళి రాముడితో, "ప్రభూ! భరతుడు మీకోసం వేయికళ్ళతో ఎదురుచూస్తున్నాడు! అతడిలో రాజ్యం తనకే కావాలన్న కోరిక అణువంతైనా లేదు!" అని చెప్పాడు. శ్రీరాముడు ఇది విని ఎంతో సంతోషించాడు. అందువల్లనే "భరతో మహాత్మా" అని అంటారు. రాముడి తమ్ముడైన భరతుడు ప్రపంచానికే ఆదర్శప్రాయుడు.

- నవీన్ 

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore